మేడమ్... మీ రాహుల్ ప్రాబ్లమ్ ఏమిటి... ఎందుకంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు? ఇంట్లో ఎలా వుంటాడు... ఇక్కడ మాత్రం చాలా శాడిస్టిక్ గా పిల్లలందరినీ ఏడిపిస్తాడు. వాళ్ళ నోట్సులు, పెన్నులు, పుస్తకాలు దాచేయడం, హోమ్ వర్క్ చేసిన పేజీలు చింపడం, వాళ్ళ లంచ్ బాక్స్ లు చాలాసేపు దాచేసి ఏడిపిస్తాడు.
ఎవరన్నా తిరగబడితే తిట్టడం, కొట్టడం... చాలా కంప్లయింట్స్ వచ్చాక నేను రెండు మూడుసార్లు నిలబెట్టి అడిగినా బుద్ధిమంతుడిలా తలదించుకుని నిలబడతాడు తప్ప జవాబు చెప్పడు. ఇతని ప్రేమగా చూసుకునే వాతావరణం వుండీ ఈ ప్రవర్తనకి కారణం ఏమిటి?" ప్రిన్సిపాల్ చెప్తుంటే శారద అయోమయంగా చూస్తూ వింది.
"మీరు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది మేడమ్. ఇంట్లో ఇలాంటి ప్రవర్తన లేదు. ఏదో ప్రతిఇంట్లో పిల్లలు చేసే అల్లరి, అప్పుడప్పుడు మంకుపట్టు పట్టడం లాంటివి తప్ప వైలెంట్ గా బిహేవ్ చెయ్యలేదు. ఆ రోజు ఎన్నోరకాలుగా మంచిచెడు విడమర్చిచెబితే కన్విన్స్ అయినట్లే కనిపించాడు. ఇకముందు బాగా వాడిని గమనిస్తాను. చదువులో కూడా మరింత శ్రద్ధ తీసుకుంటాను" శారద అపాలజిటికల్ గా అంది.
ఏమైనా రాహుల్ ని మంచిమాటలతో దారికి తేవాలి. వాడిలో తండ్రిపోలికలు బాగా కనిపిస్తున్నాయి. షార్ట్ టెంపర్... నోటికి వచ్చింది అనేయడం, తను కావాలనుకున్నదే అవాలనే పంతం... మొదలైన లక్షణాలు కనిపిస్తున్నాయి.
తను జాగ్రత్త పడకపోతే వీడు మరో ప్రకాష్ లా అవుతాడు. రాహుల్ ని ఎలా హ్యాండిల్ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఇంటిదారి పట్టింది.
* * *
ఆదివారం 'ఉషోదయం' పత్రిక పాఠకులలో సంచలనమే రేపింది. డిపాజిటర్ల వ్యధాభరిత కథలు... శ్రీధర్ రెడ్డి ఇంటర్వ్యూ చదివి తిట్టని డిపాజిటర్లు లేరు. ఇంటర్వ్యూలో బ్యాంక్ రుణం గురించి చర్చించడానికి ఇష్టపడలేదన్న విషయం వెల్లడించడంతో ప్రజల ఆగ్రహం ఇంకా ఎక్కువైంది. బ్యాంక్ ఉద్యోగులు శ్రీధర్ రెడ్డి తీసుకున్న రుణం నలభై ఐదుకోట్ల వివరాలు కాగితాల జిరాక్స్ లు పేపరులో మర్నాడు ప్రకటించాలని, అలాగే బ్యాంక్ తరుపున పంపిన నోటీసులు అన్నీ పేపరులో ప్రముఖంగా ప్రచురించి అలాంటి పెద్దమనుషుల గుట్టు రట్టు చెయ్యాలని కోరారు.
పాఠకుల ఉత్తరాలు, ఫ్యాక్స్ లు, ఫోన్ కాల్స్ లో అందరూ ఒకటే మాటగా అలాంటి పెద్దమనుషుల ఆస్తులు ప్రభుత్వం ఎందుకు జప్తు చెయ్యదో తెలియచెప్పాలని కోరారు. అపోజిషన్ పార్టీలు కూడా అలాంటివారిని ఊరికే పోనీయ కూడదని, రాబోయే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ విషయంలో ప్రజలకి న్యాయం చేకూర్చాలని పోరాడతాయి అని చెప్పారు.
పేపరులో వారానికి ఓ పెద్దమనిషి తీసుకున్న అప్పుల వివరాలు సాక్ష్యాధారాలతో ప్రచురించి వారికి వున్న స్థిరచరాస్తుల వివరాలు రాసి వారి జాతకాలు బయట పెట్టాయి. మిగతా పత్రికలు ఈ పత్రికకి వచ్చిన ప్రజల స్పందన చూసి తామూ అలాంటి వివరాలను సేకరించి రాయడం ఆరంభించి ఆ పత్రికకి సపోర్టుగా నిలిచాయి.
అణిగిపోయిందనుకున్న బ్యాంకుల దివాళా భాగోతం పైకి రావడంతో అప్పులు ఎగ్గొట్టిన బడాబాబుల మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండాపోయింది. తమ తమ ఆస్తుల వివరాల దగ్గిరనించి బయటపడి ఇన్ని కోట్లుండి సామాన్య ప్రజల డబ్బు మింగారన్న ప్రజల శాపనార్థాలు తట్టుకోవడం కష్టమైంది. అట్టహాసంగా క్లబ్బులకి, పార్టీలకి తిరిగేవారంతా మొహం చెల్లక బయట తిరగడం మానేశారు.
ఈ సంఘటనతో పత్రికల వారిని, మీడియావారిని తప్పించుకుని తిరగడం కష్టమవసాగింది. శ్రీధర్ రెడ్డి పరువు బజారునపడి బయట కనిపిస్తే జనాల చూపులు తూట్లు పొడుస్తున్నట్టు అవమానపడి దానికి కారణమైన ఉషోదయం పత్రికమీద కక్ష పెంచుకున్నాడు.
ఎడిటోరియల్ రాసుకుంటున్న నారాయణమూర్తిగారి ఫోను మోగింది. "హలో... ఉషోదయం ఎడిటరేనా మాట్లాడేది?"
"అవును... తమరెవరు... ఏం కావాలి?" వినయంగా అన్నారాయన.
"ఏం, నీకు బతికి బట్టకట్టాలని లేదా? పేపరునిండా అడ్డమైన రాతలు రాయడానికి నీకెంత ధైర్యం..." అవతలి గొంతు కర్కశంగా అంది.
ఒక్కక్షణం నారాయణమూర్తిగారు తొట్రుపడి వెంటనే నిలదొక్కుకుని "తమరెవరో, పేపరులో ఏం అడ్డదిడ్డమయిన వార్తలు రాశామో ఆ వివరాలు చెబితే వివరణ ఇచ్చుకోగలం" సౌమ్యంగా అన్నారాయన.
"స్టాపిట్... ఈ దొంగవినయాలు చాలించు. ఏం అడ్డదిడ్డమో తెలియదా? బ్యాంక్ దివాళా గురించి పెద్ద మనుషులని ఇరికించి బ్లాక్ మెయిల్ చెయ్యాలనుకుంటున్నావా... చేతిలో పేపరుంది గదా అని ఇష్టమొచ్చినట్టు రాస్తే చెల్లుతుందనుకుంటున్నావా...."
"చూడండి... పేపరులో ఇష్టమొచ్చినట్టు రాయం. నిజాలనే రాస్తాం. మేం రాసిందానిలో అబద్ధాలు, అతిశయోక్తులు వున్నయనుకుంటే అవేమిటో చెబితే నిజాలో, అబద్ధాలో నిర్థారణ చేస్తాం... అబద్దాలని మీరు రుజువు చేస్తే తప్పక స్టేట్ మెంట్ వెనక్కి తీసుకుని పత్రికాముఖంగా క్షమాపణ చెబుదాం. ఇంతకీ మీరెవరు? పేరుకూడా చెప్పే ధైర్యంలేని మీరు పత్రికలో నిజానిజాలని గురించి ఎలా మాట్లాడతారు? ధైర్యం వుంటే మీ పేరు చెప్పి మీకు తెలిసిన తప్పులు చెప్పండి... అంతేగాని మీ బెదిరింపులు మానండి. బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నది మీరు" కటువుగా అన్నారాయన.
"నీవు రాసేదంతా నిజమనుకుంటున్నావా? ఏకపక్షంగా విని నిర్ణయించే అధికారం నీకెక్కడిది?"
"ఏకపక్షంగా రాయం. ఏ పక్షంలో నిజం వుంటే అదే ప్రజలకి చెబుదాం. రాసిందానిలో నిజం లేదని మీరు చెబితే సరిదిద్దుకుంటాం అని మరోసారి చెబుతున్నాను. మా దగ్గిర సాక్ష్యాధారాలున్నవాటినే ప్రచురిస్తాం... లేదంటే కేవలం మామూలు వార్తగా ప్రచురిస్తాం తప్ప లోతులకి వెళ్ళం... ఏది ఏమైనా జరిగేవాటిని ప్రజలకి తెలియచెప్పటానికే పత్రికలున్నాయన్నది మరవకండి. పెద్దమనుషుల గుట్టు రట్టు కాంగానే పత్రికలనే బెదిరించడం మంచి సాంప్రదాయం కాదు. పత్రికా స్వేచ్ఛ ఈ దేశంలో వున్నదని మరవకండి."