కనులు నలుముకుంటూ చుట్టూ కలయచూశాడు కిరణ్ కుమార్. తన వెనుకనే తనకు రైఫిళ్ళను గురిపెట్టి సాయుధులు కొందరు వున్నట్టు గమనించాడు.
"మిస్టర్ కిరణ్? నీ తెలివే తెలివి!" హేళన ధ్వనించింది కమాండరు గొంతులో.
"మేము అవివేకులం అనుకున్నావా?" కఠినంగా ప్రశ్నించాడు.
"పరీక్షలో ఘోరంగా తప్పావు!" స్పష్టంగా అన్నాడు.
అతని గొంతులోనే కాదు, కళ్ళలో కూడా ఎర్రనెర్రటి కాఠిన్యం.
"కమాండరు! సి.ఎం.ను కిడ్నాప్ చేసేముందే ఆయనకు డూప్స్ ను పెట్టారని తెలుసుకుని ఉన్న మూడు మార్గాలను_రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలను దిగ్బంధం చేశాను. అయితే, ముగ్గురూ సి.ఎం కు డూప్సే అని చివరి క్షణం వరకు తెలియలేదు. అసలు సి.ఎం. ను పోలీసులు అంత తెలివిగా ఎలా తప్పించారో అర్ధం కాకుండా వుంది...." అంటూనే అవమానంగా తల దించుకున్నాడు కిరణ్ కుమార్. అతనికి తల తీసేసినట్టుగా వుంది!
"మిస్టర్! యూ ఆర్ ఎ జీనియస్! అటు ముఖ్యమంత్రిని తెలివిగా తప్పించావు, ఇటు మమ్ము నమ్మించడానికి డబుల్ గేమ్ ఆడావు!" ఖంగుమన్నది కమాండరు కంఠం. అతనికి అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా పట్టలేరు.
"నన్ను అనుమానిస్తున్నారా కమాండర్?" ఎర్రవారిన ముఖంతో బాధగా అడిగాడు కిరణ్ కుమార్. ఇప్పటికే అతను లోలోన కుమిలిపోతున్నాడు.
"పోలీసులు సాక్షాత్తు ముఖ్యమంత్రిని మామూలు ఆర్.టి.సి. బస్సులో తెలివిగా విజయవాడకు చేర్చారు. ఇహ, నిన్నెలా నమ్మమంటావో కాస్త చెప్పు!" వెల్లడించాడు కమాండరు.
తెల్లబోయాడు కిరణ్ కుమార్. తను చాలా చురుకుగా వ్యవహరించి పోలీసుల కదలికలను తెలుసుకుంటూ, వాటి ననుసరించి చాకచక్యంగా పథకం పన్నాడు. తన పటిష్టమైన పథకం ప్రకారం ముఖ్యమంత్రిని కమాండరు ఎదుట నిలపగల ననుకున్నాడు. కాని, పోలీసులే తనను బోల్తా కొట్టించారు....
తన పథకాన్ని ముందుగానే ఎవరో కనిపెట్టి వుండాలి! తనకు సహాయంగా వచ్చిన సాయుధులను అనుమానించవలసిన అవసరం ఏర్పడింది. కాని, కమాండరు వాళ్ళనే నమ్ముతున్నాడు కాని, ఈ స్థితిలో తన వాదనను వినిపించుకోడు, తన మాటకు విలువ నివ్వడు....ఆలోచిస్తున్నాడు కిరణ్ కుమార్ _ అవమానంతో అసహనంగా.
"మిస్టర్ ! అంతమంది పోలీస్ అధికారులను, ప్రయాణీకులను ధైర్యంగా ఎదుర్కోగల శక్తి సామర్ధ్యాలు సామాన్యునికి వుండవు. ఎదుటివాని బలహీనతలను కనిపెట్టి, సమయస్పూర్తిగా ప్రవర్తించగల నేర్పు ఆరితేరిన నేరస్తునికి మాత్రమే వుంటుంది. నువ్వు నేరస్తుడవు కావు. మరి? కేవలం మా స్థావరాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక పోలీసు అధికారివి! కనుకనే, అడుగడునా పోలీస్ ఆఫీసర్లు వున్నా, నిన్ను గమనించనట్టు నటించారు!"
కమాండరు ఇంకా ఏదో అనబోయేలోగానే అందుకున్నాడు కిరణ్ కుమార్: "సారీ కమాండర్....యు ఆర్ రాంగ్! నేను నిరుద్యోగిని. పేదరికంలో పుట్టాను, పేదరికంలో పెరిగాను. పేదవానికి జరుగుతున్న అన్యాయాలను స్వయంగా చూశాను. అందుకనే, పిడికిలి బిగించి మీ ఉద్యమంలో చేరాలని వచ్చాను...."
"ఛ! ఆవేశాన్ని అణచుకోలేనివాడు, మనసు కథ మధనపడేవాడు గొంతెత్తి గోలచేసినంత మాత్రాన అది విప్లవం అవుతుందా? నిన్నొక విప్లవవాదినని నన్ను నమ్మమంటావా!" కమాండరు హేళన.
"మీరన్నది అక్షరాలా నిజం కాని, నేను నా వ్యక్తిగత లాభనష్టాలను లెక్కవేసుకుని మీ ఉద్యమంలోకి చేరాలనుకోలేదు. సమాజంలో పీడిత ప్రజకు జరుగుతున్న అన్యాయాలను చూసి భరించలేక, వాళ్ళలో ఒకనిగ, వాళ్ళకు ఏదో మేలు చేయవలననే తపనతో వచ్చాను. నా మీద మీకు విశ్వాసం కలగడానికే, మీరు పెట్టిన పరిక్ష ఎంత సాహసంతో కూడుకున్నా చివరకు ప్రాణాలకు తెగించి మరీ _సిద్ధమయ్యాను. కారణాలు ఏమైనా, పరీక్షలో ఓడిపోయాను....ఇది నా తొలి ఓటమి. మరొక్క అవకాశం ఇచ్చి చూడండి. నా సామర్ధ్యాన్ని నిరూపించుకుంటాను...." భారంగా నిట్టూరుస్తూ, దీనంగా అడిగాడు కిరణ్ కుమార్. ఆ గొంతులో ఆవేదన ఆవేశం పెనవేచుకుని వున్నాయి.
"శెహభాష్! కట్టుకథను బాగా అల్లగలిగాను!"
అప్పటి వరకు చెట్టు చాటున దాగివున్న యువతి ముందుకు వచ్చి చపట్లు చరిచింది. కమాండరు, కిరణ్ కుమార్ తో సహ సాయుధు లందరు ఆశ్చర్యంగా అటు చూశారు.
పాలబుగ్గల పసిడి కాంత. మేలిమి బంగరు వన్నె చాయ. వయసు మిసమిస లాడుతున్న యువతి. చెక్కు డిజైన్ నల్ల చీర. లావుకు తగిన ఎత్తు. మెరుస్తున్న పెద్ద కనులు.
ఆమె ఎవరో, అంతమంది సాయుధుల దృష్టిని ఏమరచి ఎలా ఈ స్థావరానికి చేరగలిగిందో అక్కడ ఎవరికీ అంతుచిక్కని అంశమయింది. అయోమయం!
"ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? ఎందుకొచ్చావు? ఎప్పుడొచ్చావు?"