Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 18


    "జిలేబి పాకంలో మైసూర్ పాక్ నంజుకున్నంత కమ్మగా ఉంది. కానీ కానీ" అంది రాణి.

    
    వెంటనే సుందర సుకుమారి డబ్బాలు ఓపెన్ చేసి కాగితం ప్లేట్లలో అరిశెలు... పంచదార కాజాలు... చెక్క పకోడీలు సర్ది అందరికి అందించింది. "మిత్రుల్లారా! ఆరగించండి" అంది.


    "బావుంది. తింటూ కథ మొదలుపెట్టు. మధ్యలో కవిత్వం వెలగబెట్టు" ప్రమద అంది.


    "అటులనే. సమయానికి గుర్తు చేశావ్ ప్రమదావని! మధ్యలో దేనికి? ఆరంభమే అట్టహాసంగా కవిత్వంతో మొదలుపెడతాను" చెప్పింది సుందర సుకుమారి.


    "నోరు మూసుకొని తినక దానికి కవిత్వం గుర్తుజేస్తివి. ఇకచూడు ఎడా పెడా వాయిస్తుంది" రాణి అంది.


    "ఇది తినకా తప్పదు... అది వినకా తప్పదు. మహా కవయిత్రి సు...సు... కానివ్వమ్మా నీ కవిత" అంది వందన.


    "నేను చెప్పబోయే కథకి నాందిగా చిన్న కవిత" అంటూ గొంతు సవరించుకుంది సుందర సుకుమారి.


    "బాబు పాప కలిస్తే బొమ్మలాట
    అబ్బాయి అమ్మాయి కలిస్తే ప్రేమాట
    మొగుడు పెళ్ళాలు కలిస్తే పోట్లాట."


    "శభాష్!" అంది రాణి.


    "అరిశెలు అద్భుతంగా ఉన్నాయి...నీ కవిత అద్భుతంగా వుంది అంది వందనాదేవి.


    "బావుంది... బావుంది. ఈ పంచదార కాజాల సాక్షిగా చెబుతున్నాను" అంది ప్రమద.


    "హమ్మయ్య! నా జన్మ ధన్యమైంది ఇంతకాలానికి నా కవిత్వానికి ఎడా పెడా పడ్డాయి చప్పట్లు__ అప్పనంగా లభించాయి అభినందనలు. ఇంక కథా ప్రారంభం వినండి" ఒక పక్క తింటూ మరోపక్క చెప్పసాగింది సుందర సుకుమారి. "జీవితంలో ఓ తోడు నీడ కావాలి కాబట్టి పెళ్ళి మాత్రం తప్పక చేసుకుంటాను. నా ముక్కు మొహం అందంగానే ఉంటాయి కాబట్టి నా భర్తగారి ముక్కు మొహం ఎలా ఉంటాయో చూడను. సన్నగా, పొడుగ్గా ములక్కాడలాంటి పతిదేముడిని చూసుకొంటాను."


    "కూరల్లేనిచోట పప్పు పులుసులోకి పనికి వస్తాడనా! అమ్మా అమ్మా__ ఏం తెలివే సుందరి" అంది రాణి.


    "డోంట్ బి సిల్లీ! నేను లావు__ నా భర్త కూడా లావు అయితే రిక్షాలో ఎలా పడతాం?" సుందర సుకుమారి తను లావుగా వున్నా ఏమీ సిగ్గుపడదు. సుబ్బరంగా తన మనసులోని మాట చెప్పేసింది.


    "పాయింటే" అంది రాణి.


    "ఇలాంటి పాయింట్లు__ వాటి జాయింట్లు నా దగ్గర సవాలక్ష ఉన్నాయ్. అమ్మాయి నాలాగా గుమ్మడిపండులా వుంటే అబ్బాయి ములక్కాడలా వుండాలి. భార్య పొట్టిగా వుంటే భర్త జెండా బొంగులా వుండాలి.


    "అలా దేనికి?" మధ్యలో అడ్డు తగిలి అడిగింది ప్రమద.


    "అటక మీదనున్న ఆవకాయ జాడీని అవలీలగా అందిపుచ్చుకోడానికి."


    సుందర సుకుమారి చెబుతున్న తీరుకి ముగ్గురికి నవ్వు వచ్చింది.


    "భర్త లావుగా పిప్పళ్ళ బస్తాలా ఉంటే భార్య మల్లెపూవులా వుండాలి. ఎందుకంటే ఆయనగారికి మూడ్ వచ్చి తిక్కపుట్టి అమాంతం సినీ హీరోలా చేతుల మీద ఎత్తుకున్నాడే అనుకో. అప్పుడు అమ్మాయిగార్ని దభేల్ మని కింద పడవేయకుండా ఉండటానికన్నమాట."


    "ఏమో అనుకున్నానే సుందర సుకుమారి! సుఖప్రదమయిన సంసారానికి నీ దగ్గర చాలా కిటుకులే వున్నాయ్. మేం పెళ్ళాడబోయే ముందు "సుఖ కాపురానికి సున్నిత మార్గాలు" ఎలా అంటూ నిన్ను సంప్రదిస్తాం. అసలిలాంటి ఐడియాలు నీకెలా వస్తాయే?" ప్రమద అడిగింది.


    "మా బామ్మ చేసినవి ఆరగిస్తూ__ అలా__అలా ఆలోచిస్తుంటే ఇలా__ ఇలా__ ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయ్. నా మెదడు ఇంత పదునుగా వుందంటే కేవలం మా బామ్మ చేసిన నేతి పిండివంటలే కారణం" సుందర సుకుమారి నాలుగో అరిశె పని పడుతూ చెప్పింది.


    "నిన్ను కొట్టి__తిట్టే భర్త వస్తే ఏం చేస్తావే సుందరి?"


    "పేరుకే ఇది సుందర సుకుమారి. దేహంబు బహు ఘనంబుగా ఉండును కదా! ఇది ఎదురుతిరిగి చేయి ఎత్తిందంటే ఆయనగారు అటు నుంచి అటే ఉష్..." గాల్లోకి చేయి ఎత్తి చూపించింది వందన.


    "ఇది చెయ్యి కూడా ఎత్తక్కరలేదే తల్లీ! కాస్త కళ్ళెర్రజేసి చూపు చూస్తే చాలు... పాపం మానవుడు నిలువునా నీళ్ళుకారిపోతాడు. రాణి అనే సరికి వందనకి, ప్రమదకి నవ్వు వచ్చింది. ఫకాలున నవ్వారు.


    "ఆపండి మీ నవ్వులు" గట్టిగా అరిచింది సుందర సుకుమారి.


    "ఇంతలో ఏమైందే నీకు! అంత గట్టిగా అరిచావ్!"


    "నాకేమీ కాలేదు. కిటికీ తలుపు ఓరగా తెరిచి ఎవరో తొంగి చూశారు. మొహం కానరాకుండా మొహం చుట్టూతా గుడ్డ చుట్టుకొన్నాడు. దొంగేమో!" సుందరి చెప్పింది.


    "దొంగో! దొరో! తరువాత సంగతి. ముందు బైటికెళ్ళి చూద్దాం పదండి" వందన లేస్తూనే అంది.

 Previous Page Next Page