Previous Page Next Page 
సాహసి పేజి 18


    తనెందుకొచ్చిందో చెప్పింది.

    "మీతో ఎన్నాళ్ళుండాలి" అడిగాడు కపాలేశ్వర్.

    "దాదాపు సంవత్సరంపాటు... మీ పని అయిపోయిన వెంటనే పంపిచేస్తాం. ఎందుకైనా మంచిదని సంవత్సరం అని అనుకోవడం"

    "మీకు తెలుసనుకుంటాను. అయామ్ మేరీడ్ ఒక బేబీ"

    "తెలీదు" చెప్పింది ఇందుమతి. "ఏవైనా అభ్యంతరం ఉంటే వద్దు" మళ్ళీ అంది ఇందుమతి.

    "నాకైతే రావాలనే ఉంది- దిసీజ్ ఏన్ యాపర్చునిటీ ఫర్ మీ. కానీ..."

    "మీకే విషయంలోనైనా డౌట్స్ ఉంటే చెప్పండి" అంది ఆమె.

    "ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను. ఈజ్ దేర్ ఎనీ మొనిటరీ బెనిఫిట్" అన్నాడు.

    మందస్మితం చేసింది ఇందుమతి.

    రెండు నిమిషాలు తటపటాయించాడు కపాలేశ్వర్.

    "నెలకు పాతికవేలివ్వండి, నిధి దొరికినా దొరక్కపోయినా నా కనవసరం" అన్నాడు కపాలేశ్వర్ నిర్మొహమాటంగా.

    ఆలోచనలో పడింది ఇందుమతి.

    'ఇదే మంచి పద్ధతి. పనవగానే ఎకౌంట్ సెటిల్ చేసేయొచ్చు' కాలిక్యులేటెడ్ గా ఆలోచించింది ఇందుమతి.

    "ఓ.కే." హేండ్ బేగ్ తీసి పాతికవేలు రూపాయల్ని ఎడ్వాన్సుగా చెల్లించింది.

    "థాంక్యూ" అవసర సమయంలో, డబ్బు అందినందుకు ఆనందంగా వుంది కపాలేశ్వర్ కి.

    "ఎప్పుడు బయల్దేరుతున్నాం" అడిగాడు కపాలేశ్వర్.

    "ఇంకా నిర్ణయించలేదు. మనం బయల్దేరేలోపు మీరు చెయ్యాల్సింది మీకేం సామాగ్రి కావాలో... ఒక లిస్ట్ ను తయారుచెయ్యండి అంటే బైనాక్యులర్స్- వగైరా లాంటివి... బహుశా అరకులోయ ప్రాంతంలో మన అన్వేషణ వుంటుంది. ఈ లోపల మీరు కొంత మెటీరియల్ గేదర్ చేస్తే బాగుంటుంది" చెప్పింది ఇందుమతి.

    "అదెంతసేపు- నా దగ్గర చాలా ఇన్ ఫర్ మేషనుంది. అరకులోయ అన్నారు గదా- మనకేమాత్రం అది ఉపయోగపడుతుందో చూస్తాను-" అన్నాడు కపాలేశ్వర్ ఉత్సాహంగా.

    ఇందుమతి లేచింది.

    ద్వారబంధం వరకూ వచ్చాక-

    "ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్- ఈ విషయం ఎవరికీ తెలియకూడదు- రహస్యంగానే నిధి అన్వేషణ జరగాలి"

    "అలాగే మేడమ్-"

    "దేవులపల్లి కోట తెలుసా- మీకు"

    "తెలుసు మేడమ్-"

    "ఆ కోటకు మీరు ఆదివారం నాటికిరండి... నా అడ్రస్ అదే"

    "అంటే మీరు"

    "ఆ 'మీరు'కు జవాబు చెప్పలేదు ఇందుమతి... చిర్నవ్వే సమాధానం అయింది.

    కపాలేశ్వర్ ఆలోచనల్లో పడ్డాడు.

    ఇందుమతి ఆ ఇంట్లోంచి బయటకొచ్చింది.

    అరకులోయ ప్రాంతంలో ఒక గుప్త నిధి వుందనే విషయం కపాలేశ్వర్ కు తెలుసు... ఎప్పుడో ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం... ఆ విషయమై రెండు మూడుసార్లు తమ డిపార్ట్ మెంట్ లోనూ చర్చలు జరిగాయి. ఫండ్స్ ఇస్తే అన్వేషిస్తామని గవర్నమెంట్ కు ఒక లెటర్ కూడా పంపారు. హెడ్ ఆఫీసు నుంచి జవాబు రాలేదు. ఎందుకు రాలేదో తెలీదు. తన కోరిక ఈ రకంగా నెరవేరుతుందని కపాలేశ్వర్ అనుకోలేదు.

    ఇందుమతి వెళ్ళిపోయాక బయటకెళ్ళి ఒక ఆఫ్ బాటిల్ 'ఓల్డ్ మాంక్', రమ్' బాటిల్ తెచ్చుకుని- త్రాగుతూ, కొట్టుగదిలో వున్న పాత సమాచారమంతా బయటకు తీయడం ప్రారంభించాడు కపాలేశ్వర్.


                   *    *    *    *


    రోడ్డుమీద కొచ్చిన ఇందుమతి టైమ్ చూసుకుంది. సరిగ్గా ఆరుగంటలయింది.

    అంటే-

    జగదంబా జంక్షన్ 'కోకిల' ఆడియో సెంటర్ దగ్గర యువరాజు వెయిట్ చేస్తుంటాడు. ఆ ఆలోచన రావడంతో వెంటనే... ఆటో ఎక్కింది ఇందుమతి.

    యువరాజు వచ్చుంటాడా, ఆలోచిస్తోంది ఇందుమతి. మరో పావుగంట తర్వాత జగదంబా జంక్షన్ దగ్గర ఆటో ఆగింది. అప్పటికే కోకిల ఆడియో సెంటర్ ముందున్న ఎలక్ట్రిక్ పోల్ కు ఆనుకుని నించుని వున్నాడు యువరాజు.

    ఆటో దిగుతున్న ఇందుమతివేపు నడిచి-

    "గంటైంది- మేడమ్... నేనిలా... ఇంతసేపు... ఎవరికోసం వెయిట్ చెయ్యలేదు"

    నవ్వింది ఇందుమతి.

    "ఇది డ్యూటీలో ఒక భాగమనుకుంటే, మీకంత నీరసం వచ్చుండేది కాదేమో..." నెమ్మదిగా అంది.

    "ఈ వెయిట్ చేయించడం అంటే, పార్టు ఇన్ ద డ్యూటీయా... టెస్టింగా..." ఆశ్చర్యపోతూ అన్నాడు యువరాజు.

    అటూ ఇటూ చూస్తోంది ఇందుమతి అటుగా వెళ్ళిపోతున్న రెండు ఆటోల్ని ఆపింది.

    "ఆటో ఎక్కు యువరాజు..." అంది ఇందుమతి.

    "రెండు ఆటోలు ఎందుకు?" అడిగాడు యువరాజు.

    "ఒన్ ఫర్ యు... ఎన్ దర్... ఫర్ మి..." రెండో ఆటో ఎక్కుతూ అంది ఇందుమతి.

    "వాల్టేరు అప్ లాండ్- పర్లాకిమిడి ప్యాలెస్... నా వెనకే... మీరూ రండి-" రెండో ఆటోలో కూర్చున్న యువరాజుతో చెప్పింది ఇందుమతి. ఇందుమతి, ఆటో వెనక యువరాజు ఆటో బయలుదేరింది. "ఏం ఒకే ఆటోలో కూర్చుంటే... ఏం" తనలో తను చికాగ్గా అనుకున్నాడు యువరాజు.

    మరో ఇరవై నిమిషాల తర్వాత, ఆటోలు రెండు పర్లాకిమిడి ప్యాలెస్ ముందు ఆగాయి.

   
                                         *    *    *    *


    ఇందుమతి, విశ్వరూపశర్మలతో కాసేపు మాట్లాడాడు యువరాజు.

    "టీముకు లీడర్... ఇందుమతి... కానీ... ఈ టీమ్ ని కంటికి రెప్పలా రాత్రింబవళ్ళూ కాపాడాల్సిన బాధ్యత మాత్రం నీదే... అవసరమైతే నీ ప్రాణాల్ని కూడా ధారపొయ్యాల్సి వుంటుంది. గుర్తుంచుకో..." చెప్పాడు విశ్వరూపశర్మ.

    "అరకులోయలో పులులుంటాయా..." ఆసక్తిగా అడిగాడు యువరాజు.

    "ఒకప్పుడు... 'రాజు' అనే ప్రాంతం... పులులకు ప్రసిద్ధి. ఇపుడున్నాయో లేదో వెళ్తేగానీ తెలీదు. ఏం"

    "ఏం... లేదు... పులుల్తో ఫైటింగ్ చెయ్యాలని... చాలాకాలం నుంచి నాకు కోరిక... అందుకని"

    "అన్ని కోరికలూ... నెరవేరతాయి. కంగారుపడకు... ఎలుగుబండ్లు విస్తారంగా ఉన్నాయి. వాటితో ముందు 'ఫైట్' చేద్దువుగానిలే-" నవ్వుతూ అన్నాడు ముత్యాలనాయుడు.

    కాసేపు తను గ్రీకు షిప్పులో తిరిగినప్పుడు జరిగిన ముచ్చట్లన్నీ చెప్పేసి బయటపడ్డాడు యువరాజు.

    యువరాజుతోపాటు బయటకొచ్చింది ఇందుమతి.

    "మళ్ళెప్పుడు కలవమంటారు..." అడిగాడు యువరాజు.

    "ఆదివారం"

    "మళ్ళీ జగదాంబ జంక్షన్ లోనే వుండమంటారా-" నవ్వుతూ అన్నాడు.

    "కాదు- దేవులపల్లికోట దగ్గరకు రావాలి-"

    "ఎక్కడుందా కోట..."

    చెప్పింది ఇందుమతి.

    "అక్కడకెందుకండీ బాబూ- ముందు ఆ కోటలో నిధుల కోసం వెదుకుదామంటారా"

    "కాదు-"

    "మరి"

    "అక్కడకొచ్చాక తెలుస్తుంది... లే"

    "ఆదివారం ఉదయం... సరిగ్గా ఎనిమిది గంటలకల్లా రావాలి తెలిసిందా"

    "పనికి ఒప్పుకున్నాక తప్పుతుందా- అలాగే లెండి-" అంటూ ముందుకు నడిచాడు యువరాజు.

    వెళ్ళిపోతున్న యువరాజును చూస్తూ, కాసేపు అక్కడే నిల్చుంది ఇందుమతి.


                                      *    *    *    *


    "మంచి 'టీమ్' దొరుకుతున్నందుకు నాకానందంగా ఉందమ్మా. యువరాజులో కనిపించని శక్తులు చాలా వున్నాయి. పట్టుదల మనిషి కానీ- మనకు తగ్గట్టుగానే మలచుకోవాలి- నీ వెనక నడిచే నా 'టీమ్'కి కేంద్రబిందువు... నువ్వయినపుడు... నీ మీద వాళ్ళకో గురి కుదరాలి... అంటే... వాళ్ళకు నువ్వెవరో తెలియాలి- నువ్వెవరో చెప్పావా-" అడిగాడు విశ్వరూపశర్మ.

    "లేదు"

    "ఏం"

    "అందుకే, యువరాజుని, కపాలేశ్వర్ ని కోట దగ్గరకు రమ్మన్నాను... నేనెవరో... కోటే చెప్తుంది కదా అందుకు..."

    నవ్వాడు విశ్వరూపశర్మ.

    కారుని కొనుక్కున్న సేట్, మిగతా బ్యాలన్స్ ఇచ్చేసి, కారును పట్టుకుపోయాడు.

    "ఇందూ... దేవులపల్లి కోట గురించి ఇంకో ముఖ్యమైన విశేషం తెలిసిందమ్మా... మీ వంశంలో ఒక రాజుగారుండేవారు. ఆయన పేరు సుబ్రహ్మణ్య భూపతి... ఒకసారి పెద్ద మజ్జిపాలెం, అడవుల్లోకి వేటకెళ్ళారు... అప్పట్లో వేట అంటే... మినిమమ్- పదిహేను రోజులు ఉండేది గదా... సివిడిపాలెం... అనేచోట మకాం వేశారు 'వేట' అంటే ఒక్కరూ వెళ్ళరుగదా... యాభైమంది దాస, దాసీ జనం... వినోదానికి సానిమేళం- గజాలు, అశ్వాలూ... 'చిన్నకోట' తరలి వెళ్ళినట్టే... ఇంతమంది భోజనాలకు, ఆహార పదార్ధాల్నీ, నీళ్ళనీ తీసికెళ్ళారట కానీ అయిదురోజులకే నీళ్ళన్నీ ఖర్చయి పోయాయి. అప్పుడు- సివిడిపాలెంలో అప్పటికప్పుడు సుబ్రహ్మణ్య భూపతి, ఒక చెరువును తవ్వించారట... అప్పటి నుంచి ఇప్పటివరకూ, ఆ చెరువు ఒక్కసారి కూడా ఎండిపోలేదట... అంటే వర్షపు నీరు కాకుండా దానికి జలపాతం నీరు కూడా అందుతోందన్న మాట... అందువల్ల ఆ సివిడిపాలెం చెరువు సమీపంలో ఉన్న సివిడిపాలెం గ్రామంలో మనకు కొంత ఇన్ ఫర్ మేషన్ దొరుకుతుంది- గుర్తుంచుకో...

    పసరికలోవ, అనే గిరిజన గ్రామం వుంది. ఇంకొకసారి వేట కెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య భూపతిగారు... మిగతావాళ్ళ నుంచి తప్పిపోయి, దారి తప్పిపోయారు దారికోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ ముందు కెళ్ళిపోయారు... చిట్టడవిలో చిక్కుకుపోయారు.

 Previous Page Next Page