Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 19

                                 

 

    డాబా పై పిండార బోసినట్టున్న వెన్నెల, మధుమతి పక్కలో పడుకుని నవ్వుతూ ఏవో కబుర్లు చెప్పే పద్మజ, ఆమె ముంగురులు సవరించి ఆ చేత్తోనే దగ్గరగా తీసుకుని తృప్తిగా నవ్వుకుంటున్న మధుమతి. డాబా పైకి అప్పుడే వచ్చిన వాసుకి అదృశ్యం, ఆశ్చర్యంగా, నమ్మరానిది గా, అనిపించి-- "అమ్మా! పద్మజ.... పద్మజ....నీకెలా తెలుసు?" అన్నాడు అనాలోచితంగా!
    "నీ మొహం! ఏమిటా ప్రశ్న? ...రా, ఇలా కూర్చో....నా తమ్ముడు కూతురు ....పరిచయం స్నేహం అక్కర్లేదు. మా మధ్య ప్రేమాభిమానాలు వాటంతటవె , సహజంగా ఉంటాయి." అంది మధుమతి, పసివాడి మాటలకు నవ్వినట్టు నవ్వుతూ!
    "నీకెలా తెలుసు?..... అంటే అర్ధమేమిటి, వాసూ?" కిలకిలా నవ్వింది పద్మజ.
    అతనికి రోష మొచ్చింది . "వట్టి వాజమ్మ నన్నట్టు ఇద్దరూ ఒకేలా అంటున్నారు . జయ అంటే అమ్మకి బాగా తెలుసు...నువ్వు నడక నేర్చిన కొత్తలో చూసిందేమో నిన్ను.... ఇంత ఇదిగా ఆమె పక్కలో దూరి ఒకటే కబుర్లు చెప్పెస్తున్నావు మహా తెలిసినట్టు" అన్నాడు వాసు కందిన మొహంతో పద్మజ వైపు చురుగ్గా చూస్తూ.
    "జయా, నేనూ ఒకటే కదూ, అత్తయ్యా, నీకూ?' అంది పద్మజ.
    "వాడి మాటల కేమిటి? నాకూ అందరూ ఒకటే నమ్మా! వాసూ, ఎందుకురా కోపం?....కూర్చో.... జయ గలగలా పారే సెలయేరు లాటిది. పెంకిది. పద్మజ నిండుగా ప్రవహించే గంగానది లాంటిది. నేనంటే ఊరికే జాలిపడి పోతున్నావు కదమ్మా నువ్వు" అంటూ పద్మజ మొహం తన వైపు తిప్పుకుని గుండ్రని అందమైన పద్మజ కళ్ళలోకి చూసింది మధుమతి.
    "నువ్వంటే నాకు చాలా ఇష్టం, అత్తయ్యా. నువ్వు చాలా మంచిదానవు. మా దగ్గర ఉండిపోరాదూ?" అంది పద్మజ, మధుమతి భుజం పట్టి కుదుపుతూ.
    అక్కడ ఉండాలంటే ఇష్టం కాని వాసు గబగబా డాబా మెట్లు దిగి పోయాడు.
    వారం రోజుల తరవాత వెళుతూ , "నీ ఋణం మెలా గన్నా తీర్చుకుంటా తమ్ముడూ.... వాసుని...." అంటూ ఆగిపోయింది . మధుమతి, దుఃఖంతో గొంతు పూడి పోవడంతో.
    "మన మధ్య రుణాలేమిటి? చాదస్తం మాటలు! వాడు నాకు బరువేమిటి? మరో పిల్ల నాకుంటే పోషించుకోనూ! వదిలేస్తానా?' అన్నాడు మందలింపుగా గోపాల్రావు.

                              
    "చిన్నతనం. ఏదన్నా పొరపాట్లున్నా గడుపుకోవాలి, లక్ష్మీ." అంది మరదల్ని బ్రతిమాలె ధోరణి లో అనునయంగా!    
    "మీ అబ్బాయి పొరపాట్లు చేస్తాడా? భలేవారే మీరు" వదినా, మీరింకా పసివాడనుకుంటున్నారు వాసుని.  అంటున్నలక్ష్మీ వైపు తెల్లబోయి చూస్తున్న మధుమతి వైపు చూసిన లక్ష్మీ , "అహహ , మరోలా అర్ధం చేసుకోకండి నా మాటలు. చాలా తెలివైన మంచి కుర్రాడు , వదినా, వాసు. మీరదృష్టవంతులు....అతను మెల్లిగా పైకి రావాలి" అంది .
    బరువుగా నిట్టూర్చింది మధుమతి.
    "గోపాలం.....ఎలాగా చేరదీశావు! నాలుగు క్లాసులు చదివించావంటే తల్లీ కొడుకూ వాళ్ళ మానాన వాళ్ళు బ్రతుకుతారు." అంది జానికమ్మ కొడుకు వైపు అభిమానంగా చూస్తూ.
    "అలాగేలే, అమ్మా! వాణ్ణి చదివించడమేం కష్టం కాదు నాకు." నవ్వేశాడు గోపాల్రావు.

                                             *    *    *    *
    పి.యు.సి ఫస్టు క్లాసులో పాసైన వాసుకి వాచీ కొన్నాడు ప్రసాదరావు.
    "నా కెందుకు , నాన్నా?....ఇదెక్కడిదని అమ్మ అడిగితె యేమని చెప్పాలి?' అని రెండు క్షణాల తరువాత చిన్నగా నవ్వుతూ, "మా నాన్న కొన్నాడమ్మా !" అని చెప్పనా?' అన్నాడు వాసు.
    "నీ వయస్సూ వాళ్ళు చేతికి స్వేర్ వాచ్, రంగురంగుల ఒహటి, పెట్టుకుంటున్నారు. అటువంటి చేతులు నాకు అందంగా ముచ్చటగా కనుపిస్తున్నాయి. నీ చెయ్యి కూడా అలా చూడాలనిపించి కొన్నాను--" ఏదో ఇబ్బందిగా వచ్చాయా మాటలు.
    వాసు మొహం ఉదాసీనంగా మారిపోయింది. "అందరి లాటి అదృష్టవంతుడా తాను? ఇటువంటి కానుకలు తనకు హృదయ పూర్వకమైన ప్రేమానురాగాలతో ఇస్తూ ఆ షరతు లేమిటి? ఇతరుల కేమని చెప్పాలో తానె సూచించరాదూ? అమ్మా, జయా, పద్మజా అందరూ అడుగుతారు. పెద్ద అబద్దం వెదికి చెప్పాలి. చిన్నగా కోపం వచ్చిన వాసు- "అందరి లాటి వాణ్ణి నేనెలా అవుతాను?" అన్నాడు టక్కున.
    చెళ్ళున చరిచినట్టయిందా మాట ప్రసాదరావుకు. కనుబొమలు చిట్లించి వాసు వైపు సూటిగా చూస్తూ, "అంటే?" అన్నాడు.
    "మొన్న బట్టలు అవీ చూసిన అమ్మ నన్ను అనుమానించి బాధపడిపోయింది , నాన్నా!... అంటూ తానా ఊరు వెళ్ళినది మొదలు, తనకీ, తల్లికీ జరిగిన వాగ్వాదమంతా జరిగినది జరిగినట్టు చెప్పాడు వాసు.
    కొన్ని క్షణాలు మౌనం తరువాత బరువుగా నిట్టూర్చి, "అబద్దం చెప్పడానికి నువ్వెంత బాధపడుతున్నావో, నీచేత అబద్దాలు చెప్పించవలసి వచ్చినందుకు నేను వెయ్యి రెట్లు బాధపడుతున్నాను. కాని, వాసూ! నేను అనుకున్న నీ చదువు పూర్తయ్యే దాకా బయటికి నా విషయం తెలియడానికి వీల్లేదు. గోపాలం వ్యక్తిత్వం నాకు తెలుసు. అతను చెప్పడు. నాకు తెలిసిన మీ అమ్మ చాలా మొండి మనిషి. మీ అమ్మలో నేను చూసినవి గర్వం, నిర్లక్ష్యం. ఆమెలో ఆణువణువూనా గోచరమయ్యే అహం-- మీ అమ్మ నాకు పూర్తిగా తెలుసు.... ఆమె స్వభావం కాలాను కనుగుణంగా మారదు. ఆమె మార్చుకోదు." అన్నాడు. అతని గొంతులో కసి, ద్వేషం, బాధ, మొండి క్షణా మాగాడు వెలికి వచ్చే ఆ భావాల్ని అణుచుకునే ప్రయత్నం లో , దీర్ఘంగా నిట్టూర్చి నెమ్మదిగా అన్నాడు. "ఈ నిజాన్ని ఏనాడైనా నా ద్వారానే , నా నోటి మీదగానే వినాలి మీ అమ్మ. ఆమెకు నేనే చెప్పాలి. అందుకనువైన పరిణామం, అరోజూ రావాలి. మా జీవితాలేలా మాసిపోయినా పోనీ....కాని...నువ్వు నీ జీవితం మూడు పువ్వులూ, ఆరు కాయలుగా శోభించి పూల బాటపై పరచుకోవాలి. అందుకు అవసరమైనమేమైనా నేను చేస్తాను---అందరి లాటి తండ్రీ కొడుకులం మనమెలా అవుతాం? నీ ఆటపాటలు, నీ పసితనంలోని మధురమైన తియ్యని అనుభూతులు తండ్రిగా నీ నుంచి అనుభావించావా నేను? జారిపోయిన కాలం తిరిగి చేతికి రాదు. కాని చేతికి వచ్చిన కాలాన్ని మాత్రం వదులుకోలేను.... నేను కొన్న బట్టలు నువ్వు వేసుకోవాలి. ఈ వాచీచేతికి పెట్టుకో. సాయంత్రం షాపులో మంచి రింగోకటి కొని నీ వెలికి పెట్టాలి..... నేనేమిచ్చినా కాదని సాకులు చెప్పకు..... అందరి మధ్యా ఉన్న మీ అమ్మ  బాధించే ఎటొచ్చి కొన్ని క్షణాలన్నా మరవగలదు.....  నాకేవరున్నారు? నేనేం అనుభవించాలి ?" ఎంత అపుకుందామనుకున్నా ఆగని ఆవేశంతో , బాధతో అనేశాడు ప్రసాదరావు.
    "మీకు కోపం వచ్చేసినట్టుంది . మీ ఇష్టం అలానే చెయ్యండి. నాన్నా!... మంచి బట్టలు, వాచీ, ఉంగరం నాకు మాత్రం సరదా కాదేమిటి?" అని వాచీ చేతికి పెట్టి బెల్టు బిగించుకుంటూ "మీరన్ని  మాటలేవో అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు" అన్నాడు చిన్నబోయిన వదనంతో ప్రసాదరావు వైపు చూస్తూ.
    "అబ్బే, నిన్నేమీ అనలేదు, నాన్నా!...ఒక్కోసారి ఏమిటో ఇలా మాట్లాడేస్తూ ఉంటాను..... ఆ కాలేజీ లో సీటుకి అప్లై చేశావు కదూ? వచ్చి అధమం పది రోజులన్నా ఉంటా వనుకున్నాను. వెళ్ళి ఓసారి మీ అమ్మకు కూడా కనుపించు. మళ్ళీ ఎన్నాళ్ళకో! ఎదురుచూసి వాచిపోతాం మేము. కాలేజీ, పాఠాలూ, గొడవల్లో పడిపోతావు. ఉత్తరమే కరువై పోతుంది." అంటూ కళా విహీనమై ఏదో బాధ పడుతున్నట్టున్న వాసు మొహంలోకి చూసి, "సినిమాకి పోదామా?' అన్నాడు ప్రసాదరావు.
    "ఊ, పదండి...." అన్నాడు వాసు. డ్రెస్ మార్చుకుంటూ. ఏదన్నా రిలీఫ్ క్వాలిద్దరికీ కూడా!
    ఒకరి పక్కన ఒకరు నడుస్తున్నారు మౌనంగా ఇద్దరి మనసులూ బరువుగా ఉన్నాయి.
    "లేత మనుసులు" పిక్చర్ చాలా బాగుందిట. వెళదామా, నాన్నా?"
    త్రుళ్ళిపడ్డట్టు చూశాడు ప్రసాదరావు వాసు వైపు. ఏమీ చెప్పలేని ఆందోళనతో నడక వేగం హెచ్చించాడు.
    కొన్ని క్షణాల నిశ్శబ్దం తరవాత, "స్టోరీ నాకు తెలియదు కాని మా ఫ్రెండోకడు చెప్పాడు. ఇప్పుడు క్రొత్తగా రిలీజ్ అయిన వాట్లో అదే బాగుందని." అని ఏమంటారన్నట్టూ ప్రసాదరావు వైపు చూశాడు వాసు.
    "సరే, పద." మరొక రోడ్డుకు మళ్లాడు ప్రసాదరావు , అనుసరించాడు వాసు.
    కుతుహలంగా తెర వైపు చూస్తున్నాడు వాసు. 'కోడి ఒక కొనలో, పుంజు ఒక కొనలో" జాలిగా పాడుతుందమ్మాయి. హాలంతా నిశ్శబ్దంగా ఉంది. అప్రయత్నంగా పక్క చెయిర్ వైపు చూశాడు వాసు. ప్రసాదరావు సీటు ఖాళీగా ఉంది. చప్పున వాసు కళ్ళు చెమ్మగిల్లాయి. రుమాలుతో గబగబా మొహం తుడుచుకున్నాడు.

 Previous Page Next Page