ఆ నేపథ్యంలో నాకూ, నా భర్తకూ వున్న పాత గొడవలు సమసిపోవడం నాకు ఆనందాన్ని కలిగించింది. నా బావగారి మాటలు గుర్తొచ్చాయి. నిజమే... భార్యాభర్తల మధ్య శాశ్వతమైన గొడవలంటూ ఏవీ వుండవు. కనీసం ఇద్దరూ కలిసి వుంటున్నంతవరకూ! నేను ఇంటికి వచ్చేసరికి నా బావగారు టూర్ నుంచి తిరిగి వచ్చేశాడు. నా తండ్రి గురించి కుశల ప్రశ్నలు వేశాడు.
మేమిద్దరం కారులో కలిసి వెళ్తున్నప్పుడు "మీరిద్దరూ మాట్లాడేసుకుంటున్నారా? నేను చెప్పలేదూ!" లాంటి చవకబారు ప్రసక్తి ఎత్తలేదు. గమనించి సంతోషించినట్టు మాత్రం కనిపించాడు. నేను ఇంట్లో మరీ నాకు సంబంధం లేనట్లూ, మొహం ముడుచుకునీ వుండడం మానేశాను. సాధ్యమైనంత ఉత్సాహంగా అన్నింటిలోనూ పాలుపంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నా ఆడపడుచుకి పెళ్ళి సంబంధాలు ఇంటివరకూ రావడం వల్ల నా బాధ్యత, పెద్దరికం పెరిగినట్టు ఫీలయ్యాను.
నా ఆడపడుచు మొదటి పెళ్ళిచూపులు నాకు బాగా గుర్తు. పెళ్ళి జరుగుతోందా అన్నంత హడావుడి చేశాం. నా తోడికోడలూ, నేనూ కలిసి యింటిని అలంకరించి మొత్తం స్వరూపాన్నే మార్చేశాం. పెళ్ళివారొచ్చారు. వాళ్ళొచ్చేసరికి నా అత్తగారు కూడా మంచి జరీ చీర ధరించి, బంగారు గాజులు, చెయిన్ వేసుకుని తయారైపోయింది. పెళ్ళికొడుకు వాళ్ళు అంత స్థితిపరులు కాదేమో, అబ్బాయిని మాత్రం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని చేశారు. కుర్రాడు చూడటానికి అంత డాబుగా లేడు. వాళ్ళు మా ఏర్పాట్లు చూసి ఖంగుతిన్నట్లున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో తర్జన భర్జనలు మొదలయ్యాయి.
"వాళ్ళకేం లేదురా. అమ్మాయిని ఇచ్చుకునేటప్పుడు అన్నీ వున్నవాళ్ళకి ఇచ్చుకుని తెచ్చుకునేటప్పుడు ఏమీలేని వాళ్ళనుంచి తెచ్చుకోవాలని చెప్తారు. అందుకే నా కోడళ్ళ స్థితిగతులు నేను చూడలేదు. కూతురిని మాత్రం అలా ఇవ్వను" అంది నా అత్తగారు. అది విని కమ్చీతో కొట్టినట్టయింది నాకు. రోషం తన్నుకొచ్చింది. కందిపోయిన మొహంతో న తోడికోడలి కేసి చూస్తే ఆవిడ అసలా మాటలు పట్టించుకున్నట్టే లేదు.
అప్పటివరకూ నేను తీసుకున్న నిర్ణయాలు అన్నీ గాలికి కొట్టుకుపోయినట్టయ్యాయి. "ఎంత అహంకారం ఈవిడకి? ఈవిడకి వున్నదేంటి? నాకు లేనిది ఏమిటి? కొడుకులు ఇద్దరూ ఇంత సంపాదించిపోస్తున్నా, సంప్రదాయం పేరుతో కోడళ్ళచేత ఇంటి పనంతా చేయిస్తుంది. ఒక సొంత ఇల్లు, ఓ వాషింగ్ మెషీన్ కూడా లేవు. స్థితిగతుల గురించి ఈవిడకేం తెల్సు? కొడుకుల్ని ముంచి కూతుర్ని అందలం ఎక్కించడం తప్ప..." అనుకున్నాను.
నేను ప్రతి చిన్న విషయానికీ, విమర్శకి ఇంతలా రియాక్టవడమే నా సమస్యలన్నింటికీ కారణమనుకుంటా. ఆ తర్వాత నేను నా ఆడపడుచు పెళ్ళి విషయం పట్టించుకోలేదు.
చిట్టచివరికి ఓ సంబంధం కుదిరింది. అబ్బాయి చూడడానికి బావున్నాడు. పెద్ద వున్నవాళ్ళు కాదు కానీ ఒక్కడే కొడుకు.
నా భర్త ఇక రాత్రింబవళ్ళూ పెళ్ళి ఏర్పాట్లలో మునిగి తేలుతూ వాళ్ళ అమ్మ ఇచ్చే ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు.
పరోక్షంగా నా అత్తగారు "ఎంత మర్యాదలు చేస్తే ఆడపిల్లకి వాళ్ళింట్లో అంత గౌరవం వుంటుంది. మనమేం లేనివాళ్ళం కాదుగా. వాళ్ళడిగిన వన్నిటికంటె ఎక్కువే చేద్దాం" అని అంటోంది. "... అన్నిటికీ డూడూ బసవన్నల్లా తలూపే చెట్టంత కొడుకులుంటే నువ్వెందుకు లేనిదాని వవుతావు తల్లీ?" అనుకున్నాను కసిగా. పెళ్ళిచీరలూ, పెట్టుడు చీరలూ అని వేలకి వేలు ధారాళంగా ఖర్చుపెట్టారు. నేనన్నీ నిశ్శబ్దంగా చూడడం తప్ప మరేం చెయ్యలేదు. వీళ్ళ సూడో రాయల్టీ పట్ల అసహ్యం కలిగింది.
మొత్తం మీద పెళ్ళిరోజు దగ్గిర పడింది.
వెండి పళ్ళెమూ, చెంబూ దగ్గర పేచీ వచ్చింది. మొదట డబ్బు ఇస్తే వాళ్ళే తెచ్చుకుంటామన్నారు. డబ్బు తీసుకున్న తర్వాత 'కొని తీసుకురావడం మీదే బాధ్యత' అన్నారు. అక్కడో మూడువేల దాకా తేడా వచ్చింది. ఈ మోసానికి నా భర్తకి ఒళ్ళు మండిందనుకుంటా... అప్పటికే నా ఆడపడుచూ, ఆ కుర్రాడూ కలిసి షికార్లు కొడుతున్నారు.
"ఏం? నువ్వా కుర్రాడికి చెప్పుకోలేవూ, వాళ్ళ అమ్మా నాన్నలకి సర్దిచెప్పుకోవేమి?" అని చెల్లెలి మీద ఎగిరాడు. 'వాడూ మీలాంటి వాడే అయుంటాడు' అందామనుకున్నాను.
"ఆయన బాధపడ్తూనే వున్నారాన్నయ్యా! అయినా పెద్ద వాళ్ళకేమని చెప్పుకుంటారు చెప్పు" అంది ఆ అమ్మాయి నంగనాచిలా. తనుగానీ స్త్రీ హక్కుల పరిరక్షణ సమితిలో చేరి వుంటే, తప్పకుండా ప్రెసిడెంట్ అయివుండేది అనుకున్నాను.
నేను భయపడుతున్న సమయం రానే వచ్చింది. మొహమాట పడుతూనే "పాతిక వేలుంటే అప్పుగా ఇవ్వకూడదు?" అని నా భర్త నన్నడిగాడు. నాకు మందిపోయింది. "నేనివ్వను" అన్నాను ఖండితంగా. "ఏం?" అన్నాడు తెల్లబోయి.
"మీ అమ్మని అన్నీ రాచరికపు అలవాట్లు కదా. కోడల్ని అడిగి తీసుకునేంత బీదరాలు ఎప్పుడయింది?" అన్నాను వ్యంగ్యంగా.
"ఆవిడ ఏదో తెలీక మాట్లాడితే, దాన్ని నువ్వు ఇంతగా సాధించాలా?" అన్నాడు దిగొస్తున్నట్లు. అవును, అవసరం అతనిది మరి!
"కష్టం కోడలిది. క్రెడిట్ కొడుకులది. లాభం ఆవిడదీ, ఆవిడ కూతురిదీ! నేను మాత్రం అన్నీ మర్చిపోయి ఇప్పుడు సాయం చెయ్యాలా?" అన్నాను మొండిగా. అతను నిస్సహాయంగా చూశాడు. "నా తల్లిదండ్రులు లేని వాళ్ళంటుందా ఆవిడ? మరి కొడుకుల పెళ్ళిళ్ళకి కట్నం వసూలు చేసి, ఉద్యోగం చేసే కోడళ్ళని దోచి కూతురి పెళ్ళి చెయ్యాల్సిన ఖర్మ ఆవిడకెందుకు పట్టింది?" అన్నాను. అతని మొహం ఎర్రబడడం చూసి నేనిక పొడిగించకుండా ఆపేశాను. అతను గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడుగానీ నా మనసు చల్లబడలేదు. వాళ్ళకి పొదుపు తెలీదు. దేనికి ఖర్చు పెట్టాలో, దేనికి మానెయ్యొచ్చో తెలీదు. నేను ఇచ్చినా అదేదో అనవసరపు ఖర్చు చేసేస్తారు. సంసారపక్షంగా చేసుకునేవాళ్ళకేమోగానీ, ఇలాంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. నేను బండి కొంటానన్నప్పుడు 'అది అనవసరపు ఖర్చు' అని కొట్టిపారేసిన విషయం ఇప్పటికీ నేను మరిచిపోలేదు!
ఇక్కడ నాకు అర్థంకాని విషయం మరొకటి వుంది. ఆడపెళ్ళివాళ్ళు పెళ్ళి డాబుగా చెయ్యాలనుకున్నప్పుడు అనవసరపు ఖర్చులు చాలా వస్తాయి. అలాంటి సమయాల్లో నా భర్త లాంటి వాళ్ళు బయటెక్కడో ఎక్కువ వడ్డీకి లెక్కలేనంత డబ్బు అప్పుగా తీసుకుంటారు. చిత్రమేమిటంటే అలా తీసుకుంటున్నప్పుడు భవిష్యత్తు వూహించరు. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడరు. పశ్చాత్తాపపడరు. అవసరమొస్తే ఇంకోసారి అలా చెయ్యడానికి కూడా వెనుకాడరు.
మా నాన్నగారు తెచ్చిన జీతంతో మా అమ్మ పొదుపుగా సంసారం చేసి, మా ఇద్దరి చదువులకి మాత్రం ఏ లోటూ రాకుండా ఖర్చుపెట్టి, సొంతిల్లు కట్టుకుని నా పెళ్ళినాటికి నా తండ్రి రిటైరయిపోయినా, కూడా ఒక్క పైసా అప్పుచేయాల్సిన అవసరం లేకుండా వైభవంగా చేయగలగడం ....ఆలోచిస్తే మా వాళ్ళమీద నాకు గౌరవం, వాళ్ళను చూసుకుని గర్వం కలిగాయి.
నా భర్త అప్పులు చెయ్యడం, అవి తీర్చడానికి ఇంట్లో ఖర్చులు ఏ మాత్రం తగ్గించకపోవడం, అవి తీరే బదులు పెరిగి పోవడం, అప్పుల వాళ్ళు ఏకంగా ఇంటికే రావడం జరిగాయి. నా బావగారు అప్పటికి వాళ్ళకేదో సర్దిచెప్పి పంపేశారు. నా అత్తగారు కనీసం బయటకు కూడా రాలేదు. బహుశా అప్పులవాళ్ళకివ్వడానికి కాఫీ చేస్తోందేమో అనుకున్నాను.
నా బావగారు నా భర్తకి సగం డబ్బు అప్పుగానే సర్దారు. దాన్ని నేను నెలనెలా ఠంచనుగా కట్టి "తీర్చేస్తానన్నది" కూడా అనవసరమైన విషయమే.
నన్ను అమితంగా బాధించిన విషయం ఏమిటంటే, ఎలాగూ తీర్చక తప్పలేదు. ఆ మాత్రం దానికి నేనెందుకు నోరు పారేసుకున్నానా అని.
ఎందుకంటే ఆ తర్వాతెప్పుడో నా అత్తగారు "పెళ్ళి పనుల్లో నా బిడ్డ బాగా నలిగిపోయాడమ్మా! ఎవరూ వాడికి సాయపడలేదు. ఆర్థికంగా అయినా, పనుల్లో అయినా ఇంట్లో వాళ్ళే 'నీ బాధలు నువ్వు పడ' మన్నారు..." అని ఇంకా ఏదో నా గురించి పరోక్షంగా దెప్పి పొడుస్తుంటే విన్నాను. నాకు కోపం రాలేదు. జాలి కలిగింది.
నా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయ్యింది. నెల నెలా నా జీతం నా బావగారి అప్పు తీర్చడానికే సరిపోయింది. నేను నా ఉద్యోగంలో ఎక్కడ మొదలయ్యానో తిరిగి అక్కడికే చేరుకున్నాను. రెక్కలు ముక్కలయ్యేంత కష్టం. కొండంత అశాంతి, కళ్ళకింద వలయాలు మాత్రం మిగిలాయి.
నా సంసారం బాగుపడుతుందన్న నమ్మకం ఏమూలో వుండి వుండుంటే అది ఇప్పుడు పూర్తిగా పోయింది నాకు. నాకు సంసారం మీదే కాదు, జీవితం మీదే కోరిక నశించింది.
నేను నా బావగారితో కూడా మాటలు తగ్గించేశాను. ఆయన వాళ్ళింట్లో అందరికంటే భిన్నమనుకున్నాను. డబ్బు విషయానికి వచ్చేసరికి చెల్లెలి పెళ్ళి తన బాధ్యత కానట్టు అప్పులన్నీ తమ్ముడి నెత్తిన వేశాడు.
నా ప్రవర్తనలో మార్పుని ఆయన గమనించినట్టున్నాడు. ఎందుకలా వుంటున్నావని ఒక రోజు అడిగాడు. నేనేం జవాబు చెప్పలేదు. అప్పుడాయన అన్నాడు- "నువ్వెందుకలా వుంటున్నావో తెలీని మూర్ఖుడిని కాదు. నీ భర్తచేత ఆ అప్పులన్నీ తీర్పిస్తున్నాననేగా నీ కోపం?"
నేనప్పటికీ ఏం మాట్లాడలేదు.
"చూడు పెళ్ళికి అప్పులు చేయడం విషయంలో నువ్వెంత వ్యతిరేకమో నేనూ అంతే. నేనొకసారి వద్దని చెప్పాను. అయినా వాడు, అమ్మ, ఇద్దరూ నా మాట వినలేదు. దాని రిజల్టు ఎలా వుంటుందో వాళ్ళనే తెలుసుకోనిమ్మని నేనూ వూరుకున్నాను. ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమైంది. అవి తీర్చడానికి మళ్ళీ నువ్వు, నేనే కావలసి వచ్చాం. నేను వాడింది కంపెనీ డబ్బు. నీకు తెల్సిన 'షేర్స్' తప్ప నాకు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటూ ఏమీలేవు. అవి మదుపు పెట్టి కంపెనీ లోన్ తీసుకున్నాను. అది తీర్చవలసిన బాధ్యత నా మీద ఎంత వుందో, నా తమ్ముడి మీద కూడా అంతేవుంది. అందుకే నెలనెలా తీర్చాలన్న షరతు పెట్టాను" అన్నాడు.
కారునుంచి దిగుతుండగా గుర్తొచ్చింది నాకు. "నెల నెలా ఆ తప్పు తీరుస్తున్నది నేను. మీ తమ్ముడు కాదు. ఇక అతను నేర్చుకున్న గుణపాఠమేంటి? అన్ని విధాలా నష్టపోయింది నేను కదా!" అందామనుకున్నాను కానీ అప్పటికే నాకు అందరిమీదా వున్న కోపం పోయి నిర్లిప్తత కలిగింది.
నిర్లిప్తత కోపానికి పైమెట్టు.
15
ఎప్పుడూ లేనిది నాకు నా అత్తగారి ఇంట్లో వాళ్ళమీద చులకనభావం కలిగింది. అందరూ నా మీద ఆధారపడి బ్రతుకుతున్నారన్న ఫీలింగ్. అందుకే ఎవరేమనుకుంటారో అన్న ఆలోచనలు రావట్లేదు నాకు. నేను ఏదైనా అలక్ష్యంచేస్తే మాత్రం వీళ్ళకి అడిగే హక్కు ఎక్కడిది? అనే నిర్లక్ష్యభావం మొదలయింది. అది చాలా ప్రమాదకరమయిన సంకేతం.
నేనూ, నా భర్తా సఖ్యంగా వుండాలని నా బావగారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంట్లో వీళ్ళందరూ వుండగా మేమిద్దరం అవగాహన ఏర్పరచుకోవడం అసంభవం అని నాకు అర్థమయింది. నా బావగారు కూడా ఏదో ఆలోచనలో వున్నట్లు కనిపించాడు. అతనేం ఆలోచిస్తున్నాడనేది నాకు రెండురోజుల తర్వాత అర్థమైంది.
గుంటూరులో ఎవరో దూరపు బంధువుల పెళ్ళి వుందని అందరినీ బయలుదేరతీశాడు నా బావగారు. నా బావగారికి అప్పటికప్పుడు ఏదో టూర్ పని పడడంవల్ల ఆయన గుంటూర్లో భార్యనీ, తల్లినీ వదిలి అట్నుంచటు వెళ్ళిపోవాలని 'ప్లాన్ చేశాడు' ఆ ప్రయత్నమంతా నన్నూ, నా భర్తనీ ఒంటరిగా వదిలేయడానికని అర్థమై నేను కృతజ్ఞతగా ఫీలయ్యాను.
వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను వారంరోజులు సెలవు పెట్టెయ్యాలని నిశ్చయించుకున్నాను. అతనూ పెట్టేస్తే బావుండుననుకున్నాను. జీవితంలో మొదటిసారిగా దొరికిన ఏకాంతం. దాన్ని అద్భుతంగా ఆనందించాలని నా తపన. "సెలవు దొరకదోయ్, ఇన్స్ పెక్షన్ వుంది" అనేశాడు నా భర్త. అది నేను ఊహించని జవాబుకాదు కాబట్టి పెద్దగా బాధపడలేదు.