తిరిగి ఆ ఛాంబర్ లో నిశ్శబ్దం అలుముకుంది.
తాము చేసిన తప్పేమిటో వచ్చీ రాగానే అలా ఎందుకు తమ మీద విరుచుకుపడుతున్నాడో అర్థంకాక వాళ్ళు బిక్కచచ్చిపోయారు.
అది అతని స్ట్రాటజీ. ముందు తనకింద పనిచేసేవారిని అదరగొట్టి, బెదరగొట్టి అదునుచూసి తన గ్రిప్ లోకి తెచ్చుకుంటాడు. తన మాటని వేదంలా, తన ఆజ్ఞని శిలాశాసనంలా వాళ్ళు భావించి పనిచేసేలా మెంటల్ గా ప్రిపేర్ చేస్తాడు.
"మహిమ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సార్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఆమె ప్రత్యేకత. స్క్రూప్స్ ని ప్రోబ్ చేసి రాసి పత్రికలకు అమ్ముకుంటుంది. సెన్సేషన్ క్రియేట్ చేసే వార్తల పట్ల మక్కువ చూపిస్తుంది. ఎక్కడికయినా, ఎలాగయినా వెళ్ళిపోతుంది. తెలివిగా ఆరా తీస్తుంది. ఎవరికీ చిక్కదు. పాదరసంలా జారిపోతుంటుంది. ఆమె ఆర్టికల్స్ ఎక్కువగా బెంగుళూరు, మైసూర్ ల నుండి వెలువడే డైలీలకు అందిస్తుంది. మాకు తెలిసిందంతే సార్" బ్రహ్మప్ప అనే ఎస్.ఐ. ఒకింత ధైర్యంచేసి అన్నాడు. రంజిత్ ప్రవర్తన అతనికి ఒకింత మనస్తాపం కలిగించింది.
కొద్దిక్షణాలు మౌనంగా పచార్లు చేసిన రంజిత్ సడన్ గా ఆగిపోయి వారికేసి చూశాడు తీక్షణంగా.
"ఇకపై ఎ;ఎలాంటి వివరం బయటకు వెళ్ళటానికి వీలులేదు. ముఖ్యంగా జర్నలిస్ట్స్ ని, ప్రెస్ వాళ్ళని దగ్గరకు రానివ్వకండి. వాళ్ళేడి అడిగినా మాకు తెలీదని చెప్పండి. మన స్ట్రాటజీ ఏమిటనేది వాళ్ళకనవసరం. వాళ్ళ పిచ్చి రాతల వల్ల మన స్టాఫ్ లో ఆత్మస్థయిర్యం సడలిపోతుంది. పైగా పరిశోధనకి అంతరాయం కలుగుతుంది.
అతి త్వరలోనే ఆ అమ్మాయి వివరాలు నా టేబుల్ మీదుండాలి. వీరూకి సంబంధించిన పోలీస్ డైరీని, ఫైల్స్ ని, ఫోటోగ్రాఫ్స్ ని, ప్రెస్ కటింగ్స్ ని నా టేబుల్ మీదకు అరగంటలోపు తీసుకురావాలి" అంటూ తన ఛాంబర్ లోకి వెళ్ళబోతూ ఆగిపోయాడు ఒక్కక్షణం....
"ఫారెస్ట్ డిపార్టుమెంట్ చేతులెత్తేసినప్పుడే మన అవసరం ఆ డిపార్టుమెంటుకి ఏర్పడుతుంది. ఆ డిపార్టుమెంట్ గురించి కూడా నాకు క్షుణ్ణంగా తెలియాలి. చెప్పింది చేయకపోయినా, విధి నిర్వహణలో పొరపాట్లు దొర్లినా క్షమించను. జాగ్రత్త" అంటూ లోపలకు వెళ్ళిపోయాడు ఎస్.పి.రంజిత్.
తుఫాన్ తగ్గినట్టుగా గుండెలనిండా ఊపిరి తీసుకున్నారు వాళ్ళు.
* * * *
బెంగుళూరు.... ఛామరాజ్ పేట.
ప్రకాష్ కేఫ్ వెనుకవున్న హోంమంత్రి రాఘవేంద్ర రెసిడెన్స్ తో ఆయనకి డి.జి.పి.దేవదాసుకి వేడిగా, వాడిగా చర్చలు కొనసాగుతున్నాయి.
"మొత్తానికి మీ మూలంగా ముఖ్యమంత్రిగారిచేత తిట్లు తింటున్నాను. ఫలితం చూపించకపోతే నా పోర్టిఫోలియో పీకి పడేస్తాడు. అది జరిగేలోపు నేను మిమ్మల్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కి ఎం.డి.గా పంపించవలసి వుంటుంది. అది మీకూ మంచిదికాదు, నాకు సబబుగా వుండదు. ఏం చేస్తారో చేయండి. ఫుల్ ఎమ్యునేషన్, డబ్బు, వెహికల్స్ ఫోర్స్ ఎంత కావాలంటే అంత తీసుకోండి. హెలికాప్టర్ కూడా కావాలంటే తీసుకోండి. అడవిలోని ప్రతి అంగుళాన్ని గాలించండి. కనిపించిన వాడ్ని కనిపించినట్లు పిట్టని కాల్చినట్లు కాల్చివేయండి" హోం మినిష్టర్ ఆగ్రహావేశాలతో ఊగిపోతూ.
ముఖ్యమంత్రి బాగానే మందలించి వుంటారు. లేదంటే ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే హోమ్ మినిష్టర్ అంతగా ఉద్రేకపడుతున్నారనుకున్నాడు డి.జి.పి.
"రాయచూర్ డిస్ట్రిక్ట్ ఎస్.పి.గా చేస్తున్న రంజిత్ అనే ఆఫీసర్ ని ఫారెస్ట్ విభాగానికి ఎస్.పి.గా వేశాను సార్. అతను సాహసి, మొండివాడు. వీరూని పట్టుకొనేవరకు నిద్రపోడు. మన సి.సి.ఎఫ్. చంద్రశేఖర్ కూడా శర్మ అనే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ ని డి.ఎఫ్.ఓ.గా నియమించాడు. అతనూ గొప్ప ధైర్యశాలి, తెలివి కలవాడు. వాళ్ళిద్దరూ వీరూ బలాన్ని, బలగాన్ని, అనుపానుల్ని, కదలికల్ని అంచనావేసి అవసరమయిన ఆయుధాల గురించి, ఫోర్స్ గురించి రాయగానే వాటిని సమకూర్చటానికి నేను సిద్ధంగా వున్నాను. ఖచ్చితంగా ఈసారి పట్టుకొని తీరతాం సార్" డి.జి.పి. భరోసా ఇస్తున్నట్లుగా అన్నాడు.
"ఉరుము ఉరిమి ఎవరిమీదో పడ్డట్లు మాట్లాడితే సి.ఎం. నా మీద విరుచుకుపడుతున్నారు. అసలతన్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఫారెస్ట్ విభాగానిది. ఫారెస్ట్ మినిష్టర్ ని మందలించకుండా నావైపు గురిపెట్టుకు కూర్చున్నారు.
ఆ వీరూగాడి ప్రాణాలంతా గొప్పవేం కావు. ప్రాణాలతో పట్టుకోవాలన్న పిచ్చిపనులకు పోక, కనిపించగానే కాల్చి అవతల పడేయండి. పీడా విరగడయిపోతుంది. ఎప్పటికప్పుడు మీ ప్రోగ్రెస్ ని నాకు తెలియపర్చండి" ఇక వెళ్ళిరమ్మన్నట్లుగా చూశాడు మినిష్టర్.
డి.జి.పి. నిట్టూర్చుతూ లేచాడు.
* * * *
ఆరోజు సాయంత్రం ఐదు గంటలకు మైసూర్ సెంట్రల్ బస్ స్టేషన్ లో దిగి కాలినడకన కె.ఆర్. సర్కిల్ ని చేరుకుంది మహిమ.
ఆమె భుజానికి ఒక వి.ఐ.పి. బ్యాగ్, చేతిలో ఎకోలాగ్ సూట్ కేసుంది. చెబితే తప్ప ఆమె ఒక సెన్సేషనల్ జర్నలిస్ట్ అని ఎవరికీ తెలీదు.
మూడు, నాలుగేండ్లుగా పత్రికలకి ఆర్టికల్స్ రాస్తున్నా, ఒక్కసారి కూడా ఆమె ఫోటో పత్రికల్లో రాలేదు. అలా రాకుండా ఆమె జాగ్రత్త పడింది.
తన వృత్తికి తన ఐడెంటిఫికేషన్ అంతరాయాన్ని కలిగిస్తుందనే కాదు, పబ్లిసిటీ కూడా ఆమెకి ఇష్టంలేదు.
సరీగ్గా ఐదున్నర గంటలకు ఒక యువకుడు మహిమ దగ్గరకు వచ్చి విష్ చేశాడు.
అతని పేరు విజయ్. సన్నగా, అయిదడుగుల ఆరంగుళాల ఎత్తులో వున్న విజయ్ టక్ చేసి పైన ఓపెన్ కోట్ వేసుకున్నాడు. చిన్ని కళ్ళు చురుగ్గా వున్నాయి. చిన్న గడ్డం ట్రిమ్ వేసుకున్నాడు. చిన్ని కళ్ళు చురుగ్గా వున్నాయి. చిన్న గడ్డం ట్రిమ్ చేసుకున్నట్లుగా ఆకర్షణీయంగా వుంది. ఆ సిటీలో ఆమెకున్న ఫ్రెండ్ అతనొక్కడే.
బొంబాయి కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ కి అతను డీలరు. అతనుండేది సంజన్ గడ్. వ్యాపారరీత్యా గూడ్సు ఆటోలోగాని, బైక్ మీదగాని, బండి పురా, ముదుమలై, కొల్లెగాళ్, ఛామరాజ్ నగరు, కౌదల్లీ, సాంటేమారహళ్ళి తలకాడ్, పుంజూర్, సర్గూర్, గుండ్లుపేట, టి. నర్సాపూర్ లాంటి చిన్న చితకా గ్రామాల్ని, పట్టణాల్ని ప్రతిరోజు కవర్ చేస్తుంటాడు.
ఎవర్నీ నొప్పించని మృదుస్వభావం....అందరితో కలిసిపోగల కలుపుగోలుతనం....
తనకెన్ని వ్యక్తిగతమయిన బాధలున్నా, బరువులున్నా వాటిని తనలోనే దిగమ్రింగుకొని నలుగురికి సహాయపడే మంచి మనిషి. తన పనుల్ని, అవసరాల్ని కూడా ఇతరులకు సహాయపడేందుకు దూరంగా పుంచుతుంటాడు. తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగలడు.
మహిమకి, విజయ్ కి పరిచయం కూడా గమ్మత్తుగా జరిగింది. ఓ రోజు సాయంత్రం విజయ్ సరుకు అన్ లోడ్ చేసి తిరిగి వస్తుండగా ఛామరాజ్ నగర్ కి దగ్గరలో వున్న స్వర్ణావతి రిజర్వాయర్ మెయిన్ గేట్ ముందు టి.వి.ఎస్. రిపేరు చేస్తూ మహిమ, ఆమె ఫ్రెండొకరు కనిపించారు.
అప్పటికే ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి విజబిలిటి పూర్ అయింది. సన్నగా చిరుజల్లు పడుతోంది. ఆ పరిస్థితిలో విజయ్ తన గూడ్స్ ఆటోని వారి దగ్గర ఆపి "మే ఐ హెల్ప్ యూ" అన్నాడు మృదువుగా.
చూడగానే సదభిప్రాయం ఏర్పడింది విజయ్ మీద మహిమకు.
హెల్ప్ కావాలన్నట్లు మహిమ తలాడించింది. కొంతసేపు విజయ్ కూడా దాన్ని రిపేరు చేసే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు.
చివరకు టి.వి.ఎస్.ని గూడ్స్ ఆటోలో వెనుకవేసి, ఆ ఇద్దర్నీ ఎక్కించుకొని ఛామరాజ్ నగర్ వరకు తెచ్చి ఒక షెడ్ ముందు దింపి వెళ్ళిపోయాడు.