"షటప్, నోటి కొచ్చినట్లు వాగకు!" అన్నాడు.
నేను మొహం తిప్పేసుకుని నా పుస్తకాల్లో మునిగిపోయాను. అక్కడితో అది సమసిపోయేదేమో కానీ, తను విసురుగా లేచి నా ముందు నించుని "అసలు ... అసలు ఏం చూసుకుని నీ కింత మిడిసిపాటు? మొగుడంటే బొత్తిగా లక్ష్యం లేకుండా ఓ పాలేరు వెధవలా ట్రీట్ చేస్తావ్! ఇంతకీ నీ ఉద్దేశమేమిటి చెప్పు?" అన్నాడు కోపంగా ఊగిపోతూ.
"ఇప్పుడేం జరిగిందని అంత చిందులేస్తున్నారు? నేను ఈ రోజు చదువుకుంటానని ముందే చెప్పాను. మీరు తీరిగ్గా వున్నారు కాబట్టి చూసుకోమని ఇప్పుడూ చెప్తున్నాను. దానికింత రాద్ధాంతం దేనికి?" అన్నాను సిన్సియర్ గా తెల్లబోయి. "ఇక్కడ ఎవరు తీరిగ్గా వున్నారని కాదు. పొద్దున్న ఆవిడ నీ మాట విన్లేదని ఇప్పుడు నువ్వు దెప్పి పొడుస్తున్నావ్. అంతేనా?" అన్నాడు.
నేను నిట్టూర్చి "ఓ రకంగా అలాగే అనుకోండి" అనేశాను.
అంతే! దాంతో అతనికి పిచ్చెక్కినంతపనైంది. "యూ...! హౌ డేర్ యూ? నీకు ఎంత అహంకారం? ఆ బోడి చదువు చూసుకునేగా అంత మిడిసిపాటు? ఇంటి పనులు చక్కబెట్టుకోవడం రాదు. చదువుతోంది...బోడి చదువులు..." అని అరిచాడు.
నేను కామ్ గా లేచాను.
"అవును....నాది మిడిసిపాటే! ఆ చదువూ, చట్టుబండలూ లేని వాళ్ళకే మిడిసిపాటు వుంటే నాకెందుకు వుండకూడదూ?" అన్నాను. నేను కూడా అంత సిల్లీగా మాట్లాడగలనని అప్పుడే తెలిసింది. "ఆ వెధవ పిహెచ్.డి. ఎవర్ని ఉద్ధరించడానికి? అయినా నిన్నుకాదు, చదువుల పేరుతో సంసారాన్ని కూల్చుకునేలా నిన్ను పెంచినందుకు మీవాళ్ళ ననాలి" అన్నాడు.
నేనొక్కసారి రుద్రావతారం ఎత్తాను. "మద్యలో మా వాళ్ళ పేరెత్తితే మర్యాదగా వుండదు! అసలు ఆ అర్హత కూడా మీకు లేదు" అన్నాను.
"అర్హత.... అర్హత అంటే నీ దృష్టిలో ఆ డిగ్రీలేగా! ఏ డిగ్రీలతో నీ తోడికోడలు అంత సాఫీగా కాపురం చేస్తోంది? ఏ రోజైనా అన్నయ్య, వదినల మధ్య గొడవలు రావడం నువ్వు చూశావా? అలాగే ఏ రోజైనా గొడవలు లేకుండా మనం వున్నామా? ...ఛీ....ఛీ! ఇంట్లో వుండాలంటేనే కంపరమెత్తుతోంది. ఓ ఆడదానితోనే కాపురం చేస్తున్నానా అనే సందేహం వస్తోంది" అంటున్నాడు.
"నా కసలు కాపురమే చేస్తున్నానా అనే సందేహం వస్తుంటుంది" అన్నాను నేనూ అంతే స్థిరంగా. ఆ క్షణమే అతడితో తాడో, పేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను.
కానీ అంత సాహసం చేయలేకపోయాను. నాకు గుండెల్లో ఎక్కడో మంట మొదలయింది. ఎలాంటి వాళ్ళతో పోలుస్తున్నాడు నన్ను? పైగా నా ఇంట్లోవాళ్ళనంటాడా? నా అన్నయ్య కాలి గోటికి సమానమా ఇతను? నాకు అహంకారమా? ఈ ఇంట్లో ఆడవాళ్ళకి వున్న అహంకారం కంటే ఎక్కువ వుందా నాకు? నాలో లేనిది 'డిప్లొమసీ' యేగా!
నావి బోడి చదువులా? నా తెలివితేటలు నయాపైసాకి కొరగావా? నాకు సంసారం చేయడం రాదా? నేనసలు ఆడదాన్నే కాదా? నా మనస్సుని ఎందుకిలా చిత్రవధ చేస్తాడతను? నేనూ పోట్లాడుతున్నాను. కానీ ఇలా ఆగర్భ శత్రువులాగా ఈటెల్లాంటి మాటలతో గాయపర్చనే! కేవలం నా 'హక్కుల' కోసం పోరాడుతున్నాను.
నేను చదువుకోవడం, నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం వీళ్లెవరికీ ఇష్టంలేదు. అదీగాక నా మొగుడికి నామోషీ! పెళ్ళాన్ని ఆ మాత్రం 'అదుపు' లో పెట్టుకోలేడా అని తనవాళ్ళనుకుంటారనే ఫీలింగ్ వుందేమో! అది కవర్ చేసుకోవడానికి తన 'మగతనాన్ని' ఇలా ప్రదర్శిస్తున్నాడు. జీవితంలో ఏం కోల్పోతున్నాడో ఇతని కసలు అర్థమవుతోందా? గుమ్మం దగ్గర్నుంచి మాటలు వినపడటంతో నేను ఆలోచనల నుంచి తేరుకున్నాను. నా బావగారు బయట నిలబడి, "పనిమనిషి ఎదురుగా జరిగింది చాలు! నువ్వూరుకోరా, మీ వదిన చూసుకుంటుందిలే పని!" అని నా భర్తతో అనేసి "నువ్వూ ఇక గొడవాపేసి చదువుకోమ్మా!" అని కదలబోయాడు.
"వదినెందుకు చేయాలి అన్నయ్యా? తను రెస్ట్ తీసుకుంటుంది. ఇది వెళ్తుందిలే. పని చెయ్యడానికి తీరికలేదు కానీ, రాద్ధాంతం చెయ్యడానికి మాత్రం ఎక్కడలేని టైముంటుంది" అంటున్నాడు. అంత కోపంలోనూ ఆ పాయింటు నచ్చింది నాకు. నా భర్త చెప్పింది నిజమే. ఇంత గొడవపడే బదులు వెళ్ళి ఆ పనేదో చేసేసుకుంటే సరిపోయేది. తర్వాత వచ్చి చదువుకోవడానికి కనీసం మూడ్ బావుండేది.
నిర్లిప్తంగా నా పుస్తకాలు మూసేసి లేచాను.
నా మొహంలోని నిర్లిప్తత చూసి నా బావగారు నా భర్తతో ఏదో అనబోతుంటే- "ఫర్లేదు, ఇక ఎలాగూ చదువుకోలేను లెండి!" అని వంటింటివైపు నడిచాను.
నేను అక్కడికి వెళ్ళగానే అప్పటివరకూ మొహం గంటు పెట్టుకుని చదువుతున్న 'కాశీ మజిలీ కథలు' పుస్తకాన్ని చేతిలో పట్టుకునే పనిమనిషికి సూచనలు ఇస్తున్న నా తోడికోడలు మహదానందంగా ఆ పనిని నాకు అప్పగించేసింది.
చుట్టూ జరుగుతున్న విషయాలతో తనకేమాత్రం సంబంధం లేనట్టే నా అత్తగారు టీవీలో లీనమైపోయి 'తిరుగుబాటు' అనే తెలుగు సినిమా చూస్తోంది.
చేతిలో స్టెన్ గన్ వుంటే ముందు ఆవిడనీ, తర్వాత అందరినీ తూట్లు పడేలా కాల్చిపడేయాలన్నంత ఆవేశం తన్నుకొచ్చింది. ఏమీ చేయలేని నిస్సహాయత ఫ్రస్టేషనై మనసుని కాలుస్తోంది. ఇలా జరిగిన ప్రతిసారీ నాలో ఏదో ఒక దారుణం చెయ్యాలన్న భావన రావడం, వెంటనే నిస్సహాయత, నిర్లిప్తత, రాజీ... అతను మాత్రం మరుక్షణమే అసలేమీ జరగనట్లుగా, అతి మామూలుగా కూల్ గా మారిపోవడం, ఆ ధోరణి నా అహాన్ని మరింత దెబ్బతీస్తోంది.
మనస్సుని శూన్యం ఆవరిస్తోంది. ఏం బతుకు బతుకుతున్నాను నేను? ఇంత గొడవ జరిగినా, నేనెంత రాద్ధాంతం చేసినా చివరికి సర్దుకుపోక తప్పట్లేదు. నేనూ పంతంగా ఎందుకు వుండలేకపోతున్నాను? బహుశా అతనికి అక్కడ వున్నా, లేకపోయినా ఈ సంసారం మీద ఆశలు వదులుకునే స్థితిలో నేను లేనేమో! నేను రోజు రోజుకీ సగటు భారత స్త్రీకి ప్రతినిధిగా మారుతున్నానా?
నాకు నా పుట్టిల్లు గుర్తొచ్చి దిగులేసింది. ఎంత స్వేచ్చగా, నిశ్చింతగా వుండేదాన్ని! ఇక్కడ ఏడవడానికి ప్రైవసీ లేదు. ఓదార్చడానికి ప్రేమించే భర్త తోడు లేదు. వీళ్ళందరిలోకీ ఏం తీసిపోయానని నన్నిలా వేరుచేసి మట్లాడతారు? ఎన్నో ఏళ్ళు వేరే వాతావరణంలో పెరిగి హఠాత్తుగా ఈ ఇంటికి వచ్చిన మనిషి ఇక్కడ అలవాటు పడడానికి సాయపడాల్సిందిపోయి, నా భర్త అందరి ఎదురుగా నానా మాటలతో ఎందుకు అవమానిస్తాడు? అతడే ఇళా చేస్తే ఇక నాకు మిగతా వాళ్ళేం గౌరవమిస్తారు? ఆ ఇంట్లో నా స్థానం ఏమిటో అర్థంకాని అయోమయంతో ఆ వాతావరణంలోంచి పారిపోవాలన్న కోరిక పెరుగుతోంది. గుండెలో తెలియని బాధేదో ఆ రాత్రంతా నన్ను నిద్ర పోనివ్వలేదు.
ఆ తర్వాతి రోజు సాయంత్రం నా బావగారు నా కాలేజీకి రోజూ కంటే కాస్త ముందుగానే వచ్చాడు. అతని మొహం చూస్తూంటే తిన్నగా ఇంటికి తీసుకెళ్ళకుండా కూర్చోబెట్టి ఏదైనా హితబోధలు చేస్తాడేమోననే ఆలోచన కలిగింది నాకు. అతనితో ఏదీ చర్చించే మూడ్ లేదు నాకు. నేనూహించినట్లుగానే అతను ఇంటికి తీసుకువెళ్ళలేదు. తన ఆఫీసుకు తీసుకెళ్ళాడు. కూర్చున్న తర్వాత అతను వాచ్ మెన్ ని పంపి కూల్ డ్రింక్స్, స్నాక్స్ తెప్పించాడు. అతనేం మాట్లాడతాడని నేను ఆలోచించలేదు. ఏం మాట్లాడినా తలూపేసి వెళ్ళి నా పని నేను చూసుకుందామనే మూడ్ లో వున్నాను. అతను కాసేపు బిజినెస్ విషయాలు మాట్లాడాడు. కొత్త ప్లాంట్ కి పాత ఖాతాలను బదిలీ చేయడంలో లాభనష్టాల గురించి చర్చించాడు. నేనూ అది ఆసక్తిగానే విన్నాను.
అతనికి తన గురించి తను మాట్లాడుకోవాలంటే తన వ్యాపకం తప్ప మరో ప్రసక్తి దొరకదా అనే సందేహం నాకు కలిగింది. వ్యాపారం అతని జీవితంలో ఎంత పెనవేసుకుపోయిందో తల్చుకుంటే నాకు ఆశ్చర్యమేసింది. అంత అంకితభావం వుండబట్టే అలాంటివాళ్ళు విజయాలను చవిచూస్తారేమో! ఏకాగ్రత, లక్ష్యం కూడా కుదురుగా వుండని నా లాంటివాళ్ళు ఇలా ప్రతి చిన్న సంఘటనకీ తీవ్రంగా స్పందిస్తూ జీవితంలో ఏదీ సాధించకుండా మిగిలిపోతారు.
నా రీసెర్చ్ వర్క్ గుర్తొచ్చి నాకు దిగులేసింది.
"నాకు మీ అంత పట్టుదల ఎప్పటికైనా వస్తుందంటారా?" అన్నాను దిగులుగా.
అతను అర్థంకాక "ఏ విషయంలో?" అన్నాడు.
నేను చెప్పాను.
అతను నవ్వేసి, "జీవితంలో మరేదీ లభించదని నిశ్చయంగా తెలిసిపోయాక వస్తుంది" అన్నాడు.
ఆ నవ్వులో ఎక్కడో దిగులు ధ్వనించడం నేను గమనించాను. చుట్టూ వున్న వాతావరణం మా సంభాషణలో ఏదో గంభీరతను ప్రవేశపెడుతుంటే, అతని కంఠం సీరియస్ గా ధ్వనించింది. "అవును! ఇంతకాలం నీ సంసారం మాత్రమే అలా త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతోందని వాపోయావు. నిజానికి అలా ఏం వుండదు. నీలాంటివాళ్ళు లోకంలో చాలా మంది వున్నారనే నిజం నీకు ఓదార్పు నివ్వవచ్చు. అసంతృప్తి అనేది మనిషి నీడలాంటిది. అది మనముందు వుండకుండా వెనక్కి వెళ్ళిపోవాలంటే సూర్యుడికి అభిముఖంగా నడక సాగించాలి. ఉదాహరణకి నన్నే తీసుకో!"
అతనిలో కొత్త మనిషిని నేను కళ్ళార్పకుండా చూస్తున్నాను. అతనన్నాడు- "మనకు లేనిదాని గురించి ఆలోచిస్తూ జీవితం నాశనం చేసుకోవడం అవివేకం. పరిస్థితులతో సర్దుకుపోయి, మనకున్న ప్లస్ పాయింట్స్ ని మన ఆస్తులుగా మార్చుకునే ప్రయత్నంలో మన బాధను మరచిపోవచ్చు".
"అది ఎస్కేపిజం కదా! నిజాన్ని ఎదుర్కొనే బదులు దాన్ని తప్పించేసి, మరోదారి వెదుక్కోవడం ఎంతవరకు సమంజసం?" అని అడిగాను సిన్సియర్ గా.
"అది ఎస్కేపిజం అవదు. నేనింత క్రితమే చెప్పాను. మన ప్రయత్న లోపం వుండకూడదు. భవిష్యత్తులో మన ఇప్పటి చర్యలు మనకి గిల్ట్ ని కలిగించకూడదు.అయినా నీ భర్త నీకు అనుకూలించకపోవడం- అది నీ తప్పుకాదు, అతని తప్పు. ఒక భార్యగా నీ విధులు నిర్వర్తిస్తే చాలు. తర్వాత నువ్వతని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు. నీ జీవితంలో అతడొక భాగం మాత్రమే. నీ లక్ష్యంమీద నీ దృష్టి సారించు. మిగతా అన్నీ నీ కనవసరమైన విషయాలనుకో!"
నేను ఆలోచిస్తున్నాను. అతను ఈ మార్గంలో మాట్లాడతాడనుకోలేదు. ఎలా సర్దుకుపోవాలో, తన తమ్ముడు ఎంత మంచివాడో నాకు హితబోధలు చేస్తాడనుకున్నాను. ఏ కారణంగా అతనిలా కొత్తగా మాట్లాడుతున్నాడో అనుకున్నాను. ఆలోచిస్తే అతని మీద అంతులేని ఆప్యాయత కలిగింది. నా ఫీలింగ్స్ పట్ల అతని స్పందన, నా భవిష్యత్తు గురించి అతని ఆలోచన నన్ను కదిలించాయి.
అతను చెప్తున్నాడు- "పెళ్ళయ్యేవరకూ పెళ్ళి గురించి నాకు కొన్ని నిర్ధిష్టమైన ఆశలు వున్నాయని నాకు తెలియదు. చాలామంది అంతే ననుకుంటాను. ఏ స్త్రీ అయినా ఒకటే కదా! అని అనుకుంటాం. చేసుకున్న వాళ్ళతో ప్రత్యక్షంగా గడపవలసి వచ్చినప్పుడే మనకూ ఊహలుండేవని అర్థమవుతుంది. వాస్తవం దానికి పూర్తి భిన్నంగా, అసంతృప్తికరంగా వుంటుంది. అలాంటి సమయాలలో కొంతమంది వెంటనే రాద్ధాంతం చేసి, ఎదుటి వ్యక్తిలో మార్పు తేవాలని ప్రయత్నించి, విఫలులై, గొడవలతోనో, మరే బలహీనతకో బానిసలై జీవితాన్ని నరకం చేసుకుంటారు. ఇక నా లాంటివాళ్ళు సంతోషాన్ని మరో దారిలో వెతికి పట్టుకుని వేదాంతులవుతారు" అతను నవ్వాడు.
నేను నా రెండు అరచేతుల్లో గడ్డమానించి అతను చెప్పేది వింటున్నాను.