"మీరీ హోటల్ పెట్టకముందు కోర్ట్ లో ఏమన్నా పనిచేశారా? లేక వేలంపాటలు పాడేవారా? ప్రతిదీ మూడుసార్లు చెబుతారెందుకు?" ప్రమద అడిగింది.
"కొంపదీసి ఆ యువతిని రేప్ చేసిన రూమ్ బోయ్ ఇంకా ఇక్కడే ఉన్నాడా ఏంటీ?" అడిగింది సుందర సుకుమారి.
"ఇక్కడెందుకుంటాడు! జైల్లో ఉన్నాడు"
"అయితే ఇంకేం? నిక్షేపంలా మీరు రూము ఇవ్వచ్చుగదా! పైగా ఒంటరి ఆడపిల్ల అయితే మీరు భయపడ్డా అర్థముంది. మేం మొత్తం నలుగురం. మేము పేరుకి నలుగురమే అయినా మా కాలేజీలో మమ్మల్ని అందరూ "ఆడ పంచపాండవులు" అనేవారు సుందర సుకుమారి గొప్పగా చెప్పింది.
"పంచపాండవులంటే ఐదుగురు కదమ్మా"
"పంచపాండవులంటే ఐదుగురే. మా నలుగురిలో ఇదొక్కతి ఇద్దరి సమానం. అందువలన మేము 'లేడి పంచపాండవులం' అయ్యాం.
పైకి నలుగురిగా కనబడ్డా అవసరమైతే ఐదుగురిగా మారతాం. మీకేమన్నా డౌటా! అభ్యంతరమా" ప్రమద అడిగింది.
"పంచపాండవులు ఇద్దరే అన్నా నాకు ఏమీ అభ్యంతరం లేదు. వున్న అభ్యంతరమల్లా మీకు రూము ఇవ్వటంలోనే"
"ఇంతకీ రూమ్ ఇవ్వనంటారు!" వందన అంది.
"ఇవ్వను...ఇవ్వను...ఇవ్వను" మళ్ళీ పాట అందుకున్నాడు హోటల్ ఓనరు.
"మీరెందుకు భయపడుతున్నారో నాకర్థం కావటంలేదు" వందన అడిగింది.
"ఎందుకు భయపడకూడదో నాకర్థం కావటంలేదు. దయచేసి తల్లుల్లారా! మీరు వెళ్ళిపోతే మీకివే నా శతకోటి నమస్కారాలు" నమస్కారం పెట్టి మరీ చెప్పాడు హోటల్ ఓనరు.
వందనకి కాస్త కోపం వచ్చింది. "రండే వెళ్ళిపోదాం. హోటల్ కాకపోతే మరో హోటల్" అంది.
"ఎప్పుడయినా మీకు భయంవేస్తే నన్ను తల్చుకుని ఈ కవిత కళ్ళుమూసుకుని జపించండి" అని చెప్పిన సుందర సుకుమారి రాగయుక్తముగా వినిపించింది.
"నీదాక వస్తే భయం
నాదాక వస్తే జయం
నీదాక వస్తే భయం
నాదాక వస్తే జయం
నీదాక వస్తే భయం
నాదాక వస్తే జయం
అక్కడితో ఆగితే నయం అదే అభయం
అక్కడితో ఆగితే నయం అదే అభయం
అక్కడితో ఆగితే నయం అదే అభయం
"డోస్ చాలు...పదండి" అంటూ ముందుకు కదిలింది వందన. ముగ్గురు వెనకనే బయలుదేరారు.
"బాబోయ్! వీళ్ళు ఆడపిల్లలు కారు...ఆడపులులు. వినయంగా మాట్లాడాను కాబట్టి బతికిపోయాను. లేకపోతే వీళ్ళు నలుగురు కలిసి నన్ను..." రామ...రామ...అంతమాట అనుకోటం ఎందుకులే? రామ...రామ" వాళ్ళు వెళుతున్నవైపు చూస్తూ అనుకున్నాడు హోటల్ ఓనరు.
8
"హమ్మయ్య! ఇప్పటికిగాని నా ప్రాణం తెరిపిన పడలేదు. చల్లటి నీళ్ళతో హాయిగా స్నానం చేసొచ్చి__ ఒంటికి పౌడర్ రాసుకుంటూ అంది ప్రమద.
"ఇప్పటికైనా పడింది కదా!" నైటీ హుక్స్ పెట్టుకొంటూ అంది రాణి.
"పడిందనే అది చెప్పేది. హోటల్లో రూమ్ ఇవ్వనన్నాడు వాడు. మిగతా హోటళ్ళలో రూమ్ లు ఖాళీగా లేవు. ముక్కూ మొహం తెలీని ఈ ఊళ్ళో ఎన్ని హోటళ్ళని వెతుకుతాం? ఎంతసేపని వెతుకుతాం? అని చెప్పి మళ్ళీ స్టేషన్ కి వెళ్ళి వెయిటింగ్ రూములో వున్నాం. మళ్ళీ సాయంత్రం నాలుగు వీధులు తిరగ్గా... తిరగ్గా ఈ హోటల్లో రూమ్ దొరికింది. మొత్తానికి కాస్త కష్టపడ్డా హోటల్లో రూమ్ సంపాదించాం" వందనాదేవి రిలాక్సుగా మంచానికి అడ్డంగా పడుకొని చెప్పింది.
"ఇది మాకు తెలిసిందే కదా! మళ్ళీ మొదట్నించి కథ ఎందుకా అని!" సుందర సుకుమారి అడిగింది.
"వెయిటింగ్ రూమ్ అన్న తర్వాత వచ్చేపోయే ప్రయాణీకులతో కిటకిట లాడుతూనే వుంటుంది. మీరు ఒకటే విసుక్కోవటం. కొన్ని గంటల సహనం వహించలేని మీరు రేపు పెళ్ళి అయి ముక్కూ మొహం తెలీనివాడితో కాపురం వెలగబెడుతూ... కొత్త ప్రదేశం...కొత్త పద్ధతులు కొత్త... కొత్త..."
"ఆగవే వందనా! ఈ రూమ్ లోకి వచ్చిపడి స్నానం గీనం కానిచ్చి ఓ చుక్క తప్పు తప్పు ఓ కప్పు కాఫీ తాగేసరికి మనందరికీ నూతన శక్తి వచ్చేసింది కదా! పెళ్ళిళ్ళు... కొత్త కాపురం... ముక్కు మొహం లేని మొగుడు... గురించి చర్చించుకుంటే ఎలా వుంటుందంటావ్?"
"బాగానే వుండొచ్చు. ఈ ఐడియా నీకే వచ్చింది కాబట్టి నీవే మొదలుపెట్టమ్మా సుందర సుకుమారి!"
"అటులనే. ముందుగా మా బామ్మ నేతితో చేసి ఇచ్చిన పదార్థాలు వింటూ కమ్మ కమ్మగా మాట్లాడుకుందాం. ఎలా ఉంది నా ఐడియా!" సుందర సుకుమారి అడిగింది.