"ఈ ప్రశ్నలకి దేవి సమాధానం చెప్పడం -ఇదంతా బోగస్ అనుకుంటున్నాను. నా అభిప్రాయం నిజమేనా?"
ఆమె కాగితం మడత పెట్టింది. దాన్ని మరో నాలుగు మడతలు వేసింది.
"దేవీ విగ్రహం దగ్గరికి వెళ్ళి నిలబడమ్మా" సిద్ధేశ్వరీ కంఠంలో ఏ మార్పూ లేదు. ఆమె గదిలో ఒక మూల వున్న విగ్రహం దగ్గరకు వెళ్ళింది. విగ్రహం ముందు చిన్న దీపం వెలుగుతూంది.
"నీ ప్రశ్నను దేవీ వెలుగుకు అర్పణం చెయ్యి తల్లీ"
ఆ అమ్మాయి కాగితాన్ని ఒక చివర అంటించింది. నెమ్మదిగా మంట కాగితాన్ని దగ్దం చేసింది ఆ వెలుగులో తలతిప్పి సిద్దేశ్వరి వైపు ఓరగా చూసి ఉలిక్కిపడింది.
మంట వెలుగులోసిద్దేశ్వరి మొహం ఎర్రగా ప్రతిబింబిస్తుంది. జారిపోయిన చర్మం వెనుక బిగించిన పళ్ళ ఆవేశం స్పష్టంగా కనిపిస్తూంది. ఆమె కళ్ళు అగ్ని గోళాల్లా వున్నాయి.
తన మనసులో భావం -తన ప్రశ్న ఆమెకి ఎలా చేరింది?
ఇంత తొందరగా
మానవాతీత శక్తులు వున్నాయా?
ఆమె వళ్ళు జలదరించింది. ఒక చెమట చుక్క పాపిటిమీద నుంచి నుదుటి మీదకు జారింది. కంపిస్తున్న కాళ్ళతో తలుపువైపు వెళ్ళబోయింది.
"అటు కాదమ్మా"
నాగస్వరం విన్నదానిలా ఆమె చప్పున ఆగిపోయింది. డోర్ హాండిల్ మీద నుంచి ఆమె చెయ్యి కిందకి వాలిపోయింది.
"నీ ప్రశ్నకి కాళికాదేవి స్వయంగా సమాధానం చెబుతుందట అటు వెళ్ళు"
ఆ అమ్మాయి తలతిప్పి చూసింది. ఎడమవైపు ఇంకోదారి, చిన్న తలుపు.
"వెళ్ళు తల్లీ" ఈ సారి సిద్ధేస్వరి కంఠం, మొహమూ మాములుగా వున్నాయి. ఆమె ఇక తప్పనిసరి అయినట్టు అటు నడిచింది. ఎడమవైపు తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించింది.
ఆమె వెనుక తలుపు దానంతట అదే మూసుకుపోవడం -లాక్ పడడం ఆమె గమనించలేదు. చిన్న చప్పుడుకు అటు చూసింది.
ఆ మసక చీకట్లో బల్లమీద ఉన్న పుర్రెను చూసి ఆమె కెవ్వున అరవబోయింది. నోటమాట రాలేదు. భయంకన్నా విస్మయం ఎక్కువైతే ఆ స్థితి మనిషిని కట్రాట చేస్తుంది. ఆమె నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నిశ్చేష్టురాలై శిలలా ఆగిపోయింది.
పుర్రె దానంతట అదే నాలుగు అంగుళాలు గాలిలోకి లేచింది. ప్రతి ద్వనిస్తున్న స్వరంతో బొంగురు గొంతుతో -ఆపుర్రె అన్నది.
ఒక్కసారి గాలిలోకి లేచిన పుర్రె వికృత స్వరంతో అలా మాట్లాడేసరికి ఇరవై ఏళ్ళ అమ్మాయి బెదిరిపోయింది. హిస్టీరిక్ గా మారి కెవ్వు కెవ్వున అరవసాగింది.
ఆ అరుపులు బయటికి వినిపించడం లేదు.
"ఎందుకలా అరుస్తావ్?" అని పుర్రె అడిగింది.
భయంతో ఆమె చప్పున అరవడం మానేసింది. ఉన్నట్టుండి ఆ గదిలో నెలకొన్న నిశ్శబ్దం కూడా భయంకరంగా కూడా వుంది. ఆమెకు కొద్దిగా ధైర్యం వచ్చింది. స్వతహాగా ధైర్యవంతురాలు ఒక్కసారిగా గదిలో వున్న చీకటి - గాలిలోకి లేచిన పుర్రె ఆమెని భయపెట్టాయి అంతే.
ఆమెకి కొంచెం ధైర్యం చేకూరగానే అడుగు ముందుకు వేసింది. పుర్రె కల్ళ స్థానంలో వున్న రెండు కన్నాలూ ఆమెనే తీక్షణంగా చూస్తున్నట్టు వున్నాయి. ఆమె ఒకటి గమనించింది. మాటలు పుర్రెలోంచి వస్తున్నాయి. అందులో సందేహం లేదు. అయినా అనుమానం తీరక చుట్టూ చూసుంది. గది మామూలుగానే వుంది. ఎక్కడా మైకులు లేవు.
టేబిల్ మీద నుంచి పుర్రెకు ఏమైనా కనెక్షన్ వుందేమో అని ఆమెకు అనుమానం వచ్చింది.
ఇంకో రెండడుగులు వేసి ఆమె బల్ల దగ్గరకు వెళ్ళింది. బల్లమీద పుర్రె నిశ్చలంగా వుంది. ఆమె చెయ్యిచాచి పుర్రెని చేతుల్లోకి తీసుకోబోయి ఒక క్షణం ఆలోచించింది. ఏ మాత్రం కరెంట్ కనెక్షన్ వున్నా తన మరణం ఖాయం. ఒకవేళ అలాంటి కనెక్షన్ వుంటే పుర్రె గాలిలోకి ఎలా లేచింది? మసక చీకట్లో వైర్లు తనకి కనబడలేదా? లేకపోతే సన్నటి వైర్లా అవి.
వైర్లువున్నాయో లేవో తీసుచూస్తే తెలిసిపోతుంది కదా.
ఆమె తటపటాయిస్తూ పుర్రెమీద చెయ్యివేసింది.
షాక్ కొట్టలేదు మామూలుగానే వుంది.
ఆమె నాలుగు వేళ్ళతోనూ దాని పై భాగాన పట్టుకొని పైకి ఎత్తింది. చాలా తేలిగ్గా మామూలు పుర్రెలాగానే చేతిలోకి వచ్చింది అది.