ఒక విద్యార్ధి లేచి చంద్రశేఖర్ చేతిలో ఒక కాగితం పెట్టాడు.
"సార్!
మాలో కొందరు నాయకులుంటారు- వాళ్ళు ఏది చెపితే, మిగిలినవాళ్ళు అది వినవలసిందే! లేకపోతే బ్రతకనివ్వరు-సాధారణంగా కాపీలు కొట్టగలిగిన వాళ్ళూ; మొత్తం క్లాసంతటికీ, కాపీలు అందించగలిగినవాళ్ళూ నాయకులుగా ఉంటారు-వాళ్ళకు ఎదురు తిరిగి మేమెలా చెయ్యగలం? మాబోటి కొందరికి క్లాస్ లో పాఠాలు శ్రద్ధగా వినాలని ఉన్నా, వాళ్ళు విననివ్వరు-మేం ఏం చెయ్యాలో, మీరే చెప్పండి."
చంద్రశేఖర్ చీటీ చదువుతుండగానే "ఏమా ప్రణయలేఖ?" అని అరుపులు వినిపించాయి-చీటీ అందించిన విద్యార్ధికి అప్పుడే నుదుటిమీద చెమటలు పడుతున్నాయి-చంద్రశేఖరం ఆ చీటీ ముక్కలుగా చింపేసి "కబుర్లు చాలించి కథ చెప్పమంటున్నాడు" అన్నాడు. ఆ విద్యార్ధి నుదుటిమీద చెమటని రుమాలుతో తుడుచుకున్నాడు.
"అవును కథ-కథ-కథ" అని మళ్ళీ గోల ప్రారంభమయింది. చేసేది లేక చేతిలో పుస్తకాన్ని బల్లమీద పడేసి పుస్తకంలో పాఠాన్నే కథలా చెప్పి ఇవతల పడ్డాడు చంద్రశేఖర్__ఇలా ఎన్నాళ్ళు? తెలుగు కనుక, కనీసం ఏదో ఈ మాత్రంగానైనా కథలా చెప్ప గలిగాడు. మిగిలిన సబ్జెక్ట్స్? తెలుగు మాత్రం? ఎప్పుడూ కథల్లా చెప్పటానికి వీలవుతుందా? అర్ధాలు వ్రాసుకోమంటే వ్రాసుకోరు-గ్రామర్ అసలు వినిపించుకోరు! తెలుగంటే తాము పోట్లాటల్లో వాడుకునే అత్యద్భుత పదజాలమనే వాళ్ళ ఉద్దేశం! ఇంతోటి తెలుగుకే చదవటం కూడా దేనికని నిర్లక్ష్యం!
ఫిజిక్స్ లెక్చరర్ ప్రసాదరావు కొంత స్ట్రిక్ట్ గా ఉంటాడు__ ఒకరోజు ప్రాక్టికల్ క్లాస్ కి ఒక విద్యార్ధి చాలా ఆలస్యంగా వచ్చాడు. అప్పటికి ప్రసాదరావు ప్రాక్టికల్ ప్రొసీజర్ అంతా విద్యార్ధులకు వివరించటం అయిపోయింది. విద్యార్ధులు ప్రయోగం ప్రారంభించారు కూడా-ప్రసాదరావు చాలా కోపం తెచ్చుకుని "నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు-నిన్ను క్లాసులోకి రానివ్వను-వెళ్ళిపో!" అన్నాడు- ఆ విద్యార్ధి వెళ్ళిపోలేదు- "రవీ!" అని దీనంగా పిలిచాడు. ఆ పిలుపు వింటూనే రవి ఆర్తత్రాణ పరాయణుడిలా తలపై కెత్తి "సార్! గోపాల్ ని లోపలకు రానియ్యండి. ప్రాక్టికల్ క్లాస్ పోతే చాలా కష్టం-" అన్నాడు__ప్రసాదరావుకు మతిపోయినట్లయింది__ఒక విద్యార్ధి తనను ధిక్కరించి, ఎదురు తననే ఆజ్ఞాపిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు.
"నీ పని నువ్వు చూసుకో!" అన్నాడు కోపంగా.
రవి చొక్కాచేతులు పైకి లాగి "సార్! గోపాల్ ని లోపలకు రానియ్యండి." అన్నాడు.
"నువ్వు కూడా క్లాస్ లోంచి బయటకి పో!" అని అరిచాడు ప్రసాదరావు-రవి వెంటనే చేస్తున్న ప్రయోగం ఎక్కడి దక్కడ వదిలి లేబ్ బయటకు వచ్చేశాడు-రవి, గోపాల్ కలిసి వెళ్ళిపోయారు- ప్రసాదరావు ఇంకా తన దిగ్భ్రాంతిలోంచి తేరుకోక పూర్వమే వాళ్ళిద్దరూ ప్రిన్సిపాల్ తో కలిసి వచ్చారు లేబ్ లోకి. ప్రిన్సిపాల్ ని చూసి మర్యాదగా లేచి నిలబడ్డాడు ప్రసాదరావు.
"మిస్టర్ ప్రసాదరావ్! స్టూడెంట్స్ కొంచెం లేట్ గా వచ్చినంత మాత్రాన లేబ్ లోకి రానియ్యకపోతే ఎలాగ? ప్రాక్టికల్ క్లాస్ పోతే స్టూడెంట్స్ కి ఇబ్బందికాదూ?" అన్నాడు ప్రిన్సిపాల్.
స్టూడెంట్స్ ముందు __అందులోనూ తను మందలించి క్లాస్ లోంచి పంపేసిన స్టూడెంట్స్ ముందు-ప్రిన్సిపాల్ అలా మాట్లాడుతోంటే ఏం సమాధానం చెప్పాలో తోచలేదు ప్రసాదరావుకి.
"అతడు క్లాస్ కి చాలా ఆలస్యంగా వచ్చాడు సార్! అప్పటికి మిగిలిన వాళ్ళందరూ యెక్స్ పెరిమెంట్ చాలావరకు చేసేశారు.
"ఆలస్యంగా వస్తే చీవాట్లు పెట్టండి__క్లాస్ లోకి రానియ్యనంటే ఎలా? ఆలస్యంగా వస్తే అతడే ఆలస్యంగా పూర్తి చేసుకుంటాడు-రవీ! గోపాల్! లోపలకు వచ్చి యెక్స్ పెరిమెంట్ చేసుకోండి."
బూట్స్ టకటక లాడించుకొంటూ వెళ్ళిపోయాడు ప్రిన్సిపాల్- గర్వంగా నవ్వుకుంటూ లేబ్ లోకి వచ్చారు రవి, గోపాల్__ ప్రసాదరావుకి తల కొట్టేసినట్లయింది.
"ఆలస్యంగా వస్తే అతడే ఆలస్యంగా పూర్తి చేసుకుంటాడు-" ఎంత నిశ్చితంగా అంటున్నాడు ప్రిన్సిపాల్! అప్పటివరకూ తనూ ఉండద్దూ? లెక్చరర్లంటే, తన ఇంట్లో నవుకర్లనుకుంటున్నాడా? అదీగాక స్టూడెంట్స్ ముందే అలా నిరసించి మాట్లాడితే, ఇక స్టూడెంట్స్ కి లెక్చరర్లంటే ఏమాత్రమైనా గౌరవ మర్యాదలుంటాయా? ఆ క్షణంలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఆ కాలేజి నుంచి వెళ్ళిపోవాలని ఆరాటపడింది అతని మనసు-కానీ, అంతపని చెయ్యలేకపోయాడు- ఈ ఉద్యోగం సంపాదించటానికి అతడెంతో యాతన పడవలసి వచ్చింది. ఇది వదులుకుంటే మరో ఉద్యోగం అంత తేలిగ్గా దొరుకుతుందా? తన కుటుంబం ఏం కావాలి?
"ఛీ! ఇలాంటి కాలేజీలలో సిన్సియర్ గా పాఠాలు చెప్పాలనుకోవటం నాదే బుద్ధితక్కువ-" అని తనను తను తిట్టుకున్నాడు.
జరిగినదంతా స్టాఫ్ రూంలో అందరూ చర్చించుకున్నారు.
మూర్తి నవ్వి "నువ్వొక ఫూల్ వి-లేబ్ లో ఉండి ప్రాక్టికల్స్ చేయిస్తున్నావు-" అన్నాడు.
"అదే నన్ను నేను తిట్టుకుంటున్నాను-" కష్టంగా అన్నాడు ప్రసాదరావు.