Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 17


    డి.జి.పి. మాటలకు పత్రికా ప్రతినిధులు ముగ్ధులయ్యారు. భాషలో, భావంలో ఒక్క పరుష పదం కూడా లేకుండా సర్దిచెప్పడంలో వారి కోపం తగ్గిపోయింది. సంతృప్తిగా డి.జి.పి.తో కరచాలనం చేసి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు.

    పోలీస్ అధికారుల రహస్య సమావేశం మరల మొదలయింది.

    "ఆఫీసర్స్! ఐ డ్రా యువర్ ఎటెంన్షన్!

        "whatever the probocatton
         I would appeal to you
         To rimain cool,
         It is the prime duty of the police.
         He who loses his temper,
         No longer remains a police man"

            ('sardar' Uallabe bhaie patel)

    ఎవరన్నారో చెప్పగలరా?"

    జవాబుకోసం క్షణం ఆగి, అందరి ముఖాలు చూశారు డి.జి.పి. నవ్వుతూ.

    క్విజ్ కాంపిటేషన్ లో జవాబు చెప్పెవలెనని చకచకా ఆలోచించే రీతిలో అందరూ నిమిషం కాలం బిగుసుకుపోయారు.

    జవాబు తెలియక కాదు, దానిని పై అధికారికి ఎలా చెప్పాలా అనేదే వారి ఆలోచన.

    "సారీ ఆఫీసర్స్! సీనియర్లకు నేనేదో పరీక్ష పెట్టాననుకోవద్దు. సందర్భం వచ్చింది కనుక అడిగాను. ఇందాక పత్రికలవారి ముందు మనవారు సహనం కోల్పోయారని వేరే చెప్పనవసరం లేదు. మన వాళ్ళు చేసింది తప్పని చెప్పడం కోసమని నేను ఈ అంశాన్ని ఎత్తడం లేదు. పరిస్థితులకు ఓవర్ గా రియాక్ట్ అవకుండా సీనియర్ ఆఫీసర్లు సబార్డినేట్లకు తెలియజెప్పాలి అనేదే నా ఉద్దేశం. మనం ఆ బాధ్యతలను మరచిపోతే, ఇదుగో_ఇటువంటి విషమ సంఘటనలే తలెత్తుతాయి." డి.జి.పి. అందరినీ ఉద్దేశించి చిన్న చురకవేశారు సుతిమెత్తని మందలింపు!

    "రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యవాదులను గడగడ లాడించిన భారతీయులు అప్పుడు అహింసా మార్గాన్ని ఎన్నుకున్నారు. కాని, నేడో....? ప్రతి సమస్యను పోరాటం ద్వారానే పరిష్కరించుకోవాలని యువతరం ఉద్యుక్తమవుతున్నది. హింసావాదాన్ని ఆశ్రయిస్తున్నారు. స్వాతంత్ర్యోద్యమం నాటి ఐక్యత, మత సామరస్యం, అహింసావాదం నేడు మచ్చుకైనా కనుపించడం లేదు. కుహనా రాజకీయాలు, విప్లవ శక్తుల విజృంభణ ఎక్కువవుతున్నాయి. దేశ సమగ్రత, జాతి సమైక్యతలకు ముప్పు వాటిల్లుతున్నది. ఉగ్రవాదులతో, సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలుపుతున్న యువతరం నిర్వీర్యమైపోతున్నది. ప్రస్తుత పరిస్థితులలో పోలీసుల దినచర్య చాలా పట్టుదలతో, పటిష్టమంతంగా వుండాలి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అరాచక శక్తుల ఆటకట్టించాలి. ప్రజలలో నమ్మకం కలిగించాలి!" ఉద్విగ్నంగా_ అదేసమయంలో హుందాగా - మాట్లాడి కూర్చున్నారు డి.జి.పి.

    ఇంటిలిజెన్స్ ఐ.జి. లేచి అసలు ఇప్పుడు ఈ రహస్య సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసిందీ విశదీకరించారు.

    ముఖ్యమంత్రికి సెక్యూరిటీ విషయంలో ఎస్.పి. శ్రీ నవీన్ కనబరిచిన అసమాన ప్రతిభను ముఖ్యమంత్రి ప్రశంసించి, పదిహేను వేల రూపాయిల బహుమతిని కూడా ఇచ్చినట్టు డి.ఐ.జి. వెల్లడించి, ఆ మొత్తాన్ని నవీన్ కు అందజేశారు.

    "నిజానికి, ఈ సత్కారానికి నేనొక్కడినే బాధ్యుడను కాను. కాని స్టేబుల్స్ చారి, మీరయ్య, వెంకటస్వామి తమ ప్రాణాలకు సయతం తెగించి ముఖ్యమంత్రికి డూప్ లుగా అద్భుతంగా అభినయించారు. కనుక, ఈ నగదు బహుమతిని సమంగా వారికే పంచుతున్నాను!" అంటూనే ఆ మొత్తాన్ని డి.జి.పి. ద్వారా వారికి అందజేయించాడు నవీన్. అతనిప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్టు కనుపించాడు.

    నవీన్ కు ప్రమోషన్ లభించినట్టు డి.జి. ప్రకటించగానే ఒక్కసారిగా హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. అందరి కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది.

    సీక్రెట్ కాన్ఫరెన్స్ పూర్తయి, అందరూ వెళ్ళిపోతుండగా వినిపించింది డి.ఐ.జి. గొంతు: "మిస్టర్ నవీన్! మీతో మాట్టాడాలి_ఒక్కసారి నాతో రూమ్ కు రండి!"


                          *    *    *


    అదొక రహస్య స్థావరం. టెర్రరిస్టుల స్థావరం.

    నలువైపులా నల్లని యూనిఫారంలో వున్న సాయుధులు కావలి కాస్తున్నారు.

    టప....టప....టప....

    నేలమీద పడివున్న ఎండుటాకులు కాళ్ళకిందపడి నలుగుతున్న శబ్దం అక్కడి నిశబ్ధంలో ప్రతిధ్వనిస్తున్నది.

    ఆటోమాటిక్ రైఫిళ్లను లోడ్ చేశారు సాయుధులు.

    గుంపు కదులుతున్నట్టు ధ్వనిస్తున్న శబ్దం దగ్గరయింది.

    సరిగ్గా అటాక్ రేంజ్ లోకి గుంపు ఆడుగిడగానే సాయుధులు తమ రైఫిళ్ళను వాళ్ళకు గురిపెట్టారు.

    సాయుధులు చేతి వ్రేళ్ళు ట్రిగ్గర్ మీదకు చేరాయి. ఇక....

    "నో...." కమాండరు తన చేతిని అడ్డుపెడుతూ అరిచాడు.

    "కిరణ్ కుమార్ ను అక్కడే వుంచండి. మిగిలిన వాళ్ళు స్థావరంలోకి రావచ్చు." కమాండరు ఉత్తర్వు చేశాడు. అది చండశాసనం.

    అతనిని అక్కడే వదలి మిగిలిన వాళ్ళు కమాండరు దగ్గరకు చేరుకున్నారు.

    కమాండరు కనుసైగ మేరకు ఒక సాయుధుడు కిరణ్ కుమార్ ముఖానికి కట్టిన ముసుగు తొలిగించాడు.
 

 Previous Page Next Page