Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 19

    ఆమెను చూద్దాం ఎందుకో నాకర్ధం కాదు. మనసు చాలా విచిత్రమైనది-
   
    పేరుకు టీ కానీ రెండు స్వీట్సు__రెండు హాట్సు వున్నాయి.
   
    ఫలహారాలు పిల్లలు తెచ్చారు-డాక్టర్ విలాస్ సూచనాపై న అభార్య లోపల కూర్చున్నది-డ్రాయింగ్ రూంలొ నాకు ముళ్ళమీద కూర్చున్నట్లున్నది. పిల్లల్ని పలకరించాను. వాళ్ళెక్కువ మాట్లాడలేదు.
   
    నేను, డాక్టర్ విలాస్ కబుర్లు చెప్పుకుంటున్నాం.
   
    రోజూ కార్లో చెప్పుకుంటున్నాం-ఇప్పుడు ఇంట్లో
   
    పెద్ద తేడా ఏమీ లేదు.
   
    నా కుడుకుమోత్తనం వచ్చింది- కానీ ఎందుకు?
   
    ఇంటికి వెళ్ళగానే నా కోపాన్ని పద్మినిపై చూపించాను- ఆమెకు ఎందుకో అర్ధంకాలేదు-
   
    "అంత సేపెందుకు కూర్చుండిపోయావ్?" అన్నాను.
   
    "లోపల ఆవిడ ఒక్క కబురుకూడా చెప్పలేదు-నాకు కూడా బోర్ కొట్టింది. మీరెప్పుడు పిలుస్తారా అని చూశాను- మన పిల్లలకూ అక్కడ తోచలేదు - చూస్తే డ్రాయింగు రూంలోంచి ఆగకుండా నవ్వులు వినిపిస్తున్నాయి. మీరూ నవ్వుతున్నారు మీకు చాలా సరదాగా గడిచిందనుకున్నాను"
   
    "నేనూ నవ్వానా?" అన్నాను అసహాయంగా.
   
    ఆమె కనబడలేదని నాకంత ఇది ఎందుకు? ఆమెను నేను ఎందుకు చూడాలి? చూడడం వల్ల ఏం ప్రయోజనం ఆసిస్తున్నాను?
   
    "ఓ రోజు వాళ్ళనూ మనం టీకి పిలుద్దాం" అన్నది పద్మిని.
   
    "నీ యిష్టం."
   
    ఓ రోజు వాళ్ళూ మా యింటికి వచ్చి వెళ్ళారు. పెద్ద విశేషమేమీ లేదు. ఆవిడ ముఖం నిండా పెద్దగా మేలిముసుగు కప్పుకుని లోపల కూర్చునేందుకు వెళ్ళింది. ముఖం కనబడలేదు నాకు.
   
    కర్టెసీ కి కూడా ఆయన ఆమెను పరిచయం చేయలేదు. డాక్టర్ విలాస్ చాలా విచిత్రమైన మనిషనిపించింది నాకు.
   
    మళ్ళీ నేనూ ఆయనా కార్లో బదులు ఇంట్లో మాట్లాడుకున్నాం. నేను చాలా ఎక్కువగా నవ్వానని పద్మిని చెప్పింది.
   
    ఆమెను చూడడం నాకు సాధ్యపడదని అనిపించింది. నా కుతూహలం నాకొక సవాలుగా నిలిచింది.
   
    డాక్టర్ విలాస్ ఈ విచిత్ర ప్రవర్తనకు కారణమేమిటి? ఆమె రూపాన్ని ఆయన ఎందుకు బయటపడనివ్వడు? ఆమె కురూపియా? లేక ఆమె ప్రవర్తన మందిది కాదా?"
   
    అప్పటికి నా వివేకం మేల్కొన్నది. ఒక స్త్రీ ముఖం చూడాలన్న కుతూహలంలో తప్పులేదు. కానీ ఆమె ప్రవర్తన గురించి ఆలోచించడం అవసరమా?
   
    నేను ఆమె గురించి ఆలోచించడం మానడానికి ప్రయత్నించసాగాను.
   
                                            O    O    O    O
   
    డిపార్టుమెంటు అడ్రసుకు వచ్చిన ఆ ఉత్తరం నన్ను ఆకర్షించింది. కవరు మీది దస్తూరీ చూడగానే నాకు తెలిసిన వారిదేననిపించింది. ఎవరిదో కూడా వెంటనే స్ఫురించింది. కానీ అది నిజమా?
   
    ఆ దస్తూరీ కోమలిది.
   
    కవరు చింపాను. ఆ ఉత్తరం కోమలి వ్రాసింది.
   
    ఎంత ఆశ్చర్యం?
   
    కోమలి నాకు ఉత్తరం వ్రాయడాన్ని మించి నేను ఆమె దస్తూరీని గుర్తుపట్టగలగడం ఎక్కువగా ఆశ్చర్యపరిచింది నన్ను. కోమలి- ఆమె దస్తూరీ - నా మనసులో అంతగా తిష్ట వేసుకున్నాయా?
   
    కోమలి తలపులోకి రాగానే- ఆ రోజు - ఆ దృశ్యం నా కళ్ళముందు మెదులుతుంది ప్రేమ సిగ్గెరుగదు-అన్న ఆమె మాటలు చెవుల్లో గింగురుమంటాయి. ఆపైన ఆమె శుభలేఖ....కవరు మీద ఆమె దస్తూరీ...
   
    ఉత్తరం చదివాను.,
   
    ఈ రోజు సాయంత్రం మూడుగంటలకు నన్ను కలుసుకుని మాట్లాడాలనుకుంటుంది కోమలి. అందుకు స్థలనిర్ణయం కూడా చేసింది. అనుకోకుండా ఆ వూరు వచ్చిందట. అర్జంటుగా నాతో మాట్లాడాలిట.
   
    ఉత్తరం చదవగానే నా మనసుపరిపరివిధాలపోయింది. ఆమె ఈ ఉత్తరం ఎందుకు రాసింది? ఉన్నట్లుండి నన్నెందుకు కలుసుకోవాలనుకుంటున్నది?
   
    ఆమె పిలుపు నాకు ఎప్పుడూ ఉంటుందని అన్నది అప్పట్లో. ఆ మాట నిలబెట్టుకుందుకు ఈఉత్తరం వ్రాసిందా?
   
    అదే నిజమైతే నేను ఆమెను కలుసుకోకూడదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు వివాహిత. ఇప్పుడు మేము ఒకరి గురించి ఒకరు మరో విధంగా ఆలోచించడం చాలా పెద్ద తప్పు.
   
    కానీ ఎంతో కాలం తర్వాత ఆమె ఉత్తరం వ్రాస్తే నేను వెళ్ళకపోతే బాగుంటుందా? నేను ఆమెకు స్నేహితుడిని. ఆమె ఆడపిల్లయిన కారణంగా మా స్నేహానికి విలువ లేకుండా పోతుందా?
   
    అయినా యిప్పుడు కోమలి ఎలాగున్నదో!
   
    నాకామెను చూడాలని ఉన్నది.
   
    ఆమె చెప్పిన సమయానికి ఆమె నిర్ణయించిన స్థలానికి వెళ్ళాను. ఆమెను చూడబోయే ముందు నా గుండె గుబగుబలాడింది.
   
    వద్దన్నా నాకు ఆ రోజు ఆ దృశ్యం గుర్తుకు వస్తూనే ఉంటుంది.

 Previous Page Next Page