శ్రీప్రియకు అతని అసహాయత బోధపడింది.
అతణ్ణి తొలి పరిచయంలోనే మార్చడం అసాధ్యంద్ అని ఆమెకు అర్ధమయింది.
"మిమ్మల్ని నేను ఈ విషయంలో బలవంతం చేయను....కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ముందూ వెనుకా ఎవ్వరూ లేని అనాధను నేను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ అంగీకారం కోసం, మీతో పంచుకునే జీవితం కోసం ఎంత కాలమయినా మీ కోసం ఎదురు చూసే ఈ అభాగ్యురాలు వుందన్నది మరచిపోకండి...."
ఆవేదనతో చెబుతున్న శ్రీప్రియ కంఠం పెగలడం లేదు....
చక్రవర్తికి అంతా అయోమయంగా వుంది....
ఏం మాట్లాడాలో తోచడం లేదతనికి.
"ఇక వెళతాను...." అన్నాడతను క్లుప్తంగా.
శ్రీప్రియ ముఖం అదోలా మారిపోయింది....
అతనికి కూడా ఏదోలా అనిపించినప్పటికీ మనసులు బలవంతంగా చంపుకుని బయటకు నడిచాడు చక్రవర్తి!
* * * *
జగపతి భవంతి విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోంది.
ఆ రోజు అలేఖ్య పుట్టినరోజు....
అదీగాక మరుసటి రోజునే ఆమె తిరిగి అమెరికా వెళుతుండటంతో రెండూ కలిసివస్తాయనే ఆలోచనతో ప్రత్యేకంగా ఫంక్షన్ ఏర్పాటు చేశాడు ఆమె తండ్రి.
వాళ్ళిద్దరివైపు అబ్బురంగా చూస్తున్న జగపతిని ఎవరో పిలవడంతో చిరాగ్గా తల తిప్పాడతను.
వచ్చిన పెద్దమనుషులను సాదరంగా ఆహ్వానించాడతను.
డిన్నర్ కార్యక్రమం మొదలయింది....
వచ్చిన కొద్దిసేపటికే జగపతి భార్య వసుమతితో చక్కని స్నేహాన్ని సంపాదించింది శ్రీప్రియ.
"ఒక్క పేరే కాదండీ....పిల్లకూడా లక్షణంగా వుంది....నాకే కనుక కొడుకు వుండి వున్నట్టయితే ఈ పిల్లను కోడలిగా చేసుకుని వుండేదాన్ని...."
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అన్నది వసుమతి.
ఆ మాటలకు జగపతి ఇబ్బందిగా ఫీలయ్యాడు.
శ్రీప్రియ ఫకాలున నవ్వింది అలేఖ్యతోపాటు....
"పోనీ ఒక పని చేస్తే...."
"ఏమిటమ్మా....అది?"
"అంకుల్ తో మాట్లాడి ఇప్పుడు ట్రై చేయండి ఆంటీ....కొడుకు కోసం...." అన్నది శ్రీప్రియ తన నవ్వుని రెట్టింపు చేస్తూ.
ఒక్కసారిగా ఆ హాలంతా నవ్వులమయం!
"ఏమో అనుకున్నాను....సమయస్పూర్తిగా జోక్స్ వేయగల వన్నమాట!" అన్నాడు జగపతి కల్పించుకుని.
"ఈమె సంగతి మీకు పూర్తిగా తెలియదు డాడీ....చూడడానికి అమాయకురాలిగా కనిపించినా ఎదుటివాళ్ళను తేలిగ్గా చిత్తుచేయగల తెలివితేటలు దీని బుర్రలో చాలా వున్నాయి. ఏ పని మొదలుపెట్టినా చాలా ముందునుంచే ఎంతో జాగ్రత్తగా స్టెప్స్ వేసి, అనుకున్నది సాధించడంలో నా స్నేహితురాలు ఎప్పుడూ నెంబర్ వన్"
"అబ్బ ఆపవే....నీ పొగడ్తలు....నువ్వు చెప్పిందంతా నిజమనుకుంటారు"
"ఏం కాదా ఏమిటి?"
"అమ్మాయి అలేఖ్యా....నీ స్నేహితురాలి టాలెంట్ ఏమిటో నాకు తెలియకుండానే జాబ్ ఇచ్చాననుకుంటున్నావా? నెవ్వర్ తొలిచూపులోనే ఆమె నన్ను ఆకట్టుకుంది. కాబట్టే వెంటనే ఉద్యోగంలో చేరమన్నాను"
అతనివైపు చురుగ్గా చూసింది శ్రీప్రియ.
నవ్వులతో, జోక్స్ తో....సరదాగా డిన్నర్ ముగిసింది.
అక్కడవున్న ఆ కొద్దిసేపూ జగపతి కనులు తన చుట్టూనే తిరుగుతుండటం గమనించినా గమనించనట్టే ఊరుకున్నది శ్రీప్రియ.
"ఇక వెళతానే...."
"అప్పుడేనా....రేపు ఉదయం వెళ్ళకూడదూ...."
"లేదే....నా పరిస్థితి అర్ధంచేసుకో....కొత్త ప్రదేశంలో నిద్రపట్టదు. అందుకే ఎంత రాత్రయినాసరే ఇంటికెళ్ళి పోతుంటాను"
"అలాగా....మరి రేపు పెళ్ళి అయితే ఏంజేస్తావే?"
"అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చులేవే....ఓకే గుడ్ నైట్" అని చెప్పి వేగంగా బయటకు వచ్చేసిందామె.
నడుస్తూనే టైమ్ చూసుకున్నది.
ఎనిమిదన్నర దాటింది.
ఏదో గుర్తువచ్చినదానిలా ఆటోను పిలిచి ఎక్కికూర్చుని ఒక హోటల్ పేరు చెప్పింది. పది నిమిషాలలో ఆ హోటల్ దగ్గర దిగింది శ్రీప్రియ.
బిల్ చెల్లించి లోపలకు నడిచి....ఒక టేబుల్ దగ్గర కూర్చుందామె
అప్పటికే అక్కడ కూర్చునివున్న వ్యక్తి ఆమెను చూసి చిరునవ్వుతో పలకరించాడు.
"ఎంతసేపయింది వచ్చి...."
"పావుగంటయింది మేడమ్...."
"సారీ! లేటయిందనుకుంటాను...."
"ఇట్స్ ఆల్ రైట్ మేడమ్....మన ప్రొఫెషనల్ లో ఇలాంటివి సహజమే....ఇప్పుడు చెప్పండి. నేనేం చేయాలో...."అన్నాడతను వినయంగా.
"నాకు మీ ఫోన్ నంబర్ ఇవ్వండి రేపు ఉదయం ఫోన్ చేసి చెబుతాను మీరు ఎక్కడకు రావాలో.....టైమ్ మాత్రం సాయంత్రం ఐదూ ఇరవై నిమిషాలు....ఏమాత్రం మరిచిపోకూడదు. అర్ధమయిందా?" సీరియస్ గా వుందామె గొంతు.