"ఓకే మేడమ్"
అతనిచ్చిన ఫోన్ నెంబరు స్లిప్ ను బాగ్ లో వేసుకుని, కొన్ని నోట్లు తీసి అతనికి ఇచ్చింది. ఆప్యాయంగా ఆ నోట్లను అందుకుని జేబులో పెట్టుకున్నాడతను.
"ఇప్పుడు ఇచ్చింది అడ్వాన్స్ మాత్రమే. మిగిలిన బ్యాలెన్స్ పని పూర్తయ్యాక...."
"అలాగే మేడమ్....రేపు కలుసుకుందాం" అని చెప్పి వెళ్ళిపోయాడతను.
రెండు నిమిషాల తర్వాత హోటల్ లోనుంచి బయటకు వచ్చింది శ్రీప్రియ. దూరంగా వెళుతున్న ఆటోను పిలిచి ఎక్కికూర్చుంది.
ఆటో ముందుకు దూకింది.
అరగంట క్రితం డిన్నర్ లో జగపతి తనవైపు దొంగచూపులు చూడడం ఆమె కళ్ళల్లో ఇంకా మెదులుతూనేవున్నది.
అది తలుచుకుని తనలో తాను నవ్వుకుంది శ్రీప్రియ.
* * *
ప్యూన్ చేత శ్రీప్రియను పిలిపించాడు జగపతి.
శ్రీప్రియ అతని గదిలోకి అడుగుపెట్టింది.
గది సెంట్ వాసనతో ఘుమాయిస్తున్నది. సోఫాసెట్, టివి, విసిఆర్ మొదలైన వస్తువులతో అధునాతనంగా వున్న ఆగదిని ఆశ్చర్యంగా చూసిందామె.
"కమాన్ శ్రీప్రియా....రివాల్వింగ్ చెయిర్ లో కూర్చుని వున్న వాడల్లా లేచి నిలబడుతూ ఆమెకు సీటు ఆఫర్ చేశాడు జగపతి.
ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంటూ బాస్ వైపు ఓరగా చూసింది శ్రీప్రియ.
జగపతి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.
"నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి...."
"చెప్పండి...."
"గత నాలుగు నెలలనుంచి మన ప్రొడక్ట్స్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి. సేల్స్ ప్రమోటర్స్, మన ప్రొడక్ట్స్ మీద అంతగా కాన్ సన్ ట్రేట్ చేయడం లేదు. ఈ విషయంలో మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి" ఉపోద్ఘాతంగా అన్నాడతను.
"తప్పకుండా సర్...."
"ఆ....ఇంకొకమాట...."
"ఏమిటి?"
"మద్రాసులో మనకు ఒక ఎస్టేట్ వుంది. అక్కడవున్న స్టాఫ్ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు లెక్కలు రాసి సగానికి సగం దోచుకుతింటున్నారు. మనం కనీసం వారానికి ఒకటి రెండు రోజులైన అక్కడ వుండవలసి వుంటుంది"
అలాగే సర్...."
బై దిబై....నీకు కారు డ్రయివింగ్ వచ్చా?"
"రాదండీ...."
"అయితే నువ్వు ముందు అర్జెంటుగా కారు డ్రయివింగ్ నేర్చుకోవాలి....నేను ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇక్కడి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవలసి వస్తుంది...."
శ్రీప్రియకు అతని అంతరంగం ఏమిటో కొంచెం కొంచెం అర్ధం అవుతోంది.
"ఇక్కడ బిజినెస్ చూసుకోవడానికి మీ మిసెస్ వుంది కదండీ.."
అతనేం చెప్తాడో చూద్దామని కావాలనే ఆ ప్రశ్న వేసింది శ్రీప్రియ.
"ఆమె ఇవన్నీ చూసుకోగలిగితే నాకు ఈ రిస్క్ లు ఎందుకు ఉంటాయి?....ఏం నీకు ఇష్టం లేకపోతే చెప్పు...." సూటిగా అన్నాడతను.
"భలేవారే....మీరేది చెప్పినా నేనది తప్పకుండా చేస్తాను ఎంతైనా మీరు నా బాస్ కదా...."
"నిజంగానా?"
"మీ మీద ఒట్టుసార్"
ఆమె అంత త్వరగా అలా తన దారిలోకి వస్తుందని వూహించని జగపతి తబ్బిబ్బైపోయాడు. ఆమె కారు డ్రయివింగ్ నేర్పించే నెపంతో ఆమెను ఫ్యాక్టరీ వెనుకవైపు ఖాళీగావున్న ఓపెన్ గ్రౌండ్స్ కు తీసుకువెళ్లాడు జగపతి.
కారులో కూర్చున్నంతసేపూ నిమిషానికొక రకంగా కారణాలు వెదుక్కుంటూ ఆమెను తాకాలని ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు జగపతి.
అతని తాపత్రయం గ్రహించిన శ్రీప్రియ కావాలనే అతన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం మొదలెట్టింది.
ఒక గంట గడిచిన తర్వాత ఇద్దరూ తిరిగి ఆఫీసుకు చేరుకున్నారు
"సార్....నాకు చిన్నతనం నుంచి ఒక బలమయిన కోరిక వుండిపోయింది" సీట్లో రిలాక్స్ అవుతూ అన్నది శ్రీప్రియ.
"ఏమిటది?"
కారు డ్రయివింగ్ నేర్చుకోవాలని?"
"ఇప్పుడు తీరుతుందిగా...." ఆనందంతో అన్నాడు జగపతి.
"అవును....మీ పుణ్యమా అని తీరబోతుంది....అందుకే కృతజ్ఞతగా మీకు....అంటూ అర్దోక్తిగా ఆగిపోయిందామె.
"ఊ....కృతజ్ఞతగా...." రెట్టించాడతను.
శ్రీప్రియ అతని చేతిని తన చేతిలోనికి తీసుకుని ముద్దు పెట్టింది.
జగపతికి అది కలో నిజమో అంతుబట్టలేదు.
ఆ చర్యకు పరిసరాలను సయితం మరచిపోయి పరవశంతో మునిగిపోయిన జగపతిని చూసి విషనాగు నవ్వినట్టు చిద్విలాసంగా నవ్వుకున్నది శ్రీప్రియ....
ఇప్పుడామె అంతరంగం విందా సంతృప్తి నిండిపోయి వున్నది.
* * *
"మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించనిదే వదలవన్నమాట.."
చక్రవర్తి అంటున్నాడు శ్రీప్రియతో....
ఉదయం ఫోన్ చేసి సాయంత్రం ఐదు గంటలకు రమ్మని చెప్పింది శ్రీప్రియ.