అందుకు సిద్దంగానే ఉన్నాడు సాగర్. అదును చూసి, ఒడుపుగా కిందికి వంగిపోయాడు.
విసురుగా అతని మీదకు వస్తోన్న రాబొట్స్ వేగాన్ని ఆపుకోలేక, ఒక దాన్ని ఒకటి బలంగా ఢీ కొన్నాయి!
వెంటనే, జిగజిగ మెరుపులు మెరిసినట్లయింది. ఫెళఫెళ ఉరుములు ఉరిమినట్లయింది. జల జల నిప్పుల వర్షం కురిసినట్లయింది.
సాగర్ ని హతమార్చబోయిన రాబొట్స్ అతని చాకచక్యంవల్ల ఒక దాన్ని ఒకటి తగిలి, ఆ తీవ్రమైన తాకిడికి నాశనమైపోయాయి.
జాలంతర్గామి అంతటా గాఢాంధకారం అలముకుంది.
సముద్రంలో ఏడు వందల అడుగుల లోతున ఉక్కు శవ పేటికలో జల సమాధి అయిపోయినట్లయింది సాగర్ పరిస్థితి.
అయినా తొణకలేదు అతను. నిగ్రహం కోల్పోకుండా, ఆ చీకట్లోనే తడుముతూ ముందుకు సాగాడు.
కంట్రోల్స్ వున్న పానెల్ తగిలింది. ఆగి, కళ్ళు చిట్లించి పరీక్షగా చూశాడు.
వైర్ లెస్ లో ఎవరిదో గొంతు వినబడుతోంది.
"బ్రేవో, బ్రేవో బ్రేవో."
ఆ జాలంతర్గామి తాలూకు హెడ్ క్వార్టర్స్ నుంచీ రాబొట్స్ కి పిలుపు వచ్చిందని గ్రహించాడు సాగర్.
రాబొట్స్ రెండూ నాశనమైపోయాయి. ఇప్పుడు ఎవరూ జవాబు చెప్పకపోతే వాళ్ళకు అనుమానం వస్తుంది.
రిస్కు తీసుకోదల్చుకున్నాడు అతను.
జేబులో నుంచీ కర్చీఫ్ తీశాడు తడిపి ముద్దయిపోయి ఉంది అది. దాన్ని గట్టిగా పిండి, నోటికి కొంచెం దూరంలో అడ్డంగా పట్టుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ విధంగా చేస్తే గొంతు కొంచెం అస్పష్టంగా వినబడి, వెంటనే పట్టివ్వకుండా ఉండే అవకాశం ఉంది.
"యస్సర్?" అన్నాడు జాగ్రత్తగా.
అతని ప్రయత్నం ఫలించలేదు. అవతలివైపు ఉన్న వ్యక్తికి వెంటనే అనుమానం తగిలినట్లుంది.
కొంతసేపు మౌనంగా ఉండి, "ఎవరునువ్వు? ఐడెంటిపై యువర్ సెల్ఫ్ . మన కోడ్ లో" అన్నాడు కఠినంగా.
ఆ రాబొట్స్ తమని తాము హెడ్ క్వార్టర్స్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఏదో కోడ్ ఉపయోగిస్తాయని అర్ధమయింది సాగర్ కి.
అదేమిటో తనకు ఎలా తెలుస్తుంది?
తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టాడు.
ఆ లోగానే లైన్ డెడ్ అయిపోయింది.
ఇంక ఎక్కువ వ్యవధి లేదని గ్రహించాడు సాగర్. ఈ సబ్ మెరైన్ తాలూకు యజమానులు ఎవరో గాని, ఇంక ఊరికే ఉండరు. ఏదో ఒకటి చేసి తీరుతారు.
ఆలోగానే తను తప్పించుకోవాలి.
చకచక సెర్చ్ చెయ్యడం మొదలెట్టాడు సాగర్.
ఒకచోట "ఎమర్జెన్సీ ఎక్విప్ మెంట్" అని వున్న ఆకుపచ్చ అక్షరాలు, రేడియం పూతలో మెరుస్తూ కనబడ్డాయి.
అక్కడే ఒక మీట ఉంది. దాన్ని నొక్కాడు.
వెంటనే, ఒక అర లాంటిది తెరుచుకుంది.
దాన్లో నుంచీ బయటకు జారింది ఒక జెయింట్ సైజు లైఫ్ జాకెట్ లాంటిది. మనిషి ఆకారంలో మందంగా ఉన్న బెలూన్లా ఉంది అది. గుమ్మడికాయ అంత తల, కళ్ళ స్ధానంలో పెద్ద పెద్ద అద్దాలూ.
ఛాతీ దగ్గర ఆక్సిజను సిలిండరు అమర్చి ఉంది.
త్వరత్వరగా అందులో దూరాడు సాగర్. అతన్ని తల వెంట్రుకల దగ్గర నుంచీ కాలి గోళ్ళదాకా వాటర్ టైట్ గా కవర్ చేసేసింది అది.
అతడు ఆ మీట నొక్కగానే లైఫ్ జాకెట్ బయటికి రావడంతో పాటు, జలాంతర్గామి నీటి ఉపరితలానికి తేలడం మొదలెట్టింది.
పైకి రాగానే దాని పైన మూతలా వున్న చిన్న తలుపు ఆటోమాటిక్ గా తెరుచుకుంది.
వేగంగా బయటికి వచ్చేశాడు సాగర్. శక్తి అంతా ఉపయోగించి చేతులు కదిలిస్తూ, నీళ్ళలో ముందుకుపోవడానికి ప్రయత్నించాడు.
జలంతర్గామి మళ్ళీ కిందకు వెళ్ళిపోయింది.
అప్పుడు__
సముద్ర గర్భంలో అణ్వస్త్ర పాటవ పరీక్ష ఏదో జరిపినట్లు__
వర్ణింసనలవికాని విస్ఫోటనం!
జలాంతర్గామి తాలూకు హెడ్ క్వార్టర్స్ వళ్ళు, తమ రాబొట్స్ నాశనమైపోయాయనీ, సబ్ మెరైన్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని తెలిసి తమ రహస్యాలూ ఆచూకీ బయటపడకూడదన్న ఆదుర్దాతో, రిమోట్ కంట్రోల్ ద్వారా జలాంతర్గామిని ధ్వంసం చేసేశారు.
అప్పుడు విడుదల అయిన శక్తికి సముద్రంలో అలలు సూరు అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశంలో ఉన్న నీటినంతటినీ ఎవరో తరిమికొడుతున్నట్లు అపారమైన జలారాశి, అనూహ్యమైన శక్తితో, అత్యంత వేగంగా తీరంవైపు కదలిపోయింది.
ఆ జలప్రళయంలో చిక్కుకుపోయాడు సాగర్.
* * *
గుడ్లప్పగించి తలుపువైపే చూస్తోంది స్వరూప. గజగజ వణుకుతోంది. నిర్విన్నుడాయి చూస్తున్నాడు సింగ్.
దబదబ తలుపులు బాడుతున్నాడు డ్రాకులా చాంగ్. ఏక్షణంలో నైనా విరిగి పడేలా ఉందా తలుపు, దుర్భారంగా, కిర్రుకిర్రుమని శబ్దం చేస్తోంది.
తలుపు విరిగి, చాంగ్ గనక కేబిన్ లో ప్రవేశిస్తే, తనకు పట్టబోయే దుర్గతి తలుచుకోవడానికే సాహసం చాలడంలేదు స్వరూప రాణికి.
తలుపుకి భుజం ఆనించిమ్ హుమ్మని నెట్టాడు చాంగ్.
తలుపు విరిగి, ఒరిగిపోయింది.
ప్రాణభయంతో, వెర్రికేక పెట్టింది స్వరూప. నిశ్చేష్టుడయిపోయాడు సింగ్.
నవ్వుతూ లోపలికి అడుగు పెట్టాడు చాంగ్.
సరిగ్గా అదే క్షణంలో-
జలాంతర్గామి పేలింది.
ఎగిసిపడ్డ అలలతోబాటు వంద అడుగుల ఎత్తుకు వెళ్ళిపోయింది సింగ్ కేబిను.
అంతటి బలశాలి అయినా డ్రాకులా చాంగ్ కూడా ఆ ఉధృతంలో పింగ్ పాంగ్ బాల్ లాగా ఎగిరిపోయి, గిరగిర తిరుగుతూ చాలా దూరంలో పడ్డాడు.
ఆలయ శిఖరం లాంటి ఆ అల శిఖరాన వున్న విపరీతమైన వేగంతో పయనిస్తూ తీరంవైపు వెళ్ళిపోయింది.
తీరం చేరడానికి కొద్ది క్షణాల ముందు ఫేటేల్మని మధ్యకు విరిగింది అది అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనడానికి మాత్రమే నిర్మించబడింది ఆ కేబిన్ కానీ మరీ ఇంత ప్రళయాన్ని తట్టుకోవడానికి కాదు.
సింగూ, చాంగూ, స్వరూప విడివిడిగా విసిరివేయబడ్డారు తీరం మీదకి.
ఆ ఉప్పెన అప్పటికే అనూహ్యనీ, సాగర్ నీ కూడా ఒడ్డుకి చేర్చింది.
కానీ వాళ్ళు ఒకరి ఉనికి ఒకరికి తెలియకుండా, వేరే వేరే ప్రదేశాల్లో వుండిపోయారు.
* * *
ప్రొఫెసర్ ఆనందరావూ, ఫకర్, ఇబూకా ఉన్న కిచెన్ ఫ్లోర్ కూడా ఆ ఉధృతంలో చిక్కుకుని బెండుముక్కలా తేలుతూ తీరంవైపు వస్తోంది.
ఆ వేగానికి చేపలు, పీతలూ కొన్ని విసిరి వేయబడ్డ రాళ్ళలా వచ్చి వాళ్ళమీద పడుతున్నాయి.
తన కాలిదగ్గర పడివున్న ఒక చేపను ఆసక్తిగా చూసింది ఉరాంగ్ ఉటాన్ కోతి. తర్వాత ఒక పుల్లతో దాన్ని ఎత్తి ప్రొఫెసర్ మీద పడేసింది.
"చచ్చాన్రోయ్ దేముడోయ్!" అన్నాడు ప్రొఫెసర్ గిలగిల్లాడుతూ.
అది ఎలక్ట్రిక్ ఈల్ చేప. తాకితే దిమ్మతిరిగేలా షాక్ కొడుతుంది. అది నాలుగొందల యాభై మొదలుకొని ఆరొందల వోల్టుల విద్యుచ్ఛక్తిని తయారు చెయ్యగలదు. దానితో వంద శక్తిగల ఎలక్ట్రికల్ బల్బులు ఒక డజను వెలిగించవచ్చు.
ఆ షాక్ కి స్పృహతప్పిపోయాడు ప్రొఫెసరు.
"అయ్యో" అనడానికి వోరు తెరవబోయాడు ఫకర్.
ఆ లోపలే కిచెన్ ప్లోర్ ముక్కలు చెక్కలై పోయింది.
అందరూ తలోవైపూ విసిరివేయబడ్డారు.
చాలాసేపటి తర్వాత తెలివి వచ్చింది ప్రొఫెసర్ కి.
తను బతికే ఉన్నాడా? చచ్చిపోయాడా?
ఎలక్ట్రిక్ ఈల్ చేప షాక్ ఇచ్చిందంటే మనిషి మడి చచ్చినా ఆశ్చర్యం లేదు.
తను చనిపోయే ఉంటాడు, ష్యూర్.
అతి కష్టంమీద కళ్ళు తెరిచి చూశాడు.
చుట్టూతా పచ్చటి చెట్లు, పైన నీలంగా ఆకాశం. సేదదీరేలా చల్లటి పిల్లగాలి.
సందేహంలేదు. ఇది స్వర్గమే తను పోయి స్వర్గం చేరాడు.
ప్రయత్న పూర్వకంగా తల పక్కకి తిప్పాడు.
తన మొహంలోకే ఆత్రంగా చూస్తున్న ఉటాగ్ ఉటన్ కోతి కనబడింది.
"ఓసి నీమ మొహం తగలెయ్యా! స్వర్గాన్ని కెళ్ళినా సవతిపోరు తపదన్నట్లు ఇక్కడ కూడా తయారయ్యావూ?" అన్నాడు మంటగా. సంధి ప్రేలాపనలా ఉన్నాయి అతని మాటలు.
మహా కష్టపడి, చివరికి లేచి నిల్చున్నాడు.
కడుపులో ఆకలి దహించేస్తోంది.
"ఆకలి దంచి కొడుతుంది కాబట్టి ఇది స్వర్గం అయివుండదు! స్వర్గంలో మరి ఆకలి, దప్పులు ఉండకూడదు కదా! అంటే, ఇంకా బతికే వున్నానన్నమాట" అని జానంతికంగా అనుకుంటూ, తినడానికి పనికి వచ్చేవేమైనా దొరుకుతాయేమోనని పరిశోధించడం మొదలెట్టాడు ప్రొఫెసర్.
దగ్గరలోనే కొబ్బరి చెట్లు కనబడ్డాయి.
ఆశగా చూస్తూ, ఆబగా దగ్గరికి నడిచాడు.
ఒక చెట్టు దగ్గరికి రాగానే, ఠపామని బట్టతల పేలిపోయేలా పెద్ద సైజు కొబ్బరికాయ ఒకటి అతని నెత్తిన పడింది.
బొప్పి తడుముకుంటూ, వంగి చూశాడు.
శుభ్రంగా పీచు వలిచి, మధ్యకు పగలగొట్టి వుంది కొబ్బరికాయ.
విస్తుపోయాడు అతను. 'ఈ ద్వీపంలో కొబ్బరిచెట్లకు పీచు వలిచిన కాయలు కాస్తాయా ఏం' అనుకుంటూ దాన్ని అందుకోబోయాడు. అతని కంటే వేగంగా ముందుకు వంగి, కొబ్బరికాయను అందుకుని, కొబ్బరి తీసి గుటకాయ స్వాహా చేసింది కోతి.
'ఇది మహాతిండిపోతులా ఉందే?' అని విసుక్కున్నాడు ప్రొఫెసరు.
మళ్ళీ ఇంకో కొబ్బరికాయ పడింది ఫిరంగి గుండులా , సరిగ్గా అతని నెత్తిమీద.
దాన్నీ లాక్కుని తినేసింది కోతి.
అలా నాలుగో కాయని కూడా తినేశాక, ఏదో ప్రమాదాన్ని శంకించినట్లు కీచుకీచుమని అరుస్తూ ఎగిరి, అతని భుజంమీదఎక్కి కూర్చుని, మెడచుట్టూ కాళ్ళు బిగించిందా కోతి.
"ఏయ్ ఏయ్ ఛీ ఛీ దిగు దిగు." అని దాన్ని వదిలించుకోడానికి ప్రయత్నిస్తూ, ఏదో తట్టినట్టు కొబ్బరి చెట్టు పైకి చూశాడు ప్రొఫెసర్.
కొబ్బరి చెట్టు ఎక్కి కాయలని తెంపి, పగలగొట్టుకు తినే-కోకోనట్ క్రాబ్ అనే రాక్షసి యండ్రకాయ. తిక్క కోపంతో లిప్టులా జాయ్ మని చెట్టు దిగి వస్తోంది.