Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 18


    ఏనుగులు చూశాయి రవిని. వాటి ఘీంకారాలు ఎక్కువయ్యాయి. అతడి మీదకి వచ్చేస్తున్నాయి. ఎటు పారిపోవాలో కూడా తెలియదు. పైగా భుజం మీద బరువు. ఆ సమయంలో ఎవరో అతడిని చెయ్యి పట్టుకుని మెరుపులాంటి వేగంతో ఒక పక్కలకి లాగారు. ఆ చెయ్యి అలాగే పట్టుకుని మరో వైపుకి ఇంచుమించు ఈడ్చుకుపోతున్నట్టు తీసుకుపోయారు.
    ఏనుగుల గుంపు అతడికి కొన్ని గజాల దూరం వరకూ వచ్చి, అక్కడినుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా ఘీంకారాలు చేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాయి.
    అప్పుడు చూశాడు రవి, తనను చెయ్యి పట్టుకుని ఆపద నుంచి తప్పించిన వ్యక్తిని.
    ఆమె అత్యంత ఆకర్షణీయంగా ఉన్న స్త్రీమూర్తి! అంతకుముందు అతడు అడవిలో చూసిన యోగినిలాగే ఈమె కూడా కాషాయాంబరాలు అతి సన్నవి బాగా ఖరీదైనవి కట్టుకుంది. ఈమె కూడా జాకెట్ వేసిలేదు. స్తన వల్కలం లాంటిదే కట్టుకుంది. రెప్ప వేయకుండా తనను చూస్తున్న రవిని చూసి ఆమె నవ్వింది సమ్మోహనంగా.
    "ఆ అబ్బాయిని అక్కడ పడేసి నాతో రండి!" అంది అల్లరిగా ఆహ్వానిస్తున్నట్లు.
    ఆ మాటలతో తెలివి వచ్చింది రవికి. లజ్జపడ్డాడు, తన బలహీనతకి.
    "మీకు చాలా థాంక్స్, నన్ను కాపాడినందుకు. ఆ ఏనుగుల గుంపు అలా వెనక్కి వెళ్ళిపోవటానికి కారణమేమిటీ? ఏమైనా మంత్రం వేశారా? అసలు మీరెవరు? ఎక్కడికి వెళుతున్నారు?"
    ఆమె నవ్వింది. ఆ నవ్వులో యోగిని కంటే ఒక విలాసిని కనబడుతోంది.
    "అవును. మంత్రమే వేశాను. ఆ మంత్రం మీకూ చెప్తాను. నాకేం ఇస్తారు?"
    అల్లరిపిల్ల అయిన కాలేజీ స్టూడెంట్ తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. భేదం అంతా కాషాయ వస్త్రాల్లోనే.
    "నేను ముందు ఈ అబ్బాయిని ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. అక్కడికి తొందరగా చేరుకునే మంత్రం తెలిస్తే చెప్పండి. నాకు దాహం గొంతు ఎండిపోతుంది. మంచినీళ్ళు దొరికే మంత్రం చెప్పండి. ఇందుకు ప్రతిఫలంగా కావాలంటే మీకు ఆర్కియాలిజీ టీచ్ చేస్తాను."
    గలగలా నవ్వింది ఆమె.
    "తప్పకుండా మీ శిష్యురాలినవుతాను. తర్వాత మరిచిపోకండి. మరి ఇదిగో మీకు మంచినీళ్ళు!"
    ఎండిపోయిన అనపకాయ లోపల తొలిచి పాస్క్ లాగ తయారుచేశాడు. రవి దాన్ని కుతూహలంగా చూస్తోంటే ఆ కాషాయధారిణి అంది "దీనిలో నీళ్ళు తాగటానికి మీరు సందేహించక్కర్లేదు. ఇవితప్ప వేరే నీళ్ళు త్రాగకండి. కొద్దిగా తాగండి. దాహం తీరుతుంది. ఆ అబ్బాయికి కూడా పట్టండి. లేకపోతే దారిలోనే ప్రాణాలు పోగలవు. ఇదిగో, ఈ బాటలో వెళ్ళండి. పది నిముషాల్లో ఆస్పత్రి ముందు ఉంటారు. ఏనుగుల గుంపు మీ మీదకి రాకుండా నేను వేసిన మంత్రం అదిగో"
    ఎదురుగా చూపించింది. కొద్ది దూరంలో విశాలంగా పరచుకుని ఒత్తుగా ఎండుగడ్డి.
    "అదేమిటి? ఆ గడ్డి మంత్రించినదా?"
    ఆమె నవ్వింది మళ్ళీ.
    "ఆ మంత్రమే? ఆలోచన! ఏనుగులకి కూడా మెదడుంది, ఆలోచన ఉంది. అడవులలో ఏనుగులను పట్టే విధానం మీకు తెలుసుగా. లోతుగా గోతులు తవ్వి అవి కనపడకుండా ఆకులు కప్పుతారు. ఏనుగులు ఆ గోతుల్లో పడ్డాక వాటిని పట్టుకుంటారు. ఆ ఎండు గడ్డి పేర్చిన విధానం జాగ్రత్తగా గమనించండి. రెండు వరసలు ఎత్తుగా ఉండి, మధ్యలో గొయ్యి ఉన్నలాంటి భ్రమ కలుగుతుంది. అలా ఉంటే ఏనుగులు తమని పట్టణానికి తవ్విన గొయ్యి అనుకుని దగ్గిరకి రాకుండా వెనక్కి వెళ్ళిపోతాయి. వాటి జాగ్రత్తలో అవి వుంటాయి, పాపం"
    "ఇక్కడ ఇలా ఎండుగడ్డి ఎవరు పేర్చారు? ఇక్కడికి ఏనుగులు వస్తాయని తెలుసా? మీరెందుకు వచ్చారిక్కడికి? మీరు ఎవరు?"
    "అయ్యా పరిశోధకులు గారూ!మీ ప్రశ్నలన్నింటికి సమాధానం నేను మీకు శిష్యురాలినయినప్పుడు చెప్తాను. ప్రస్తుతం మీరు మంచినీళ్ళు తాగి, ఆ పిల్లవాడికి పట్టించి, ఈ దారిగుండా వెళ్ళండి"
    రవి సమాధానం కోసం చూడకుండా అడవిలోకి వెళ్ళిపోయింది ఆమె. ఆమె కోసం చూసి ప్రయోజనం లేదని రవికి తెలుసు. అంత వ్యవధి కూడా లేదు. నీళ్ళు కొద్దిగా తాగాడు. స్వచ్చంగా ఉన్నాయి. రుచి కూడా వింతగా ఉంది. అది తియ్యదనం కాదు. కానీ ఏదో సాధుత్వం ఉంది.
    అతడికి ప్రాణాలు తేరుకున్నట్లయింది. ఆ పిల్లవాడికి కూడా పట్టాడు. కొంత కష్టం మీద అతడి ముఖం కూడా తేటపడింది. చొంగ తగ్గినట్లయింది. అనపకాయ ప్లాస్క్ ని తన బేగ్ లో వేసుకుని మళ్ళీ నడక సాగించాడు. ఆ కాషాయాంబర ధారిణి చెప్పినట్లుగా పది నిమిషాల్లోనే టౌన్ లో ఆస్పత్రిని చూడగానే ప్రాణం లేచొచ్చి నట్లయింది రవికి. ఏదో గండం గడిచినట్లు అనుభూతి చెందాడు. అసలు గండం ముందే ఉందని అతడికి తెలీదు.
    ఆస్పత్రి కూలిపోతున్న పెంకుటిల్లు. అక్కడ డాక్టర్ లేడు, నర్స్ లేదు. కాంపౌండర్ లేడు. మందులు లేవు. ఒక ఆయా మాత్రం ఉంది, గుప్పుగుప్పున చుట్ట కాల్చుకుంటూ తుపుక్కున ఉమ్ముకుంటూ.
    అంటే డాక్టర్, నర్సూ, కాంపౌండరూ అపాయింట్ కాలేదని కాదు, ఆస్పత్రిలో లేరని.
    "డాక్టర్ గారెక్కడ?" ఆయాని అడిగాడు రవి.
    మళ్ళీ తుపుక్కున ఉమ్మి "లేరు!" అంది పొగ పీలుస్తూ.
    "అర్జంట్ కేస్! డాక్టర్ గారెక్కడున్నారో చెప్పు" దబాయిస్తున్నట్లుగా అన్నాడు రవి.
    "ఇంటికాడున్నాడు"
    "ఇల్లెక్కడా?"
    "తెలవదు."
    తన భుజంమీద వున్న పిల్లాడిని అక్కడి బల్లమీద పడుకోబెట్టాడు రవి. అతడి కాళ్ళూ చేతులూ చల్లబడుతున్నాయి. కాని కొన ఊపిరితో ఉన్నాడు.
    రవి, ఆయా భుజం పట్టుకుని గుంజి "వెళ్ళి డాక్టర్ని పిలుస్తావా? లేకపోతే నిన్ను పోలీసులకి పట్టియ్యమన్నావా?" అన్నాడు కోపంగా.
    ఆయా పెద్ద భయపడలేదు కాని, నిదానంగా లేచి వెళ్ళింది.
    చుట్టూ చూశాడు రవి. అది ఆసుపత్రిలా లేదు. ఎక్కడ చూసినా దుమ్మూ, ధూళీ... అరటి పండు తొక్కల కిళ్ళీ నమిలి ఉమ్మిన మరకలు.
    డాక్టర్ దగ్గిర్లోనే ఉన్నట్టున్నాడు. ఆయా కొద్దిసేపట్లోనే డాక్టర్ తో వచ్చింది. ఆ డాక్టర్ లో అతని వృత్తికి ఉండవలసిన సహనమూ, దయ, సానుభూతి వగైరా లేమీలేవు. వస్తూనే "ఏమిటండీ, పోలీసులన్నారట? పిలవండి పోలీసుల్ని? ఏం చేస్తారో చూద్దాం?" అన్నాడు ధూంధాం లాడుతూ.
    రవి తగ్గి "సారీ! మీ ఆయా ఎంతకీ మీకోసం వెళ్ళకపోతే అలా చెప్పాను. ఈ అబ్బాయిని చూడండి? చావు బతుకుల్లో ఉన్నాడు. వెంటనే తగిన ట్రీట్ మెంట్ ఇచ్చి ఈ అభాగ్యుణ్ని బతికించండి" అన్నాడు.
    డాక్టర్ కి మండిపోయింది ఆయా వచ్చి పోలీసుల ప్రస్తావన తెచ్చేసరికి వచ్చింది ఎవరైనా వి.ఐ.పి. వేమోనని భయపడి వచ్చాడు. చావు బతుకుల్లో మూలుగుతున్న ఆ కూలి కుర్రోణ్ని చూడగానే ఆ డాక్టర్ కి ఎక్కడలేని చిరాకూ, అంతకు మించిన కోపమూ వచ్చాయి.
    "మిస్టర్! మీరెవరో నాకు తెలీదు! డాక్టరు కూడా ఒక మనిషేననీ, అతడికీ కాస్త విశ్రాంతి కావాలనీ, మీకు తెలీదా? ఇక్కడ నా వర్కింగ్ అవర్స్ ఉదయం ఎనిమిది నుండి పన్నెండు వరకు మాత్రమే. రేపు ఎనిమిది తర్వాత తీసుకురండి. లేకపోతే ప్రైవేట్ డాక్టర్ కి చూపించుకోండి."

 Previous Page Next Page