అతనింకా ఏదో అనబోతూంటే నేను అడ్డుపడి "మరి తర్వాత ఏమనుకున్నారు? ఇప్పుడే మనుకుంటున్నారు?" అనడిగాను చిన్నపిల్లలా. అలా అడిగిన తర్వాత సిగ్గేసినా, అతను నన్ను మెచ్చుకుంటుంటే చిన్న పిల్లలకు కలిగే ఆనందం కలిగింది.
ఈ లోపులో అతనన్నాడు. "తరువాత, తరువాత నువ్వు పుస్తకాలు ఆసక్తిగా చదువుతూ, ఇంటిపనిని ఓ అడ్డంకిలా ఫీలవుతుంటే మ ఇంటి వాతావరణంలో అనవసరంగా నలిగిపోతున్నావని జాలివేసేది. ఆ విషయంలో నీకూ, వాడికీ గొడవలు వస్తాయని ముందే వూహించాను. ఎందుకంటే వాడు బాగా హోమ్లీటైప్. వాడికి నీలా నాలా ఛాలెంజింగ్ జీవితం అక్కర్లేదు. అమ్మ వండి పెడుతుంటే, పెళ్ళాం అత్తగారికి సాయపడుతూ, తనను ప్రేమిస్తుంటే, సాఫీగా జీవితం గడిపేయాలనుకున్నాడు. దురదృష్టవశాత్తూ నా ఊహ నిజమైంది. కానీ నువ్వు చాలా తెలివైన అమ్మాయివి కనుక అవన్నీ నువ్వు పరిష్కరించుకోగలవన్న నమ్మకం కూడా నాకుంది" అన్నాడు. అప్రయత్నంగా నా కళ్ళెందుకో తడయ్యాయి. ఈ మాత్రం సానుభూతికోసం నేనెంత మొహంవాచి వున్నానో దాన్నిబట్టే నా కర్థం అయింది.
"నా మనస్తత్వం సరిగ్గా అర్థం చేసుకున్నది మీరొక్కరే. నేను పెరిగిన వాతావరణం వేరు. వంటింటి గురించి తపన పడుతూ పెరగలేదని, అందుకే నా ఆలోచనా సరళి వేరుగా వుంటోందనీ మన ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. సర్లెమ్మని నేనే మన ఇంటి వాతావరణానికి అనుగుణంగా మారదామని ప్రయత్నిస్తున్నా ఎవరూ నాకు సహకరించట్లేదు" అన్నాను. నా కంఠం రుద్ధమైంది.
నా వ్యధని పంచుకున్నట్లుగా అతను మౌనంగా విని, తర్వాత "అవును...నేను అర్థం చేసుకోగలను. కానీ బాధపడడం వల్ల ప్రయోజనం లేదు కదా! సంసారమే అక్కర్లేదని వెళ్ళిపోతే అది వేరే సంగతి. కానీ కావాలనుకున్నప్పుడు దాన్ని మనకు అనుగుణంగా మలచుకోవడంలోనే మన తెలివితేటలు బయటపడతాయి. అది చెప్పినంత తేలిక కాదనుకో. నువ్వు మానసికంగా సర్దుకోవడానికి కొంతకాలం పడుతుంది. అంతవరకూ ఓపికపట్టు...ఓ.కే." అతని స్వరం మార్దవంగా, వాత్సల్యంగా, ఓదార్పుగా ధ్వనించింది. ఇంట్లో అసలే విషయమూ పట్టించుకోవడానికి తీరికలేని మనిషిలా కనిపించే ఇతను ప్రతి చిన్న విషయాన్నీ ఇంత లోతుగా పరిశీలించి కరెక్టుగా అంచనా వేసి అర్థం చేసుకుంటున్నాడు. ఇతనింత బాధ్యతాయుతమైనవాడు కాబట్టే ఇంట్లో ఎవరూ ఈయనకి ఎదురు చెప్పరు. ఇది అర్థమైన తర్వాత నాకు ఆయనమీద గౌరవం మరింతగా పెరిగింది.
నేను అతనితో ఇంకోటి కూడా గమనించాను. అతను ఇంట్లో మిగతా వారందరిలా లౌక్యుడుకాడు. మిగతా వాళ్ళెవరైనా ఏదైనా మాట్లాడుతూ వుంటే మనసులో ఇంకేదో పెట్టుకుని, పైకి వేరేలా కనబడుతున్నారేమోననే భావం నాకు కలుగుతుండేది. ఆ అలవాటు ఈయనలో లేకపోవడం నేను గుర్తించాను. అతనిమీద విశ్వాసం పెంచుకోవడానికి ఇది కూడా దోహదపడింది.
దగ్గరగా చూడడం వల్ల అతని వ్యక్తిత్వాన్ని బాగా పరిశీలించే అవకాశం నాకు కలిగింది. అతనిలో అదో విధమైన నిరంతర రిలాక్సేషన్ వుంది. ఎప్పటి విషయమప్పుడు, ఎక్కడి గొడవలనక్కడే వదిలేసి, తర్వాతి దానిమీద మనసు కేంద్రీకరించే కంపార్ట్ మెంటలైజేషన్ వుంది. ఈ గుణం అందరికీ వుండదు. ఆఫీసు గొడవల్తో ఇంట్లోకి వచ్చి కురుక్షేత్రం సృష్టించే వ్యక్తులు కోకొల్లలు.
అంతకంటే ఎక్కువ వత్తిడి, రిస్క్ వున్న వ్యాపార రంగంలో వుంటూ కూడా ఇతనింత ఆహ్లాదంగా కనిపించడం నాకు అమితమైన ఆశ్చర్యం కలిగించేది.
శ్రావ్యమైన సంగీతం వినడం అతని అలవాటు. అదే తనను బాగా ఆహ్లాదపరిచేది అని అతనెప్పుడో ఒకసారి చెప్పాడు. కరులో ఎప్పుడూ సన్నటి సంగీతం వినిపించడం వల్ల అది నన్ను ఉల్లాసపరుస్తుంటే నాకూ అది నిజమేననిపించింది. ఆ ఉల్లాసం చాలాసేపు నన్ను కదలకుండా వుంచేది. ఈ విషయం నాకింతకాలం ఎందుకు తెలియలేదా అని నేను ఆశ్చర్యపడ్డాను. చురుకుగా పనిచేయగలగడం, కొత్త ఉత్సాహం నాకు తెలీకుండానే నాలో ప్రవేశించాయి. భవిష్యత్తు ఆశాజనకంగా వుండడం మొదలు పెట్టింది.
ఇంతక్రితంలా అతనితో కలిసి కార్లో వెళ్ళడం నాకు గిల్టీగా అనిపించడంలేదు. అదేదో మామూలు విషయంలా కనబడసాగింది. బయటి వాళ్ళకు కూడా అది విడ్డూరంగా కనబడాల్సిన అవసరంలేదని నా నమ్మకం. ఎందుకంటే అతనికీ, నాకూ వయసులో వున్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నన్ను నేను సమాధానపర్చుకోవడానికి వెతుక్కున్న జవాబేమోనని తరువాత అనిపించింది.
నేనలా వెళ్తున్నానన్న విషయం మా అమ్మకు తెలిసిన తర్వాత, తనకు నచ్చని విషయం వింటున్నట్లుగా మొహం పెట్టింది. "ఎందుకే బండి కొనుక్కోవచ్చుగా? నువ్వే దర్జాగా వెళ్ళొచ్చు" అంది, నాక్కాస్త బాధేసింది. ఒక ఆడా, మగా కాస్త సన్నిహితంగా వుంటే ఎవరికైనా ఈ అర్థరహితమైన అనుమానమే ఎందుకొస్తుందో అర్థంకాలేదు. అయితే నా చిరాకుని ప్రదర్శించకుండా "సర్లే, దానికో పెద్ద గొడవ జరిగింది. నా డబ్బు దానికి తగలేయడం వాళ్ళ కిష్టంలేదు. నాకు శ్రమ కలగకుండా వుండడానికి ఇది 'వాళ్ళు' కనుక్కున్న పరిష్కారమే!... అయినా ఆయన చాలా పెద్దవాడమ్మా, నేనంటే ఎంతో ఆపేక్ష" అని చెప్పాను. ఆ తర్వాత తర్వాత కూడా మాటల్లో "ఆయన బిజినెస్ విషయాలు అప్పుడప్పుడూ నాతో చర్చిస్తూ వుంటారు. నాకీ రంగంలో ఆసక్తి ఎలా ఏర్పడిందా అని ఆయన కెప్పుడూ ఆశ్చర్యమే. ఇదంతా మా నాన్నగారు, అన్నయ్యల నుంచి నేర్చుకున్నదే అని నేను చెప్తే ఎంతో మెచ్చుకున్నారు" లాంటి వ్యాఖ్యానాలతో నా తండ్రి అంతటివాడి గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడేదాన్ని. మనిషి తన ప్రవర్తనకి అనుగుణంగా ఎంత చక్కగా తన మాటల్ని ఏర్చి కూర్చుకుంటాడో కదా అని ఆ తరువాత నాకే అనిపించింది.
ఒకరోజు నా అత్తగారి దూరపు బంధువు ఒకావిడ మా ఇంటికి వచ్చింది. న అత్తగారు ఆవిడతో ఇంత పెద్ద కుటుంబానికి ఇల్లు చిన్నదైపోయి, సరిపోవట్లేదని చెప్తుంటే ఆవిడ పెద్దరికమంతా తనకే ఆపాదించేసినట్లు సలహాలు ఇవ్వబోయింది. "మగవాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోగలరు. నీ కోడలి కాలేజికో, కూతురు కాలేజీకో దగ్గరగా పెద్ద ఇల్లు తీసుకో. అద్దె ఓ రెండు మూడువందలు ఎక్కువైనా ఫర్లేదనుకో. మీ ఇంట్లో అంతా సంపాదనాపరులేగా!" అని దీర్ఘాలు తీసింది.
"ప్రస్తుతం అదేం సమస్య కాదొదినా. చిన్నదాని కాలేజీ దగ్గరే. ఆటోలో వెళ్ళినా ఐదు రూపాయలవుతుంది. ఇక కోడలంటావా, దాన్ని మా పెద్దాడు దింపుతాడాయె..." అని తన ధోరణిలో చెప్పుకుపోతోంది మా అత్తగారు. మా దూరపు బంధువు ఎనిమిదో వింత జరిగినట్లు అదిరిపడింది.
"పెద్దాడు చిన్న కోడలిని దింపుతున్నాడా?" అంది ఆవిడ తప్పుగా విన్నానేమో అన్నట్లు.
నా అత్తగారు వెంటనే సర్దుకుని "అదే... అమ్మాయి పాపం చిన్నపిల్ల. ఉద్యోగం, ఇల్లు సర్దుకోలేక, బస్సులో ప్రయాణాలు చేయలేక అవస్థపడుతోంది అని నేనే పెద్దాడిని 'వీలున్నప్పుడల్లా అమ్మాయిని దింపేయరా, నీదీ అదేదారిగా' అన్నాను. వాడూ పాపం వెంటనే ఒప్పుకున్నాడు. ఎంతైనా నా పిల్లలు నా మాట జవదాటరు" అని గర్వంగా చెప్పుకుంది.
నా అత్తగారు ఏం చెప్తుందా అని కుతూహలంగా లోపలి నుంచి వింటూన్న నేను ఆవిడ చెప్పిన తీరుకి ఎంతో ఆశ్చర్యపోయాను. ఎదుటివాళ్ళకి మరే వాదమూ లేకుండా చెప్పగలగడం అందరికీ సాధ్యంకాని విషయం. నా అత్తగారిది అందులో అందెవేసిన చెయ్యి. అయినా ప్రస్తుతం ఆవిడ నన్ను సమర్థించడం చాలా ఆనందాన్ని కలిగించింది.
ఏదేమైనా మేమిద్దరం రాకపోకలు సాగించడం ఆగలేదు. అతని ఎక్టివిటీస్ లో రాను రానూ నేనూ బాగా పాలుపంచుకోసాగాను. మా ఇద్దరి భావసారూప్యం నన్ను చకితురాలిని చేసేది.
ఆశ్చర్యకరంగా అతనికి అధునాతన ఫ్యాషన్స్, వస్త్రధారణ, హెయిర్ స్టయిల్స్ గురించి కూడా బాగా తెలుసు. ఎప్పుడో మాటల్లో "ఈసారి టూర్ కి వెళ్ళినప్పుడు నీకు రాజస్థానీ ఉలెన్ హాండ్ వర్క్ చేసిన డ్రెస్ తీసుకొస్తాను. క్రితం సారి చెల్లాయికి తెచ్చాను. నువ్వు చూశావా నేను తెచ్చిన డ్రెస్?" లాంటి మాటలు అతని నోటినుంచి దొర్లితే నాకు వింతగా వుండేది. విట్నీ హాస్టన్ కి ఫలానా సినిమాలో వున్న స్టయిల్ ఇంకే సినిమాలో వుందో చెప్పేవాడు. ఇతన్ని అతనెప్పుడు ట్రాక్ లో ఉంచుకుంటాడా అని నాకు ఆశ్చర్యం కలిగేది. రీడర్స్ డైజెస్ట్ జోక్స్, 'హిందూ' లో వచ్చే మానేజిమెంట్ ఆర్టికల్స్, సంపాదకీయం అతనికి ఎప్పటికప్పుడు తెలిసిపోయేవి. ఇతరులు చూసి నేర్చుకోవాల్సిన ఇలాంటివే ఎన్నో మంచి లక్షణాలని నేను అతనిలో గమనించాను.
అదంతా గుర్తొస్తే ఇప్పుడు నవ్వు వస్తూంది. ఎవరో రచయిత అన్నట్టు మొదట్లో ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తిలో మంచి లక్షణాలనే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు తమ మంచి లక్షణాలనే చూపిస్తారు కాబట్టి!
14
ఒకరోజు మా అమ్మా వాళ్ల ఇంటినుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను స్నానం చేస్తున్నాను. అసలు ఫోన్ వచ్చిందన్న విషయం నాకు తయారై బయటి కొచ్చేవరకూ తెలీదు. నా భర్త నాతో ఏదో చెప్పాలన్నట్టు, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నట్టు గంభీరంగా మొహం పెట్టి పచార్లు చేస్తున్నా, నేనేం పట్టించుకోలేదు. 'ఏదో అవసరం వచ్చుంటుంది, ఎలా అడగాలా అని సందిగ్ధంలో వున్నాడు. అడగనీ అతన్నే' అనుకున్నా నిర్లక్ష్యంగా.
ఉన్నట్టుండి అతను పచార్లు ఆపి "మీ ఇంటికేసి వెళ్ళొద్దాం. ఈ రోజు కాలేజీకి వెళ్ళకు" అన్నాడు.
ఎందుకో నాకర్థంకాక "దేనికీ?" అనడిగాను.
"ఏం లేదు. మామయ్యగారికి చిన్న హార్ట్ అటాక్ వచ్చిందట. చిన్నదే కంగారు పడాల్సిందేమీ లేదన్నారు. హాస్పిటల్ కు వెళ్ళి చూద్దామని" అన్నాడు. నాకు ఒక్కసారిగా ఒళ్ళు చల్లబడిపోయింది.
మేం వెళ్ళేసరికి ఆయన్ని చూడనివ్వలేదు. అమ్మ దిగులుగా బెంచిమీద కూర్చునుంది. వదిన అమ్మ భుజం చుట్టూ చెయ్యేసి అండగా నిల్చుని వుంటే, అన్నయ్య డాక్టర్లు పురమాయించే పనుల మీద తిరుగుతున్నాడు.
ఆ రోజంతా మాకు కంగారుగానే గడిచింది. ఒకరికొకరం తోడుగా, ధైర్యం చెప్పుకుంటున్నట్లుగా ఒకేచోట కూర్చున్నాం. నా తల్లి బయట పడట్లేదు కానీ ఆవిడెంత కదిలిపోయిందో ఆ మొహం చూస్తే పసిగట్టేయవచ్చు. భార్యాభర్తల బంధం ఇంత బలంగా వుంటుందా? జీవితాలే ముడిపడుంటాయా? మరి మా ఇద్దరి విషయంలో ఎందుకలా జరగట్లేదు? అతనికేదైనా జరిగితే నేనూ అందరిలాగే బాధపడతానేమోగానీ, ఇలా క్రుంగిపోతానని గ్యారంటీగా చెప్పలేను. అంత విషాదంలోనూ నా ఆలోచనలు నాకే చిత్రమనిపించాయి. 'ఆధారపడడం' ఆప్యాయతకి పునాదేమో!
ఆ రోజు రాత్రి పదవుతూ వుండగా నా భర్త ఇంటికి వెళ్ళి పోతానన్నాడు. అతనింకా వుంటే బావుండుననిపించింది నాకు. నా ఆలోచన నాకే ఆశ్చర్యం కలిగించింది. అయినా వుండమంటే అతనేం జవాబు చెప్తాడో నాకు తెలుసు. "ఇంట్లో అన్నయ్య కూడా లేదు. వాళ్ళ ముగ్గుర్నీ ఎలా వదిలేస్తాము?" అంటాడు. అందుకే అతన్నేం ఆపలేదు.
స్పృహ వచ్చాక "బాగా కంగారుపెట్టానామ్మా?" అన్నారు నా తండ్రి వాత్సల్యంగా. ఆయన్ని ఆ స్థితిలో చూసి నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. "నువ్వింటి కెళ్ళమ్మా. నిన్నట్నుంచీ తిండీ తిప్పలూ లేకుండా ఇక్కడే వున్నట్టున్నారు. మీ అత్తయ్య ఇక్కడే వుంటుందిలే" అన్నారాయన మా వదినతో.
మా వదిన చాటుగా కళ్ళు తుడుచుకోవడం నాకేం ఆశ్చర్యం కనపడలేదు. వాళ్ళ నలుగురి మధ్యా ఎంత ఆపేక్షలు అల్లుకున్నాయో నాకు అర్థమైంది. మనసులో ఏ మూలో ముల్లు గుచ్చుకున్నంత బాధ. సంస్కారంతో దాన్ని మాపేశాను.
నా తండ్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేను ఒక రోజు అక్కడే వుండి, ఆ తర్వాత వాళ్ళ బలవంతం మీద మా ఇంటికి వచ్చేశాను.
నాకు సంబంధించినంతవరకూ ఆ సంఘటన ప్రభావం చాలా వుంది. మా ఇంట్లోవాళ్ళు ఒకరిమీద మరొకరు ఆధారపడే విధానం, ఆ ప్రేమాభిమానాలూ చూస్తుంటే నేను నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపించింది. ప్రేమాభిమానాలు 'పరస్పరం' వుండాలనే విషయం నేను మర్చిపోలేదు.