జనార్ధన్ ఠాగూర్ భూకబ్జా వ్యవహారాల్లో ప్రధానంగా పాల్గొనేది బబ్లూ అని తెలుసు.
అంతే - అంతకంటే మరే వివరాలు తెలీవు-
ఒకవేళ ఇది నిజంగానే - నిరంజనరావుగారన్నట్టు తలా, తోకా లేని కేసేనా? ఒక్క క్షణం అలా ఆలోచించినా-ఏదో అనుమానం సూర్యవంశీని చుట్టుముట్టి వదలటంలేదు.
ఏది ఏమైనా ఎక్కడో ఒకచోట తీగలాగి చూడాలి - తప్పదు - సూర్యవంశీ ఒక స్థిరమైన అభిప్రాయానికొచ్చి ముందుకు కదిలాడు.
* * * * *
గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలోకి, రెండోసారి అడుగుపెట్టిన సూర్యవంశీ వేపు ఆశ్చర్యంగా చూసాడు మార్చురీ వాచ్ మెన్.
ఏదో ప్రశ్నించడానికి నోరు తెరిచిన వాచ్ మెన్ సూర్యవంశీ చేతిలోని వంద రూపాయల నోటును చూడగానే ఆ ప్రయత్నాన్ని విరమించాడతను.
నాంపల్లి రైల్వేస్టేషన్ కంపార్ట్ మెంట్లో స్వాధీనం చేసుకున్న మొండెం కాళ్ళూ చేతులూ ఉంచిన ఐస్ బాక్స్ ని ఓపెన్ చేసాడు వాచ్ మెన్.
కుళ్ళిపోతున్న శవాల వాసన గుప్పుమంది. హేండ్ కర్చీఫ్ ని ముక్కుకి అడ్డం పెట్టుకుని ఆ మొండేన్ని నిశితంగా పరిశీలించాడు సూర్యవంశీ.
డాక్టర్లు వేసిన కుట్లు, గడ్డ కట్టిన రక్తం....నెమ్మదిగా కరుగుతున్న ఐస్.....అంతకు మించి ఏం కనిపించడంలేదు.
ఒక్కసారిగా నిరాశ ఆవరించింది సూర్యవంశీకి. శూన్యంలో నుంచైనా, సాక్ష్యాన్ని వెతికి పట్టుకోగల ప్రతిభావంతుడు సూర్యవంశీ.
శవాలుకూడా దొరకని ఎన్నో కేసుల్ని పరిష్కరించి, పరిశోధన చేసి, నేరస్తుల్ని పట్టుకున్న చరిత్ర ఉందతనికి!
సిగరెట్ తీసి వెలిగించాడు....అతని చూపులన్నీ మొండెమ్మీదే ఉన్నాయి. నిశితంగా పరిశీలిస్తున్నాడతను.
ఒకటి... రెండు... మూడు.... క్షణాలు.
అతని బ్రెయిన్ సీరియస్ గా వర్క్ చెయ్యడం ప్రారంభించింది.
బ్లడ్... బ్లడ్... బ్లడ్...
శరీరమ్మీద రక్తం ఏ మేరకు గడ్డకడుతుందో అతనికి తెలుసు.... అంత మందం ఉంటుందో తెలుసు.
కానీ మొండెం చర్మం పై భాగంలో పేరుకున్న రక్తం కేకు పీసెస్ అతికించినట్టుగా అంతమందంలో ఉండడం ఆశ్చర్యంగా ఉందతనికి.
అప్రయత్నంగా అతని చేతి వేళ్ళు ముందుకు కదిలాయి.....రక్తస్పర్శ మెత్తగా ఉంది....మొండెం చర్మంమీద వేళ్ళతో రాస్తున్నాడు.
చర్మం స్పర్శ అతనికి తెలుసు అది చర్మం కాదు.... గుడ్డ పీలిక.....అంటే.....మృతుని వంటి మీద బట్టలున్నాయన్న మాట....
మొండాన్ని అటూ ఇటూ కదిలించడం ప్రారంభించి, రక్తంలో, రక్తంగా కలిసిపోయిన బనీన్ని గుర్తుపట్టాడు.
చీలికలు, చీలికలుగా ఉందా కట్ బనీన్....
"సార్...." ఏదో అనడానికి ప్రయత్నించాడు వాచ్ మెన్. సూర్యవంశీ జేబులోంచి మరో యాభై రూపాయలనోటు అతని చేతిలోకెళ్ళింది....
వాచ్ మెన్ చేతిలోని టార్చిలైట్ తీసుకొని, చూపులన్నింటిని ఆ బనీన్ మీద నిలిపి పరిశీలించాడు సూర్యవంశీ.
ఎక్కడైనా, ఏ ఒక్క ఆధారమైనా, కన్పిస్తుందన్న ఆశ.
ఉద్రిక్తతతో సూర్యవంశీ వంటి మీద చెమటలు పడుతున్నాయి.
మెడ ప్రాంతంలో మరింత ఎక్కువగా గడ్డకట్టిన రక్తాన్ని, చూపుడు వేలితో పక్కకు తొలగించాడు.....
సరిగ్గా, సరిగ్గా.... ఆ మెడ ప్రాంతంలోనే....
స్కెచ్ పెన్ తో వేసినట్టుగా ఓ బ్లూ మార్క్...
సూర్యవంశీ కళ్ళు, ఆశ్చర్యంతో మరింత విశాలమయ్యాయి.
ఆ బ్లూ మార్క్, ఇంటూలా లేదు.... ఆ అక్షరాన్ని పోల్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు....
కొద్ది నిమిషాలు గడిచాయి.
అతి కష్టమ్మీద, ఆ అక్షరం ఏమిటో తెలుసుకో గలిగాడు సూర్యవంశీ....
'ఎస్'....
ఎస్ ఫర్ సక్సస్....
సూర్యవంశీ పెదవులమీద చిరునవ్వు కదలాడింది.
మరేం ఆలస్యం చెయ్యలేదతను. ప్రెస్ ఫోటోగ్రాఫర్ తో ఫోటో తీయించడం, అర్జెంటుగా ప్రింట్లు వేయించడం చకచకా జరిగిపోయాయి.
ఆరోజు రాత్రి అతను చాలాసేపు, యధా ప్రకారంగానే నిద్రపోలేదు.
'ఎస్' మార్కు, లాండ్రీలో వేసిన మార్కు అని తెలుసుకోడానికి అతనికి అట్టేసేపు సమయం పట్టలేదు.
అంటే....
వికారాబాద్ పరిసర ప్రాంతాల్లోని లాండ్రీ షాపుల్లో ఎంక్వయిరీ చేస్తే.....
ఆలోచన వచ్చిన తఃదవుగా వాల్ క్లాక్ వేపు చూసాడు.
రాత్రి రెండు గంటలు దాటింది.
లేచి, హేంగర్ కున్న తను రెగ్యులర్ గా వేసుకునే జర్కిన్ వేసుకుని, ఫ్లాట్ కి తాళం వేసి, మెట్లు దిగి, హీరో హోండా స్టార్ట్ చేసాడు.
* * * * *
సెక్రటేరియట్ లోకి సర్రున దూసుకొచ్చిందో జీపు.
హోం మినిస్టర్ చాంబర్స్ ముందు, పార్కింగ్ లో ఆగింది. జీపులోంచి దిగిన ఎ.సి.పి. నిరంజనరావు, హోం మినిష్టర్ పి.ఎ. రూమ్ లోకి అడుగు పెట్టాడు.
మరో మూడు నిమిషాల తర్వాత అతను హోం మినిస్టర్ జనార్ధన్ ఠాగూర్ ముందున్నాడు. హోం మినిస్టర్ జనార్ధన్ ఠాగూర్ తారు డబ్బాకి, ఖద్దరు దుస్తులు తొడిగి, బండ ముఖాన్ని బండ కాళ్ళనీ, చేతుల్నీ పెట్టినట్టుగా ఉంటాడు.
నిరంజనరావు వేపు చూసి అతను బండగా నవ్వాడు... పార్టీలో కార్యకరతలా ఉన్నప్పుడు అతగాడి పేరు బండబాబు...
సిటీలో బండబాబు అంటేనే భయంతో అతనికి ఓట్లు పడతాయి. హోం మినిస్టర్ ఎందుకు పిలిచాడో, నిరంజనరావుకి చూచాయగా అర్ధమైపోయింది.
"ఏందయ్యా నిరంజనం... అయామ్ అన్ హేపీనయ్యా... ఆ జర్నలిస్టుగాడి కేసుని, అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏందయ్యా....చెప్పు.....కట్టె.... కొట్టె.... తెచ్చె... రామాయణం టైపులో చెప్తున్నాను... ఆ ముసలి జర్నలిస్టు కేసు.... క్లోజ్ చేసెయ్... ఎందుకు చెప్పు గోల... ఏంటంటావ్...?" సూటిగా చూస్తూ అడిగాడు హోం మినిష్టర్.
"మీరు జర్నలిస్టులికి చేసిన ప్రామిస్...." గంభీరమైన గొంతుతో ప్రశ్నించాడు నిరంజనరావు.