"దానిదేముంది! మీకు తోచినకథ కల్పించుకోండి" అన్నదామె.
"అంటే?"
"నేను మీకు నచ్చాను, మనం సుఖంగా ఉన్నాం. అలాంటప్పుడు గతంలో ఏదో జరగలేదని మీకు బాధగా వుంటే గతాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి"
ఏమనాలో తెలియలేదు నాకు ఎన్నోవిధాల ప్రయత్నించాను. తన ప్రేమకథ గురించి పద్మిని బయటపడడం లేదు చాలా అమాయకంగా నటిస్తుందామె. నేనేమో సూటిగా అడగలేకపోతున్నాను.
ఆ రోజునుంచీ నేను అన్యమనస్కంగా ఉంటున్నాను...
నేను ఏదోలా ఉంటున్నట్లు పద్మిని గుర్తించి కారణమడిగింది. ఏమీ లేదన్నాను. ఆమె నన్ను వేధించింది.
"ఎందుకలా నన్ను వేధిస్తావు?" అన్నాను.
"నాకు తెలియని రహస్యాలు మీరు దాచుకుంటే అవి తెలిసేదాక నేను మిమ్మల్నిలాగే వేధిస్తుంటాను" అంది పద్మిని చిలిపిగా.
ఆమె చిలిపితనం నా కెంతో ఇష్టం. ఎందుకంటే అది సాధారణంగా బయటపడే చిలిపితనం కాదు. నన్ను లొంగదీసుకునేందుకు వేరేదారి ఏమీ లేనప్పుడామె చిలిపితనాన్ని ప్రదర్శిస్తుంది. అప్పుడు వద్దనుకుంటూనే నేను లొంగిపోతాను.
కానీ ఇప్పుడా చిలిపితనం నన్ను కదిలించలేదు. అంటే ఆమెపై వ్యతిరేక భావాలు నాలో బాగా నాటుకుంటున్నవన్నమాట.
"నాకు తెలియని రహస్యాలు నువ్వేమీ దాచుకోలేదా!"
సవాలు చేస్తున్నట్లు అడిగాను.
"లేదు" అంది పద్మిని స్పష్టంగా.
"లేదూ" అన్నాను.
"అలా అడుగుతారేం మీకేమైనా తెలిసిందా?"
నేనేమీ మాట్లాడలేదు. మవునంగ నాలో నేనే అంతా భరించాలనుకున్నాను.
పద్మిని తప్పుచేసిందని నాకు తెలుసు ఆ తప్పు ఆమె ఒప్పుకోదు. ఒప్పించాలంటే మాధవరావును తీసుకురావాలి. మాధవరావును తీసుకురావడం నాకిష్టంలేదు. అతడికి తెలియదు పద్మిని నా భార్య అని.
ఈ పాత ప్రేమికులను కలపడం తీగలాగి డొంక కదపడం వంటిది.
మరి నేనేం చేయాలి?
నాలోని సంస్కారాన్ని పెంచుకుందుకు ప్రయత్నిస్తున్నాను. నా సంసారంమీద నమ్మకం లేకనేనా పద్మిని తన ప్రేమకథ చెప్పుకోలేదు.
నేను మానసికంగా ఎదగాలి....నాలో విశాలభావాలు పెంపొందాలి. అప్పుడు పద్మిని తనకు తానే తన ప్రేమకధని చెప్పుకుంటుంది.
అప్పుడు....
అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలియదు. కాని ఇప్పుడు మాత్రం పద్మినిచేత నిజం చెప్పించడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకు నేనెన్నుకున్న మార్గం నాలో మరింత సంస్కారాన్ని పెంచుకోవడం.
O O O O
యూనివర్సిటీ క్వార్టర్సునుంచి స్వంత ఇంటికి మారబోతున్నందుకు నా కెంతో సంతోషంగా వుంది.
ఇల్లు చాలా బాగా ప్లాన్ చేశానని అందరూ మెచ్చుకున్నారు.
గేటు దాటి లోపలకు రాగానే పెద్ద హాలు. దానికి ప్రవేశ ద్వారాలు రెండు, ఆ హాలునానుకొని కుడివేపున మూడు గదులు. ఆపైన మరో చిన్న పొడవాటి హాలు. ఆ హాలుకు అటూ ఇటూ కూడా వంటగది ఉపయోగించవచ్చును, ఈ యింట్లోని విశేషమేమిటంటే మొదటి హాలు చివరహాలు మధ్యకు విడదీస్తే మొత్తం ఇల్లు రెండు వాటాలుగా ఉంటుంది అటు మూడు, ఇటు మూడు గదులకు అటాచ్డ్ బాత్ సదుపాయాలున్నవి.
ముందు మేము క్వార్టర్సు లోనే ఉండి ఇల్లు మొత్తం అద్దెకిచ్చేద్దామనుకున్నాం. కానీ పద్మిని పట్టుబట్టింది. స్వంత ఇల్లుండీ అద్దె ఇంట్లో అవస్థలు పడటమేమిటీ అని! నిజానికి యూనివర్సిటీ క్వార్టర్సు లో అవస్థలేమీ లేవు.
కాని రెండు లక్షల పై చిలుకుపోసి కట్టిన ఇల్లు. స్వసుఖానికి బొత్తిగా ఉపయోగపడకపోతే బాధగా ఉంటుంది. అయిన ఖర్చులో కొంత యూనివర్సిటీనుంచి అప్పుచేశాను. కొంత నాన్నగారిచ్చారు, కొంత మామగారిచ్చారు.
మేము ఇల్లు మారేలోగానే మా యింటికి బేరాలొస్తున్నాయి. అయితే నేను మంచి కష్టమర్సుకోసం చూస్తున్నాను. వాళ్ళవలన ఏ ఇబ్బందులూ ఉండకూడదు. అద్దె విషయంలో పేచీలుండకూడదు. అందుకు ట్రాన్స్ ఫరయ్యే ఉద్యోగస్తులు బాగుంటారు.
అలాంటి బేరం ఒకటి నాకు తగిలింది.
అద్దె అయిదువందల యాభయి రూపాయలు. ఆయనకీ ఊరు ట్రాన్స్ ఫరయి నెలరోజులయింది. మంచి ఇంటికోసం చూస్తున్నాడు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాలకు మించి ఒకే ఊళ్ళో వుండడం అరుదు.
ఆయనకు ఇల్లు వచ్చింది. మనిషికి ఎక్కువ వయస్సు వుండదు. కానీ చూడటానికి హుందాగా పెద్దవాడిలా కనబడతాడు. మనిషి చాలా గంభీరంగా ఏదో ఆలోచిస్తున్న వాడిలా వుంటాడు. అతడు పరభ్యానం మనిషని అనుకున్నాను కాని చెప్పినవతడికి ఒక అక్షరం పొల్లు పోకుండా గుర్తుంటున్నాయి.