ఇంట్లో అందరూ వున్నప్పుడు అతను తొందర తొందరగా లేచి సాయంచేసేవాడు. ఇప్పుడు ఇద్దరమే కాబట్టి ఆలస్యంగా నిద్రలేచి, కలిసి పనులు చేసుకుని, అతను రాగానే ఎక్కడికయినా షికారుకో, సినిమాకో వెళ్ళి వచ్చి భోంచేసి, కబుర్లాడుకుంటూ వెన్నెలలో కూర్చుని, కౌగిట్లో ఆదమరచి నిద్రపోయి... అలా ఊహించుకుని ఎంతో ఉత్సాహపడ్డాను నేను.
మొదటిరోజు ఎనిమిదిన్నరయినా అతను లేవలేదు. అతనే లేపాలని, బ్రతిమాలి బ్రష్, పేస్ట్ అందిస్తే గునుస్తూ లేవాలని ఊహించుకున్న నాకు కంగారేసి అతన్ని లేపాను. "అబ్బా, కనీసం ఇప్పుడైనా పడుకోనీయకూడదూ, అందరూ వుంటే ఎలాగూ కుదరదు" అన్నాడు బద్ధకంగా.
"అదేమిటి, ఆఫీసుకి వెళ్ళరా?" అంటే, "వెళ్తాను" అన్నాడు. "మరి లేచి వంట పని చూసుకుందాం. మీరు వెళ్లిన తర్వాత మిగతా పని నేను చూసుకుంటానులే" అన్నాను త్యాగం చేస్తున్న ధోరణిలో. "అబ్బా, ఇద్దరి వంటకి నేను కూడా అవసరమా? ఏదో ఒకటి వండెయ్. వంటయ్యాక నన్ను లేపు. అన్నట్టు స్నానానికి నీళ్ళు కూడా పెట్టేయ్" అన్నాడు అటు తిరిగి ముసుగుపెట్టుకుంటూ. 'వంటకి మీరు అవసరమయికాదు. ఇద్దరం కలిసి చేసుకుంటే సరదాగా వుంటుంది' అందామనుకున్నాను. కానీ అప్పటికే నాకు నిరుత్సాహం వచ్చేసింది.
ఆలస్యమయితే, "చూశావా, మా అమ్మ ఎలా కరెక్టుటైమ్ కి వండేస్తుందో, నీకు చాతకాలేదు" అని ఎగతాళి చేస్తాడేమోనని, అతనికి ఆ అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో చకచక నాలుగు రకాల వంటలు వండి వడ్డించా తనకి. హడావుడిగా బాత్ రూంలో దూరి, స్నానం చేసి, ఒళ్ళు తుడుచుకోకుండానే కంగారు కంగారుగా భోజనం ఏదో ముగించా ననిపించి ఆఫీసుకి పరుగెట్టాడు. ఒక్కదాన్నే ఒంటరిగా ఫీలవుతూ పని ముగించుకుని స్నానం చేసి ఐదింటి వరకూ పుస్తకం చదువుతూ కూర్చున్నాను. తర్వాత లేచి మొక్కలకి నీళ్లు పోసి, వంట ముగించేసి, స్నానం చేసి కొత్త చీర కట్టుకుని ఈజీ చెయిర్ లో వాలి ఫాన్ గాలికి జుట్టు ఆరబెట్టుకుంటూ టీవీ చూస్తూ గడిపాను. అతను ఏడు దాటినా రాలేదు. సహనంగా ఏడున్నర వరకూ, చిరాగ్గా ఎనిమిది వరకూ, భయంతో ఎనిమిదిన్నర వరకూ గడిపాక అతను అలసటగా ఈసురోమంటూ వచ్చాడు. అతని అలసట చూసిన తర్వాత అప్పటివరకూ నాకు కలిగిన చిరాకుని అణుచుకున్నాను. నేను మంచినీళ్ళు తీసుకొచ్చి అందిస్తే తాగేశాడు. వడ్డిస్తుంటే స్నానం చేసొచ్చాడు. తినేసిన తర్వాత నేను గిన్నెలు కడిగేసి, వంటిల్లు శుభ్రం చేస్తుంటే అతను టీవీ చూస్తూ కూర్చున్నాడు. తల్లికి వంటింట్లో అంత సాయం చేసేవాడు - ఒక్కసారిగా భర్త హోదా ప్రదర్శించడం నాకు చిరాకుతో కూడిన అసహనాన్ని కలుగజేసింది. అయినా నా 'మూడ్' ని పాడుచేసుకోదల్చుకోలేదు.
అగరువత్తులు వెలిగించి స్టాండు పడగ్గది గూట్లో పెట్టేసి, తమలపాకుల పళ్ళెం ఫ్రిజ్ లోంచి తీసుకుని గదిలోకి అడుగు పెడుతుంటే అతని గురక సన్నగా వినిపించింది. నేను నిశ్శబ్దంగా అవి పక్కన పెట్టేసి, లైటార్పి పక్కమీద పడుకుని దుప్పటి కప్పుకున్నాను. నా గొంతులోంచి వెలువడిన బలమైన నిట్టూర్పు అతని గురకలో కలిసిపోయింది.
* * *
మేమిద్దరమే వున్న వారంరోజులూ దాదాపు ఇలానే గడిచాయి. అతను నిద్రనుండి ఆలస్యంగా లేవడం, ఆఫీసు నుండి ఆలస్యంగా రావడం నాకు నా లీవ్ వేస్ట్ అయిపోయిందనే బాధని తప్ప మరేమీ మిగల్చలేదు. మేం ఏ ఒక్కరోజూ షికారుకి వెళ్ళలేదు. సినిమాకి వెళ్ళలేదు. కలిసి వంట చేయలేదు. వెన్నెలలో కబుర్లూ చెప్పుకోలేదు. భావుకత భార్యాభర్తలలో ఎవరో ఒకరికే వుండడమంత దురదృష్టం మరింకేదీ లేదు.
ఒకరోజు నా బావగారి దగ్గర్నుంచి ట్రంక్ కాల్ వచ్చింది. "ఎలా వున్నారు? పరిస్థితులన్నీ చక్కబడ్డాయా?" అని ప్రశ్నించాడాయన. నేను నవ్వాను. నా నవ్వులోనే ఆయనకి సర్వం అర్థమైపోయినట్టుంది. రెండే నిముషాలు షేర్ల ధరల గురించి మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఆఫీసులో ఇన్స్ పెక్షన్ అని ఏ రోజూ తొమ్మిదిన్నర, పదికి మధ్య తప్ప రాలేకపోయాడతను. సతీ అనసూయలా అతనొచ్చేవరకూ గడప దగ్గరే దిగులుగా తచ్చాడి, రాగానే అమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, వడ్డించేసి, టేబుల్ శుభ్రం చేసుకుని, మంచ మెక్కేయడం. అతనికి ఓపిక మిగిలుంటే నన్ను దగ్గరికి తీసుకునేవాడు. అంతా మూడు నిముషాల్లో అయిపోయేది. మొత్తం స్ట్రిప్ కూడా చేసేవాళ్ళం కాదు. ఇక అతను అటు తిరిగి గుర్రు పెడుతుంటే, నేను ఇటు తిరిగి ఆలోచనలు కూడా చేరని బ్లాంక్ నెస్ లోకి జారి రాత్రి తెల్లార్చుకునేదాన్ని.
ఆదివారం వచ్చింది. అతనికి ఆఫీసుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని బద్ధకంగా అలాగే పడుకున్నాను. ఏ కళ నున్నాడో నన్ను దగ్గరకు తీసుకుని బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. నేను పరవశంగా కళ్ళు మూసుకున్నాను. ఆ ప్రైవసీ, సూర్యుడి తొలికిరణాల వెచ్చదనం నాలో ఏదో పులకరింతలు రేపుతుంటే, అతని ఆర్ధ్రత ఆవేశంగా మారి ఇద్దరం తాదాత్మ్యంలోకి జారుతుండగా మోగింది కాలింగ్ బెల్...!
ఒక్కసారిగా మేము ఆకాశం నుండి పాతాళంలోకి తోయబడ్డట్టు... అస్తవ్యస్తంగా వున్న గుడ్డలతో నేను బాత్ రూమ్ లోకి పరిగెట్టాను. అతనూ కంగారుగా లేచి బట్టలు కట్టుకుని వెళ్ళాడు. వీధి తలుపులు తీసిన చప్పుడు వినిపించింది. క్షణం తరువాత "ఏరా అబ్బాయ్! ఎలా వున్నారు? ఇద్దరే వుండి సుఖపడి వుంటారేమో ననుకున్నాను" అంటూ నా అత్తగారి కంఠం కంచులా మ్రోగుతూ వినపడింది. నేను చీర కట్టేసుకుని ముంగురులు సవరించుకుంటూ బాత్ రూమ్ నుంచి బయటపడ్డాను.
నా భర్త అందరికీ కాఫీలు కలుపుతున్నారు. రెండే నిముషాల తర్వాత వాళ్ళున్న గదిలోకి అడుగుపెడితే- ముగ్గురూ కూర్చుని ఊరి ముచ్చట్లూ, బంధువుల విశేషాలు చర్చించుకుంటున్నారు. నా భర్తలో ఆ వారంరోజులుగా నేను చూడని హుషారు కనిపించింది. ఒక మంచి అనుభవంలోంచి బయటికి బలవంతంగా లాగబడిన నిస్పృహఛాయలు అతని మొహంలో ఏం కనిపించలేదు నాకు. ఎంత కాదనుకున్నా నా హృదయం చివుక్కుమంది.
"ఏంటమ్మాయ్! ఇంత పొద్దెక్కినా యిల్లు ఇలా చిందరవందరగా వుంది. కొంపదీసి పాచికొంపలోనే వండేస్తున్నావా ఏమిటి?" అంది నా అత్తగారు.
నేనే జవాబూ చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆ సమయంలో నా మూడ్ ఎలా వుంటుందో తెలుసు కనుక నా భర్త తనే అందుకుని "లేదమ్మా! ఈ రోజు ఆదివారమే కదాని నేనే ఫర్లేదు లెమ్మన్నాను. పైగా మీరు వస్తారని కూడా తెలియదు కదా!" అన్నాడు.
ఇది జరిగిన తర్వాత అతను గిల్టీగా ఫీలయినట్టు కూడా కనిపించలేదు నాకు. నిజమే! వాళ్ళ అమ్మవాళ్ళు తిరిగొస్తే ఆ తప్పు ఇతనిది కాకపోవచ్చు. అయినా అతనోసారి బాధగా ఫీలయి వుంటే నేనా వారంరోజుల డిజప్పాయింట్ మెంటూ మర్చిపోగలిగి వుండేదాన్నేమో!
16
మరుసటిరోజు నేను కాలేజీకి వెళ్ళిపోయాను. ఆ తరువాతి ఉదయమే నా బావగారు వచ్చారు. ఆయన నా మొహంలోని భావాలు చదవడానికి ప్రయత్నిస్తున్నట్లు నాకు తోచింది. అంతే కాదు, తను నా మానసిక స్థితికి జాలిపడుతున్నాడేమోనని కూడా అనిపించింది. ఆ రోజు కారులో అన్నాడు- "కనీసం ఆదివారమైనా ఉపయోగించుకుంటారనుకున్నాను. అమ్మావాళ్ళను ఆ రోజువెళ్ళవద్దని ముందే చెప్పాను. అందుకే నేనూ రాలేదు. ఇలా జరుగుతుందనుకోలేదు" అని సన్నగా నిట్టూర్పు విడిచాడు.
"మరేం ఫర్లేదు లెండి. అప్పటికే మీ తమ్ముడు తన తల్లి మీద బెంగ పెట్టేసుకుని జ్వరం తెచ్చుకునే స్థితిలో వున్నాడు. వాళ్ళు రావడం మంచిదైంది" అన్నాను.
నా స్వరంలోని విరక్తి అతన్ని మళ్ళీ మాట్లాడనివ్వలేదు.
మనిషి తాలూకు కోపం, చిరాకు, విసుగు మొదలైన అవలక్షణాలన్నీ - జీవితంపట్ల అతడికున్న అసంతృప్తిపై ఆధారపడి వుంటాయనుకుంటాను. అసంతృప్తి ఎక్కువయ్యేకొద్దీ చిరాకు తొందరగా వచ్చేస్తుందన్నది సత్యం! ఈ సత్యాన్ని నిరూపించే సంఘటన మరుసటి ఆదివారం జరిగింది.
నా అత్తగారు పనిమనిషితో అంటోంది- "ఇదిగో బట్టలు ఇప్పుడు ఉతకక్కర్లేదు, నిన్ను చూసుకోవడానికి ఎవరూ ఖాళీగా లేరు. నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నాను. మధ్యాహ్నమొచ్చి బట్టల సంగతి చూద్దూగానీ, ఇప్పటికి వెళ్ళిపో" అని.
నా గుండె గుభిల్లుమంది. ఈ రోజు ఆదివారం కాబట్టి పనయ్యాక సీరియస్ గా కూర్చుని ఆ రీసెర్చ్ వర్క్ ఓ కొలిక్కి తీసుకువద్దామనుకుంటున్నాను. మధ్యాహ్నం పనిమనిషి వస్తే ఇక నాకు దానితోటే సరిపోతుంది.
అందుకే హడావిడిగా వచ్చి ఆవిడతో ఆ సంగతి చెప్పి "నా వంటింటి పనయ్యాక నేను చూసుకుంటాలెండి. కాసేపు దాన్ని ఆగమనండి" అన్నాను.
ఆవిడ కాస్తంత ముఖం చిట్లించి "మరేం ఫర్లేదు. నువ్వు కాకపోతే మరొకరు చూసుకుంటారులే. ఇప్పుడు హడావుడిలో వంటింటి పని తగలెట్టకు" అనేసింది.
నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంట్లోకి పెద్దకోడలు రాకూడదు కదా! నేను కాక చూసుకోవడానికి మరొకరు ఎవరున్నారో ఆవిడకి? అనుకుంటూ తీవ్రంగా ఓ చూపు మా ఆయనకేసి విసిరేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాను.
ఆవిడ గుడి నుంచి తిరిగి వచ్చేసరికి దాదాపు ఒంటిగంటైంది. అప్పటికి నేను భోజనం పూర్తిచేసి నా పేపర్లూ, జర్నల్సూ, పుస్తకాలూ సరంజామా అన్నీ ముందేసుకుని వాటిలో మునిగిపోయాను. నా భర్త మంచంమీద అడ్డదిడ్డంగా పడుకుని పార్టీ జోక్స్ చదువుకుంటూ మధ్య మధ్యలో పెద్దగా నవ్వేసుకుంటున్నాడు. మా అత్తగారు భోజనం చేసి నడుం వాల్చగానే పనిమనిషి వచ్చింది. అది రాగానే నా అత్తగారు ఆపసోపాలు పడుతూ లేచి తలుపు తీసింది. అది చూసి నా భర్త కొంచెం మొహమాటపడుతూనే "ఇంకా నీకు చాలా రాసుకోవాల్సి వుందా? అనడిగాడు. అతనేం అడగాలనుకుని అలా మొదలు పెట్టాడో అర్థమై నేను "అవును" అన్నాను కనీసం తల కూడా ఎత్తకుండా.
నా అత్తగారు అక్కడ సణుగుతోంది, "పొద్దున్నే అది (అంటే నేను) చెప్పినప్పుడు వినుండాల్సింది. ఇంకో అరగంటలో టీవీలో అవార్డు తెలుగు సినిమా వస్తుందిట. తెలీక దీన్ని రమ్మన్నాను" అని. ఇక నా భర్త ఆగలేక "ప్లీజ్ కాస్త వెళ్ళి చూసుకోకూడదూ, తర్వాత చదూకుందుగాన్లే అమ్మ అలసిపోయినట్టుంది" అన్నాడు.
నా అత్తగారు ఎప్పట్లాగే చెవులు రిక్కించుకుని వుందనుకుంటాను "ఎందుకులేరా అబ్బాయ్, అది చదువుకోవాలని ముందే చెప్పింది" అని సన్నాయి నొక్కింది.
"తరువాత చదువుకుంటుందిలే, దానికి తొందరేమిటి?"
బలవంతంగా కోపాన్ని అణచుకుంటూ "మీరు తీరిగ్గానే వున్నారుగా, మీరెళ్ళి చూసుకోండి పనిమనిషిని" అన్నాను.
"అర్థంలేకుండా మాట్లాడకు. పనిమనిషిని నేను చూసుకోవడమేమిటి?..." అతనంటుండగానే ఆవిడ రివ్వుమని గదిలోకి వచ్చేసింది. "అవునే, వాడు చూసుకోవడమేమిటీ? ఏదో అప్పుడప్పుడు నాకు సాయం చేస్తాడని అంత లోకువయిపోయాడా?" అంది మొహం ఎర్రగా చేసుకుని.
ఆవిడని నా గదిలోంచి బలవంతంగా మెడపట్టి బయటకు గెంటాలన్న కోరికని బలవంతంగా ఆపుకుని "ఇందులో లోకువై పోవడం ఏముంది? ప్రస్తుతం ఆయన ఖాళీగా వున్నారు కాబట్టి చూసుకోమన్నాను" అన్నాను మరింత చిరాగ్గా.
ఆవిడేదో అనబోతే ఆయన కల్పించుకుని, "అమ్మా, నువ్వెళ్ళి పడుకో, మేం చూసుకుంటాంలే" అని ఆవిడని పంపేసి నా వైపు తిరిగి "అమ్మతో అలాగేనా మాట్లాడేది?" అనడిగాడు తీవ్రంగా. "నేను ఆవిడతో మాట్లాడలేదు. ఆవిడే మన గదిలో కొచ్చి మాట్లాడింది" అన్నాను నేను నిర్లక్ష్యంగా.