Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 17

 

    "చాలా థాంక్స్ అమ్మా! నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ఆశీర్వాదం ఉంటె.... అమ్మా.... నీ వాసు బాబు కలెక్టరై పోతాడు!' తేలిగ్గా హాయిగా గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు వాసు. ఈ సమస్యే ఇంత తేలిగ్గా పరిష్కారమౌతుందని ఊహించని వాసు మనస్సు నిండుగా తృప్తి తో మైమరిచి నిద్రపోయాడు. ఆ నిద్రలో అతను కాలేజీ, చదువూ, పరీక్షా ఫలితాలలో తాను ఫస్టు క్లాసులో పాసైనట్టూ , తన నందరూ అభినందించినట్టూ కమ్మని కలలు కన్నాడు.

                             *    *    *    *
    జయ తెల్లావారుజామున సంగీత సాధన చేస్తుంది. కొంత కలలా విన్న వాసు కళ్ళు నులిమి మేల్కొంటూ "అబ్బా, జయ గొంతు ఎంత బాగుంది! ఎంత బాగా పాడుతుంది!' అనుకొంటూ మెల్లగా లేచి డాబా మెట్లేక్కాడు , ఆ పాట వినవచ్చిన వైపు నడుస్తూ.
    అరమోడ్పు కన్నులతో, చెరిగి ఎగిరే ముంగురులతో పరికిణీ, జాకేట్టూ , తానూ అంతా తెల్లగా అపర సరస్వతి లా వీణ మీటుతూ శ్రావ్యమైన గొంతుతో పాడుతూ ఆ పాటలో లీనమై పోయిన జయ కెదురుగా మడిగాళ్ళు వేసి చెక్కిట చెయ్యి ఆన్చి రెప్ప వాల్చకుండా ఆ పిల్ల వైపు చూస్తూ కూర్చున్నాడు వాసు. చటుక్కున అతని వైపు చూసిన ఆ అమ్మాయి గులాబి పెదవులు చిన్నగా నవ్వాయి పలకరింపుగా. 'జయ ఎంత బాగుంటుంది!" అనుకున్నాడు వాసు.
    ప్రశాంత సమయం. తెల్లని వెన్నెల. మధురమైన గానం. మైమరిచి తన్మయతతో ఆ గానాన్ని ఆస్వాదిస్తున్నాడు వాసు.
    ఎప్పుడు వెలుగు రేఖలు ప్రకృతి లో ప్రవేశించాయో ఏరగనీ గాయనీ, శ్రోతా-- "వాసూ, హమ్మయ్య! ఇక్కడున్నావా? గుండె లెండి పోయాయి రా" - అంది మధుమతి, వారిని మేల్కొలుపుతున్నట్టు పెద్ద గొంతుతో.
    వీణ దిగువున ఉంచుతూ, "ఎందుకత్తయ్యా గుండె లెండిపోవడం? ఇల్లొదిలి పారిపోయాడనుకున్నావా?" అని కిలకిలా నవ్వింది జయ.
    "ఏమోనే! నా మనస్సన్నీ పెడదారులే చూపి భయపెడుతుంది. నా నీడకి నేను జడుసుకుంటుంటాను. నీకు పాటంటే అంత ఇష్టం రా, వాసూ!" నవ్వుతూ అడిగింది మధుమతి.
    "జయ చాలా బాగా పాడుతుందమ్మా! ఇలా పాడగలదని నే ననుకోలేదు. ఇంకా కృషి చేస్తే..... సినిమాల్లో.... రేడియో లో ...రికార్డు కివ్వచ్చు" అన్నాడు వాసు మెచ్చుకుంటూ.
    ఆ ఇద్దరి వైపు ఓసారి గర్వంగాచూసింది జయ.

                           *    *    *    *
    సాయంత్రం సన్నని సూర్య కిరణాలు ఏటవాలుగా ప్రకృతి పై పరుచుకుని వింత అందాన్ని సృష్టిస్తున్నాయి. పెరట్లో మామిడి చెట్టు నీడన బండరాయి మీద కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారిద్దరు. ఆవేళ విజయదశమి. బ్లూ కలర్ టెర్రీ కాట్ బట్టల్లో పచ్చగా అందంగా ఉండే వాసు అందం ద్విగుణీకృతమైంది. బెంగుళూరు సిల్కు జరీ బోర్డరు పరికిణీ అదే కలర్ గులాబీ జాకెట్టూ, నల్లని పొడుగాటి జడా! అతని అందాన్ని సవాల్ చేస్తూన్నట్టుంది జయ. మనమలిద్దర్నీ నూతి చపటా పై నిలుచుని ముక్కు మీద వేలేసుకు ఆశ్చర్యంగా , తృప్తిగా చూస్తూ, "మీరిద్దరూ నా మనుమలేనుట్రా! చిలకల్లా, గోరు వంకల్లా! ముద్దెట్టుకోనా ఓ సారి, జయా!" అంది వారి వైపు నడుస్తూ జానికమ్మ.
    "మేము మీ మనమలం కామండోయ్ , జానికమ్మగారూ!" చప్పట్లు చరిచి కిలకిలా నవ్వింది జయ. "తాను కాదేమో! నేను మాత్రం నీ కూతురి కొడుకుని. నీ మనమడ్ని. రా, ముద్దెట్టుకో. "దగ్గరగా వచ్చి బుగ్గ చూపెట్టాడు వాసు. అతని బుగ్గలు మృదువుగా పుణికి , "నా బాబు" అని ఆ చేతులు ముద్దెట్టుకొని, "చూడు, రాలుగాయి పిల్ల ఎలా పరుగెత్తిందో దూరంగా. ఒసేవ్! నీ పరికిణీ చూపించే. కొత్త బట్టలేసుకు నాకు దణ్ణం పెట్టావా?" అని పిలిచింది జానికమ్మ.
    "ముద్దు పెట్టుకోనిస్తాను. దణ్ణం పెడతాను. ఏమిస్తావు? ఒక్క పది రూపాయలిస్తావా?' జానికమ్మ దగ్గరికి వస్తూ అంది జయ కొంటెగా.
    "నే ఇస్తాలే." టక్కున అన్నాడు వాసు.
    "చ. ఫో...." సిగ్గుపడింది జయ వాసు వైపదోలా చూస్తూ.
    పరికిణీ కుచ్చేళ్ళు చేత్తో పట్టి బట్ట మెత్తదనం, బోర్దరూ అందం చూస్తూ, "ఎంత ఖరీదే, జయా!" అంది జానికమ్మ.
    "ముప్పై రెండు."
    "పది రూపాయల చీర అత్తయ్య కి కొనడానికి డబ్బు లేకపోయింది...."
    "అమ్మమ్మా!...." వాసు ఇంకేమీ అనవద్దన్నట్టూ హెచ్చరింపుగా అన్నాడు.
    "మనమడికి కుట్టించావు డెబ్బై రూపాయల ఖరీదు చేసే బట్టలు. నువ్వెందుకు కొనలేక పోయావు!"..... తానాడే మాటలోని చురుకు తెలియని జయ అనేసింది.
    "అవి డెబ్బై రూపాయలా?' బుగ్గలు నొక్కుకుంటూ వాసు బట్టల వైపు చూసింది జానికమ్మ.
    "ఇలాంటివే ప్లీడరు గారబ్బాయి జగపతి కొన్నాడు, మేమావేళ షాపుకి వెళ్లిన్నాడే. కావాలంటే వాసు నడుగు." అంటూ అటు చూసిన జయకి గబగబా వీధి గేటు దాటుతూ కనుపించాడు వాసు. నాలుగు ద్వారాలు తెరచుకుని ఉన్నాయి.
    "వాడికి స్కాలర్ షిప్ ఇస్తే కుట్టించుకున్నాడు కాబోలు. నేను కుట్టించా ననుకుంటున్నారేమిటే జయా, అమ్మా, నాన్నా?"
    "చచ్చాం....ఇంట్లో కురుక్షేత్రం ...." తానూ వెళ్ళిపోయింది జయ.
    "వాళ్ళు ఇవ్వలేరు....వాడు కొనుక్కుంటే చూడలేరు. ఇంతకీ వాడి అదృష్టం..." గొణుక్కుంటూ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది జానికమ్మ.
    వాసు ఖరీదైన బట్టలతో ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుంటే, అతని కదలికల్లో , చూపుల్లో, మాటల్లో కొత్తగా ప్రసాదరావు పోలికలు ఉన్నట్టు ఆవేళే గ్రహించిన మధుమతి మనస్సు చలించి పోయింది.
    "మధూ! పెద్దైతే వాళ్ళ నాన్నలా ఉంటాడేమోనే వీడు!" త్రుళ్ళిపడింది మధుమతి , తల్లి మాటలు వింటూ. తాను మనస్సులో అనుకుంటున్న మాట ఆమె బయటకంది. అంతేకాని, చాలాకాలం తరవాత తన భర్త ప్రసక్తి, దానితో ఎంత విసిరినా వెంటాడే గతం. అత్యంతానురాగాన్ని చూపే అతని అప్పటి ప్రవర్తన నటనో, నిజమో ఈనాటికీ గ్రహించలేని మధుమతి మనస్సు కకావికలమై పోయింది.
    "మనిషి మెత్తగా దబ్బ పండులా ఉన్నాడని చేస్తే గొంతు కోసి పోయాడు. వయోముఖ విష కుంభమని మనకేం తెలుసు?.... అయినా, మధూ , నువ్వు కొంత ఓర్చి ఉంటె ఇంతదాకా వచ్చేది కాదు." జానికమ్మ మాటలకు రోషం, దుఃఖం రెండూ వచ్చాయి మధుమతికి. 'ఆనాడు ఒర్చుకోమని చెప్పలేని తల్లి ఈనాడు నువ్వు ఓర్చుకోలేదని నిందిస్తుంది.' ఆనాడు తలిదండ్రులూ, తమ్ములూ-- వీళ్ళ భరోసా చూసుకునేకదా అతన్ని వదులుకుంది? ఇందులో ఏ ఒక్కరైనా నువ్వు నీ భర్తతో వెళ్ళు. మా ఇంట్లో నీకు గౌరవ స్థానం ఉండదనే సత్యాన్ని చెప్పి ఉంటె? పోనీ, ఆయనతో పాటు నన్నూ గెంటి ఉంటె! ఎంత కృతజ్ఞురాలినై ఉండేదానను!
    ఆనాటి నుంచి ఈనాటి వరకూ తన భర్తను వారు దూషిస్తూనే ఉన్నారు. కాని తన వినికిడి లోనే ఏదో మార్పు వచ్చి ఉంటుంది. అతను వెళ్ళిన కొత్తలో అందరూ ఇంటా బయటా ఇష్టమొచ్చినట్టూ కావలసిన వాళ్ళూ, అక్కర్లేని వాళ్ళూ అతన్ని తిడుతూ ఉంటె తనకేదో ఊరటగా, ఓదార్పు గా అనిపించేది. కాని క్రమంగా అతని ప్రసక్తి తెచ్చిన వారి మీద కోపం రాసాగింది. ఇప్పుడతన్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఖూనీ చెయ్యాలన్నంత కోపం, కసి ముంచుకు వస్తున్నాయి. తానక్కర్లేదు పొమ్మన్నా తనతో రమ్మని పిలిచాడు, అవమానాలు లెక్కచెయ్యకుండా . ఒంటికి, కళ్ళకి పొర కప్పి ఉన్న తాను కదలనంది. అతను హాయిగా పెళ్ళి చేసుకుని ఎందరు పిల్లల్ని కన్నాడో! తండ్రి దగ్గర ఆలనా పాలనా ఆ పిల్లలకు లభ్యమౌతాయి..... తన కొడుకు భవిష్యత్తు తానె నాశనం చేసింది.' ఆమె హృదయం కదిలిపోయింది. కళ్ళ నిండుగా నీళ్ళు తిరిగాయి. మౌనంగా తన గదికి పెళ్ళి తలుపులు వేసుకుని హృదయం తెలికయ్యేలా కన్నీరు కార్చింది.
    "ఏంరోయ్, మంచి బట్టలే కుట్టించావే?" నవ్వుతూ అన్నాడు రాజశేఖరం. జవాబుగా నవ్వి , "క్లబ్బు కెళ్ళావా, మామయ్యా, ఇంత ఆలస్య మైంది?" అన్నాడు వాసు. పండగ లోస్తే పేకాడి చాలా డబ్బు నష్టపోవడం రాజశేఖరానికి అలవాటు.
    "చాలాకాలానికి ఈవేళ ;లాభ మొచ్చిందిరా, వాసూ! తీసుకో, నీకో పది రూపాయలు . ఏమన్నా కొనుక్కో!"
    "ఊరకనే అన్నాను, వద్దు, మామయ్యా." మొహమాటంగా అన్నాడు వాసు.
    "తీసుకోవోయ్...." అతని జేబులో కూరి భోజనానికి వెళ్ళిపోయాడు రాజశేఖరం.
    "అమ్మా! నీకో శుభవార్త!' నవ్వుతూ మధుమతి పక్కలో కూర్చున్నాడు వాసు.
    "ఏమిటది?' నవ్వబోతూ అంది మధుమతి.

 Previous Page Next Page