ఇంత అంధకారంలోనూ సంతోషకరమైన విషయం ఏమిటంటే- తన మేనకోడలికి కావలసినవాడు ఈ విధివలయంలో చిక్కుకోలేదు. ఆ నరసింహంగారి దయవల్ల చక్కగా చదువుకొని వృద్ధిలోకి వచ్చాడు. అది చాలు !
"బాబాయ్ !"
ఆలోచన్ల నుంచి తేరుకుని రామలింగం తలెత్తాడు.
"రాధ విషయం ఏమిటి ? తనకి నేనసలు గుర్తున్నానా ?"
"ఈ మొత్తం కథలో అందరికన్నా ఎక్కువ కష్టపడింది రాధే బాబూ ! పాపం దానికి ఊహ తెలియని వయసులో తాళి కట్టించాం. భర్త ఎనిమిదేళ్ళపాటు కనబడకుండాపోతే అతడు చనిపోయిన వాడితో సమానమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయని చెప్పి, దాన్ని ఘోరంగా విధవరాల్ని చేశాము. మరో పెళ్ళి చేసుకొమ్మని ఎంత బ్రతిమాలినా ఆ అమ్మాయి వినలేదు. చిన్నప్పటినుంచీ దానికి సాంప్రదాయమంటే చాలా గౌరవం. తిరిగి దానిచేత బొట్టు పెట్టించటానికే ఎంతో కష్టపడవలసివచ్చింది. కాలేజీలో చేర్పించాము. అలాగయినా అది మారుతుందేమో అని మా ఆశ. కానీ చూశావుగా ! అది ఏమాత్రం మారలేదు. దాని మనసు విరిగిపోయింది. ఎప్పుడూ దేవుడూ, పురాణాలూ అంటుంది. ఇప్పుడు నువ్వొచ్చావు కాబట్టి ఇక అంతా సుఖాంతమే అనుకో..."
"కాదు బాబాయ్ !" అన్నాడు మురళి ఒక నిశ్చయానికి వచ్చినట్టు. "రాధ- తన మెడలో చిన్నప్పుడు తాళి కట్టిన కృష్ణని మర్చిపోలేక వేదాంతాన్ని ఆశ్రయించింది. కేవలం చిన్నప్పుడు ఆ తాళి కట్టానన్న అర్హతతో భర్తగా ఆమె జీవితంలోకి రావడం నాకిష్టంలేదు. నేను స్వయంగా ఆమె ప్రేమ పొందాలి ! కావాలంటే తరువాత చెపుదాం. ఈ చిన్నప్పటి విషయం. అప్పుడు తను మరింత సంతోషిస్తుంది. లేకపోతే ఆమె ప్రేమని పొందటానికీ, ఆమె మనసు వివాహంవైపు తిరిగి మళ్ళించటానికీ, నువ్వూ నేనూ కలిసి ఆడిన నాటకం అని ఆమె భ్రమపడే అవకాశం వుంది."
రామలింగం కొంచం ఆలోచించి, "అంతేనంటావా" అన్నాడు.
"అవును కాదనకు."
"సరే- అయితే" వప్పుకుంటున్నట్టు అన్నాడు రామలింగం.
7
తులసి కోటచుట్టూ ప్రదక్షణలు చేస్తున్న రాధ హఠాత్తుగా ఆగిపోయింది. కారణం ఆమె చెవిలో "మిమ్మల్ని ఎంతో ప్రేమించబట్టే మీతోపాటు నేనూ ఇలా ప్రదక్షిణలు చేయవలసి వస్తోందండీ" అన్న గొంతు వినిపించటం ! అంత దగ్గరలో మురళీ గొంతు వినిపించేసరికి ఉలికిపడి పక్కకు చూసింది. మొఖాన విభూతి బొట్టూ, మెడలో రుద్రాక్షమాలా, పీతాంబరాలూ ధరించి చిరునవ్వుతో మురళీ కనిపించాడు.
కోపంగా ఏదో అనబోయి కళ్ళు నులుముకుని, అది తన భ్రమ అని గుర్తు తెచ్చుకుంది. తనమీద తనకే కోపం వచ్చిందామెకి.
'ప్రేమపిచ్చి పట్టింది అతనికి కాదు, తనకు !' అనుకుంది కసిగా.
అన్నపూర్ణమ్మ రాధను అందోళనతో గమనిస్తోంది.
పక్కన ఎవరో ఉన్నట్లు చూడటం, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడటం, అర్దరాత్రి లేచి కూర్చుని గీత చదవడం- ఇవన్నీ ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
"కాలేజీకి టైమవుతుంటే ఇంకా తులసమ్మ దగ్గరే ఉన్నావేం ?" అడిగిందామె.
భోజనం ముందు కూర్చుని అన్నం ముద్ద చేతిలోకి తీసుకునే సరికి ఎదురుగ్గా మురళి కనిపించాడు.
"నేను చెపుతోంటే మీకు వేళాకోళంగా ఉందేమోగానండీ, నేను మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నానండీ !" అంటూ ముఖం ముందుకు వంచి ఆమె చేతిలోని అన్నం ముద్దని ఆప్యాయంగా తినేశాడు.
ఆమె ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరయింది. 'ఇది కూడా తన భ్రమే అయితే తన చేతిలోని అన్నంముద్ద ఏమయినట్లు ?' కళ్ళు నులుముకుంది.
మరుక్షణం మురళి మాయమయిపోయాడు.
రాధ త్వరత్వరగా భోజనం ముగించి కాలేజీకి బయల్దేరింది. నాలుగడుగులు వేసిందో లేదో మురళి రోడ్డుమీద మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.
"నమస్కారమండీ ! మీ కోసమే ఎదురు చూస్తున్నాను. మన పవిత్ర ప్రేమ గురించి ఏం నిర్ణయం తీసుకున్నారండీ? తెలుసుకోవచ్చా?"
రాధకు ఏడుపొచ్చింది. అంతా తన భ్రమ అని తెలుసు. ఓసారి కళ్ళు నులుముకుని మళ్ళీ చూస్తే చాలు- మాయమయిపోతుంది ఆకారం.
ఆమె కళ్ళు నులుముకుని. కాని అతనింకా ఎదురుగా నిలబడే ఉన్నాడు.