"అదసలే పిరికిది. ఒంటరిగా ఉండలేదు" నిర్మలకు ఆ పల్లెటూరికి వెళ్ళడం సుతరామూ ఇష్టంలేదు.
"అంత పిరికిదానికి చదువెందుకు....? మాన్పించి మంచి సంబంధం చూసి పెళ్ళి చేద్దాం" అన్నాడు మరో అన్నయ్య.
సాహితి గుండెల్లో రాయి పడింది. అంతా కలిసి తన చదువు మాన్పించి వెయ్యరు కదా! ఆమె నిస్సహాయంగా తల్లివైపు చూసింది. ఆమె ఎటూ చెప్పలేనట్టు తల దించుకుంది. అప్పుడు పరమహంసే వాళ్ళ నాదుకున్నాడు.
"మీరెవరూ ఇబ్బంది పడనవసరం లేదు. అసలు ఈ వాదనలే వద్దు వినయచంద్రకి చిన్ననాటి స్నేహితుడిని అతడి వ్యాపారం గురించి బాగా తెలిసినవాణ్ణి దేవుడి దయవల్ల ఈ మధ్యనే నాకు బాగా కలిసొచ్చింది. వీళ్ళదంటూ ఏమీ లేకపోయినా వాళ్ళ బాధ్యత తీసుకోగలిగే స్థితిలోనే ఉన్నాను. నిర్మల గారికి అభ్యంతరం లేకపోతే నేను వీళ్ళను గార్డియన్ గా వుంటాను."
అక్కడున్న అందరికీ పరమహంస అంటే ఎనలేని గౌరవం. అతడు వ్యక్తిగతంగా తెలియకపోయినా అతడి దైవభక్తి మూలంగా బాగా పాపులర్ అయిపోయాడు. అందరూ అతడి అభిప్రాయాన్ని మన్నించారు. కృతజ్ఞతలు చెప్పుకున్నారు.... అందరికంటే ఎక్కువగా సంతోషించేది నేనే అనుకుంది సాహితి.
నిర్మలను కూడా పార్టీకి బయలుదేరదీసి అన్నమాట నిలబెట్టుకున్నాడు పరమహంస. అధునాతనమైన హోటల్లో వాళ్ళిద్దరితో కలిసి భోజనం చేయడం చాలా గొప్ప విషయంగా అనిపించింది. సాహితి తండ్రి ఎప్పుడూ వాళ్ళనలా తీసుకురాలేదు. ఆ వాతావరణం ఎలా వుంటుందో కూడా సాహితికి తెలియదు. ఉదాసీనంగా కూర్చున్న నిర్మలను కూడా నవ్విస్తూ, కబుర్లు చెప్పి వాళ్ళచేత కొసరి కొసరి తినిపించాడు పరమహంస. సాహితి పై చదువుల గురించి వివరంగా మాట్లాడాడు.
సాహితి ఆ రోజు రాత్రి ఎలాంటి దుస్వప్నాలూ లేకుండా హాయిగా నిద్ర పోయింది. హోటల్లో పరమహంసకాస్త 'డ్రింక్' చేయటంలో కూడా అసహజత్వం ఏమీ కనిపించలేదు.
* * *
సాహితి ఇంటర్ లో సైన్సు గ్రూపు తీసుకుంది. సైన్సుతో ఇంటర్ చదివే విద్యార్ధులందరూ దాదాపు 90 శాతం డాక్టర్లయి పోయమనే కలలు కంటూ వుంటారు. డాక్టర్ తప్ప మరో ఆశయం వుండదు.
అయితే సాహితి నిజంగానే బ్రిలియంట్ స్టూడెంట్.
ఒకరోజు ఆమె వచ్చేసరికి యింట్లో ఒక చిత్రమైన దృశ్యం కనపడింది.
పూజగదిలో పరమహంస ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆమె లోపలి ప్రవేశించింది.
లోపల ఎవరూ లేరు.
"ఎవరితో అంకుల్ మీరు మాట్లాడుతున్నారు....?" అంది నిర్మల లోపలెక్కడో వంటింట్లో వుంది.
పరమహంస కళ్ళు అదో రకమైన వెలుగుతో ప్రకాశిస్తున్నాయి. "దేవుడితో" అన్నాడు. సాహితి విభ్రాంతితో "నిజమా" అంది.....అతడు నవ్వాడు.
"దేవుడు మీకు కనపడతాడా?"
అతడు నవ్వి "నేనే దేవుడి అంశని. ఈ మధ్యనే ఆ విషయం తెలుసుకున్నాను. మానవ జాతికి సుఖసంతోషాలు అందించడం కోసం దేవుడు నన్ను పంపాడు."
"నేను నమ్మలేకపోతున్నాను."
"నమ్మొద్దు.....నమ్మమని నిన్ను అడగలేదు కదా!"
ఆమె ఎటూ నిర్ణయించుకోలేక "దేవుడు మీకు ఏం చెప్పాడు?" అంది.
"ఈ ఇంటిలో సుఖశాంతులు నెలకొల్పేలా చెయ్యమని చెప్పాడు. ఇలారా సాహితీ!"
సాహితి దగ్గరగా వెళ్ళింది. అతడామెని పొదివి పట్టుకుని చిన్నపిల్లని పెట్టుకున్నట్టు రెండు బుగ్గలమీద ముద్దు పెట్టుకుని, "నిన్ను గొప్పదాన్ని చెయ్యవలసిన బాధ్యత నా మీద వుంది. చేస్తాను కూడా. ఇది దేవుడి ఆదేశం" అన్నాడు.
సాహితి రెండు బుగ్గలూ తుడుచుకుంది.
"నేను చెప్పినట్లు చేస్తావా?"
"తప్పకుండా అంకుల్!"
"జీవితాంతం?"
"అదేమిటంకుల్! మీరు చెప్పిన మాట నేనెప్పుడు కాదన్నాను? నేనేం చెయ్యాలి?"
"నాకు తెలీదమ్మా! దేవుడి నుంచి ఆదేశం రావాలి" అంటూ ఆతడు బొట్టు తీసుకుని ఆమెకు పెట్టాడు హారతి వెలిగించి, తన చుట్టూ తాను తిప్పుకుని తనకు తనే నైవేద్యం సమర్పించుకున్నాడు. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని ఆమె నోట్లో పెట్టి "దీర్ఘాయుష్మాన్ భవ" అని దీవించాడు.
* * *
సాహితి చాలా కష్టపడి చుదువుతోంది. ఇంటి వాతావరణంలో కూడా చాలా మార్పు వచ్చింది. పరమహంస తరచుగా వస్తాడు. నిర్మలతో ముందుగా వ్యాపార విషయాల వివరాలు చెప్తాడు. సాహితికి ఏం కావాలో కనుక్కుంటాడు......సలహా లిస్తాడు.
సాహితికి అతడి రాక ఎప్పుడూ సంతోషాన్నే కలిగిస్తుంది. అతడున్నాడంటే అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. తండ్రి బ్రతికినంతకాలం అలాంటి అనుభవం ఆమెకు కరువైంది. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడల్లా పోగొట్టుకున్న దేమిటో తెలియవస్తున్నట్లనిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యం తల్లి ముఖంలో చిరునవ్వులు, ఆమెలో ఉత్సాహం, వాటి అర్ధం పూర్తిగా తెలుసుకునేంతగా ఎదగలేదు సాహితి.
ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయింది. కాలం చాలా త్వరగా గడిచిపోతున్నట్లు అనిపించింది. ఆ సెలవుల్లో మొదటిసారిగా మావయ్యగారి ఊరెళ్ళింది. పల్లెటూరి వాతావరణం బావుంటుందని, ఈ రొటీన్ లైఫ్ నుంచి ఒక మార్పు అవసరమని బలవంతంచేసి పంపాడు పరమహంస.
నిజంగానే సాహితికి ఆ వాతావరణం నచ్చింది. పచ్చటి పొలాలూ, విరగకాసిన మామిడితోటలూ, చెట్టుకు కట్టిన ఉయ్యాలలూ, కొత్తరకం ఆటలూ నవ ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది. అన్నింటిని మించి తను తెచ్చిన కానుకలను పేరు పేరునా పిలిచి యిస్తుంటే వాళ్ళ ముఖాల్లో కనిపించిన తృప్తి, కృతజ్ఞతా! ఆ ఆలోచన కూడా పరమహంసదే. ప్రతి ఒక్కరి గురించి కనుక్కుని వాళ్ళకోసం తగిన వస్తువులు సెలక్టు చేసి కొన్నాడాయన.
సెలవులు గడిచిపోయాయి. సాహితి నవ్యోత్సాహంతో తిరిగి వచ్చింది. ఇంట్లో కూడా కొంత మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా నిర్మలలో ఉత్సాహం రెట్టింపయింది. అతడు కూడా ఆమెతోపాటు పూజల్లో పాల్గొంటూ ఆమెకు తోడుగా వుంటున్నాడు.
సాహితి కాలేజీకి వెళ్ళివస్తోంది. మొదటి సంవత్సరం మార్కులు తెలిశాయి. చాలా మంచి మార్కులొచ్చాయి. సైన్సు సబ్జెక్టుల్లో కాలేజీలోనే ఫస్టు మార్కు పరమహంస చాలా సంతోషించాడు. ఫోన్ లోనే మాట్లాడాడు.
"ఈ రోజు మళ్ళీ నీకు పార్టీ ఇవ్వాలి. ఒక బహుమతి కూడా ఇస్తాను. అది నీకు నచ్చుతుందో లేదో కనుక్కొని ఇస్తాలే" అన్నాడు.
"మీకు నా అభిరుచి బాగా తెలుసు. నాకంటే మీకే బాగా తెలుసు. మీరు ఇవ్వబోయేది ఏదైనా నాకు నచ్చుతుందనే నా నమ్మకం అంకుల్" అంది సాహితి.
"నచ్చకపోతే మాత్రం నిర్మొహమాటంగా చెప్పాలి సుమ?"
"తప్పకుండా! మమ్మీకి చెప్పనా సాయంత్రం పార్టీ గురించి?"
"వద్దు.....ఈ రోజు మమ్మీ ఉపవాసం. మనిద్దరమే వెళదాం!"
"అలాగే అంకుల్" ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడింది సాహితి. ఏమిటి ఆయనిచ్చే కానుక? పెళ్ళికొడుకుని సెలక్టు చేశాననడు కదా? ఉహు, ఆయనకు తనను బాగా చదివించాలనే వుంది....అదయుండదు. సాహితి నవ్వుకుంది. బహుశా ఏ డైమండ్ సెట్టో అయుంటుంది. పరమహంస వచ్చేసరికి తయారై రెడీగా వుంది. నిర్మలతో చెప్పి తీసుకెళ్లాడతడు.....అతడితో రావడం ఇదే మొదటిసారి ఆమెకు. లోపల కాస్త బెరుగ్గానే వుంది. అతడే పదార్ధాలన్నీ ఆర్డరు యిచ్చాడు. తనతో మాట్లాడడానికి సందేహిస్తున్నట్లుగా అనిపించిందామెకు. భోజనం పూర్తయ్యింది. ఆమె కిష్టం అయిన కసాటా ఐస్ క్రీం ఆర్డరు చేసి తెప్పించాడు.
"నేను చెప్పిన బహుమతి గురించి అడగవేం?"
"మీరు చెపుతారుకదా అని ఎదురుచూస్తున్నాను."
"సాహితీ" అతడి స్వరంలో సీరియస్ నెస్ ధ్వనించింది. "ఇది నేను నీకిచ్చే బహుమతో, అడిగే వరమో నాకే అర్ధంకావడంలేదు. నీకు ఇష్టం లేకపోతే నీ మనసుని కష్టపెట్టాననే బాధ నన్నెప్పటికీ వదలదు కానీ అడగకుండా వుండలేకపోతున్నాను. అందుకే మరోసారి చెప్తున్నా నీకు ఇష్టం లేకపోతే నిర్మొహమాటంగా చెప్పాలి. నేనేమీ బాధపదను ఆ విషయం ఇద్దరం మర్చిపోదాం. ఎప్పటిలాగే స్నేహితుల్లా వుండిపోదాం."
"చెప్పండి అంకుల్! సందేహించకండి" సాహితికి అదేమిటో తెలుసుకోవాలనే ఉత్సాహం అధికమైంది.