"మామయ్య కీవేళ పేకాట లో లాభ మొచ్చిందట . నాకు పది రూపాయ లిచ్చాడు."
"ఎందుకు తీసుకున్నావు?"
"పోనీలే , అమ్మా! ... పీడగా వదలకుండా వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం, వాళ్ళ మీద కోపమెందుకు? ఎన్నాళ్ళ ని కొసకి మనకి పెట్టగలరు?....వాళ్ళేదన్నా విసుక్కుంటే నువ్వు కోపగించుకుంటుంటావు. మన మేదన్నా కొన్నాళ్ళు సహించాలమ్మా!" చెళ్ళున చరిచినట్టనిపించింది మధుమతి కి. "తన కొడుకు చెప్పేది సహించమనే! సహించక తానెం చెయ్యగలదు, బొంద! తనకన్నా వాసే బాగా అర్ధం చేసుకున్నాడులా ఉంది పరిస్థితుల్నీ , మనుషుల్నీను.' బరువుగా నిట్టూర్చి, "నాకెందుకు బాబూ, కోపం? కోపం వచ్చి నేనేం చెయ్యగలను! అతనిచ్చాడు, నువ్వు తీసుకున్నావు" అంది మధుమతి నిష్టూర స్వరంతో.
"నీకు పెద్ద మామయ్య మీద కోపముంది, నాకు తెలుసు. ఇక్కడ నేను చదివే రోజుల్లో ఎన్నిసార్లు మనకి డబ్బు ఇచ్చి అదుకున్నాడు! కాస్త దురుసుగా ఏదో అనేస్తాడు అంతే కాని...పోనీ, నీకు ఇష్టం కాకపొతే ఇచ్చేస్తాను....ఇచ్చిరానా?' లేచి నిలుచున్నాడు వాసు.
"బాగుంది, ఆ నిష్టూరం నాకా?... అమ్మమ్మ కిచ్చెయ్ నువ్వు వెళ్ళే రోజున. ఆమె కైతే కొడుకు సొమ్ము!" అంది మధుమతి.
"అలా చేస్తానమ్మా! మళ్ళీ మామయ్య కిచ్చేయ్యడం బాగుండదేమో!" అన్నాడు వాసు.
* * * *
ప్లాట్ ఫారం సందడిగా , గోలగా ఉంది. ట్రెయిన్ ఎక్కుతున్న వాసుతో - "బాబూ, జాగ్రత్త. అందర్నీ అడిగానని చెప్పు. ఉత్తరాలు వ్రాస్తుండు" అన్న మధుమతి గొంతు గాద్గదికమైంది. కనులు చెమ్మ గిల్లాయి.
'అలానే అమ్మా. నా గురించి బెంగపడకు" అంటూన్న వాసు హృదయం కలుక్కుమంది, ఆమె కన్నీరు చూసి. స్వచ్చమైన పాల పొంగు లా ఉన్న ఆమె ప్రేమకు తానర్హుడు కాడేమో! ఆమె నుంచి దాచుకుని అనుభవించే ప్రస్తుత జీవితం ఊహించి, పశ్చాత్తాప భారం, గత్యంతరం లేని తన నిస్సహాయతా తలుచుకుని బరువుగా తల వాల్చాడు వాసు.
"వాసూ, మళ్ళీ సెలవుల్లో తప్పకుండా వస్తావు కదూ?' మృదుమధురమైన జయ గొంతు. స్నేహపూర్వకంగా చెయ్యి ముందుకు చాచి వస్తాను, తప్పకుండా" అన్నాడు చిరునవ్వుతో వాసు.
అతని చెయ్యికి చెయ్యి కలిపి వదిలేస్తూ, "పద్మజ ని తీసుకురా ఈసారి వచ్చేటప్పుడు. బాబయ్య నోసారి రమ్మను....' అంది జయ.
కదలబోతున్న ట్రెయిన్ లోంచి గలగలా నవ్వుతూ, "అత్తయ్యనీ, శీనునీ రావద్దని చెప్పనా?" అన్నాడు వాసు.
"క్లాసు తెచ్చుకోవాల్రోయ్...." మూలిగి మూలిగి పరుగు లంకించబోయే ట్రెయిన్ శబ్దం లో కలిసి పోతూ వినిపించింది రాజశేఖరం గొంతు. విన్న వాసు చివాల్న అటు చూశాడు నవ్వుతూ. తాను ఉన్న పెట్టె దగ్గరకు పరుగు లాటి నడకతో వస్తూన్న రాజశేఖరం.
"ఆగిపో . పరుగెత్తకు. ప్రయత్నిస్తాను క్లాసు తెచ్చుకోడానికి" అన్నాడు వాసు అదే నవ్వుతో.
"ఏమన్నా ఇబ్బందయితే డబ్బుకి వ్రాయి-- "గట్టిగా అంటూన్న రాజశేఖరం వైపు కొంచెం ఆశ్చర్యంగా చూశాడు వాసు. ట్రెయిన్ స్పీడు హెచ్చింది. ప్లాట్ ఫారం మీది మనుషులు క్రమంగా దూరమై బొమ్మల్లా కనుపిస్తున్నారు. "క్లాసు తెచ్చుకోవాల్రోయ్.
ఇబ్బందైతే డబ్బుకి వ్రాయి...." రాజశేఖరం ఈవేళ మాటకి నవ్వుకున్నాడు వాసు. అతని మనస్సు గతంలోకి చూసింది. "వాసుకి కాలేజీ లో సీటు ఉందేమో కనుక్కో!" జానికమ్మ మాటకి రుసరుస లాడుతూ , "ఇహ చాల్లే. ఎవడన్నా షావుకారికి చెపుతాను. అకౌంట్లు వ్రాశాడంటే అరవయ్యో, డెబ్బయ్యో ఇస్తారు. వాళ్ళమ్మ కి సాయంగా ఉంటాడు." రాజశేఖరం ఆనాటి సలహా. "వెధవ సలహా. బోడి సలహా! ఇదా నువ్వు చెప్పేది! సిగ్గన్నా వేసింది కాదు. వాళ్ళ తాత ఈ ఊళ్ళో తహసీల్దారు చేశారు!' జానికమ్మ మండిపడింది. "తాత తాహసీల్దారయితే అతని అల్లుడు బస్సు కండక్టరు కాలే. వీడు కోమటి గుమస్తా అయితే తప్పేముంది?" తల్లి మాటకి అసహనంగా, కసిగా సమాధానం చెప్పాడ రాజశేఖరం. "నిండా పదహారేళ్ళు లేవు. వాడి ఖర్మ ఉద్యోగమా!..... మరొక్క క్లాసు చదివిస్తే బాగుంటుందని అడిగాను. వాళ్ళ తాత బ్రతికుంటే..." ఆమె గొంతు పూడిపోయింది. "నీ చాదస్తం కాని, కండక్టరు కొడుకు కలెక్టర్ అవుతాడా!" నవ్వాడు రాజశేఖరం. అదే మాట ఆ రోజు నాలుగైదు సార్లు అని గలగలా ఈర్ష్యా, అసూయా, హేళన, ఎన్నో భావాలు ధ్వనించగా నవ్వాడు రాజశేఖరం. ఆరోజు తనని ధైర్యంగా చదువు కోమన్నవారే కనిపించలేదు. 'ఈవేళ క్లాసు తెచ్చుకోవాలట. అవసరమైతే డబ్బు సాయం చేస్తాడుట....' ఆనాడు హేళన చేసిన రాజశేఖరం 'తన జీవితం సాధారణమైనది కాదు, పదునైన కత్తుల మీది ప్రయాణం. కాలు తెగకుండా నడవాలి. చదువుకోవాలంటే చాలా గుట్టుగా వ్యవహరించాలి! భగవాన్, నాకేమిటీ పరీక్షలు?' గట్టిగా కళ్ళు మూసుకున్నాడు వాసు.
"అమ్మా వాళ్ళూ బాగున్నారు కదూ? మొహం కడిగేసుకో, కాఫీ తెస్తాను." ఆప్యాయంగా పలకరించింది లక్ష్మీ. అతని హోల్డాలతని గదిలో పెట్టిస్తూ.
"ఆ బాగున్నారు . వాళ్ళంతా మిమ్మల్నందరినీ అడిగినట్లు చెప్పమన్నారు" అన్నాడు నవ్వుతూ.
"నిన్న సాయంత్రానికి వస్తావను కున్నాను. సరిగ్గా కాలేజీ టైముకి వచ్చావు. "మెరిసే కళ్ళతో అతని వైపు చూస్తూ అంది పద్మజ.
'అలాగే అనుకున్నాను. అక్కడి వాళ్ళు రానిస్తేగా!" అంటూ బాత్ రూం వైపు నడిచాడు వాసు.
ఆరోజు రాత్రి ఏకాంతంగా డాబా పైకి తీసుకు వెళ్ళి వాసుతో అరగంట మాట్లాడాడు గోపాల్రావు. తరువాత తృప్తిగా నిట్టూర్చి, "ఊ . పోయి పడుకో" అంటూ వాసు భుజం తట్టాడు నవ్వుకుంటూ.
ఉదయం పెరట్లో మందార పూలు కొస్తుంది పద్మజ. బ్రెష్ నోట్లో పెట్టుకుని పెరట్లోకి వెళ్ళిన వాసు ఏదో గుర్తు వచ్చినట్టు "పద్మజా!" అని పిలిచాడు. ఆమె వైపు చిలిపిగా చూస్తూ, "చాలా తొందరగా లేచేవే ఈ వేళ.... పాపం, సెలవుల్లో అలవాటై ఉంటుంది వార్తలయ్యాక లేవడం..... తెలుగా? ఇంగ్లీషా? విజయవాడ స్టేషనా? లేక హైదరాబాదా!.... అసలింతకీ ఇప్పుడు టైమెంతయి నట్టూ" అని వచ్చే నవ్వు పెదవుల్లో బిగించి అడిగాడు వాసు.
అతని ప్రశ్నలకి వీణ మీటినట్టు నవ్వుతూ, "మన రేడియో లో ....విజయవాడ స్టేషన్ లో ....ఉదయం న్యూస్ వినబడి చస్తేగా! హైదరాబాద్ తెలుగు న్యూస్ అయిపొయింది. ఎందుకు పిలిచావ్?" అంది పద్మజ.
"ఈసారి సెలవుల్లో నిన్ను తీసుకు రమ్మంది జయ. నీ గురించి చాలా అడిగింది..."
"నేనడిగినట్టు చెప్పావా?"
"చెప్పాను.... జయ ఎంత బాగా పాడుతుందనుకున్నావ్! వీణ చెప్పిస్తున్నారట."
ఒక్క క్షణం మౌనం తరవాత -- "ఇన్ని రోజులూ నీకు అక్కడే....కాదు, వచ్చెయ్యాలని పించలేదా?' అని, తల వాల్చి సజ్జలో ఉన్న ఎర్రటి పూల వైపు చూస్తూ అంది పద్మజ.
"నేను పుట్టిన పెరిగిన ఊరేగా! అక్కడ ఎన్ని రోజులన్నా ఉండగలను. వచ్చెయ్యాలని పించక పోయినా చచ్చినట్టు వచ్చి తీరవలసిందే -- కాలేజీ తెరిచేసరికి."
అతని మాటలెం ఆమెకు తృప్తి అనిపించలేదు. గబగబా ఇంట్లోకి నడిచింది పద్మజ.
రోజులూ, నెలలూ గబగబా దొర్లిపోతున్నాయి. వాసు కాలేజీ , తన పాఠాలు తప్ప మిగతా ప్రపంచమే మరిచినట్టు ప్రవర్తిస్తున్నాడు.
పదమూడు సంవత్సరాలు నిండిన పద్మజ హృదయంలో ఏదో చెరగని బలమైన ముద్ర వేసుకుంటున్నాడు వాసు.
పరీక్ష లైపోయాయి. పెట్టె బట్టలూ సర్దుకుంటున్నాడు వాసు. 'అత్తయ్య నోసారి రమ్మని వ్రాస్తే పోలే? నువ్వెందుకు వెళ్ళిపోవడం ?" నెమ్మదిగా అంది పద్మజ అతని సమీపానికి వస్తూ.
"అక్కడికి నే వెళితే అమ్మమ్మా, అమ్మా, మిగతా వారందర్నీ చూస్తాను.' అంటూ సూట్ కేస్ కు టక్కున కప్పు నొక్కాడు.
"నాన్నగారితో చెబుతా నుండు" అంటూ వెళ్ళబోతున్న పద్మజ, "పద్మజా!" అని వాసు పిలవడంతో వెనుదిరిగి చూసింది.
"ఏమని చెపుతావ్?' నవ్వుతూ అడిగాడు.
"అత్తయ్య నిక్కడికే పిలవమని."
"వద్దు....ఛ, ఛ! అలా నువ్వు చెప్పకూడదు."
"ఏం? ఎందుకు చెప్పకూడదు?"
ఒక్కసారి పద్మజ వైపు ఇబ్బందిగా చూసి, "నువ్వలా చెప్పడం, అమ్మని మామ్మయ్య పిలవడం నాకు ఇష్టం కాదు" అన్నాడు.
"సరే" అంటూ గడప దాతబోతున్న పద్మజ పక్క నుంచి వచ్చిన గోపాల్రావు, "ప్రయాణం కడుతూన్నట్టుందే! అక్కయ్యా, మా అమ్మా ఇక్కడికే వస్తున్నారుగా రేపు సాయంత్రం? చూడు, ఇదిగో, లేటరోచ్చింది" అంటూ పోస్టు కార్డు వాసు కిచ్చాడు.
గబగబా చదివిన వాసు --' నువ్వు రమ్మని వ్రాశావా?' అన్నాడు.
"చాలా రోజులుగా వ్రాస్తున్నాను-- ఓసారి వచ్చి వెళ్ళమని."
"ఎన్ని రోజులు ఉంటారు అమ్మా వాళ్ళూ?' అడిగాడు వాసు.
"ఓహ్.,..! నాన్న దగ్గిరి కెళ్ళడానికా?" అనబోయి, పద్మజను చూసి కదలబోయే పెదవులు బిగించి , ఊ, బాగుంది . నాకేం తెలుసు! వాళ్ళిష్టమొచ్చినన్ని రోజులు" ఆన్నాడు గోపాల్రావు.
"ఇప్పుడెం చేస్తావు?" అన్నట్టు వాసు వైపు చూసింది పద్మజ.
చిరాగ్గా పద్మజ వైపు చూశాడు వాసు.
* * * *