"మీకు ఈర్ష్య ఎక్కువ!"
అనిల ముఖం జేవురించింది. ఏదో సమాధానం చెప్పేలోగానే కొద్ది దూరంలో కలకలం వినిపించింది. అనిలనీ, అందమైన గిరిజనుల అమ్మాయినీ పూర్తిగా మరిచిపోయి అక్కడికి ఉరికాడు రవి.
పన్నెండేళ్ళ పిల్లవాడు నేలమీదపడి కాళ్ళూ చేతులూ కొట్టుకుంటున్నాడు. కళ్ళు తేలేస్తున్నాడు. అతడి తల్లి కాబోలు ఒక నడివయసు మనిషి గుండె బాదుకుంటూ ఏడుస్తోంది. తండ్రి ఇంకా గెంతుతూనే ఉన్నాడు తప్పతాగి! అదంతా అతని భక్తీ...
మూర్ఛల రోగమేమో? "ముఖం మీద బిందెలతో నీళ్ళు కొట్టండి!" అన్నారెవరో...
"ఇప్పుడు అన్ని బిందెల నీళ్ళెట్టా వస్తాయ్?" అన్నారు మరొకరు.
అదంతా కొండ ప్రాంతం! చెరువు చాలా దూరాన ఉంది. గుళ్ళో బిందెలతో నీళ్ళు పెట్టారు కాని, అవి తాగటానికి. అసలే కెలికినట్టుగా ఉన్న ఆ నీళ్ళు కూడా బిందెల అడుగుకి చేరుకున్నాయి.
"త్రిసికిని పిలవండి! మంత్రం చేస్తది!" అన్నారొకరు.
"అమ్మో! జాతరయ్యేంతవరకూ త్రిసికి గుళ్ళోంఛి కదలదు! పూజలో ఉన్న త్రిసికిని కదిలిస్తే కళ్ళు పోతాయ్"
ఇలాంటి తర్జన భర్జనల మధ్య "నా కొడుకుని నాకు దక్కించండి, దేవుడోయ్" అని ఏడుస్తోంది ఆ తల్లి.
"ఈ సమయంలో కావలసింది మంత్రం కాదు వైద్యం. వెంటనే ఈ అబ్బాయిని ఆస్పత్రికి తీసుకెళ్ళండి."
ఆ అబ్బాయి పరిస్థితి అర్థం చేసుకుని ఆందోళనతో అన్నాడు రవి.
"హాస్పిటల్ కా?"
"ఆసుపత్రికి కాడికి పోతే మడుసులు బతుకుతారా?"
ఏదో విడ్డూరమైన విషయాన్ని విన్నట్లు...అసంభవమైన విషయాన్ని రవి చెప్పినట్లు- విభ్రాంతితో కూడిన వ్యాకులపాటు గొంతులో ధ్వనించగా అన్నారు అక్కడివాళ్ళు.
"అవును, వెంటనే తీసుకెళ్ళండి"
వాళ్ళ మూర్ఖత్వానికి చికాకు కలుగుతోంది రవిలో. వాళ్లకి హాస్పిటల్ కంటే త్రిసికి మంత్రంలోనే గురి ఎక్కువన్నది తెలుస్తోంది స్పష్టంగా.
"ఇప్పుడు టౌన్ కెళ్ళటం ఎట్టా దొరా! వంద కిలోమీటర్ల పైగా ఉంది రోడ్డు! అడవికి అడ్డంపడి పోతే దగ్గరవుతుంది! కానీ జబ్బు మడిసిని మోసుకుపోవటం మాటలా?"
వాళ్ళలో ఒకరన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్ళటం విషయంలో ఎవరికీ కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. తల్లి మాత్రం బోరుబోరున ఏడుస్తోంది. తను చెయ్యగలిగింది అదే గనుక.
"ఈ అబ్బాయిని నేను ఆస్పత్రికి తీసుకెళ్తాను. వెంటనే వైద్యం చేయించకపోతే, నిష్కారణంగా ప్రాణం పోతుంది" అన్నాడు రవి.
ఎవరూ మాట్లాడలేదు. రవి చూపులు విష్ణు కోసం వెతికాయి. అతడు జెన్నిఫర్ తో కలిసి, గిరిజన స్త్రీలు గుంపుగా చేరి గుండ్రంగా తిరుగుతూ చేస్తున్న నృత్యాన్ని చూస్తున్నాడు. విష్ణు దగ్గిరకెళ్ళి "నాకు అర్జంటుగా ఒకసారి జీప్ ఇవ్వండి" అన్నాడు.
"దేనికి?"
"ఒక పిల్లాడు చావుబతుకులలో వున్నాడు. అర్జంటుగా టౌన్ లో ఆస్పత్రికి తీసుకెళ్ళాలి"
"డాక్టర్ రవీ! మనం వచ్చింది వేరే పనిమీద. ఈ విలేజర్స్ జీవితాలలో మనం కల్పించుకోవటం మంచిది కాదు. మనం మంచి ఉద్దేశ్యంతో మంచి చెయ్యబోయినా వీళ్ళు అది అర్థం చేసుకోరు. మనమీదకే ఎదురుతిరుగుతారు చివరికి."
"అవన్నీ, తర్వాత ఆలోచించుకుందాం. ముందు జీప్ తాపం చెవులివ్వండి. అర్జంట్ గా ఆస్పత్రి కెళ్ళాలి?"
"సారీ! ఒకసారి టౌన్ కి వెళ్ళిరావటానికి బోలెడు పెట్రోల్ అవుతుంది. అంత వేస్ట్ చెయ్యటం నాకిష్టం లేదు!"
రవి నిటారుగా అయ్యాడు. ఒక్క క్షణం విష్ణు ముఖంలోకి చూసి గిరుక్కున వెనక్కి తిరిగాడు.
ఆ పిల్లాడు ఇంకా కాళ్ళు, చేతులూ టపటప కొట్టుకుంటూనే ఉన్నాడు. అతడిని భుజం మీద వేసుకుని 'ఆస్పత్రికి తీసుకెళ్తాను' అన్నాడు.
నిర్ఘాంతపోయింది అనిల! అడవిలో కాలిబాట వుంది...ఒంటరిగా...పిల్లవాడిని భుజాన వేసుకుని...
ఒక భుజం మీద పిల్లవాడు, మరో భుజానికి వేలాడుతూ హేండ్ బేగ్, ప్యాంట్ జేబులో 32 రివాల్వర్ బయలుదేరాడు రవి.
"నేనూ వస్తాను" అనలేకపోయింది అనిల! ఆ సమయంలో అతనితో వెళ్తే అనిలని గ్రామీణులు క్షమించరు! దేవనారాయణ్ విషయం చెప్పనక్కర్లేదు. రెచ్చిపోతాడు పూర్తిగా! అతడి క్రౌర్యం, ప్రతీకారవాంఛ, అనిలకి తెలుసు.
గిరిజనుల అమ్మాయితో వేళాకోళంగా మాట్లాడినప్పుడు "వెకిలి మనిషి" అని చీదరించుకుంది. ఇప్పుడతను గిరిజనుల అమ్మాయినీ చూడటం లేదు. తననీ చూడటం లేదు. మట్టిలో దొర్లి దుమ్ము కొట్టుకుపోయి, చీదరగా ఎముకల పోగులా- వికారంగా ఉన్న ఆ లేబర్ క్లాస్ పిల్లాడిని ఏమాత్రం అసహ్యం లేకుండా తన కొడుకే అన్నట్లు ఎత్తుకుని అతడి ప్రాణాలు కాపాడటానికి తన కలవాటులేని అడవి దారివెంట వెళ్తున్నాడు.
రవి ఒక కూలి పిల్లాడిని భుజాన వేసుకుని టౌన్లో ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్ళాడన్న వార్త క్షణాలలో ఆ జాతరలో ఉన్న అమరికీ తెలిసిపోయింది. దేవనారాయణ్, యజ్ఞనారాయణ్ కుటుంబాల వారికీ తెలిసింది. అనిల అతడివెంట వెళ్ళలేదని తెలిసి తాత్కాలికంగా స్థిమితపడ్డాడు దేవనారాయణ్.
"అతడికేమైనా పిచ్చా?" నిరసనగా అన్నాడు యజ్ఞనారాయణ్.
అందరూ ఒక విశేషంగా చెప్పుకుంటున్న ఈ వార్త పట్ల ఏమాత్రం కుతూహలం చూపనిది విలసిత ఒక్కర్తే!
"మనం బంగళాకెళ్ళిపోదాం" అంది యజ్ఞనారాయణ్ తో.
"ఇప్పుడా? సాయంత్రం ఇంకా సహస్ర నామార్చన, హారతి అవన్నీ ఉంటాయి. మనం ఉండాలి"
"ఉండనక్కర్లేదు. మనం వెంటనే వెళ్ళిపోవాలి" సీరియస్ గా అంది విలసిత. అలా అందీ అంటే, అది ఆజ్ఞ అన్నమాటే.
దానిని తిరస్కరించగలిగే శక్తి యజ్ఞనారాయణ్ కి లేదు. వెళ్ళాలని లేకపోయినా భార్యతో ప్రయాణమయిపోయాడు అతడు. జమీందారీ కుటుంబాలలో ఒకటి అలా పూజ మధ్యలో వెళ్ళిపోవటం అదే మొదటిసారి! ఒక పెద్ద ముత్తైదువ అది అపచారమనీ, దాని దోషం తగులుతుందనీ చెప్పబోయింది. విలసిత వినిపించుకోలేదు. ఆమె ఎవరిమాటా వినిపించుకోదు.
అడవిలో కాలిబాట బాగా నలిగి ఉంది. త్వరగా నడవటానికి ప్రయత్నిస్తున్నాడు రవి! భుజం మీద ఉన్న పిల్లవాడి వంటినిండా చెమటలు, నోటి నుండి చొంగ కారుతూ అతడి భుజాన్ని తడుపుతోంది. అక్కడ కూలిజనం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా బరువులు మోసుకుంటూ ఆ బాట వెంట సునాయాసంగా ఎలా నడిచి వెళ్తారా అనుకున్నాడు రవి. మానవ శరీరమంత అద్భుతమైనదీ, శక్తివంతమైనదీ మరొకటి లేదు. మనం దాన్ని లొంగదీసుకోవాలే కాని మంచు గడ్డల్లోనూ, మండు టెడారుల్లోనూ కూడా తన అస్తిత్వాన్ని కొనసాగించుకోగలదు.
ఎంత దూరం నడవాలో తెలియటం లేదు. అప్పుడే అలసట అనిపిస్తోంది. విపరీతమైన దాహం! వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. చుట్టూ చూశాడు.
కొద్ది దూరంలో చెరువు కనిపిస్తోంది. అడవులలో నలిగిన కాలిబాట వదిలి పక్కలకు వెళ్ళటం ప్రమాదం. ఆ కాలిబాట మీదుగా జనం వస్తూ పోతూ వుంటారని అడవి జంతువులు కూడా గ్రహించి ఆ బాట దరిదాపులకు రావు. కానీ, మిగిలిన అడవిలో ఎక్కడ ఏ జంతువులు ఉంటాయో అనుభవజ్ఞులకు కానీ తెలియటం కష్టం.
దాహానికి తట్టుకోలేక పోతున్నాడు. సాహసించి చెరువు వైపు నడిచాడు. బాట తప్పించి, కాలిబాట వదిలాడో లేదో ముళ్ళు తుప్పలు, రాళ్ళూ రప్పలతో ఎగుడు దిగుడుగా ఉన్న నేల అలాగే అవస్థ పడుతూ భుజం మీద పిల్లవాడితో చెరువుకి కొంచెం దగ్గిరగా వచ్చి భయంతో బిగుసుకుపోయి నిలబడిపోయాడు. ఎదురుగా ఏనుగుల గుంపు. తొండాలు పైకి సాచి ఘీంకారాలు చేస్తూ ఒకదానితో ఒకటి తొండాలతో సరసాలాడుకుంటూ గున గున నడుచుకుంటూ వస్తున్నాయి.