Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 17

    మరికొద్దిసేపు మాట్లాడి బబిత మనోజ్ దగ్గర శలవు తీసుకుని వెళ్ళిపోయింది.

    "ఈ అమ్మాయిగారే ఒక కేసు" అనుకున్నాడు చిరునవ్వుతో ఇన్ స్పెక్టర్ మనోజ్.


                                          12


    ఆ రోజు ఆదివారం.

    అందరూ ఇంటిలోనే వున్నారు.

    ఆదివారం ఒక్కపూటే వారికి విశ్రాంతి. వురుకులూ పరుగులూ వుండనిది. అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పకోడీలు తిందామనుకున్నారు.

    వారిది మధ్యరకం సంసారం అయినా, ఆ యింటిలో వున్న సుగుణం ఏమిటంటే అందరూ మంచివారు కావటమే. ఏ విషయానికి తొందరపడి ఒకరి నొకరు తూలనాడుకోరు. క్రితంరోజు కొడుకు శేఖరం అత్తవారింటినుంచీ వచ్చాడు. ఇంకా రెండు వారాలు ఆగితే కానీ, కోడలికి పురుడురాదని అతను చెప్పాడు.

    అందరూ ఒకచోట చేరి వేడి వేడి పకోడీలు తింటూ, కబుర్లు మొదలుపెట్టారు.

    "బావగారూ! మీరేం బాధపడకండి! నాకు తెలిసిన పెద్ద పెద్ద వారిని నలుగురిని అడిగాను వాళ్ళ కంపెనీల్లో ఏదో ఒక ఉద్యోగం మీ కోసం చూసి పెడతామన్నారు. మీరు టైపు నేర్చుకుని వుండటం కూడా మంచిదే అయింది. ఖాళీ అంటూ అయితే టైపిష్టుగానయినా చేర్చుకుంటారు" శేఖర్ నోటికీ, చేతికి పనిగల్పిస్తూ అన్నాడు.

    "నీ మాటలు పకోడీలంత కమ్మగా వున్నాయి" నవ్వుతూ అన్నాడు పాండురంగం.

    "మాటలు మాత్రమే కమ్మగా కాదు బావగారూ! చేతలు కూడా కమ్మగానే వుంటాయి. ఇవాళంటే ఎక్కడా ఖాళీ లేకపోవచ్చు - ఇవాళ కాకపోతే రేపు. మీకు ఉద్యోగం వచ్చేలా చేసే బాధ్యత నాది. ఉద్యోగం వచ్చిన తరువాత మీరు నాకు ఏం గిఫ్ట్ ఇస్తారో చూస్తాను."

    "నువ్వు ఊహించనంత పెద్ద గిఫ్ట్ ఇస్తాను. ఆ రోజుకూడా మన యింటిలో మళ్ళీ పకోడీలే చేసుకుందాము" నవ్వుతూ అన్నాడు పాండురంగం.

    "ఒరేయ్! ఒరేయ్! బావగారికి నువ్వేదన్నా ఇవ్వాలిగానీ, నువ్వు బావగారిని అడగటం ఏమిటిరా? మంచీ మర్యాదా లేకుండా!" మహాలక్ష్మమ్మ అంది.

    "కాలం మారిందమ్మా! అన్నీ రివర్స్ పద్ధతిలోనే జరుగుతున్నాయి ఇప్పుడు"

    "చూస్తూంటే అలానే ఉంది!" ఉదయం పేపర్ లో చదివిన వార్త గుర్తుకురాగా అన్నాడు మాధవయ్య.

    "విషయం చెప్పకుండా చూస్తూంటే అంటే మాకెలా అర్ధమవుతుంది?" అంది మహాలక్షమ్మ.

    "కాలం పూర్తిగా మారింది. వింతలూ, విడ్డూరాలూ రోజూరోజుకీ ఎక్కువ అవుతున్నాయి. నీవు పేపరు చదువవుకదూ! నీకు తెలియదు గోడలు దూకే మంత్రులు, వరకట్నం చావులూ కాక, ఈ మధ్య కొత్త కొత్త వార్తలు వేస్తున్నారు పేపర్ వారు" అంటూ గ్లాసెడు మంచినీళ్లు త్రాగాడు మాధవయ్య.

    "కొత్త విషయమేమిటో చెప్పండి!" అంది మహాలక్షమ్మ.

    "ఇంత మహానగరంలో, ఏ మూల ఏ వింత జరుగుతుందో ఎవరికీ తెలియదు. పేపర్ వారి ధర్మమా అని క్రొత్త వార్త ఒకటి తెలిసింది. కొందరు దుండగులు నగరంలో చాలాచోట్ల కాని పనులుచేసి, కొందరికి ఆస్తి నష్టమూ, ప్రజలకి ఆనందమూ కలిగిస్తున్నారట. ఆ చేసేవారు ఇలా ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు."

    "మీరు అసలు విషయం చెప్పకుండా అర్ధం కావటంలేదు అంటున్నారు. మీరు చెప్పేది ఏమిటో మాకూ అర్ధంకావటం లేదు."

    మహాలక్షమ్మ మాటలకు అందరూ నవ్వారు.

    "ది గిఫ్ట్" అన్నాడు మాధవయ్య.

    ఆ మాట వినంగానే పాండురంగం ఉలిక్కిపడి, మరుక్షణం మామూలయి పకోడీలు తింటంలో పడిపోయాడు.

    ఉదయం పేపర్ లో ఆ వార్త చదివిన శేఖరం "ఆ...." ఇదేదో మామూలు విషయం అన్నట్లు నోరు చప్పరించి ఊరుకున్నాడు.

    "నేనెలాగూ పేపర్ చదవను. అదేమిటో చెప్పండి!" అంది మహాలక్షమ్మ.

    కామాక్షి ఆ రోజు పేపర్ తిరగవేసింది. కానీ, పనిగట్టుకొని చదవలేదు. అందువల్ల కామాక్షి కూడా తండ్రి చెప్పబోయేదానికి కుతూహలంతో శ్రద్ధగా వినసాగింది.

    "ఆకతాయి పనులు చేసే వాళ్లు ఎక్కువయిపోయారు. ఇలాంటి పనులు ఎందుకు చేస్తారో ఎవరికీ అర్ధంకాదు. కొంటె కుర్రాళ్లో, మోసగాళ్లో తెలియదు కానీ, కొందరు కలసి ఈ మధ్య ఒక విచిత్రమయిన పని చేస్తున్నారు.

    కార్లు తగలబెట్టటం, స్కూటర్లు తగలబెట్టడం, కొందరి షాపుల్లో దూరి ఆస్తినష్టపెట్టడం, షాపుల్లోనే కాదు ఇళ్ళలో దూరి కొన్నిపనులు చేశారు.

    "బహుశా దొంగ వెధవలు అయివుంటారండీ!" మహాలక్షమ్మ అంది.

    "అలా అనుకోవటానికి వీలులేదు. వస్తువులు తీసుకువెడితే దొంగలనుకోవచ్చు. ఆస్తినష్టపెడితే విరోధులనుకోవచ్చు. ఈ రెండూ కానిది, ఇంకోటుంది.  

    'ది గిఫ్ట్' అని ఇంగ్లీషు అక్షరాలతో అందంగా రాసి, గిఫ్ట్ ప్యాకెట్టు లాంటి బొమ్మ అందంగా వేసివున్న అట్టముక్కని దుండగులు అక్కడ వదిలి వెడుతున్నారు" అంటూ దాని గురించీ వివరించాడు మాధవయ్య.

    "చాలా విచిత్రంగా వుందే!" అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

    "ఆస్తినష్టం చేసింది ఎవరో పసిగట్టకుండా వుండటానికి ఇలాంటి వేషాలు వేస్తున్నారు" శేఖరం అన్నాడు.

    "ఎవడైనా పిచ్చివాడు చేస్తున్న పనేమో!" కామాక్షి తన అనుమానం వెళ్ళగక్కింది.

    "పిచ్చివాళ్ళెవరూ క్రమబద్ధంగా ఒక పని చేయలేరు. చేసేపని చాలా నీట్ గా, పకడ్భందీగా వుంటున్నది. ఒకే రకం అట్టముక్కలు. ఒకేరకం బొమ్మలు. ఆ అట్టముక్క తగలబడకుండా దూరంగా పెట్టడం. ఇది పిచ్చివాళ్లు చేసేపనికాదు. ఎవరో కావాలని, ప్రజలని, పోలీసులని తప్పుదారి పట్టించటానికి చేస్తున్న పని ఇది."

    మాధవయ్య ఆ మాట ఆనంగానే, "మీకొచ్చిన అనుమానమే నాకూ వచ్చింది నాన్నగారూ! ఈ తమాషా వెనుక ఏ విదేశీ హస్తమూ లేదు. మన స్వదేశీ హస్తం తప్ప, ఏమంటారు బావగారూ!" నవ్వుతూ అడిగాడు శేఖరం.

    అకస్మాత్తుగా అతన్ని అడిగేసరికి పాండురంగం కంగారుపడ్డాడు. ఆ కంగారులో పకోడీ మొత్తం మింగేసరికి పొలమారింది.

    "వెంటనే జవాబివ్వాలని ఆ తొందర ఎందుకు? చూడండి! ఎంత పొలమారి అంత దగ్గువస్తున్నదో! ముందీ మంచినీళ్లు తాగండి!" అంది మంచినీళ్లు గ్లాసు అందిస్తూ కామాక్షి. 

 Previous Page Next Page