Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 17


    "నిజం అయితే కొంచెం కష్టం కదూ?"
    "ఒకోసారి మంచి కలలు కూడా వస్తాయిరా! అవి నిజం అయితే మనకెంత ఆనందంగా ఉంటుందని."
    "కానీ నిద్ర లేచేప్పటికి కల చెదిరిపోతుంది కదా?"
    "అయినా సరే! చాలాసేపు దాని తాలూకు తీపిదనం మనసు నంటిపెట్టుకునే ఉంటుంది."
    చిరంజీవి లేచి మొఖం కడుక్కుని బయటకు నడిచాడు.
    సాయంత్రం అయిపోయింది.  
    మెయిన్ రోడ్డు మీద కొచ్చాడతను.
    మనసు పరిపరి విధాలుగా పోతోంది.
    తనెటు నడుస్తున్నాడో తనకే తెలీటం లేదు.
    మనసంతా భయంతో, ఆందోళనతో నిండిపోయింది.
    ముఖ్యంగా పిల్లలను ఎలా పోషించాలా అనేది చాలా భయంకరమయిన సమస్య అయిపోయింది.
    వాళ్ళను పోషించటం కోసం తను నీతిగా, నిజాయితీగా బ్రతకాల్సిన అవసరం ఉంది.
    లేకపోతే వాళ్ళూ తన లాగానే తయారవుతారు.
    చదువూ సంధ్యా లేకుండా, దొంతనాలు చేస్తూ, పోలీసులతో గొడవపడుతూ, జైలు కెళ్తూ... అదే తనకిష్టం లేదు.
    ఏమయినా సరే వాళ్ళు తను నడుస్తున్న తప్పుత్రోవన నడవకూడదు.
    అందుకే ఉద్యోగం పోయినందుకు అంత బాధపడుతున్నాడు.
    "ఎవరు కావాలి?" ఆ ప్రశ్నతో ఉలిక్కిపడి ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడతను.
    ఎదురుగ్గా గన్ పట్టుకుని నిలబడ్డ సెక్యూరిటీ గార్డ్ కనిపించాడు.
    కొద్దిక్షణాలు తనెక్కడున్నది అర్థంకాలేదు చిరంజీవికి. చుట్టూ ఓసారి చూశాడు. అప్పుడు తెలిసిందతనికి, తను ఆ రాక్షసి పిల్ల ఇంటికే వచ్చాడు.
    అక్కడికెలా వచ్చాడో, ఎందుకొచ్చాడో తనకే తెలీదు.
    ఆ భవనం చూడగానే కోపం పొంగి పొరలసాగిందతన్లో.
    "ఎవరు కావాలా? ఈ ఇంటాయన కూతురు కావాలి?"
    "ఏయ్. మర్యాదగా మాట్లాడు! అమ్మాయిగారు అనలేవూ? మాట్లాడ్డం నేర్చుకో, ఇలాంటి పెద్దాళ్ళ ఇళ్ళకు వచ్చేటప్పుడు" చిరాగ్గా అన్నాడు సెక్యూరిటీ గార్డ్.
    చిరంజీవికి కోపం పెరిగిపోయింది.
    "ఏయ్...నువ్ నోర్మూసుకో బే! ఎట్లా మాట్లాడాలో ఎట్లా మాట్లాడకూడదో నాకు బాగా తెలుసు. ముందు ఆమెను పిలు. చాలా ముఖ్యమయిన విషయం మాట్లాడాలి."
    గార్డ్ ఛటుక్కున చిరంజీవి చొక్కా పట్టుకున్నాడు.
    "ఏంట్రా? నన్నే 'బే' అంటున్నావా? కుక్కను కాల్చినట్లు కాలుస్తా నిన్ను. జాగ్రత్త" రెండో సెక్యూరిటీ గార్డ్ చప్పున అతనిని వెనక్కు లాగేశాడు.
    "అమ్మగారి కోసం వచ్చినప్పుడు ఇలా చేయకూడదు మనం. నువ్ వెళ్ళు." అంటూ అతనిని కసిరి చిరంజీవి వేపు చూశాడు.
    "లోపలికెళ్ళు" అన్నాడు సైగ జేస్తూ.
    చిరంజీవి ఆ భవనంలోకి నడిచాడు. ఓ నౌఖరు వచ్చి అతని పేరు అడిగి లోపలికెళ్ళాడు. అయిదు నిమిషాల తర్వాత వచ్చింది దీప.
    ఇప్పుడామె గెటప్ పూర్తిగా మారిపోయింది.
    "ఎవర్నువ్వు!" అంటూ పరీక్షగా చూసింది.
    "నేనే! నిన్న నన్ను కారులో నుంచి బయటకు తోసి, కారుకి యాక్సిడెంట్ చేసి పారిపోయిన కారు డ్రైవర్ని."
    ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా ఎరుపు రంగు వచ్చేసింది.
    "ఎందుకొచ్చావ్ మళ్ళీ?" అడిగింది కర్కశంగా.
    "మీరు చేసిన దురాగతం వల్ల నా ఉద్యోగం పోయింది. మీరు చెప్పిన అబద్ధం వల్ల కారు నేను యాక్సిడెంట్ చేశానని నామీద పోలీస్ కేసు పెట్టాడు మా ఓనరు" ఆవేశంగా అన్నాడు చిరంజీవి.
    "అయితే ఇక్కడికెందుకొచ్చావ్?"
    "నేనూ, మా ఇంట్లోని చిన్న చిన్న పిల్లలూ తిండికి కూడా లేక నానా బాధలూ పడుతున్నాం మీరు చేసిన పని వల్ల."
    "ఇప్పుడిక్కడికి ఎందుకొచ్చావని అడుగుతున్నాను? అడిగిందానికి మాత్రమే సమాధానం చెప్పు."
    "నా జీవితాన్ని మీరే నాశనం చేశారు కనక నాకు మీరే ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను."
    ఆమె కోపం పెరిగిపోయింది.
    "గెటౌట్!" అంది అతనివేపుకు నడుస్తూ.
    "మా ఓనర్ కి ఫోన్ చేసి తప్పంతా మీదేనని చెప్తారా లేదా?"
    "బాస్టర్డ్! బయటకు వెళ్తావా లేదా?"
    "నేను వెళ్ళను."
    హఠాత్తుగా గాలిలోకెగిరి అతని మోకాలిమీద ఇనుప కమ్మీతో కొట్టినట్లు తన్నిందామె.
    "అబ్బా!" అన్నాడు చిరంజీవి మోకాలు పట్టుకుని బాధగా.
    ఆమె గోడ పక్కకు నడిచి అక్కడున్న బటన్ నొక్కింది.
    మరుక్షణంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గన్స్ తో పరుగెత్తుకొచ్చారు.
    "వాడిని బయటకు గెంటండి."
    ఇద్దరూ గన్ చిరంజీవికి గురిపెట్టారు. ఒకడు అతడిని ఒక్క తోపు తోశాడు వెనకకు.
    "బయటకు నడవరా! లేకపోతే ఛస్తావ్!"
    చిరంజీవి అతికష్టం మీద ఆవేశం అణుచుకున్నాడు.
    "ఏయ్! నీ అంతు చూస్తానే! ఎప్పటికయినా నీ పొగరణుస్తాను. నువ్ నాకు చేసిన అన్యాయానికి రెట్టింపు అనుభవించేటట్లు చేస్తాను."
    అతను అరుస్తూంటే బలవంతంగా బయటకు నెట్టుకెళ్ళిపోసాగారు వాళ్ళు.
    రోడ్డు మీదకొచ్చేసరికి అరచి అరచి అలసిపోయాడు చిరంజీవి.
    తను అనవసరంగా ఆవేశపడుతున్నాడు గానీ దానివల్ల ఏమీ ఉపయోగం లేదని అర్థమయిందతనికి.
    తను కావాలంటే ఆ సెక్యూరిటీ గార్డ్సు ఇద్దరినీ మట్టి కరిపించి ఆ భవనంలోని సామాన్లన్నీ ధ్వంసం చేసి మరీ బయటకు రాగలడు. కానీ తర్వాత జైల్లో రెండేళ్ళు గడపాల్సి వస్తుంది. దాంతో పిల్లలు అడుక్కుతినాల్సి వస్తుంది.
    రోడ్డు మీద నీరసంగా నడవసాగాడతను.
    "అరే చిరంజీవి!" ఇరానీ హోటల్లో నుంచి ఎవరో అరవటం వినిపించింది.

 Previous Page Next Page