Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 18


    "ఆయన్ని ఒకసారి నేను రామ్మన్నానని చెప్పాలండీ. ఎప్పుడైనా సరే, ఒకసారి ఆయనతో ఒకరాత్రి గడపాలని వుంది" అంది మత్తుగా.
    అతని గుండెను రంపంపెట్టి పరపర చీలుస్తున్నారు.
    "ఏమండీ! ఆయనకు చెప్పరూ" అర్థిస్తోంది ఆమె.
    "అలాగే" అన్నాడు నూతిలోంచి అరిచినట్లు.
    "ఏదీ, ఒట్టువేయండి" అని ఆమె చీకట్లో చెయ్యి జాచింది.
    అతనింక కోపం ఆపుకోలేకపోయాడు. ఆమెను ఛడామడా తిట్టాడు, అబ్బ, తిట్టేటప్పుడు ఎంత శక్తివంతమైన భాష ఉపయోగించాడు! అయినా కోపం చల్లారలేదు. ఇహ తన్నటం మొదలుపెట్టాడు. జుత్తుపట్టుకుని నేలమీద బరబర యీడ్చాడు. తను కీచకుడు- తను దుశ్శాసనుడు- తను తన్నేవాడు.
    "ఏమండీ. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఒట్టు వెయ్యరా?"
    కీచకుడు మృత్యుంజయరావుగా మారి ఆమెచేతిలో చెయ్యివేశాడు.
    ఆమె నిట్టూర్పు విడిచింది. మృదుస్వరంతో అన్నది. "ఆయన నాదగ్గరకు వస్తే డబ్బుకూడా తీసుకోను, సంతోషంగా యీ శరీరాన్ని ఆయనకు సమర్పిస్తాను. ఇంతకూ యిది ఆయన చేసుకున్న అదృష్టం."
    ఇంకా ఏమేమో అంటున్నది అపస్మారకస్థితిలో వున్నట్లు.
    "ఔరా! శేఖరం! ఒక వేశ్యముందుకూడా నేను ఓడిపోయేటట్లు చేశావురా. ఇహ యీ అవమానం భరించలేను. కాని ఈ రహస్యం జీవితంలో నానుంచి రాబట్టగలననుకుంటున్నావేమో! అసంభవం. నన్ను కోసినా నిజం తెలుసుకోలేవు. హహ్హహ్హహ్హ."
    లైటు వేశాడు. మంచంమీదనుంచి లేచి గోడదగ్గరకు వెళ్ళి అలమరాలోని వాచి తీసి టైము చూశాడు. రెండయింది. ఇన్నిపనులు చేసినా, యింతసేపు ఆలోచించినా, యింతహింస అనుభవించినా యింకా రెండేనా? మంచంవైపు చూశాడు. మంజులత ఒకప్రక్కకు తిరిగి గాఢనిద్రపోతూ కనిపించింది. చీరె పూర్తిగా వూడిపోయింది. పరికిణీ స్థానభ్రంశం పొందింది. ఒక అయిదు నిముషాలపాటు అతను దృష్టి మరల్చకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు. తను ఓ స్త్రీని నగ్నంగా చూస్తున్నాడు. పరిశీలిస్తున్నాడు. అతన్లో కోరికలు చెలరేగకపోగా చెడ్డ అసహ్యమేసింది. ఈ ప్రపంచంమీద అసహ్యమేసింది. తనమీద అసహ్యమేసింది.
    "భగవంతుడా! ఇంకెప్పుడూ వ్యభిచారం చెయ్యను, నన్ను క్షమించు. ఎప్పుడూ- ఎప్పుడూ చెయ్యను" అతని కళ్ళవెంట నీళ్ళుకారాయి. అతనేడుస్తున్నాడు.
    ఈ స్పందన కలిగాక గదిలో ఆమె ఉనికి అతనికి దుస్సహంగా తోచింది. ఆమె అగ్నిలా సెగలు విరచిమ్మింది. ఉక్కిరిబిక్కిరయినట్లు, ఊఫైరాడనట్లు బాధపడ్డాడు. ఆమె దగ్గరకు వెళ్ళి భుజంమీద చేయివేసి తట్టిలేపాడు.
    ఆమె బద్ధకంగా కళ్ళువిప్పి దీపకాంతి చూడలేక మళ్లీ మూసేసుకుని "ఏమిటిది? లైటెందుకు వేశారు? ఆర్పివేయండి బాబూ" అంది ముఖం చిట్లించి విసుగ్గా.
    ఆమెని సాగనంపటానికి ఎలా బోధపర్చాలో తెలియక "అదికాదు, అదికాదు" అంటూ తడబడుతున్నాడు.
    "ఏదికాదు? మీ ఎత్తులన్నీ నాకు తెలుసులెండి. ఇప్పుడేంకాదు. నాకు నిద్ర ముంచుకొస్తోంది. లైటు తీసేసెయ్యండి. పడుకుందాం" అన్నదామె కళ్ళు తెరవకుండానే.
    అతను సంశయిస్తూ "నా ఉద్దేశ్యం అదికాదు... చాలా రాత్రయింది. ఇహ వెడితేనేం?" అనేశాడు.
    ఆమె బద్ధకాన్ని ఒదుల్చుకుని, లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకుంటూ "అబ్బబ్బ! చంపుతున్నారు బాబూ. ఎంతయిందేమిటి?" అని అడిగింది.
    "రెండు దాటింది."
    "ఓస్, దీనికేనా యింత హంగామా! నాలుగింటిదాకా వుండాలని డప్పాలు కొట్టారుగా"
    "అన్నాననుకో..."
    "ఏమనుకో? ఇప్పుడు నాకు మంచి నిద్రవస్తోంది. నేను కదల్లేనండీ సార్. మీకు పుణ్యముంటుందిగాని ఆ లైటు తీసెయ్యండి. కాసేపు నిద్రపోతాను" అని ఆమె మళ్ళీ పడుకోబోయింది.
    ఆతను కంగారుపడుతూ "అదికాదు. ఇప్పుడు బిట్రగుంట రైలు వచ్చేవేళ అయింది. అందులో యింటివాళ్ళు దిగితే దిగవచ్చు. ఎందుకైనా మంచిది. జాగ్రత్తగా వుందామనీ" అంటూ నసిగాడు.
    "అందుకే ఈ మొగవాళ్లని చూస్తే నాకసహ్యం" అంటూ ఆమె చర్రున లేచింది. "ఈ తెలివితేటలు యిందాక ఏమైపోయినాయో" అని లేచి నిలబడి గబగబా చీరె చుట్టబెట్టుకుంటూ "తీసుకురండి రిక్షావాడ్ని, నా పీడ వదుల్చుకుందురు గాని" అంది రుసరుసలాడుతూ.
    బ్రతుకుజీవుడా అని అతను బయటపడ్డాడు. రిక్షా దగ్గర్లోనే ఓ చెట్టుక్రింద కనిపించింది. దగ్గరకు వెళ్ళాడు. తోగులు సీటులో ముడుచుకుని పడుకుని, దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు. భుజంతట్టి లేపాడు.
    తీరా వాడ్ని తీసుకుని యింటి గుమ్మంవరకూ వచ్చాక, గదిబయట నిలబడి ఎదురుచూస్తున్న మంజులత "ఏమిటి దిక్కులు చూస్తున్నారు? మీరుకూడా రిక్షా ఎక్కండి తలుపు తాళంవేసి" అంది మెట్టుదిగుతూ.
    "నేనెందుకూ?" అన్నాడు నసుగుతూ.
    "బాగుంది వరుస. ఈ అర్దరాత్రి చీకట్లో డదాన్ని ఒక్కతినే పోనా ఏమిటి? మీరు దగ్గరుండి తీసుకెళ్ళకపోతే నేనిక్కడ్నుంచి కదలనే కదల్ను" అందామె దబాయింపుగా.
    "అవును సార్, పక్కన మొగాళ్ళులేకుండా ఒక్కదాన్ని చూశారంటే పోలీసోళ్ళు తెగ చిక్కుపెట్టేస్తారండీ. మీరూ రావాలి" అన్నాడు తోగులు ఆమెను బలపరుస్తూ.
    ఇహ లాభంలేదని గ్రహించి భగవంతుడిమీద భారంవేసి గదితాళంపెట్టి, ఆమెతోపాటు రిక్షా ఎక్కి కూర్చున్నాడు. రిక్షా కదిలింది. పోలీసువాళ్ళు... అతని కాళ్లు వొణుకుతున్నాయి.
    ఈసారి మంజులత ఏమీ మాట్లాడటంలేదు. కునికిపాట్లు పడుతున్నట్లుంది.
    రిక్షా రెండుమూడు ఫర్లాంగులు దాటివుంటుంది. అంతలో సరిగ్గా అతను భయపడ్డట్లే జరిగింది. సైకిళ్ళు తొక్కుకుంటూ యిద్దరు పోలీసు కానిస్టేబిల్స్ ఎదురుగా వస్తూ రిక్షాని నిలిపివేశారు.
    అంతేకాదు. "ఏయ్... ఎవరు నువ్వు?" అని గర్జించాడు వారిలో ఒకడు.
    వాళ్ళు అవటానికి పోలీసులే అయినా, చూడటానికి హంతకుల్లా వున్నారు. వీధిదీపం వెల్తుర్లో వాళ్ళ కళ్ళు చింతనిప్పుల్లా గోచరించాయి. జేవురుంచిన ముఖాలతో మెలితిరిగిన మీసాలతో భయంకరంగా వున్నారు. వారి నోళ్ళనుండి భరించరాని వాసన వస్తున్నది.
    "గాడిదలు- తాగారు" అనుకున్నాడు. గడగడమని వణుకుతున్నాడు. ముచ్చెమటలు పట్టి దేముళ్ళకి మొక్కుకుంటున్నాడు. ఆ సమయంలో అతను ఆస్తికుడు.
    తోగులుకూడా రిక్షా దిగి దణ్నాలు పెడుతూ నిలబడ్డాడు.
    మంజులత నిద్రమత్తు వదిలి కళ్ళు పెద్దవిచేసి చూస్తున్నది.
    "ఏయ్, ఎవరు నువ్వంటే మాట్లాడవేం? వొళ్ళు తిమ్మిరిగా వుందా?" ఒకడు టార్చిలైటు రిక్షాలోకి ఫోకస్ చేశాడు. "ఓ! ఈ మహాతల్లా, ఎంత ముట్టచెప్పావు నాయనా? చెప్పు నీ పేరేమిటి?"
    "చెప్పను" అందామనుకున్నాడు. కాని "ము...ము... మృత్యుంజయరావు" అని చెప్పాడు.
    "ఎక్కడ నీ యిల్లు?"
    గొంతు తడారిపోతోంది. అయినా ఎలాగో ఓపిక చేసుకుని చెప్పాడు.
    "ఏంపని చేస్తావు?"
    చెప్పాడు.
    "ఇలాంటి వెధవపన్లు చేయకపోతే, పెళ్ళి చేసుకుని ఏడవకూడదట్రా?" అన్నాడు ఒకడు.
    అతనికి దిమ్మతిరిగింది. ఏమిటి? తనని "రా" అంటున్నాడు అసభ్యంగా.
    "జాగ్రత్తగా మాట్లాడు తెలుసా?" అందామనుకున్నాడు. కాని "త... త...ప్పయిపోయింది" అన్నాడు. ఈ ఆపదనుంచి ఏదోవిధంగా బయటపడితే చాలు. ఇప్పుడెంత అవమానం పాలయినా, అంతగా అయితే జరిగిన అవమానం గురించి తర్వాత బాధపడవచ్చు.
    "ఏమిట్రా ఫూల్... గుడగుడమంటావు? ఈ ఘనకార్యం చెయ్యటానికి ముందే ఏమయినాయి యీ తెలివితేటలు?"
    "అరేయ్! వాడికి నీతులు బోధిస్తావేంట్రా? స్టేషన్ కి తీసుకెళ్ళి మూసేద్దాం పద."
    "అరేయ్, రిక్షా తిప్పరా."
    ఆంజనేయస్వామి, వడ్డీకాసులవాడు, భద్రాద్రి శ్రీరాముడు, వేదాద్రి నరసింహుడు అందరికీ మొక్కులు ఠకఠక మొక్కేస్తున్నాడు. ఒకవైపు శరీరం తేలికైపోతోంది. కళ్ళు తిరిగిపోతున్నాయి.
    ప్రక్కనుండి మంజులత మోచేత్తో పొడిచింది. "అలా చూస్తారేమిటండీ, దిష్టిబొమ్మలా! వాళ్ళమొహాన ఓ అయిదురూపాయలు పారేసి ఎలాగో గట్టెక్కించండి" అంది నెమ్మదిగా.
    మృత్యుంజయరావు కళ్ళముందు ఓ ఆశారేఖ తళుక్కుమని మెరిసింది. గబగబ చెయ్యి జేబులోపలకు పోనిచ్చి చేతికందిన నోటు బయటికి లాగాడు. చాలా చాకచక్యంగా మాట్లాడాలనుకున్నాడు. వాళ్ళకు లంచం యిస్తున్నట్లు ఎవరికీ అనిపించకూడదు. అయినా వాళ్లది తీసుకుని తనని విడిచిపెట్టాలి.
    కాని వొణుకుతూన్న చేతిని గాలిలో చాచి అట్టేపెట్టాడు. నోటు గాలికి రెపరెపలాడుతోంది. ఎంతసేపటికి నోట్లోంచి మాటరాదు.
    "ఏమిటి చేస్తున్నాడు? ఎందుకలా చెయ్యిపెట్టాడు?"
    "పదిరూపాయల కాగితం. మనకి ముట్టచెబుతున్నాడు."
    "అవును. ఆ విషయం నోటితో చెప్పొచ్చుగా?"
    "ఒణికి చస్తున్నాడ్రా. నోరు పెగలటల్లేదేమో."
    "అలవాటు లేదనుకుంటాన్రా, అమాయకుడిలా వున్నాడు. విడిచి పుచ్చేద్దామా?"
    ఒకడు ఆ నోటుని చేతిలోంచి చటుక్కున లాగేసి, జేబులోకి తోసుకున్నాడు. "ఇదిగో మిష్టర్! యిది ప్రథమ తప్పుగా భావించి, మన్నించి వొదిలిపెడుతున్నాం. ఇంకెప్పుడైనా యిలా కనిపించావా... జాగ్రత్త. నీ అంతు చూస్తాం. అరేయ్ రిక్షా! తొరగా తీసుకెళ్ళి దింపెయ్యరా."
    "రారా! ఇంకో పెగ్గేసుకువద్దాం."
    సైకిళ్ళు తూలుతూ కదిలాయి. రిక్షాకూడా మెల్లిగా బయల్దేరింది.
    తర్వాత ఏం జరిగిందో మృత్యుంజయరావుకు సరిగ్గా తెలియదు. మంజులత ఏదో గొణుక్కుంటున్నది. "ఆ మాత్రం చేవలేనివాళ్ళు ఎందుకు తీసుకురావాలీ?" అంటున్నది. తోగులుకూడా సణుగుతున్నాడు.

 Previous Page Next Page