"ఏం లేదు" ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పసాగాడతడు. "మీ మమ్మీ గురించి, ఆమెకు పెద్ద వయసేం లేదు. జీవితంలో ఎలాంటి సుఖము అనుభవించలేదు. ఆమె మానసికంగా క్రుంగిపోయింది. చాలా జీవితం ఆమె ముందుంది, ఇప్పటికయినా ఆమె పోగొట్టుకున్నది ఇవ్వాలని వుంది. ఇది నాకు నేను కోరే కోరిక కాదు. భగవత్ సంకల్పం అనుకుంటున్నాను. ఆవిడను...."
"ఊ....చెప్పండి."
"ఆవిడను నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను-మీ ఇద్దరికీ అభ్యంతరం లేకపోతేనే" అన్నాడు పరమహంస.
సాహితి మనసు ఐస్ క్రీంకన్నా కూడా మధురమైన భావంతో నిండిపోయింది. హిమాలయాలంత ఉన్నతమైన వ్యక్తిత్వం గల అతనికి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియనట్లు చూస్తుండిపోయింది.
"ఏమిటమ్మా నీకు ఇష్టం లేదా?"
"ఇష్టం లేకపోవడమా అంకుల్! ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. మమ్మీలో మీ మూలంగా ఈ మధ్యన వచ్చిన మార్పులకే సంతోషపడిపోతున్నాను. ఇక ఇలా కూడా జరిగితే ఆవిడ నిండుగా నవ్వుతూ యింట్లో తిరుగుతూంటే అంతకంటే నాకేం కావాలి? మీరు మమ్మీతో మాట్లాడారా అంకుల్?"
"లేదమ్మా! ఇది కేవలం మా ఇద్దరికీ సంబంధించిన విషయం మాత్రమే కాదు. వయసువచ్చి విజ్ఞత కలదానివి. నీ విషయం తెలుసుకోకుండా మమ్మీ దగ్గర ఈ విషయం కదపదలుచుకోలేదు.'
"నాకు చాలా సంతోషంగా వుంది. మమ్మీని ఒప్పించడానికి నన్నేం చేయమన్నా చేస్తాను."
"ప్రస్తుతానికి నువ్వేం చెప్పకు. నేను ముందుగా మాట్లాడతాను. ఆవిడ కాదంటే అప్పుడు ఆలోచిద్దాం. బేరర్" పిలిచాడు పరమహంస. "ఈ ఐస్ క్రీం కరిగిపోయింది. తీసుకెళ్ళి వేరేది పట్టుకురా."
అంత సీరియస్ సంభాషణలో ఇంత చిన్న విషయాన్ని అతడు గమనించడం అతనిలోని సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని తెలియజేస్తుంది. సాహితీలాంటి ఇంట్రావర్టులమీద అది గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.
"మరొక్క విషయం కూడా నీకు స్పష్టంగా చెప్పాలి. నాకు పెళ్లై ఇద్దరు పిల్లలున్న విషయం నీకూ తెలుసు. వాళ్ళు చాలా కాలంగా నా దగ్గర లేరు. మీ మమ్మీని పెళ్ళి చేసుకునే ముందు వాళ్ళనుంచి ఎలాంటి అభ్యంతరాలుగాని, అవాంఛనీయ సంఘటనలుగానీ ఎదుర్కోవలసిన అవసరం రాకూడదు. ఆ విషయంలో కొన్ని ఏర్పాట్లు చేయాలి. దానికి కొంత సమయం పట్టవచ్చు. నా ఇద్దరు పిల్లల్లో ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీరు. వాళ్ళు సెటిలయ్యారు."
"మీకేది సబబుగా అనిపిస్తే అలా చెయ్యండి అంకుల్! నేను చేయగలిగిందేదైనా వుంటే చెప్పండి మనస్ఫూర్తిగా చేస్తాను" అంది సాహితి. ఆ తరువాత తనలో తాననుకుంది 'ఇలాంటి వ్యక్తులు అందరి జీవితాల్లోనూ తారసపడరు' అని. అతని గురించి కోమలా టీచర్ కి వివరంగా వ్రాయాలి. మగవాళ్ళందరూ దుర్మార్గులు కారని, దైవస్వరూపులు కూడా వుంటారని తెలియజేయాలి' అనుకుంది సాహితి.
పార్టీ నుంచి ఇద్దరూ ఇంటికొచ్చేసరికి నిర్మల బయట హాల్లో ఎదురుచూస్తోంది. బాగా రాత్రయింది.
బయట వర్షం పడే సూచనలు కనబడుతున్నాయి. ఇంటికి రాగానే నిర్మల ఉత్తరమిచ్చింది. కోమలా టీచర్ వ్రాసిన ఆఖరి ఉత్తరం అది. ఆమె మరణించినట్లు మరుసటిరోజు టెలిగ్రాం వచ్చింది.
5
"సాహితీ!" పరమహంస జాలిగా పరామర్శిస్తున్నట్టు దగ్గరికి వచ్చాడు. "ఎందుకమ్మా అలా వున్నావు?"
"మనసేం బావోలేదంకుల్!"
అతడు తలమీద చెయ్యివేసి నిమిరాడు. "యవ్వనంలో వున్నదానివి. మనసు బాగోలేదంటే దానికి రెండు కారణాలుండాలి. నువ్వు ఎవరి దగ్గరయినా మనసు పారేసుకోవటం, లేదా ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నానని అనడం" అంటూ నవ్వాడు.
నిజానికి సాహితికి తను యవ్వనవతినన్న విషయమే అప్పటివరకూ స్ఫురణలో లేదు. చదువు తప్ప మరో ప్రపంచం లేదు ఆ అమ్మాయికి. మొదటిసారి అతని నోటివెంట ఆ మాటలు వింటూంటే సిగ్గు, జంకు కలిగాయి. తత్తరపాటుతో తల వంచుకుంది. "తండ్రిలాంటివాడిని, నాకు చెప్పటానికి కూడా భయపడుతున్నా వామ్మా?"
అప్పుడొచ్చింది ఆమెకు దుఃఖం. ఇంట్రావర్టుల గుండెల్లో దుఃఖం వరదలా బయటపడదానికి ఆ మాత్రం సానుభూతి చాలు. 14-20 మధ్య వయస్సు అమ్మాయిల్లోగానీ, అబ్బాయిల్లో గానీ ఇలా 'ఆధారపడే' గుణం వుంటుంది!
ఎప్పుడూ తమలోకి తాము చూసుకుంటూ, తమ గురించే ఆలోచించుకుంటూ, ప్రపంచమంతా తమనే పరిశీలిస్తుందనీ, తామే ఒక సెంట్రల్ పాయింటుగా వూహించుకుంటారు. సానుభూతి..... ఆ మధనాన్ని ఒక చల్లటి మలయమారుతంలా తాకేసరికి ఆషాఢ కాలమేఘంలా వర్షించడమే ఇలాటి 14-19 ఏళ్ల అమ్మాయిల ఆవేదన. ఈ సానుభూతిని వీళ్ళు ఎక్కడనుంచైనా స్వీకరించగలరు. ఎదురింటి, పక్కింటి 'రాఖీ' అన్నయ్యల దగ్గర్నుంచి, వయసులో వున్నా (తండ్రిలాంటి....) స్కూల్ టీచర్స్ నుంచి ఎక్కడనుంచైనా సరే. ఈ పెద్దన్నయ్యలు లేడీస్ హాస్టల్స్ ముందు కూడా నలుగురైదుగురు అమ్మాయిల్నేసుకుని మెట్లమీద కూర్చుని కనబడతారు. వీళ్ళకి ఆవకాయ నుంచి ఐస్ క్రీమ్ వరకూ తెలియని విషయమే వుండదు. తమ భావాల్నీ, అభిప్రాయాల్నీ అవతలి వాళ్ళమీద రుద్దేస్తూ, వాళ్ళని తమ అధీనంలో వుంచుకుంటారు. ఎదుటివాళ్ళని ప్రభావితం చేయటము కోసమే దేముడు తమని పుట్టించినట్టు భావిస్తూ వుంటారు.
"చెప్పమ్మా! ఏం జరిగింది?"
"మా కోమలా టీచర్ చచ్చిపోయింది అంకుల్" అంది సాహితి. "ఆత్మహత్య చేసుకున్నట్లు ఉత్తరం పెట్టి చచ్చిపోయిందట. కానీ భర్తే చంపేసి వుంటాడు. టీచర్ చాలా మంచిది అంకుల్! సహనం అంటే ఏమిటో మాకు నేర్పించింది టీచర్! తను సహనాన్ని కోల్పోయేటంతగా హింసించిన ఆ భర్తని చంపెయ్యాలనిపిస్తోంది. ఎంత బాధపడి ఈ నిర్ణయానికి వచ్చి వుంటుంది?"
"ఎవరి విధి ఎలా వ్రాసివుందో ఎవరూ నిర్ణయించలేరు తల్లీ!"
"విధి కాదు అంకుల్! ఆమె భర్త...."
"కాదమ్మా..... నువ్వు పొరపాటుపడుతున్నావు. అక్కడ ప్రత్యక్షంగా జరిగిందేమిటో నీకు తెలీదు. సహనం, మంచితనం స్త్రీ సహజ ఆభరణాలు. అవి కోల్పోయిన స్త్రీని దురదృష్టం వెంటాడుతుంది. భర్తని తీర్చిదిద్దుకోవటం స్త్రీ బాధ్యత. సీత, అనసూయలు పుట్టిన కర్మభూమి మనది. పాతివ్రత్యం మన ఆదర్శం. కర్మ సిద్దాంతాన్ని నమ్మని వాడెవడూ బాగుపడలేదు. కర్మే నన్ను మీ దగ్గరికి లాక్కొచ్చింది. కర్మే నాచేత నీకిలా ఉద్భోద చేయిస్తోంది" ఆ చివరి మాటలు మాత్రం నిజం.
సాహితి ఆశ్చర్యంగా వింటూంది.
"కోమలికి మరణం వ్రాసిపెట్టి వుంది కాబట్టే దేవుడు నన్నామె దగ్గరికి పంపలేదు. లేకపోతే నా మనోబలం ద్వారా నీ తల్లిని మార్చినట్టు ఆమెని కూడా కష్టాల్లోంచి బయట పడేసి వుండే వాడిని. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకునే శక్తి నాకు దేవుడిచ్చాడు. ఈ లోకంలో ఇంతమంది ఇన్ని కష్టాల్లో వుండటం నాకు దుఃఖాన్ని కలగజేస్తుంది. వారికి శాయశక్తులా సాయపడటం నా విధి. అందుకు నా సుఖాలు కూడా త్యజిస్తాను. ఇప్పుడు నేనక్కడ అందర్నీ వదలి తప్పించటానికే అని నాకు దేవుడు చెపుతున్నాడు. త్వరలో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇక మీ టీచర్ సంగతంటావా....చెప్పానుగా, దాన్ని మర్చిపో. చదువు మీద దృష్టి నిలుపు."
మంత్ర ముగ్ధంగా సాహితి తలూపింది.
ఆ విధంగా 'తర్కం' స్థానే 'కర్మ సిద్దాంతం' ఆమె మనసు క్షేత్రంలో స్థిరపడింది.
* * *
"సింహాచలం!" పిలిచింది సాహితి.
బజారుకి వెళ్ళబోతున్న సింహాచలం వెనక్కు తిరిగి చూశాడు.
"ఏంటమ్మగారూ! కారు తీయమని చెప్పనా?"
"వద్దు. ఈ ఉత్తరం పోస్టులో వెయ్యి. మర్చిపోకు."
"ఎవరికమ్మా?" అక్కడే కూర్చున్న నిర్మల అడిగింది.
"మావయ్యకమ్మా!"
"ఏం వ్రాశావు....?" అనుమానంగా అడిగింది నిర్మల. సాహితి ఆమెవైపు ఆశ్చర్యంగా చూసింది. నిర్మల ఎప్పుడూ ఇలాంటి ప్రశ్న వేయలేదు.
"ఏం లేదమ్మా....! కోమల టీచర్ గురించీ, ఇంకా పరమహంస అంకుల్ గురించీ...."
"అంకుల్ ని అడిగావా మరి?"
"అంకుల్ ని అడగటం దేనికమ్మా?"
"అయినా సరే! ఇకముందు అంకుల్ ని అడగకుండా మనం ఏ పనీ చేయకూడదమ్మా ఆయనేం అంటారో తెలియదు."