Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 16


    సూపర్ ఫాస్ట్ లో బిచ్చగాని వేషంలో ప్రయాణించిన వ్యక్తి, ఇంజన్ డ్రయివర్ ను గార్డును కంట్రోల్ చేసిన సాయుధులు, కమాండరుగా సెట్ లో మాట్లాడిన మరొక సాయుధుడుకూడా అదే క్షణంలో ఎక్కడెక్కడి నుంచో హుటాహుటిన వచ్చి జీప్ ఎక్కారు. వాయువేగ మనోవేగం అంటే అదేనేమో!

    దుమ్ము లేపుతూ జీప్ ముందుకు దూకి, మలుపు తిరిగి దూసుకుపోయింది.

    కోచ్ లో....

    మూడవ సెకన్ మీదకు ముల్లు రాగానే__

    "ఢాం__" టైమ్ బాంబు పేలిపోయింది.

    ఆ శబ్దానికి స్టేషనులో వున్న ప్రయాణీకులు చెల్లా చెదురైపోయారు.


                           *    *    *


    డి.జి.పి. ఆఫీసు. కాన్ఫరెన్స్ హాలు.

    సీనియర్ పోలీస్ ఆఫీసర్ల సమావేశం జరుగుతున్నది.

    కాన్ఫరెన్స్ హాలు బయట పత్రికా ప్రతినిధులు, ప్రెస్ ఫోటోగ్రాఫర్లు గుమిగూడి వున్నారు.

    ఎంట్రెన్స్ దగ్గర వున్న పోలీస్ సిబ్బందిని పత్రికా ప్రతినిధులు వార్తల సేకరణ నిమిత్తం మొహమోటపెడుతున్నారు. రిక్వెస్టులు, ఆవేశకావేశాలు, తిట్లు_దీవెనలతో ఆ ప్రదేశం అంతా రణగొణధ్వనులతో నిండివుంది. పోలీసులు తలకు మించిన బాధ్యతలతో నానా హైరానాపడుతున్నారు.

    "సారీ! ఇది కేవలం శాఖాపరమైన రహస్య సమావేశం. విశేషం ఏమీలేదు. వెళ్ళండి." పోలీసులు పత్రికా ప్రతినిధులకు సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

    "డెమోక్రసీలో సీక్రెట్ ఏమిటి? అయినా, ప్రతి మీటింగ్ కూ మీరు పిలిస్తేనే మేము వస్తున్నామా? వార్తా సేకరణ మా హక్కు. ఆపడానికి మీరెవరు? లాఠీచార్జి చేసినా, తుపాకులతో కాల్చినా మేము లోనికి వెళ్ళేది వెళ్ళేదే! పత్రికా స్వేచ్ఛ_వర్ధిల్లాలి!" పత్రికా ప్రతినిధులు నినదించడం ప్రారంభించారు.

    మరుక్షణమే ఆవేశంగా పోలీసులను త్రోసుకుని ముందుకు కదిలారు. పోలీసులు విధిలేక లాఠీలను ప్రయోగించారు. కలం_ఖాకీ ఘర్షణ!

    బయట జరుగుతున్న హడావుడికీ, కాన్ఫరెన్స్ హాలు నుంచి పోలీస్ ఆఫీసర్లు మీటింగ్ వదలి బయటకు వచ్చారు. గొణుకుతూ సణుగుతూ వచ్చారు.

    పరిస్థితిని అవగాహన చేసుకున్న సిటీ పోలీస్ కమిషనరు సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. అది తన పరిధి. తన బాధ్యత.

    "శాంతియుతంగా వున్న రిపోర్టర్ల మీద పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేశారు." "పోఈస్ జులుం_ నశించాలి! డౌన్ డౌన్_కమిషనర్!" 

    నినాదాలు హోరెత్తాయి. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతున్నది....

    "ప్లీజ్! నా మాట వినండి...." సిటీ కమిషనరు సర్దిచెప్పడానికి మరొకసారి ప్రయత్నించాడు. అతను కోపం తెచ్చుకోలేకపోతున్నాడు. అవతలి వాళ్ళు కలం జీవులు. బుద్ధి జీవులు.

    అంతమంది విజ్ఞానవంతులైన పత్రికా ప్రతినిధులకు సర్దిచెప్పడం కష్టమే! పైగా పోలీసులు తమ విధి నిర్వహణలో బ్యాలెన్స్ ను కోల్పోయి లాఠీలను ఝళిపించారు!

    ఈ పత్రికలవారి నిరసన ఏ స్థాయికి చేరుతుందో....పోలీస్ అధికారులు దిగాలుపడుతున్నారు. అసలే పత్రికలు, నాటి ప్రతినిధులు. తెలిసిన వాళ్ళు....

    పోలీస్ అఫీసర్లనే చుట్టిముట్టి నినాదాలిస్తున్న ప్రెస్ రిపోర్టర్లను, ఫోటోగ్రాఫర్లను దూరంగా నెట్టివేయడానికి పోలీసులు మరల యత్నించబోయారు.

    ఈ లోగానే లోపలినుంచీ పోలీసులను వారిస్తూ డి.జి.పి. అక్కడకు వచ్చారు. డి.జి.పి. ని చూస్తూనే, కొద్ది క్షణాల అనంతరం పత్రికా ప్రతినిధులు తామంతట తాముగా నినాదాలను నిలిపివేశారు. అది వారి సంస్కార చిహ్నం. గౌరవ సూచికం.

    "ఫ్రెండ్స్_థాంక్స్! నేను మాట్టాడానికి ఒక్క రెండు నిమిషాలు అవకాశం ఇవ్వండి!" చిరునవ్వుతూ అడిగారు డి.జి.పి.! మాటలో మన్ననలో హుందాతనం!

    రిపోర్టర్లంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వయసులో కాస్త పెద్దరికాన్ని కనబరుస్తున్న రిపోర్టరు ఒకరు ముందుకు వచ్చాడు.

    "వార్తా సేకరణకోసం మేం వచ్చాం. మమ్ము లోనికి రానీయకుండా మీ పోలీసులు అమానుషంగా మాపై లాఠీలను ప్రయోగించారు. దీనికి మీ సంజాయిషి ఏమిటి?" ఆవేశంగా, సూటిగా అడిగాడు ఆ సీనియర్ జర్నలిస్టు. అడుగుతూనే కాగితం కలం చేపట్టాడు.

    "ఫ్రెండ్స్! మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ కు మిమ్ము ఎందుకు రానివ్వలేదో దయచేసి సహృదయంతో అర్ధం చేసుకోండి. ప్రస్తుతం సీనియర్ పోలీసు ఆఫీసర్ల రహస్య సమావేశం జరుగుతున్నది. ఈ రహస్యాలు రేపు పత్రికల కెక్కితే ఇక మా డిపార్ట్ మెంట్ ఎలా పని చేయగలుగుతుంది? కనుకనే మిమ్ము ఆహ్వానించ లేదు కాని, మరే కారణమూ లేదు. అయితే, సర్దిచెప్పడంలో మావాళ్ళు విఫలమయ్యారు. అన్యధా భావించకండి. మనలో మనకు కోపతాపాలేమిటి!"      
 

 Previous Page Next Page