డాక్టర్ మనస్తత్వం అర్థమయిపోయింది రవికి. అదే క్షణంలో గ్రామాల కూలి జనం ఆస్పత్రికి రాకుండా త్రిసికి మంత్రాన్నే ఎందుకు కోరుకుంటున్నారో కూడా అర్థమయింది. అతడిని బతిమాలుకోవాలనిపించలేదు.
"ఇక్కడ ప్రైవేట్ డాక్టరెవరో చెప్పగలరా, దయచేసి?"
"నేనే ఆస్పత్రిలో వర్కింగ్ అవర్స్ అయిపోయాక ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటాను."
నిర్ఘాంతపోయాడు రవి.
"చూశావా గాంధీ! నీ దేశంలో ఎందరు బిచ్చగాళ్ళో? తీరా ప్రాణం పోతుందన్నా, తెల్లకోటు చెయ్యి జాపుతుంది." డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవిత గుర్తొచ్చింది.
"సరే! ఇతడి పరిస్థితి చూడండి. మీ ఫీజు నేనిచ్చుకుంటాను."
"నా కన్సల్టింగ్ ఫీజు ఇరవై రూపాయలు."
"డబ్బు చేహ్తిలో పడితేగాని రోగిని ముట్టుకోను" అన్నట్లుంది అతడి ధోరణి.
తన పర్స్ లోంచి డబ్బు తీసి అతడికిచ్చాడు రవి.
డాక్టర్ యధాప్రకారం గుండె, నాడి, కళ్ళు, నాలుక వగైరాలు చూశాడు తర్వాత చప్పరించాడు.
"లాభం లేదండీ. ఈ రకమైన మూర్ఛ జబ్బులు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో తరచుగా వస్తున్నాయి. వీళ్ళకి శుచీ శుభ్రం తెలీదు. ఒకే చెరువు ఉంటుంది. అక్కడే గొడ్లని కడుగుతారు. అందులోనే స్నానం చేస్తారు. ఆ నీళ్ళే తాగుతారు. ఈ మధ్య కొందరికి కాళ్ళూ చేతులూ చచ్చుబడిపోవటం కూడా జరిగింది. మీకు ఫ్రాంక్ గా నిజం చెప్తున్నాను. ఈ ఆస్పత్రిలో ఉన్న మందులేవో వేస్తాను. కానీ ప్రయోజనం ఉంటుందనుకోను."
కన్సల్టేషన్ ఫీజు ముందుగానే తీసుకుని డాక్టర్ చేసింది ఫ్రాంక్ గా రోది బతకడని చెప్పటం, తను చెయ్యగలిగిందేమీ లేదని ఒప్పుకోవటం.
ఏదో ఇంజక్షన్ పొడుస్తున్నాడు. ఆ సిరంజిలో ఉన్న ద్రవం ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి.
రవికి ఒక్కసారిగా తనలో వున్న శక్తి అంతా హరించుకుపోయినట్లుగా అనిపించింది. ఇంత కష్టపడి తను సాధించిందేమిటి? ఆ పిల్లవాడు బతకడు అనే నిజాన్ని తెలుసుకోవటమా?
"నా బిడ్డని బతికించండి దేవుడోయ్!" అని ఏడుస్తున్న ఆ తల్లికి తాను అప్పజెప్ప గలిగింది కొడుకు శవాన్ని మాత్రమేనా? తను ఏమీ చెయ్యలేడా? మానవుడు ఇంత నిస్సహాయుడా! ఆ పిల్లాడిని అక్కడే వుంచి త్రిసికిని పిలిపించి మంత్రం వేయిస్తే బతికేవాడేమో?
ఏమిటాలోచిస్తున్నాడు తను? మానవుడు ఇలాగే విధి ఎదురుదెబ్బలకి లొంగిపోయి దేవుణ్ని ఆశ్రయిస్తాడేమో?
రెండు చేతుల్లో తల పెట్టుకుని మతిలేనట్టు కూచుండిపోయిన రవి భుజం మీద చెయ్యి పడింది. తల ఎత్తి చూశాడు. మరో కాషాయాంబరధారి. ఇతడు మొగవాడు. గోరంచున్న కాషాయరంగు ధోవతిని చక్కగా కుచ్చెళ్లు పోసి కట్టుకున్నాడు. పైన షర్ట్ లేదు, వుత్తరీయం కప్పుకున్నాడు. మిగిలిన వగైరాలన్నీ ఆధునికంగానే వున్నాయి. పిలక, బొట్టు అలాంటివి లేవు.
"నాతో రండి! మిమ్మల్ని తీసుకురమ్మని దేవి ఆజ్ఞ అయింది" అన్నాడు.
అతడు మాట్లాడుతున్నదేమిటో అర్థంకాక అయోమయంగా చూశాడు రవి.
"మీరు తీసుకొచ్చిన అబ్బాయిని బతికించటానికి దేవి ప్రయత్నిస్తానంది, రండి"
బల్లమీద పడుకుని వున్న అబ్బాయిని అతడే భుజాన వేసుకుని రవి చెయ్యి పట్టుకుని "రండి" అన్నాడు.
మరబొమ్మలా అతడివెంట నడిచాడు రవి. అతడు జీప్ లో వచ్చాడు. ఆ అబ్బాయిని జీప్ వెనక సీట్లో పడుకోబెట్టాడు. రవిని కూడా అతడి పక్కనే కూర్చుని అప్పుడప్పుడు నీళ్ళు పట్టిస్తూ వుండమన్నాడు. అతడే జీప్ నడిపాడు.
చావు బతుకులలో వున్న పిల్లాడి మీదనే దృష్టి లగ్నం చేసిన రవి, జీప్ ఎటు పోతుందో గమనించలేదు. జీప్ ఆగాక కాషాయాంబరధారితోపాటు దిగాడు. పిల్లాడిని కాషాయాంబరధారి ఎత్తుకున్నాడు.
ఎదురుగా వున్నది పాడుబడ్డ కోట. రాతికోట? కోట చుట్టూ లోతైన అగడ్తమీదుగా కోటలోకి వెళ్ళటానికి ఒక ఇనుప ద్వారం. అతడివెంట కోటలోకి వెళ్ళాడు. ఏవేవో గదులు! అన్నీ రాతితో కట్టినవే! కొన్నిటికి ద్వారాలున్నాయి. మరి కొన్నిటికి లేవు. కొన్ని గదులు దాటి విశాలమైన హాల్లోకి వచ్చారు.
"దేవికి నమస్కరించండి!" అన్నాడు అతడు ఎదురుగావున్న విగ్రహానికి చేతులు జోడిస్తూ.
ఇదా దేవి? ఈ విగ్రహం ఆజ్ఞాపించిందా, తనని తీసుకురమ్మని? ఈ విగ్రహం బతికిస్తుందా ఈ పిల్లాడిని? పెద్ద పెద్ద కళ్ళు ప్రసన్నంగా లేవు కాని, భయంకరంగానూ లేవు. విప్పార్చి చూస్తున్నట్లుగా వున్నాయి.
చేతిలో త్రిశూలం. సింహ వాహనం! నాలుక బయటకు చాచి వికృతంగా లేక, చిరునవ్వుతో కొద్దిగా విచ్చుకున్నట్లుగా వున్నాయి పెదవులు. ఆ ముఖంలో ఏదో ఆకర్షణ వుంది.
"దేవికి నమస్కరించండి?" మళ్ళీ అన్నాడు అతడు. అయినా రవి నమస్కారం చెయ్యలేదు. విగ్రహాన్ని పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు.
"నువ్వు నన్ను నమ్మటంలేదు. పోనియ్! నేను నిన్ను నమ్ముతున్నాను. అందుకే ఆహ్వానించాను. ఆ కమండలంలో నీళ్ళు ఆ పిల్లాడితో తాగించు"
ఈ మాటలు ఆ విగ్రహంలోంచి వచ్చాయి. తల గిర్రున తిరిగినట్లయింది రవికి. విగ్రహం నిజంగా మాట్లాడిందా? లేక ఇది హెల్యూసినేషనా?
"తొందరగా తాగించు. ఎలాగైనా చావు బతుకులలో వున్నాడు, జరిగితే మేలు జరుగుతుంది."
మళ్ళీ అంది విగ్రహం లేక, దేవి.
రవి ఆ పిల్లాడిని తన వళ్ళో పడుకోబెట్టుకుని కమండలంలో నీళ్ళు తాగించాడు. కొంచెం కష్టం మీద కొన్ని నిముషాలలోనే మూసుకుపోతున్న పిల్లాడి కళ్ళు తెరుచుకున్నాయి. అతడు తనంతట తాను లేచి కూర్చున్నాడు. నీరసించిన గొంతుతో "దాహం!" అన్నాడు.
"ఇంక అతడికి నీళ్ళు ఇయ్యకండి. వేడి పాలు పట్టండి." విగ్రహం-దేవి మళ్ళీ అంది.
ఒక కాషాయాంబధారిణి పాలు పట్టింది. ఆ పిల్లాడు చుట్టూ చూసి "మా అమ్మేది? అమ్మా" అన్నాడు నీరసంగా.
"ఇంపాసిబుల్?" పిచ్చిపట్టిన వాడిలాగ గట్టిగా అరిచాడు రవి.
విగ్రహం నవ్వింది. వికటంగా-వెటకారంగా... "ఏది ఇంపాసిబుల్?" అడిగింది విగ్రహం!
సమాధానం చెప్పకుండా బిత్తరపోయి చూడసాగాడు.
మళ్ళా విగ్రహమే మాట్లాడింది.
"ఇందులో అంత "అసంభవం ఏముందీ?" ఇప్పుడు "రోబట్స్" రావటం లేదా? ముందుగానే ఫీడ్ చేస్తే కావలసినప్పుడు కావలసిన విధంగా మాట్లాడతాయి. చెయ్యమన్న పనిచేసి పెడతాయి. ఇదంతా ఆధునికుల విజ్ఞానమయితే నేను పూర్వీకుల విజ్ఞానాన్ని అనుకోరాదూ? 'భూత మరియు అభూత' కల్పనలకి మోడ్రన్ సైంటిఫిక్ రీజనింగ్!"
నవ్వసాగింది విగ్రహం.
అది విగ్రహమో లేక దేవీ మూర్తో- లేక మరేదైనా దెయ్యమో, ఏదైనా కానీ తనను వెటకారం చేస్తుందని అతనికి అర్థమయింది.
"నువ్వెవరో నాకు తెలీదు. కానీ నాకు నిజం చెప్తావా?"
"అది నువ్వడిగేదాన్ని బట్టి వుంటుంది. సత్యం తెలుసుకోవాలనే నీకుంటే సత్యమే గ్రహిస్తావు"
"నువ్వెవరు?"
"నిజానికి నేను ఎవరినీ కాను. కానీ నువ్వు ఎవరుగా అనుకుంటే నీకు సంబంధించినంతవరకూ ఆ మూర్తినే అవుతాను"
"ఇలాంటి వేదాంతం కబుర్లు చెప్పకు. నాకసలు దేవుడిలో నమ్మకం లేదు. అంటే దేవిలోనూ లేదని చెప్పక్కర్లేదు. నీ థియరీ ప్రకారం నువ్వు కనపడేదీ, మాట్లాడేదీ, సాయం చేసేదీ నీలో నమ్మకం వున్న వాళ్ళకే కదా. మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నాకెందుకు సాయం చేస్తున్నావూ?"