Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 18

    నేను ఇలాంటిబేరం తగిలినందుకు చాలా సంతోషించాను. అంతా నన్ను అదృష్టవంతుదని అందుకే కాబోలు అంటారనుకున్నాను.
   
    మేము ఇల్లు మారాము. ఆ తర్వాత ఆయన రెండు రోజుల్లో తనూ వచ్చాడు.
   
    ఆయనపేరు విలాసరావు. కానీ అధి సర్టిఫికెట్ల కోసమేనని తనని మిత్రవర్గంలో డాక్టర్ విలాన్ అంటారనీ అలా అనిపించుకోవడమే తనకూ ఇష్టమనీ ఆయన నాకు చెప్పాడు.
   
    డాక్టర్ విలాన్ చాలా తమాషా అయిన మనిషి. మంచి సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు. ఆయనలోని గొప్ప విశేషమేమిటంటే, చాలా ప్రాక్టికల్ జోక్స్ వేస్తాడు. కానీ తను గంభీరంగా వుంటాడు. ఆయన నవ్వినా సందర్భాలు చాలా తక్కువ.
   
    "నా నవ్వు చాలా మనోహరంగా, సమ్మోహనంగా వుంటుందట. ఇంగ్లీషులో చెప్పాలంటే సెక్సీగా, ఇన్వైటింగ్ గా వుంటుందిట. ఫారిన్లో అయితే మగాళ్ళుకూడా నా వెంటబడిపోయేవారు. ఇండియాలో ఆ ఇబ్బందిలేదు కానీ నా నవ్వుకు ఆడవాళ్ళు వెంటబడితే ఆపైన మరోకందుకు మగవాళ్ళూ వెంటపడుతుంటారు" అని "అందుకే నేను నవ్వడం మరిచిపోయేందుకు ప్రయత్నించాను" అన్నాడు నాతో మొదటి రోజునే.
   
    ఆయన కోసం రోజూ ఉదయం కంపెనీ కారు వస్తుంది. నా టైమూ ఆయన టైమూ ఒక్కటే కాబట్టి ఇద్దరం అదే కార్లో వెళ్ళేవాళ్ళం ఆ విధంగా నా స్కూటరుకు పనితక్కువయింది. తిరిగి మళ్ళీ సాయంత్రం అయిదింటికి ఆయన నా డిపార్టుమెంటుకి వచ్చేసేవాడు.
   
    "మిమ్మల్ని కార్లో దింపితే నా బాధ్యత అయిపోదు గదా మీ ఆవిడ నన్ను తిట్టుకుంటుంది..." అనేవాడాయన.
   
    ఒకవేళ తను వచ్చినా రాకపోయినా కంపెనీకారును మాత్రం అయిదింటికల్లా నాకోసం పంపేవాడు.
   
    నాకాయన మీద చాలా సదభిప్రాయం ఏర్పడింది.
   
    కార్లో ఆయన నాతో మాట్లాడేవాడు. నేను ఉత్తశ్రోతగా వుండిపోయేవాడ్ని.
   
    ఒకసారి నేనే ఫీలై - "పాపం మీకు నేను బొత్తిగా కంపెనీ ఇవ్వలేకపోతున్నాను. మాట్లాడ్డం చేతకాదు నాకు" అన్నాను.
   
    "అమ్మమ్మ అలాగనకండి. మీకు ఈ కారూ అదీ ఎందుకు సరఫరా చేస్తున్నాననుకుంటున్నారు? స్వార్ధం-అంతాస్వార్ధం! నా అదృష్టం కొద్దీ దొరికారు. అసలు మీరు ఆడదైపుట్టి వుంటే మిమ్మల్ని పెళ్ళి చేసుకుని ఉండేవాణ్ణి" అన్నాడు డాక్టర్ విలాన్.
   
    ఆయనలా మాట్లాడితే నేను ఆడపిల్లలా సిగ్గుపడ్డాను.
   
    "అవునండీ మీకు తెలియదు. నాలాంటి వాగుడు కాయకు మీలాంటి శ్రోత దొరక్కపోతే ఏమైపోతాడు? ఎరక్కపోయి పెళ్ళి చేసుకున్నాను. మా ఆవిడుంది చూశారూ ఆవిడ నోరు విప్పిందంటే ఆ వాక్ప్రవాహానికి అడ్డుండదు. ధోరణి-ఒకటే ధోరణి ఏదో చెప్పుకుపోవాలన్న ధ్యాసే తప్పితే ఎదుటివాళ్ళు వింటున్నారా అనికూడా పట్టించుకోదు. తనాగితే ఎదుటి వాళ్ళెక్కడ మాట్లాడేస్తారో, తనకు మళ్ళీ అవకాశం రాదేమోనన్న భయంతో అలా గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తూంటుంది. ఇలాంటి వాళ్ళను కబాడీ టీములో సెలక్టు చేసుకుంటే బాగుంటుంది. అటు దేశానికి పేరూ వస్తుంది. ఇటు నా బోటివాళ్ళూ రక్షించబడతారు.
   
    నాకు నవ్వు వచ్చింది. ఆపుకోలేక నవ్వాను.
   
    "పిల్లలు పుట్టాక కాస్త నయంలెండి. తన వాగుడంతా వాళ్ళతో అయిపోయి కాస్త అలసిపోతోంది. అమ్మయ్యా అనుకుంటే ఆ పిల్లవెధవలూ అలాగే తయారయ్యారు. వాగుడులో వాళ్ళు తల్లిదండ్రుల్ని మించిపోయారు"
   
    "పోనీ వీళ్ళని కబాడీలో చేర్పించండి" అన్నాను.
   
    "మీకు మంచి సెన్సాఫ్ హ్యూమరుంది" అని మెచ్చుకున్నాడాయన.
   
    ఆయన చాలాసార్లు కార్లో నాకు తన భార్యగురించి చెప్పాడు. పితూరీలా చెప్పినప్పటికీ ఆయనకు భార్యంటే చాలా ఇష్టమనీ, ముచ్చట అనీ నేను అర్ధం చేసుకోగలిగాను.
   
    ఆమెను చూడాలన్న కుతూహలం నాలో కలిగేది.
   
    మా ఇంట్లోకి వాళ్ళువచ్చి వారంరోజులైనా నాకామెను చూసే అవకాశం రాలేదు-అందుకు కారణం ఆయన మాటలనుబట్టి అర్ధమయింది.
   
    తను వాగుడుకాయ అన్న విషయం నలుగురికీ తెలిసిపోతుందని ఆమె సాధారణంగా నలుగురిలోనికీ రాదుట.
   
    అయితే పద్మిని ఆమె గురించి నాకు మరోలా చెప్పింది. ఆమె ఎక్కువగా మాట్లాడదట__ఎదుటివారు చెప్పిందే వింటుందట. ఆమెను చూడగానే చాలా మంచిదని పద్మినికి అనిపించిందిట.
   
    నాకామెను చూడాలన్న కోరిక పెరగసాగింది- నా అనుమానం ఆమె అందంగా వుండదని - అందంగా వుందని తన భార్యను నలుగురి ముందుకీ తీసుకురావడం డాక్టర్ విలాన్ కిష్టమై వుండదు....ఆమె అందంగా వుంటుందో ఉండదో పద్మినిని అడిగి తెలుసుకోవాలంటే ఏదోలా అనిపించేది- పరాయి స్త్రీ అందచందాల గురించి భార్యవద్ద కుతూహలం చూపించకూడదన్నది అందుకు ముఖ్యకారణం.
   
    నా భార్యతో వచ్చిన యిబ్బంది ఏమిటంటే ఆమె చాలా ముక్తసరిగా మాట్లాడుతుంది అసలామె తనకు విలాస్ భార్య అందచందాల ప్రసక్తి తీసుకురావచ్చు - కానీ అలా చేయదు.
   
    ఒకరోజు మమ్ముల్నాయన టీకి పిలిచాడు.
   
    ఆ రోజు నాకు కన్వీనియంట్ కాకపోయినా వెంటనే ఒప్పుకున్నాను-ఆమెను చూడవచ్చునని!

 Previous Page Next Page