"నీమీద పరువునష్టం దావా వేస్తాం. నిన్ను, నీ పత్రికలని నామరూపాలు లేకుండా చేస్తాం."
"నిరభ్యంతరంగా... దావా వేయండి. బెదిరింపులు మాత్రం మానండి. పత్రికల నోరు నొక్కడం ఎవరి తరం కాదు. మేం కాకపోతే ఇంకో పత్రిక వేస్తుంది. అది మీరూ మర్చిపోకండి. గుడ్ బై" ఆయన కరుకుగా అని ఫోన్ పెట్టేశాడు.
ఎదురుగా ఆరాటంగా చూస్తున్న నీరద, శ్రీనివాస్ లని చూసి "బెదిరింపులు మొదలయ్యాయి. బ్లాక్ మెయిలింగ్ ఆరంభమయింది. నన్ను, నా పత్రికని నామరూపాలు లేకుండా చేస్తామని ఎవరో పెద్దమనిషి ఫోను" నవ్వుతూ అన్నారాయన.
నీరద కలవరంగా చూసింది. "డాడీ! ఏదన్నా చేస్తారేమో నిజంగానే..." అంది.
"ఇంత మాత్రానికే భయపడిపోయేదానివి, పెద్ద ఇన్వెస్టిగేషన్ జర్నలిజమ్ అంటూ మొదలుపెట్టకూడదు. ఇలాంటి తాటిఆకుల బెదిరింపులకీ భయపడితే ఎలా అమ్మా... వెళ్ళు. వెళ్ళి పనిచూడు..." అన్నారాయన. "శ్రీనివాస్! నీవూ భయపడుతున్నావా?"
"లేదంకుల్... ఏదో ఎడ్వంచర్ చేస్తున్నంత ఎగ్జయిటింగ్ గా వుంది."
"గుడ్. కీపిటప్..." అన్నారాయన కంప్యూటర్ వంక తిరిగి.
* * *
"డార్లింగ్! ఇంకా ఎన్నాళ్ళు మనకీ ఎడబాటు? కోర్టు ఇచ్చిన టైము ఇంకా ఎన్నాళ్లుంది? రోజులు నడుస్తున్నట్లనిపించడం లేదసలు. నేనిలా బాధపడడం తప్ప నీకసలు ఏం పట్టనట్లున్నావు. అవును, హాయిగా భార్యాపిల్లలతో వున్నావు. నీకేం బాధ" ఇద్దరూ కలిసి ఆఫీసులో లంచ్ చేస్తుండగా హొయలు కురిపిస్తూ అంది రంజని.
"ఇంకా నెలో నెలా పదిరోజులో వుంది గడువు. నేనేదో భార్యాబిడ్డలతో సుఖంగా వున్నానని అపోహపడకు. ఒకే ఇంట్లో వుంటూ సునీత మొహం చూడాలంటే ఎంత ఇబ్బందిగా వుందో... పిల్లలు... పాపం వాళ్ళకేం తెలుసు? డాడీ అంటూ వెనక వెనక తిరుగుతూ, డాడీ అన్నం తిందాం రా, టిఫిను తిందాం అంటూ లాక్కెళ్ళుతుంటే, ఆ సిచ్యుయేషన్ ఎంత ఇబ్బందిగా వుందో నీకేం తెలుసు?"
"అందుకే నా దగ్గిరకి వచ్చేయమన్నాను... విన్నావు గాదు.."
సునీతకి విడాకులీయకుండా, మనం పెళ్ళి చేసుకోకుండా డైరెక్ట్ గా నీ దగ్గిర వుంటే పరువేం కావాలి? ఇప్పటికే తెలిసినవాళ్ళ చూపులు ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్నాను. మనచుట్టూ సమాజం అనేది ఒకటుందిగా..."
"చెబితే వినవు... ఇంకేం చేస్తాను! ఇంకో నెలా పదిరోజులు గదా... ఏదో ఇలా కక్కుర్తి పడాలి..." రంజని నిరుత్సాహంగా అంది.
రవీంద్రకి ఇదంతా ఇబ్బందికరంగా వుంది. డైవర్సుకి ఆరునెలలు గడువు వుండడం, సునీతతో ఒకే ఇంట్లో వుండడం, పిల్లల మొహాలు చూస్తుంటే ఏదో అపరాధభావంతో మనసు పాడవుతోంది. వైవాహిక జీవితాన్ని, రక్తం పంచుకుపుట్టిన పిల్లలని వదలడం అనుకున్నంత సులువుగా అనిపించడంలేదు.
మనసులో అప్పుడప్పుడు అనవసరంగా ఏదో క్షణికావేశంలో రంజనితో సంబంధం పెట్టుకుని పొరపాటు చేయలేదుగదా అన్న భావన తలెత్తసాగింది.
ఆరోజునించి మనశ్శాంతి కరువైంది. తప్పు చేస్తున్నానన్న భావం మనసుని తొలిచేస్తూ ప్రశాంతత కోల్పోతున్నాడనిపిస్తోంది. భార్యపిల్లలుండగా ఇంకో అఫైర్లో ఇరుక్కోడం వరంకాదు, శాపం అనిపించసాగింది. కాని అడుగు తడబడి బురదలో దిగపడ్డారు. సునీత సానుభూతి కోల్పోయాడు. ఇటురంజని డిమాండ్లు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఇది పెద్ద ఊబిగా మారి దిగబడిపోతున్నానని అతనికి లోలోపల అనిపించసాగింది. దాంతో రంజని పట్ల ఇదివరకటి వ్యామోహం తగ్గి, సునీతకి ద్రోహం చేస్తున్నానన్న చింత పెరిగింది.
* * *
సుప్రియ మొదటిజీతం తీసుకుని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరింది. "ఇదిగో సుప్రియా! నీకేం కావాల్సినా నేను, శారద వున్నామని మర్చిపోకు. ఎవరి ప్రైవసీ వారికుండాలని నీవు వేరే వెళ్ళడానికి ఒప్పుకున్నాను. ఇదిగో ఒంటరిగా వుండి మళ్ళీ లవ్ లు, ఎపైర్లు మొదలుపెట్టకు. జాగ్రత్త! నేను చూస్తుంటాను అని మర్చిపోకు. నీకిప్పుడు కావాల్సింది ముందు జీవితంలో స్థిరపడడం. ఉద్యోగం నిలుపుకో. ఓ ఫ్లాట్ కొనుక్కో లోను తీసుకుని. తరువాత అన్నివిధాలా నచ్చినవాడు దొరికేవరకు తొందరపడకు. ప్రామిస్" అంటూ బోధించి పంపింది సునీత.
ఇంట్లో వున్న స్పేర్ మంచం, స్టవ్, కొన్ని గిన్నెలు, టేబుల్ కుర్చీల్లాంటివన్నీ తీసుకెళ్ళమని ఇచ్చింది. హాస్టల్ వార్డిన్ కి సుప్రియని అప్పజెప్పి. తను గార్డియన్ గా సంతకం పెట్టింది. శారద, సునీత వెళ్ళి గదిలో సామాను సర్ది సుప్రియకి బై చెప్పి వెళ్ళారు.
'ఇన్నాళ్ళూ సునీతతో వుండడంతో, పిల్లలతో ఆడుతూ పాడుతూ సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఒంటరిజీవితం మళ్ళీ మొదలైంది. ఎప్పటికీ తనిలా ఒంటరిగా బతకడమేనా... అందరిలా తనకీ ఓ ఇల్లు, భర్త, పిల్లలు, సంసారం ఏర్పడతాయా ఎప్పటికన్నా! తన ఖర్మ... ఏ మగాడైనా తనని కావాలను కుంటాడు గాని పెళ్ళాడేదాకా రాడే!
సునీత దగ్గరుండగా మర్యాదగా చీర, సల్వార్ కుర్తాలో ఆఫీసుకి వెళ్ళేది. మొదటిసారిగా లాంగ్ స్కర్ట్, లోనెక్ బ్లౌజ్ వేసుకుని జుట్టు రబ్బర్ బ్యాండ్ కట్టకుండా వదిలి చాలా అందంగా లిప్ స్టిక్ వేసుకుని ఆఫీసుకి వెళ్ళింది.
"గుడ్ మార్నింగ్ సార్" అని విష్ చేస్తూ... "ఎనీ అర్జెంట్ పేపర్స్ సార్" అంది.
కాగితాల మధ్యనించి తలెత్తి చూశాడు ప్రకాష్. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, ఓ విధమైన స్పందన సుప్రియ కళ్ళు పసిగట్టాయి. ప్రకాష్ వెంటనే చూపు మరల్చుకుని... "గుడ్ మార్నింగ్... ఏమిటివాళ ఏదో మార్పు కనిపిస్తోంది" ప్రసన్నంగా అడిగాడు.
ఆ మాత్రం ప్రోత్సాహం చాలు సుప్రియకి... సిగ్గు ఒలకబోస్తూ తలదించుకుంది.
"మీకేమన్నా అభ్యంతరమా సార్..." అంది వినయంగా.
"నాటెటాల్... ఆ స్కర్టుమీద ఓ కోటు వేసుకుంటే పెద్ద కంపెనీ సెక్రటరీలా వుంటావు" నవ్వుతూనే అన్నాడు.