Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 17


    ఆమె మనసు దిటవు పర్చుకొని లైటార్పి నిద్రపోవడానికి గట్టి ప్రయత్నం మొదలుపెట్టింది.

    "ఏమండోయ్ ! రాధగారూ ! నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండీ !"

    మళ్ళీ అదే రహస్యమైన గొంతు !

    ఈసారి తన చెవి దగ్గరే __


                       *    *    *


    రామలింగం దిగాలుపడి కూర్చుని వున్నాడు. అంతకు ముందు రోజు జరిగిన సంఘటన అతనికి మతిస్థిరం తప్పేట్లు చేసింది. అప్పటి నుంచీ మనసు మనసులో వుండడం లేదు.

    రాధ - మగపిల్లలను ఆమడ దూరంలో వుంచే రాధ - పలుకరించగానే ఆ మురళీ చెంప పగలకొట్టకుండా - అతనితో నవ్వుతూ మాట్లాడడం ఎలా జరిగిందో తనకింకా అర్ధం కావటం లేదు. పోనీ మాటలాడి, అక్కడితో వచ్చేసినా తనకింత చికాకు వుండేదికాదు. అతనితో పాటు తను చూస్తూండగానే పార్కుకి కూడా వెళ్ళింది.

    "హలో గురూజీ" పరుగుతో లోపలికొచ్చాడు మురళీ. వెంటనే తన మొఖం మీది భావాలను చెరిపేసుకొని చిరునవ్వు నవ్వాడు రామలింగం.

    "ఇప్పుడేమంటారు గురూజీ ! రాధతో నిన్న మాట్లాడాను ! ఆ తరువాత యిద్దరం పార్కు కెళ్ళాం -"

    "చూశాను" కటువుగా అన్నాడు రామలింగం.

    "పార్కులో ఏం జరిగిందో మీకు తెలుసా !"

    "ఆ !" అన్నాడు రామలింగం.

    "రాధా నేనూ గాఢంగా కౌగిలించుకొన్నాం -"

    రామలింగం తలమీద పిడుగు పడినట్లయింది.

    "కౌ...కౌగిలించుకొన్నారా ?" చెమటలు తుడిచేసుకుంటూ గాబరాగా అడిగాడు. రామలింగం అలా తను చెప్పే ప్రతి దైలాగుకీ రియాక్షన్ ఇవ్వడం, చెమటలు తుడిచేసుకోవడం చూస్తే సరదా పుట్టుకొచ్చి తన ప్రహసనాన్ని మరింత పొడిగించాడు మురళీ.

    "కౌగిలించుకోవటమా ! దటీజ్ నథింగ్ ! ఆ తరువాత ఇద్దరం ఫ్రెండ్ రూమ్ కెళ్ళినప్పుడు జరిగిన విషయాలు చెబితే మీరు మూర్చపోతారు -"

    రామలింగం మూర్చపోబోతూ హీన స్వరంతో అడిగాడు "మీ ఫ్రెండ్ రూమ్ కెళ్ళారా ?"

    "వెళ్ళటమేమిటి గురూజీ ! వాడిని అర్జంటుగా బయటకు నెట్టి తలుపు వేసుకొని - ఆమె మొహం చేతుల్లోకి తీసుకొని -"

    "ఆ... తీసుకొని," క్షీణించిన గొంతుతో అడిగాడు రామలింగం.

    "తీసుకొని - సినిమాల్లో బాన్ చేసిన 'ముద్దు' - అంటే 'కిస్' అది పావుగంట సేపు..."

    'ఓరి అప్రాచ్యుడా ...' తనలో తను గొణుక్కుంటున్నట్లు అన్నాడతను.

    "అక్కడితో ఏమయింది ? ఆ తరువాత జరిగిన సంగతి చెబితే మీరిక్కడే హరీ మంటారు ..."

    "ఆ తరువాత ఇంకా వుందా, దుర్మార్గుడా ! ఆపు-" కోపం పట్టలేక గట్టిగా అరిచాడు రామలింగం.

    మురళీ ఉలిక్కిపడ్డాడు.

    "అదేమిటి సార్ - అలా అరిచారు ?"

    "ఇంకేం చెప్పకురా దౌర్భాగ్యుడా ! రాధ ఎవరనుకుంటున్నావ్ ?"

    మురళీ ఆశ్చర్యంగా చూసి __

    "అంటే రాధ ఎవరో మీకు తెలుసా గురూజీ ?" అని అనుమానంగా అడిగాడు.

    "తెలియటమేమిట్రా ! రాధ నా మేనకోడలు."

    ఇప్పుడు మురళీ స్థాణువయాడు. ఆ తరువాత కొద్దిసేపు నిశ్చేష్టుడయాడు. ఆ తరువాత విస్తుపోవడం లాంటి దశలన్నీ దాటాక...

    "రా ... రాధ ... మీ ... మేనకోడలా ?" అన్నాడు గొంతు పెగల్చుకొని.

    "అ ... అ ... అవును" కోపంతో మండిపడ్తూ అన్నాడు రామలింగం.

    "అ ... అ ... అయితే మీరు నన్ను క్షమించాలి." గాబరాగా అన్నాడు, "ముందు మనం ఇలా న... నత్తిగా మాట్లాడుకోవడం మానేద్దామా సార్ !"

    "క్షమించటం ఎందుకు ? ముందది చెప్పు, నాకు బి.పి. వస్తూంది. అంత క్షమించకూడని పని ఏదయినా చేశావా?" కంఠం వణికింది రామలింగానికి.

    "అబ్బే అటువంటిదేమీ లేదు సార్ ! క్షమించటం ఎందుకంటే ఇందాక రాధా నేనూ ముద్దుపెట్టుకున్నామని చెప్పాను చూడండి - అది అబద్ధం, కౌగిలించుకోవటం కూడా అబద్ధమే మొహం చేతుల్లోకి తీసుకోవడం కూడా అబద్ధమే! ..."

    "ఓరి అప్రాచ్యుడా ! ఒక్కటొక్కటే వర్ణించనక్కరలేదు, అసలేం జరిగింది అది చెప్పు" అని అరిచాడు రామలింగం.

    "నిజం చెప్పాలంటే అసలు మేము పార్కు క్కూడా వెళ్ళలేదు సార్ ! దూరం దూరంగా - చాలా దూరంగా - అంటుకోడానికి వీలులేనంత దూరంగా పార్కు బయటే నిలుచుని మాట్లాడుకున్నాం."

    రామలింగం మొఖంలోకి పోయిన కళ తిరిగి వచ్చేసింది.

    రాధ మన నమ్మకాన్ని నిలబెట్టింది.

    "నిజం సార్ ! నా మాట మీద నమ్మకం లేదా ?"

    రామలింగం ఆలోచనలో పడ్డాడు. ఈ మురళీ మళ్ళీ రాధను కలుసుకోకుండా చేయాలంటే రాధ విషయం ఉన్నదున్నట్లు చెప్పేస్తే మంచిది. వాళ్ళ పరిచయం అక్కడితోనే ఆగిపోతుంది అవును. అదే మంచిది. "బాబాయ్ గారూ !" నెమ్మదిగా పిలిచాడు మురళీ. 

 Previous Page Next Page