Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 19


    "గాంధీ నీకు అన్నీ చెప్పే ఉంటాడు" అన్నాడతను సిగరెట్ వెలిగించుకుని.
    "చెప్పాడు."
    "గంగ థియేటర్ తోబాటు రోడ్డుకి అవతలివేపు హోటల్ వాళ్ళను చూడా నువ్వే చూసుకోవాలి! ఈ ఏరియా సంగతి నీకు తెలిసే ఉంటది. ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎక్కువ. అందుకని సాయంత్రమయ్యేసరికి అంతా కల్లు కాంపౌండ్ లో తాగి సినిమాహాల్లోకో, హోటల్ కో వచ్చేస్తుంటారు. అందుకని ఎప్పుడూ ఎవరోకరితో కావాలని కిరికిరి పెట్టుకుంటారు. నువ్ చేయాల్సిందేమిటంటే వాళ్ళను సముజాయించాలి. ఎవళ్ళయినా మంచిగ చెప్పినప్పుడు వినకపోతే రెండు తగిలించి బయటకు పంపాలి. అంతనే."
    "అదంతా నాకొదిలేయండి!"
    "డబ్బు విషయం కూడా గాంధీ చెప్పే ఉంటాడు. నేన్నీకు ఆరువేలిస్తాను. అంతే! ఇంకే రకంగానూ నువ్వు నన్నేం ఆబ్లగేషన్ అడగొద్దు సమజయిందా?"
    "అయితే వెళ్ళు! ఇయాల్టి నుంచే ఉండిక్కడ! నేను రోజూ సాయంత్రం ఈ టైమ్ కిక్కడికొస్తా! రెండు గంటలుండి వెళ్ళిపోతా! మేనేజర్ శివరామ్ కి నీ గురించి ఇందాకే చెప్పాను. నీకెలాంటి సహాయం గానీ, పనులుగానీ అవసరమయితే శివరామ్ తో మాట్లాడు."
    అతను లేచి బయటకు నడవబోయాడు.
    "ఒక్క నిమిషం గౌడ్ సార్"
    "ఏమిటి?"
    "అడ్వాన్స్ కావాలి!"
    "ఎంత?"
    "ఎంతయినా ఫర్లేదు! వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా ఉంటే చాలు."
    అతను జేబులోనుంచి వంద నోట్ల కట్ట ఒకటి తీసి అందులోనుంచి పదినోట్లు లెక్కపెట్టి చిరంజీవికిచ్చాడు.
    "షుక్రియా."
    చిరంజీవి బయటకు నడిచాడు.
    "ఫస్టు షో ఇంటర్వల్ అయినట్లుంది. జనం థియేటర్ ఆవరణలో నిండిపోయి ఉన్నారు. చిరంజీవి మేనేజర్ రూమ్ లోకి నడిచాడు.
    శివరామ్ అతనివేపు ప్రశ్నార్థకంగా చూశాడు.
    "పేరు చిరంజీవి!" అన్నాడు చిరంజీవి.
    శివరామ్ ఛప్పున లేచి నిలబడి కరచాలనం చేశాడు.
    "కూర్చోండి."
    ప్యూన్ ఎవరయినా ఉంటే బయట లాన్ లో కుర్చీ వేయించు. నేను ఎప్పుడూ ఆ గార్డెన్ లోనే ఉంటాను. ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చిన నాకు కబురు చేయండి."
    "సరేనండీ అలాగే. బెల్ కొట్టి కుర్రాడిని పిలిచాడు.
    "రెండు కుర్చీలు తీసుకెళ్ళి లాన్ లో వెయ్. చిరంజీవి సార్ లాన్ లోనే కూర్చుంటారు. ఆయనకేం కావాలో చూస్తూండు."
    "అలాగే సార్."
    అతనితోపాటు వెళ్ళి లాన్ లో కూర్చున్నాడు చిరంజీవి.
    సెకండ్ షో బిగినయిన కొద్ది నిముషాలకు అతనికి పిలుపు వచ్చింది.
    రిజర్వ్ డ్ క్లాస్ లోకి చేరుకున్నాడతను.
    ఇద్దరు వ్యక్తులు కలబడి కొట్టుకుంటున్నారు. మిగతావారు విడదీయటానికి ప్రయత్నిస్తున్నారు. ఓ స్త్రీ బిగ్గరగా తిడుతోంది ఎవరినో.
    చిరంజీవి వారిద్దరి దగ్గరకూ నడిచి ఓ వ్యక్తిని పట్టుకుని బలవంతంగా లాగి దూరంగా నిలబెట్టాడు.
    రెండోవాడు అతని మీదకు దూకబోతూంటే అతనిని వెనక్కు ఒక్కతోపు తోశాడు. వెనక్కు పడిపోయి ఛప్పున లేచి నిలబడి గాబరాగా చిరంజీవి వేపు చూశాడతను.
    "ఏయ్ ఎవర్రా నువ్వు. నన్నెందుకు తోసినావ్!"
    "అదంతా చెప్తాగాని ఇద్దరూ బయటకు నడవండ్రి."
    చిరంజీవి అతనిని ఒక తోపు తోశాడు మళ్ళీ. మళ్ళీ వెనక్కు పడిపోయాడతను.
    జనమంతా చిరంజీవి వేపు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
    "ఏయ్ అతన్నెందుకలా తోస్తున్నావ్?" ఒకతను చిరంజీవినడిగాడు.
    "అందరూ కూర్చోండి! సినిమా చూడటానికొచ్చారా? ఫైటింగ్ లు చూడటానికొచ్చారా?" అరిచాడు చిరంజీవి.
    ఎవరిదారిన వారు సీట్లలోకెళ్ళిపోయారు.
    చిరంజీవి ఆ ఇద్దరినీ చేతులు పట్టుకుని థియేటర్ బయటకు తీసుకొచ్చాడు. వారితోపాటు ఆక్రీ మరో యువకుడు కూడా వచ్చారు.
    "ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది?" అడిగాడు చిరంజీవి.
    "మా లేడీస్ భుజం మీద వెనకనుంచి చేయివేశాడు ఆడు" చెప్పాడు ఒకతను.
    "నేను వేయలే" అన్నాడు రెండోవాడు.
    "ఏయ్. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండక్కర్లేదూ? మొదటిసారి పొరబాటున వేశాడేమో అని ఊరుకుంటే రెండోసారి మళ్ళా వేశావా లేదా?"
    "నేను వేయలే. ఎవనికి చెప్పుకుంటావో చెప్పుకో."
    "అవ్ మావాడు చేయి వేయలే" అన్నాడు అతని పక్క నిలబడ్డ మరొకడు.
    చిరంజీవి అతని దగ్గరకు నడిచాడు.
    "మీ ఇద్దరూ దోస్త్ లా?"
    "అవును."
    "అందుకని సపోర్ట్ జేస్తున్నావా?"
    "బరాబర్ జేస్తా! నువ్వేమంటావ్?"
    అతని మాట పూర్తవకుండానే అతని చెంప ఛెళ్ళుమంది. వెనుక ఉన్న ఫెన్స్ మీద పడిపోయాడతను. అదిచూసి రెండోవాడు వెనుకకు తగ్గాడు.
    "ఆమెకు సారీ చెప్పండ్రి."
    "అరె! మేమేం జేయలేదంటే సారీ జెప్పమంటావేం సంగతి?"
    "చెప్తావా లేదా?" పిడికిలి బిగించి అతనిమీదకు నడుస్తూ అడిగాడు చిరంజీవి.
    "సారీ!" అన్నాడతను ఆమెవేపు తిరిగి.
    "ఏయ్ తంబీ. నువ్వు మీ భార్యా హాల్లోకెళ్ళి మీ సీట్స్ లో కూర్చోండి."
    "థాంక్యూ బ్రదర్" అంటూ భార్యతో లోపలకు నడిచాడతను.
    "ఏరా ఇద్దరూ సినిమా చూస్తారా, ఇంటికెళ్తారా?" అడిగాడు చిరంజీవి.
    "ఇప్పుడేవెళ్ళి మా వాళ్ళను తీసుకొచ్చి నీ సంగతి చూస్తా" అన్నాడు ఫెన్స్ మీద పడ్డవాడు లేచి నిలబడుతూ.
    "పద నేనూ వస్తా" ఇద్దరి చొక్కాలూ పట్టుకుని తోసుకుంటూ హాలు బయట రోడ్డు మీదకు నడిచాడు చిరంజీవి.

 Previous Page Next Page