ఇప్పుడు కోమలి ఎలా వున్నదో!
చాలా సులభంగా ఆమెను గుర్తు పట్టాను.
అప్పటిమీద ఆమె అందంగా వున్నది యిప్పుడు.
మనిషికి కాస్త ఒళ్ళు వచ్చింది. లావు అవడానికి వీల్లేనంత వళ్ళు మాత్రమే వచ్చింది. ముఖంలో హుందాతనం. పరికిణీ కంటేయిప్పుడు చీరలోనే ఆమె ఎక్కువ బాగుంది.
"నువ్వేమీ మారలేదు రామం!" అన్నదామె.
"నేనూ నిన్ను సులభంగానే గుర్తుపట్టాను" అన్నాను.
"నాకిప్పుడు యిద్దరు పిల్లలు."
"నాకూను..."
ఇద్దరం కాసేపు మవునంగా వుండిపోయాం. నేను మాటలకు తడుముకోవడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ కోమలికి కూడా మాటలు దొరకడం లేదంటే అందుకు కారణం ఎన్నో ఏళ్ళ తర్వాత మేము కలుసుకోవడం అయ్యుండాలి.
"బాగున్నావా?" అన్నది కోమలి.
"ఏమో- అ ఆమాట నువ్వే చెప్పాలి" అన్నాను.
"మాటలు నేర్చావే!" అన్నది కోమలి.
నవ్వి ఊరుకున్నాను.
"అసలు నువ్వు రావనుకున్నాను" అంది ఆమె.
"నా స్నేహం మీద నీకు నమ్మకం లేదా?"
"కానీ నీకు నేనంటే యింకా భయం పోలేదేమో నని...."
"భయమెందుకు?"
"ఆ మాటన్నావు-ధైర్యం వచ్చింది. ఇంక చెప్పదల్చుకున్నది చెప్పనా?" అంది కోమలి.
ఆమె నేను ఎన్నేళ్ళ తర్వాతనో కలుసుకున్నట్లు లేదు. మేము విడిపోయి కొద్ది రోజులు మాత్రం అయినట్లుంది.
కొంతమంది అంతే! రోజూ కలుసుకున్నా అపరిచితుల్లాగే వుంటారు. కొంతమంది క్షణాల్లో ఆత్మీయులయి పోతారు.
కోమలిలో మెచ్చుకోతగ్గ చొరవ వున్నది. ఆమె నాకు స్నేహితుడయి వుంటే యింకా ఎంతో బాగుండేది.
"చెప్పనా?" అంది కోమలి.
"ఊఁ"
"నీ మీద ఒక గొప్ప ప్రమాదం వాలబోతున్నది."
"ఏమిటీ?" అన్నాను.
"నీ యింట్లో డాక్టర్ విలాస్ అనే అతను ఉంటూన్నాడు కదూ?"
"నీకెలా తెల్సు?"
"అన్నీ తెలుస్తాయి నాకు"
"సరే-డాక్టర్ విలాస్ నా యింట్లో అద్దెకుంటున్నాడు అందువలన ఏమయింది?"
"అతడు చాలా ప్రమాదకరమైన మనిషి"
"అంటే?"
కోమలి నాచేతికి ఓ పొడవాటి కవరు ఇచ్చింది. "ఇందులో ఆ డాక్టర్ విలాస్ కధ వుంది. చదివి తెలుసుకో_"
ఆశ్చర్యంగా ఆ కవరు అందుకుని "నువ్వుప్పుడు ఎక్కడుంటున్నావు?" అన్నాను.
"మనం మళ్ళీ రేపు యిక్కడ కల్సుకుందాం. అన్నీ అప్పుడు చెబుతాను. ముందు నువ్వు డాక్టర్ విలాస్ చరిత్ర తెల్సుకో" అంది కోమలి.
నాకు చాలా ఆశ్చర్యంగా వున్నది. కోమలి నన్ను ప్రత్యేకంగా కల్సుకొని డాక్టర్ విలాస్ గురించి హెచ్చరిస్తున్నది. ఈ డాక్టర్ విలాస్ నుంచి నాకు రానున్న ప్రమాదం ఎటువంటిది?
O O O O
డాక్టర్ విలాస్ విచిత్రమైన మనిషి.
ఆయన లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు ఒకరోజు ఓ అమెరికన్ తో గొడవ వచ్చింది.
"మీ ఇండియన్స్ ది సంకుచిత మనస్తత్వం_అందుకే మేము మిమ్మల్ని దూరంగా వుంచుతున్నాం." అన్నాడు అతను.
విలాస్ దీనికి బాగా రియాక్టు అయ్యాడు. అతడు అక్కడి భారతీయులు కొంతమందిని సమావేశపరచి "మనం సంకుచితంగానే ఉందాం. తెల్లవారిని మనలో చేరనిచ్చే విషయంలో, కానీ మనలో మనం సంకుచిత భావాలు వదలి పెట్టాలి. విప్లవ భావాల్లా మనం వారిని మించాలి. అందుకని ఫ్రీ లవ్ సొసైటీ ప్రారంబిస్తున్నాను" అన్నాడు అతడు...
ఫ్రీ లవ్ సొసైటీ సభ్యులు స్త్రీ పురుష వివాహవ్యవస్థకు కట్టుబడకూడదు. వారి వారి అభీష్ట ప్రకారం జంటలను మార్చుకొనవచ్చును. ప్రతిరోజూ జంటలు మారి తీరాలన్నది సొసైటీ నియమం.
ఫ్రీ లవ్ సొసైటీ చాలామంది అమెరికన్ భారతీయుల్ని ఆకర్షించింది. సుమారు వందమంది సభ్యులు అందులో చేరారు. అందులో పాతిక వివాహిత జంటలు వున్నాయి.
డాక్టర్ విలాస్ బ్రహ్మచారి. అతడు రోజూ సొసైటీ సమావేసానికి వెళ్ళేవాడు. సొసైటీ ఆశయాలను వివరించే వాడు. ఆపైన వచ్చిన వారిలో ఒక యువతిని ఎన్నుకొని బయటకు వెళ్ళిపోయేవాడు.
సొసైటీకి ప్రత్యేకమైన స్థలమంటూ లేదు. వారి సమావేశాలు హోటల్స్ లోనో, పార్కు లోనో జరిగేవి.
కొద్దిరోజులు సొసైటీ వుత్సాహంగా నడిచింది. అయితే సొసైటీలోని వారందరూ భారతీయులే కదా__ఒక ఇబ్బంది వచ్చింది.