Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 18


    చటుక్కున అటువేపు చూశాడతను.
    ఇనుప కమ్మీల్లో నుంచి గాంధీ చేయి ఊపుతూ కనిపించాడు.
    "ఇక్కడరా బిడ్డా! లోపల్రా!" అరచాడతను.
    చిరంజీవి ఓ క్షణం ఆలోచించాడు వెళ్ళాలా వద్దా అని.
    గాంధీ ఆ ఏరియాలో చాలా పెద్ద దాదా! ఒక ఎలక్షన్ లో తామంతా కలసి అతనికింద పనిచేశారు. కొన్ని పోలింగ్ బూత్ లు ఆక్రమించుకుని ఎన్నికల అధికారులకు కత్తులు చూపించి మొత్తం ఓట్లన్నీ తమ పార్టీకి వేసేశారు.
    తమది అధికారంలో ఉన్న పార్టీ అవటంతో పోలీసులు కూడా చూసీ చూడనట్లు ఊరుకున్నారు. ఆ తరువాత గాంధీ తనకు ప్రామిస్ చేసినంత మొత్తం ఇవ్వకపోయేసరికి తను గాంధీ చొక్కా పట్టుకున్నాడు నడిరోడ్డు మీద.
    గాంధీ మనుషులు తన మీదకు కత్తులతో వచ్చారుగానీ తను అవే కత్తులు లాక్కుని ఇద్దరినీ పొడిచేసరికి మిగతావారు పారిపోయారు.
    అప్పుడు గాంధీ రాజీకొచ్చాడు.
    తనకివ్వాల్సిన మిగతా డబ్బులో సగం ఇచ్చేశాడు.
    తనూ అతనితో పేచీ పెట్టుకోవటం ఇష్టంలేక మిగతా సగం వదిలేశాడు. పేచీ పెట్టుకుంటే అతని గ్యాంగ్ తోనే కాకుండా పోలీసులతో కూడా తలనొప్పి తయారవుతుంది.
    ఆ రోజు నుంచీ మళ్ళీ ఎప్పుడూ అతను తన జోలికి రాలేదు. తనూ అతని జోలికి పోలేదు.
    "అరే! చూస్తావేవయ్యా! రా! తాగుదాం" మళ్ళీ పిలిచాడు గాంధీ.
    చిరంజీవి హోటల్లోకి నడిచాడు. గాంధీతోపాటు మరో ఇద్దరు చెంచాలు కూర్చుని వున్నారు.
    తనకోసం ఓ కుర్చీ దగ్గరకు లాగాడతనే స్వయంగా.
    "ఏమిటి సంగతి?" ఛాయ్ తాగుదాం."
    అందరికీ ఛాయ్ తెచ్చిచ్చాడు బేరర్.    
    ఛాయ్ తాగసాగారు.
    "నీతో ఒక విషయం మాట్లాడ్డానికి పిల్చినా చిరంజీవి."
    "ఏమిటది?"
    "ఇయాల్రేపు నువ్వింకా ఆ డ్రైవరు కొలువే జేస్తున్నావనుకుంటా?"
    "అవును!"
    "నీలాంటి మనిషి చేసెడి కొలువు కాదు భాయ్ అది! ఎందుకు జెప్తున్నానో విను! డ్రైవర్ కొలువు జేస్తే ఏం కమా ఇస్తార్? వెయ్యి-రెండువేలు. అవునా!"
    "అవును!" చిరంజీవి అతని మాటల వెనుక ఏం ప్లానుందా అని ఆలోచిస్తున్నాడు.
    "థూ! నీయవ్వ! రెండువేలు ఒక్క దినం ఖర్చుకి చాలదు. అవునా, కాదా?"
    "దానికి లిమిట్ ఏముంది?"
    "ఎందుకు లేదయ్యా! లిమిటూంటది. మంచిగ తిననికి, తాగని కయినా "కమాయించాల్నా లేదా?"
    చిరంజీవికి అర్థమయింది. తనను మళ్ళీ పార్టీలో చేరమంటున్నాడేమో!
    "మనకీ రాజకీయ పార్టీల కిరికిరి వద్దు భాయ్! చాలా చాలా అయిందది."
    "థూ! పార్టీల కిరికిరి మనకెందుకు భాయ్? నేనట్లంటలే!"
    "మరి?"
    "నువ్వు భ్యాల్ చేస్తానంటే చెప్తా! నెలకు నాలుగువేలు. ఒక్క జాగాలో కూచొని కమాయించవచ్చు."
    "అంటే ఏంచేయాలి? చిరంజీవిలో ఆసక్తి కలిగింది."
    "మన పురానా దోస్త్ లు బాలానగర్ లో ఒక సినిమా హాల్, ఒక హోటల్ కట్టించిన్రు. ఆ సినిమా హాల్ కి, హోటల్లో గానీ ఎవళ్ళయినా తాగొచ్చి గడబిడ గిట్టజేస్తే నువ్వు ఆళ్ళను సముజాయించి బయటకు తోలాల! నెలకు ఆరువేలు కమాయ్ నీకొస్తది. దాంట్లోకెళ్ళి రెండువేలు నాకియ్యాలె! సమజయిందా?"
    చిరంజీవి చకచక ఆలోచించసాగాడు.
    ప్రొటెక్షన్ ఇవ్వటమంటే కొంచెం రిస్క్ తో కూడుకున్న పని. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవటం తప్ప గత్యంతరంలేదు. ముఖ్యంగా పిల్లలకోసం. తను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వాళ్ళు ఎందుకీ పనికిరాకుండా పోతారు.
    "నువ్ పురానా దోస్తువని చెపుతున్నా చిరంజీవి! జబర్దాస్తేం లేదు. నువ్ అయితే కిరికిరిలన్నీ మంచిగ సమజాయించుకుంటావ్. వేరోళ్ళయితే దినాం నేను పోయి సమజాయించుకోవాల్సొస్తది. అందు గురించే నిన్నడిగినా!" అన్నాడు గాంధీ వివరణ ఇస్తూ.
    "సరే!" అన్నాడు చిరంజీవి.
    గాంధీ మొఖంలో సంతోషం కనిపించింది.
    "మిలావ్ హాత్!" అన్నాడు చేయి చాపుతూ.
    చిరంజీవి కలచాలనం చేశాడు.
    "కానీ ఓ కండిషన్."
    "ఏమిటది?" అడిగాడు గాంధీ.
    "నాకెప్పుడు మానేయాలనిపిస్తే అప్పుడు మానేస్తా."
    "అది నీయిష్టం. అయితే ఇప్పుడే గంగ థియేటర్ కెళ్ళి ఆడ ప్రొప్రయిటర్ గౌడ్ ని కలుసుకో! నేను ఫోన్ లో మాట్లాడతా!"
    "సరే."
    చిరంజీవి ఆనందంగా బాలానగర్ బయలుదేరాడు.
    అంతవరకూ మనసు నావహించిన భయం కాస్తా పోయింది ఇప్పుడు.
    గంగ థియేటర్ బుకింగ్ ఆఫీస్ పైన టెర్రెస్ మీద ఫ్రెండ్స్ తో కూర్చుని బీరు తాగుతున్నాడు గౌడ్.
    చిరంజీవిని చూడగానే ఆదరంగా ఆహ్వానించాడు.
    "ఇప్పుడే గాంధీ ఫోన్ చేశాడు నువ్వు వస్తున్నావని! రా కూర్చో."
    చిరంజీవి అతని పక్కనే కుర్చీలో కూర్చున్నాడు.
    "బ్రాందీయా, విస్కీయా?" అడిగాడతను.
    చిరంజీవి టెంప్టేషన్ అణచుకోడానికి విశ్వప్రయత్నం చేశాడుకాని కుదర్లేదు.
    "విస్కీ" అన్నాడు.
    టేబుల్ మీదున్న బాటిల్ నుంచి విస్కీ గ్లాసులోకి వంచి గ్లాసుతో పాటు షోడాలు అతనిముందుకి తోశాడు.
    చిరంజీవి గడగడ తాగేశాడు రెండు పెగ్గులు.
    "ఇక చాలు" అన్నాడు గౌడ్ మళ్ళీ పోయబోతూంటే.
    "అదేమిటి? గౌడ్ నీ గురించి చాలా గొప్పగా చెప్పాడే. బాటిల్ ఎత్తితే దించవని.
    "ఆ జమానా వేరు" అన్నాడు చిరంజీవి.
    "పద. రెండు నిమిషాలు నా రూమ్ లో మాట్లాడదాం."
    ఇద్దరూ ప్రొప్రయిటర్ రూమ్ లోకి నడిచారు.
    "కూర్చో" అన్నాడు, గౌడ్ కూడా టేబుల్ వెనుక ఉన్న కుర్చీలో కూర్చుంటూ.

 Previous Page Next Page