Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 18


    రామలింగం ఈ సారి తృళ్ళిపడనూలేదు. రాధతో పార్కుకి వెళ్ళగలిగినవాడు ఏక్షణంలోనైనా అలా పిలవగలడని ముందే వూహించాడు.

    "బాబాయ్ గారూ ! జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచీ మనిద్దరం ఈ దొంగాటలు మాని నిజాయితీగా, నిస్పక్షపాతంగా వ్యవహరిద్దాం ! ఏమంటారు ?"

    "ఊ ..." తన ఆలోచనలలో తనుండి అన్నాడు రామలింగం -

    "అయితే మీరు వెంటనే కొన్ని అక్షంతలు తెప్పించి మా నెత్తిన చల్లారంటే మీ ఋణం తీర్చుకోలేను." అంటూ రామలింగం మొహంలోకి చూసి __

    "అదేమిటలా అయిపోయారు? మాట్లాడరేం ?" అన్నాడు.

    "నువ్వు రాధను పెళ్ళి చేసుకోవటం అనుభవం నాయనా !"

    మురళీ ఖంగారు పడ్డాడు.

    "అసంభవమా ? ఎందుకని ?"

    "ఆమె కిదివరకే వివాహం అయింది కాబట్టి_"

    మురళీ నిర్ఘాంతపోయాడు. తేరుకోవటానికి పావుగంట పట్టింది.

    "గురూజీ ! నన్నన్యాయం చేయకండి ! రాధకు అదివరకే పెళ్ళవటమేమిటి? వివరంగా చెప్పండి !"

    "అదో పెద్ద కథ నాయనా !" అని ఆగి వివరంగా చెప్పటం మొదలుపెట్టాడు.


                               6


    "రాధ నాయనమ్మ - మరణశయ్య మీద వున్న రోజులవి సుమారు పదేళ్ళవుతుందేమో లేక అంతకన్నా ఎక్కువే కావొచ్చు...

    అప్పుడు రాధ వయసు ఎనిమిదేళ్ళు ! మా దూరపుబంధువు శారదమ్మకు ఇద్దరు మొగపిల్లలు, వాళ్ళలో పెద్దవాడు కృష్ణ మాతోనే వుండేవాడు. కృష్ణకూ, రాధకూ పెళ్ళి జరిగితే చూసి, సంతృప్తిగా కళ్ళు మూయాలని అమ్మ కోరిక. కొద్దిరోజులు ఆమె మాటలు ఎవ్వరం పట్టించుకోలేదు గానీ, ఒక రోజు ఆమె పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయింది. మరో గంటో రెండు గంటలో అని చెప్పారు డాక్టరుగారు. ఆ స్థితిలో ఆమె తన కోరిక తీర్చాలని పట్టుబట్టింది. విధిలేక ఆ చిన్నపిల్లలిద్దరికీ పెళ్ళిచేసి, దండలు వేసి తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాము. ఆమె సంతృప్తిగా కన్ను మూసింది.

    ఆ తరువాతే వచ్చింది గొడవ !

    వాళ్ళ నాయన విషయం తెలిసి పెద్ద రాద్దాంతం చేశాడు. చిన్నకుర్రాడిని చదువు కోసం ఇంట్లో పెడితే, మూడు ముళ్ళూ వేయించేస్తారా? అని రంకెలు వేశాడు. అప్పటికప్పుడు ఆ ముసలమ్మ తృప్తికోసం అలా వేయవలసి వచ్చిందనీ, నిజానికి పూర్తి పెళ్ళి జరగలేదనీ మేము చెప్పినా వినలేదు. కట్నం ఎగవెయ్యటానికి యిలా ఎత్తు వేసినట్టు నాటకం ఆడామని నెపం వేశాడు. నాకూ కోపం వచ్చింది. మాటా మాటా పెరిగింది. కృష్ణని తీసుకుని అతడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ ఇంటికీ మాకూ రాకపోకలు లేవు. నేనూ ట్రాన్స్ ఫర్ల మీద ఊరు ఊరు తిరిగాను. కానీ వాళ్ళెక్కడా కనిపించలేదు."

    "బాబాయ్."

    చెపుతూన్న రామలింగం ఆపుచేశాడు. మురళీకృష్ణ మొహం, అప్పటివరకూ విన్నది నమ్మలేనట్టు - విభ్రాంతితో, అనూహ్యమైన భావంతో వెలిగిపోతూ వుంది. లేచి__

    "నేను బాబాయ్ మురళీకృష్ణని..." అన్నాడు ఉద్వేగంతో. "...రాధకీ, నాకూ దండలు వేయించింది మీరే. నాకు అంతా కళ్ళకు కట్టినట్టు జ్ఞాపకం వుంది."

    ఈసారి విస్తుబోవటం రామలింగం వంతయింది. నమ్మలేనట్టు చూశాడు.

    "అవును నేనే కృష్ణని..." 

    కొద్దిసేపు తదేకంగా చూసి, రామలింగం ఒక్క ఉదుటున లేచి అతడిని కౌగిలించుకున్నాడు. "ఒరే కృష్ణా ! ఎన్నాళ్ళకి కలిశావురా ! ఇంతకాలం ఒకరినొకరం ఇంత దగ్గరగా వుండీ తెలుసుకోలేకపోయామంటే - చాలా చిత్రంగా వుంది. అమ్మెక్కడుందిరా ? అమ్మా-నాన్నా-తమ్ముడూ..."

    కృష్ణ మొహం వాడిపోయింది.

    "అమ్మ నాన్నని హత్యచేసి జైలుకెళ్ళింది బాబాయ్!" అన్నాడు.

    రామలింగం బాంబు పడ్డట్టు అదిరిపడి, కృష్ణని వదిలేశాడు.

    "నాకు సరిగ్గా తెలీదు. చాలా చిన్నవయసు. నాన్న సంగతి తెలుసుగా. బాగా తాగేవాడు. తాగితే వళ్ళూపై తెలీదు. రోజూ వచ్చి అమ్మని కొడుతూ వుండేవాడు. ఒకరాత్రి అలా కొడుతూ వుంటే తమ్ముడు వెనుక నుంచి కత్తిపీఠ విసిరేశాడట. లేదా నాన్నే తూలిదానిమీద పడ్డాడో, మొత్తం మీద తమ్ముడు భయంతో ఇంట్లోంచి పారిపోయాడు.

    తనే నాన్నని చంపినట్టు అమ్మ వప్పుకుంది.

    పోలీసులు అమ్మని అరెస్టు చేశారు. నేను రోడ్డున పడ్డాను."

    "మరి అమ్మెక్కడుందిరా ?"

    "తెలీదు. అసలిదంతా నాకు తెలియటం కూడా అమ్మకిష్టం లేదు. ఆ రోజుల్లోనే నరసింహంగారి దగ్గిర వాగ్దానం తీసుకుంది. ఇవేమీ నాకు తెలియనివ్వనని...రాత్రికి రాత్రే నన్ను ఆ ప్రదేశం నుండి తీసుకు వెళ్ళి పొమ్మని పోలీసుల్ని బ్రతిమాలిందట. అంత చిన్న వయసులో అమ్మ కోసం నేనెంత ఏడ్చినా నన్ను ఆ కోర్టు వ్యవహారాలకి దూరంగా వుంచారు. నేనూ క్రమక్రమంగా ఈ విషయాలన్నీ మర్చిపోయాను. 'నా తల్లి హంతకురాలు' - అన్న విషయం నేను పూర్తిగా మర్చిపోవాలి! అన్న అమ్మకోర్కె ఆ విధంగా నెరవేరింది."

    రామలింగం అచేతునుడై వింటున్నాడు. అతడిప్పుడు అల్లరి హాస్టల్ వార్డెన్ లా లేడు. ఒక దారుణమైన విషయాన్ని వినటం వల్ల వచ్చిన వ్యథతో వయసు పదేళ్ళు మీద పడ్డ వాడిలా వున్నాడు ! చాలా దగ్గిరయిన నిండు కుటుంబం ఒకటి ఎలా ముక్కలు వ్రక్కలైందీ వింటూ బాధపడుతున్నాడు ! చనిపోయిన కుటుంబ పెద్దా,  చంపి పారిపోయిన చిన్నకొడుకూ- ఆ నేరం పసివాడి మీదికి రాకుండా, తన మీద వేసుకున్న తల్లీ...విచ్చిన్నమైపోయిన సంసారం.

 Previous Page Next Page