Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 18


    "రవి ప్రిన్సిపాల్ ని కూడా ఇన్ ఫుయెన్స్ చెయ్యగలడా? అంత అధికారం రవికెలా వచ్చింది?" అన్నాడు ఆశ్చర్యంగా చంద్రశేఖర్-ఈ ప్రశ్న కెవరూ సమాధానం చెప్పలేదు- అందరూ ఒకరిముఖాలొకరు చూసుకుని చంద్రశేఖర్ ని "ఇంత అమాయకుడివేమిటి?" అన్నట్లు చూసి నవ్వి ఊరుకున్నారు.
    ఆ రోజు చంద్రశేఖర్ మంజుని దగ్గిర కూచోబెట్టుకుని "మంజూ! మీ కాలేజీలో ప్రాక్టికల్ క్లాస్ కి ఎవరైనా లేట్ గా వస్తే ఏం చేస్తారు?" అన్నాడు-మంజు తెల్లబోతూ అసలెవరూ లేట్ గా రారు-" అంది.
    "ఒకవేళ వస్తే...."
    "లెక్చరర్ ఏమంటారోనని భయపడి వాళ్ళే క్లాస్ లోకి రారు...."
    "ఒకవేళ లెక్చరర్ క్లాసులోంచి వెళ్ళగొడితే...."
    "వెళ్ళిపోతారు. కానీ, పాపం, ఏడుస్తారు. సాధారణంగా మేడం ఎవరినీ అలా వెళ్ళగొట్టరు. అంత అల్లరి ఎవరూ చెయ్యరు."
    "అలా వెళ్ళగొడితే, మీరు ప్రిన్సిపాల్ కి రిపోర్టు చేస్తారా? రిపోర్టు చేస్తే ప్రిన్సిపాల్ లెక్చరర్ ని మందలిస్తారా?"
    మంజు గుండె బాదుకుని "ఏమిటి నాన్నా! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా దగ్గిర తప్పు పెట్టుకుని లెక్చరర్ మీద ప్రిన్సిపాల్ కి రిపోర్టు చేస్తామా? హమ్మ బాబోయ్! మమ్మల్ని బ్రతకనిస్తారా? అసలు మేము లెక్చరర్స్ మీద ఎప్పుడూ రిపోర్టు చెయ్యం....అహఁ! చేశాం__ఒక లెక్చరర్ ఎప్పుడూ క్లాస్ కి వచ్చేది కాదు. వచ్చినా పాఠం చెప్పేది కాదు. ఆ విషయం రిపోర్టు చేశాం. ఆ తరువాత ఏం జరిగిందో, మరి-ఆ లెక్చరర్ ఇప్పుడు టైంకి క్లాసుకొచ్చి సరిగ్గా పాఠాలు చెపుతోంది" అంది.
    చంద్రశేఖర్ తేలిగ్గా నిట్టూర్చాడు. కనీసం తన కూతురి చదువు సవ్యంగా సాగుతోంది. ఒకప్పుడు 'ఆడపిల్లలకు చదువెందుకూ?' అనుకుని వంశోద్ధారకులైన మొగ పిల్లలను మాత్రమే చదివించాలనుకునేవారు. ఈనాడు తారుమారైన పరిస్థితులలో మొగపిల్లల కంటె ఆడపిల్లలే కుదురుగా చదువుకుంటున్నారు. ఇంతటి అస్తవ్యస్తపు వాతావరణంలో సహితం ఆడపిల్లల కాలేజిలే, కొంత సవ్యంగా పని చేస్తున్నాయి.


                                                       9


    టైట్ స్కర్ట్ తో తన దగ్గిరకు వచ్చి "బావా!" అని పిలిచిన సరోజని అదొక రకంగా చూసి "నువ్వా! ఎవరో అనుకున్నాను" అన్నాడు కుమార్.
    అనూరాధ చాలా ఆధునిక భావాలుకల యువతి. నలభై దాటుతోన్నా ఆవిడే రోజుకొక రకంగా సింగారించు కుంటుంది. అంచేత కూతురు ఎలా అలంకరించుకున్నా, మందలించదు సరికదా, ప్రోత్సహిస్తుంది. అంచేత సరోజ ఒకరోజు టైట్ స్కర్ట్, ఒకరోజు బెల్ బోటమ్స్, మరొకరోజు మేక్సీ.... ఇలా రోజుకొక రకమయిన అత్యాధునిక అలంకరణలో ప్రత్యక్షమవుతుంది. సరోజ ఈ ధోరణి సుమతి కంత నచ్చదు. కానీ ఆ అమ్మాయి కేమని చెప్పగలదు? అసలే వదినకి తనంటే అంత పడదు. ఇలాటి మాటలంటే కలత లొస్తాయేమో! అదీగాక ఇలాంటి విషయాలు తల్లి నచ్చజెపితే బాగుంటుంది కాని, ఎంత దగ్గిర బంధువులయినా, మరొకరు చెబితే బాగుండదు.
    చీటికీ మాటికీ సరోజ ఏదో వంకన తమ ఇంటి కెందుకొస్తూందో, ఆ ఇంట్లో ఆ అమ్మాయిని అంతగా ఆకర్షిస్తున్నదెవరో అర్ధం చేసుకోలేని వెర్రిబాగులది కాదు సుమతి. తన వదిన స్వభావం తెలిసిన సుమతికి ఈ పరిచయం పెరగనియ్యటం ఇష్టం లేదు.... కానీ, "అత్తా!" అంటూ ఆప్యాయంగా తన దగ్గిరకు వచ్చే మేనకోడల్ని పొమ్మని ఎలా అనగలదూ? కల్లా, కపటం లేకుండా "బావా!" అంటూ కుమార్ చుట్టూ తిరిగే ఆ పసిపిల్లతో, "మొగవాళ్ళతో మాట్లాడకు!" అని ఎలా చెప్పగలదు? సరోజ, మంజు కూడా చాలా స్నేహంగా ఉంటారు. సరోజ హోమ్ సైన్స్ బి.యస్ సి. చదువుతోంది. అప్పుడప్పుడు వచ్చి తన ప్రయోగాలన్నీ సుమతి వంటింట్లో చేసేస్తానని సుమతిని భయపెడుతూ ఉంటుంది.
    సరోజ మనసు మంచిది. ఆ విషయం కుమార్ కీ తెలుసు. కానీ, సరోజ ఆధునిక వేషధారణ కుమార్ కీ ఇష్టం లేదు. కానీ, ఆ మాట అనలేక పోతున్నాడు. సంకోచం. ఆ అమ్మాయిని ఏమైనా అనగలిగే అధికారం తనకెక్కడిదనే ఆలోచన! వీటన్నిటినీ మించి దుందుడుకు స్వభావంకల సరోజ నోటి దుడుకుతనంతో ఏ సమాధానం చెపుతుందోనని భయం.... ఇవన్నీ కలిసి సరోజ ముందు ఏమీ మాట్లాడలేక పోతున్నాడు.
    అంతకు నాలుగైదు రోజుల క్రితంసుమతితో "అమ్మా! రేపు ఆదివారం మినపసున్ని చెయ్యవా? నాకిష్టం!...." అన్నాడు కుమార్. సుమతి దగ్గిర అలా గారాలు పోతూ అదీ-ఇదీ అడగటం కుమార్ ఇంత పెద్దయినా మానలేదు. మంజుకి తల్లి దగ్గిర కంటె తండ్రి దగ్గిరే చనువెక్కువ. తనకేం కావలసినా తండ్రినడుగుతుంది. "మంచి నెయ్యి లేకుండా మినపసున్ని బాగుండదు కుమార్! నెయ్యి కొంచెమే ఉంది. పై ఆదివారం చేసుకుందాంలే!" అంది సుమతి కొద్దిగా నొచ్చుకుంటున్నట్లు.

 Previous Page Next Page