Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 18


                                              జల ప్రళయం

 "దాహం ! దాహం !" అంటున్నాడు భూతాలరాజు.
అతనితోబాటు అందరికీ గొంతెండిపోతోంది. అది రాబోతున్న తుఫానుకి సూచన అని గ్రహించాడు సందీప్. సాధారణంగా తుఫాను వచ్చేముందు విపరీతమైన దాహమేసి, నాలుక పిడచకట్టుకుపోతోంది.
వాటర్ క్యాన్ తీసి భూతాలరాజు నోట్లో నీళ్ళు పోశాడు సందీప్. స్వప్న కూడా తాగాక తను కూడా కొద్ది గుక్కలు తాగి తలెత్తి ఆకాశంవైపు చూశాడు. రాక్షసులు గుంపులు గాల్లో ఎగురుతూ వస్తున్నట్లు దట్టంగా అలుముకున్నాయి మేఘాలు. క్షణాల్లో చిమ్మచీకటి ఆవరించేసింది. గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలి వీచసాగింది.
"ఈ గాలికి పడిపోయేటట్లు ఉన్నాను" అంది స్వప్న. కానీ ఆమె మాటలు గాల్లోనే కలిసి కొట్టుకుపోయాయి. ఎవరికీ వినబడలేదు. సందీప్ కి మాత్రం ఆమె చెబుతోంది బోధపడింది. అతనికి 'లిప్ రీడింగ్' వచ్చు. పెదిమల కదిలికనుబట్టి మాటలు గ్రహించగలడు.
మామూలుగా అయితే ఈ పద్ధతిని స్కూల్ ఫర్ ద డెఫ్ అండ్ డంబ్ లో (బధిర, మూగ విద్యార్థుల పాఠశాల)లో నేర్పిస్తారు. మాటలు వినబడని చెవిటి విద్యార్థులు ఎదుటివారి పెదిమల కదలికను బట్టే చెబుతోంది అర్ధం చేసుకుంటారు.
అది తనుకూడా ప్రాక్టీస్ చేశాడు సందీప్.
గాలి తీవ్రత హెచ్చుతోంది. ఆధారం కోసం సందీప్ భుజం పట్టుకుంది స్వప్న.
ఆ తర్వాత వీచబోయే పెనుగాలులతో పోలిస్తే, ఈ గాలి కేవలం మలయ మారుతంలాంటిదే అని స్వప్నకి తెలియదు.
చెట్లు జీబూ తాలు తలలు ఊపినట్లు ఊగుతున్నాయి. ఫిరంగి గుండులా వాళ్ళపక్క నుంచీ దూసుకెళ్ళింది ఒక వస్తువు. దాని వెనుకనే మరో రెండు గుళ్ళు రివ్వు రివ్వున దూసుకొచ్చాయి.
"తాటికాయలు" అన్నాడు సందీప్. అతని పెదిమలు కదులుతున్నాయి గానీ మాటలు ఎవరికీ వినిపించడంలేదు. చండ ప్రచండంగా వీస్తున్న గాలి తీవ్రతకు మరికొన్ని తాటికాయలు తెగి, ఫిరంగి గుళ్ళలా వచ్చి పడ్డాయి.
హోరున వీస్తోంది గాలి. ఆ వేగానికి ముగ్గురూ ఒకరిమీద ఒకరుగా కిందపడిపోయారు.
గాలి వేగం, ఇంకా పెరుగుతోంది, గంటలు వంద కిలోమీటర్లు... నూటయాభై... రెండొందలు.
గంటకు రెండొందల పాతిక కిలోమీటర్ల వేగంతో ప్రళయాన్ని సృష్టిస్తోంది గాలి.
ఉన్నట్లుండి వాళ్ళ మెడమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అంటే దగ్గరలో పిడుగులు పడబోతోన్నాయన్న మాట.
అప్పుడు కనపడింది కళ్ళు చీకట్లు కమ్మేటంత వెలుగు. ఆ తరువాత చెవులు బద్దలయ్యే అంత శబ్దం, అతి సమీపంలోనే పిడుగు పడింది. అంతటి జడివానలోనూ ఒక్కసారిగా భగ్గున మంట లేచి, చల్లారిపోయింది.
'ఎలక్ట్రిక్ స్టార్మ్ !' అనుకున్నాడు సందీప్.
"పిడుగులు పడుతున్నాయ్! ఆ చెట్టుకింద నిలబడదాం!" అంది స్వప్న, ఎలుగెత్తి అరుస్తూ. అది సందీప్ కి మాత్రమే అర్థం అయింది.
 స్వప్న లేవడానికి ప్రయత్నించేసింది. ఆమెని లేవనివ్వకుండా బలంగా చెయ్యి వేసి, దగ్గరగా లాక్కున్నాడు సందీప్.
పిడుగులు పడుతున్నప్పుడు పొరపాటున కూడా చెట్లకింద నిలబడ గూడదని తెలుసు అతనికి. అతని ఊహలని నిజం చేస్తూ, స్వప్న చూపించిన బ్రహ్మాండమైన మర్రిచెట్టుని పిడుగు తాకింది. క్షణాల్లో అంత పెద్దచెట్టు సర్రున కాలి, భస్మమైపోయింది.
దూరాన ఉన్న తాటిచెట్టు ఒకటి వేళ్ళతో సహా పెకలించుకుపోయి, ఎవరో మహాకాయుడు విసిరినా ఈటెలా రివ్వున దూసుకొచ్చి, వాళ్ళముందు పడింది.
మళ్ళీ కళ్ళు చెదిరే వెలుగు - అతిసమీపంగా.
"అమ్మో! ఆ పిడుగు మనమీదే పడుతోంది." అంది స్వప్న కళ్ళు మూసుకుంటూ.
"మనం చూడగలిగాం అంటే ఆ పిడుగు మనని మిస్సయిందనే అర్థం ! డోంట్ వర్రీ!" అన్నాడు స్వప్న వెన్ను నిమురుతూ.
కానీ అప్పటికే స్పృహ తప్పిపోయింది స్వప్నకి.

 Previous Page Next Page