చక్రవర్తికి ముందు వెళ్ళాలనిపించలేదు....
కానీ, రాణా రెండు రోజులక్రితం సింగపూర్ వెళ్ళడంతో ఏ పనీ లేకుండా వుండడం వలన చాలా కాజువల్ గా బయటకు వచ్చాడతను.
తనున్న వాతావరణంలో అంగుళం కదిలినా రాణాతో చెప్పి ఆర్డర్ తీసుకున్న తరువాతనే బయటకు రావాలి.
అమ్మాయిలతో స్నేహం....ప్రేమలాంటివి రాణాకు గిట్టవు_
అలాంటి వాళ్ళను ముందు ప్రాణాలతో వదలడు. కాదని అతన్ని ఎదిరిస్తే అతనికి ఆ క్షణాలే చివరి క్షణాలు అవుతాయి.
అందుకే శ్రీప్రియపట్ల ఆకర్షణ వున్నా తొందరపడి బయటపడలేకపోతున్నాడతను.
"ప్రియా....నీకు నేనంటే చాలా జోక్ గా వున్నట్టుంది. నువ్వు మాటి మాటికీ ఇలా ఫోన్ చేసి నన్ను బయటకు రప్పించాలని చూస్తే అది రాణా దృష్టికి వెళితే చాలా దారుణాలు జరిగిపోతాయి. అసలు నేనెవరిని? నువ్వెవరు? నన్ను మరచిపోవడం నీకే చాలా మంచిది...." ఆమె కళ్ళలోకిసూటిగా చూస్తూ అన్నాడతను.
"నెవ్వర్....ఏం జరిగినా సరే, ఆఖరికి నా ప్రాణాలే పోయినా మిమ్మల్ని మాత్రం ఒదులుకోలేను...." స్థిరంగా చెప్పిందామె.
"ఆల్ రైట్....నేను నిన్ను ప్రేమించే ప్రయత్నం చేస్తాను. కానీ నేను ఇక్కడకు వచ్చి నీతో కలిసి మాట్లాడుతున్నట్టు రాణాకు తెలిస్తే ఆ క్షణం నుంచి నీకు ప్రమాదాలు ఎదురవుతాయి. ఏ క్షణంలోనయినా నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తుంది. అయినా నన్ను ఇంకా ప్రేమించాలని అనిపిస్తుంటే నీ ఇష్టం...."
"ఆడదాని హృదయం ఒకరినే ప్రేమిస్తుంది. ఒకసారి తీసుకున్న నిర్ణయం పదే పదే మారిపోవడం జరగదు...." నిబ్బరంగా చెప్పింది శ్రీప్రియ.
"అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు?"
"తనను ప్రేమించే ప్రియురాలిని తన గుండెల్లో అపురూపంగా దాచుకోవాలనుకుంటాడు ఏ మగవాడయినా...." రెచ్చగొట్టే ధోరణిలో అన్నదామె.
"ఏమో, అవన్నీ నాకు తెలియవు" అందుకే నాకు దూరంగా ఉండమంటున్నాను.
"మైడియర్ చక్రీ....నేను మొండిదాన్ని. అనుకున్నది సాధించలేకపోతే చావడానికయినా వెనుకాడను. ఆఖరిసారిగా ఒక్కమాట చెబుతున్నాను విను. మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పందే నేను వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. నేను బ్రతికి వుండగా మీ మనసును ఎలాగూ మార్చుకోరు. కనీసం నేను పోయాకయినా నా శవాన్ని ఆఖరుసారి చూసి వెళ్ళండి" అంటూ అక్కణ్నుంచి విసురుగా కదిలింది శ్రీప్రియ.
ఆమె యిచ్చిన షాక్ నుంచి అతను తేరుకోనయినాలేదు....
శ్రీప్రియ నాలుగడుగులయినా వేసిందో లేదో ఒక్కసారిగా నలుగురు రౌడీలు ఆమెను చుట్టుముట్టారు.
భయంతో కెవ్వున అరిచిందామె....
ఇది చూసిన చక్రవర్తి ముందు వెనుకలు ఆలోచించకుండా వాళ్ళతో కలబడ్డాడు.
ఇక అతన్ని ఆపడం ఎవరి తరం కాదన్న విషయం తెలుసు ఆమెకు....
ప్రత్యర్ధులను ఎదుర్కోవడంలో నిమగ్నమయిన చక్రవర్తిని సమయము చూసి, తనను ఎవరో తరుముతున్నట్టు ఒక్క పరుగున వచ్చి వెనుకనుంచి చక్రవర్తిని తన చేతులతో చుట్టి బలంగా కౌగిలించుకున్నది శ్రీప్రియ.
అదే సమయంలో ఆ రౌడీ బృందంలో ఒక వ్యక్తి ఇనుపరాడ్ తో చక్రవర్తి తలమీద మోదాడు.
ఆమె పధకం ఫలించింది.
అంతే....
చక్రవర్తి స్పృహ తప్పిపోయాడు.
అంతవరకూ వీరవిహారం చేసిన రౌడీలు హఠాత్తుగా మౌనం వహించారు.
అదే రౌడీ బృందం సహాయంతో చక్రవర్తిని అతని జీప్ వెనుక సీట్లో పడుకోబెట్టి తను ఎక్కి కూర్చున్నది శ్రీప్రియ.
డ్రయివింగ్ సీట్లో ఉన్నవ్యక్తి ఆమెనుచూసి పలకరింపుగా నవ్వాడు.
గడచినా రోజు ఆమె డబ్బిచ్చి మాట్లాడిన వ్యక్తి అతను.
అర్ధగంట తరువాత శ్రీప్రియ ప్లాట్ ముందు ఆగింది జీప్.
అతని సహాయంతో చక్రవర్తిని రూమ్ లోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది.
రౌడీలు వెళ్ళిపోయారు.
తలపై ఇనపరాడ్ తో కొట్టడం వలన రక్తంకారి అతడి షర్టు కార్ ను తడిపింది. అదే పెద్దదెబ్బ అయినట్టయితే అతణ్ని ఆ అవసరం లేకపోయింది.
ఎంతటి కసాయి వాడినయినా మానసికంగా నిర్వీర్యుణ్ని చేయగల రక్తం అతని కాలర్ ను తడిపివుండడంతో కొంత ధైర్యాన్ని కోల్పోయినా తమాయించుకుని తనను ధైర్యపరుచుకుని తనకు తెలిసిన ప్రాధమిక వైద్యం చేసిందతనికి.
రక్తం తడిసి దెబ్బతాకినచోట ఆయింట్ మెంటు పూసి చుట్టూ కట్టేసింది.
అర్ధగంట తరువాత చక్రవర్తి స్పృహలోకి వచ్చాడు.
నిద్రపోతున్న పులి మేల్కొన్నట్టున్నది....
తనకు సపర్యలు చేస్తున్న శ్రీప్రియను చూడడంతో జరిగిందంతా క్షణాలమీద గుర్తుకొచ్చిందతనికి.
ఒక గూండా తన తలపై మోదడం....తాను వెంటనే స్పృహతప్పిపోవడం....!
"ప్రియా....నీకు....నీకేం కాలేదుకదా?"