నెలాఖరు రోజులని మరిచిపోయి అడిగినందుకు నాలుక కరచుకున్నాడు. తమ కుటుంబాలలో ఎప్పుడంటే అప్పుడు కావాలనుకున్నది అడగకూడదు.
"పోనీ అమ్మా! ఆ కాస్త నెయ్యితోనూ చేసెయ్యి. చేతి మీదకు నెయ్యి లేకపోయినా పరవాలేదులే!" అంది మంజు.
కుమార్ వెంటనే "వద్దు! వద్దు! ఇప్పుడయితే కొంచెమే వస్తాయి. పైవారం ఎక్కువ చేసుకోవచ్చు" అని అడ్డుకున్నాడు.
ఆ మాటలన్నీ విన్న సరోజ ఇన్ని సున్ని ఉండలు టిఫిన్ కేరియర్ లో తీసుకొచ్చింది. తీసుకొచ్చి సరాసరి కుమార్ కే ఇచ్చింది. ఆ అమ్మాయి దేనికీ భయపడదు.
సరోజ తనకోసం మినపసున్ని ఉండలు తేవటం ఎంత బాగుందో, ఆ అమ్మాయి కట్టుకున్న టైట్ స్కర్ట్ అంత ఘోరంగా ఉంది కుమార్ కి. అందుకే ధైర్యంచేసి "నువ్వా, ఎవరో అనుకున్నాను" అనేశాడు.
సరోజకి మండిపోయింది. తను ఎంతో అభిమానంగా మినపసున్ని ఉండలు పట్టుకొస్తే.... మెచ్చుకోవటానికి బదులు.... థాంక్స్ చెప్పటాని బదులు....తనను ఎత్తుకుని గాలిలో గిరగిర తిప్పటానికి బదులు.... వెక్కిరిస్తాడా!
"ఎవరో అనుకున్నావా! ఏం? నీ మరదలినని అనుకోలేకపోయావా? నీ మరదలంటే ఎలా ఉండాలి? చింకిచీర కట్టుకుని పేడ తట్ట నెత్తిన పెట్టుకుని కనిపించాలా?"
ఉద్రేకంతో రోషంగా అనేసి నాలుక కరచుకుని భయంగా కుమార్ ని చూసింది. కుమార్ ఏమీ కోపం తెచ్చుకోలేదు. చిరునవ్వుతో ఏం అలా ఉంటే? పాపం డబ్బులేక చింకి చీర కట్టుకున్నా ఆ చిరుగుల చీరతోనే నిండుగా తన శరీరాన్ని కప్పుకుంటుంది. నా మరదలని గర్వంగా చెప్పుకుంటాను." అన్నాడు.
సరోజ "యూ బ్రూట్...." అంటూ ముఖం ఎర్రబడగా ఆ మినపసున్ని డబ్బా తీసుకుని "నీకసలు మినపసున్ని తేకూడదు" అని కోపంగా వెళ్లిపోయింది.
"మంజూ! ఈ ఉండలన్నీ నువ్వే తినెయ్యి" అంది గట్టిగా.
మంజు నవ్వి "లాభం లేదు. నాకు అరగవు" అంది.
"అత్తా నువ్వు తినెయ్యి" అంది సుమతితో.
ఏదో పనిలోవున్న సుమతి ఏం జరిగిందో తెలుసుకోకుండానే "అక్కడ పెట్టు." అంది.
సరోజ రెండుక్షణాలు ఊరుకుని "నిజంగానే నువ్వు తినేస్తావా?" అంది.
"అన్నీ నేను తిననులే! మీ మావయ్యకి కూడా ఇస్తాను. ఆయనకీ చాలా ఇష్టం."
కొంచెంసేపు ఊరుకుని "అహ! నేను నీకియ్యను" అని ఆ డబ్బా పట్టుకుని మళ్ళీ కుమార్ దగ్గిరకొచ్చి గట్టిగా చప్పుడు చేస్తూ ఆ డబ్బా అతనిముందు పెట్టింది. కుమార్ ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకంలోకి తల దించుకున్నాడు.
"అదిగో మినపసున్ని...."
"చూశాను."
"నీకోసం తెచ్చాను...."
"ఎందుకూ?"
"నువ్వు నా బావవి కనుక...."
"నిజంగా?"
"నిజంగా....నిజంగా....నిజంగా....కావాలంటే ఎవరినైనా అడుగు."
కుమార్ నవ్వి "ఎవరినడగను? మీ అమ్మనా?" అన్నాడు.
"కాదు. బావలతో సరదాగా తిరిగే మరదళ్ళని. బావా! ఇప్పుడే చెపుతున్నాను. నువ్వు నాకేదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పు. అంతేకాని ఇలా వెటకారం చెయ్యకు."
తను తెచ్చిన మినపసున్ని బలవంతాన కుమార్ నోట్లో కూరి అతడు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా నవ్వుకుంటూ వెళ్లిపోయింది సరోజ.