ఇద్దరూ రెండు అడుగులు వేశాక "రాధగారూ ! ఈ శుభ సమయంలో మిమ్మల్నో కోరిక కోరనా" అని అడిగాడు సందిగ్ధింగా.
"ఏమిటి ?"
"మనం ఒక రెండు- రెండంటే రెండు నిముషాలు ఆ పార్కులో కూర్చుందామా ?"
రాధ ఉలిక్కిపడి "అమ్మో!" అంది.
"ఎంతో వద్దండీ. రెండే నిముషాలు. అదిగో అటు చూడండి."
రాధ అటు చూసేసరికి ఒక ఆకారం కిళ్ళీకొట్టు పక్కకి దాక్కుంది, సరిగ్గా కనపడలేదు.
"ఆయన మా మామయ్య. ఆయన కూతురు హిడింబి, నా కిచ్చి పెళ్ళి చేయాలని ఉద్దేశ్యం. అయన మనసు విరిగిపోవటం కోసం మీరు నాతో రెండు నిముషాలు... ప్లీజ్... ప్రేమాభిషేకం సినిమా చూడలేదూ, అలా అన్న మాట." బ్రతిమాలుతున్నట్టు బిక్క మొహంతో అన్నాడు.
"సరే పదండి."
అది చూసి రామలింగం నిప్పులు తొక్కుతున్న వాడిలా అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు.
అతడు వీధి మలుపు దాటగానే, అది గమనించి మురళి ఆగి, "ఇక చాలండీ. పార్కులోకి వెళ్ళనఖ్ఖర్లేదు, మనం గెలిచాం" అన్నాడు.
"గెలవటమేమిటి ?"
మురళి తడపడి "అదే! మా మావయ్య మనసు విరిగిపోయింది. మీకు థాంక్స్" అన్నాడు.
"నేనే మీకు థాంక్స్ చెప్పాలి. ఆడపిల్ల పార్కుకి వస్తూంటే అన్నమాట మీద గౌరవముంచి, కేవలం మీ పని అయ్యేవరకూ ఉపయోగించుకున్నారు. ఇంకో అల్లరి కుర్రవాడే గానీ అవుతే, ఈ అవకాశాల్ని అలుసుగా తీసుకుని మాటలు పెంచేసేవాడు."
మురళి కరిగిపోయాడు. "రాధగారూ ! మీకెలా చెప్పనండీ. నేను మీరు ఊహించినంత మంచివాడిని కాదండీ. మీ మెప్పు సంపాదించటం కోసం వెనుక గ్రామ్ ఫోన్ పెట్టి ముందు పాట పాడేసేను" అన్నాడు.
"పర్లేదులెండి. కుర్రవాళ్ళన్నాక ఆ మాత్రం హుషారుండాలి" అంది రాధ నవ్వాపుకుని.
మురళి కొంచెం ఆగి, భయం, భయంగా తటపటాయిస్తూ "ఇదంతా ఎందుకో తెలుసాండీ" అన్నాడు.
"ఎందుకండీ."
"మిమ్మల్ని ప్రేమిస్తున్నాను... అందుకు" అతడి మాటలు పూర్తిగాలేదు. రాధ అక్కణ్నుంచి వడివడిగా వెళ్ళిపోయింది. ఆమె మొహం మీద ఇంకా సన్నగా నవ్వు కదలాడుతూనే వుంది.
దూరంగా బైనాక్యులర్స్ తో మేడమీద నుంచి ఇదంతా చూస్తున్న ఒక ఆకారం అక్కణ్నుంచి తప్పుకుంది.
* * *
ఆ రాత్రి రాధకు చాలాసేపు నిద్ర పట్టలేదు. ఎంత వద్దనుకున్నా మురళీ గురించే ఆలోచనలు కమ్ముకొస్తున్నాయ్. "రాధా" అన్న పిలుపు చెవుల్లో వినిపిస్తూనే వుంది. తను మరీ పాతకాలపు చాదస్తాలూ, ఆచారాలూ దుస్తులూ, అలంకరణలతో ముసలమ్మలా కన్పిస్తోందని తన స్నేహితురాండ్రందరూ అంటూంటే ఇతగాడికేమో తను అందంగా కనిపించిందా? అంతలో ఆమె ఆలోచన్లు మరో విధంగా మలుపు తిరిగినయ్ ! ఎంత తప్పు చేస్తూంది తను ! తను ప్రేమించటానికి ప్రేమించబడటానికీ అనర్హురాలు ! కొంచంసేపు విచక్షణాజ్ఞానం మర్చిపోవటంతో ఎంత ప్రమాదం సంభవించింది. ఆమె మనసులోనే గట్టిగా లెంపలు వేసుకుంది.
బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోతుంటే ప్రక్కనే వున్న కిటికీలో నుండి మళ్ళీ "రాధా !" అంటూ రహస్యంగా, మత్తుగా, తీయగా ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కిటికీలోంచి మురళీ మొఖం నైట్ బల్బ్ కాంతిలో తమాషాగా అందంగా కనబడుతోంది.
చిరునవ్వుతో తనవంకే తన్మయత్వంతో చూస్తున్నాడతను.
"మిమ్మల్ని ప్రేమిస్తున్నా రాధా ! ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను." అన్నాడతను. రాధకు భయం వేసింది. ఒక్క ఉదుటున మంచం దిగి లైట్ స్విచ్ వేసింది. కిటికీ దగ్గర మురళీ మొఖం కనిపించలేదు. ఒకవేళ గోడదూకి తన గది కిటికీ దగ్గరకు రాలేదు కదా అతను ?
తలుపు తెరచి బయటకు నడిచి చూసిందామె. బయట కాపలా వున్న కుక్క ఆనందంగా తోక ఊపింది.
"హమ్మయ్య ! అంతా తన ఊహే ? అతను రాలేదు ! వస్తే కుక్క అరవదూ ?" సంతృప్తిగా తలుపులు మూచి మళ్ళీ పడుకుందామె. అయితే రాత్రి పన్నెండయిపోయినా నిద్ర పట్టటం లేదు. ఇంక లాభం లేదని లేచి భగవద్గీత పుస్తకం తెరచింది.
"కుతస్త్వా కశ్మల మిదమ్, విషమే సముపస్థితమ్,
అనార్య జుష్టమా స్వర్గ్యమ్ అ కీర్తి కరమర్జున !"
"అర్జునా ! విపరీతమయిన సంకట సమయంలో నీచులకు తగినదియూ, ఉత్తమ గతులకు ప్రతిబంధకమైనదియూ, విశాల భావము కానిదియూ అయిన ఈ మాలిన్యం నీకు ఎక్కడి నుంచి దాపురించింది"
రాధ ఇంక చదవలేక పోయింది.
అవును ! ఎక్కడ నుంచి దాపురించిందీ మాలిన్యం తనకు ?
ఏమో ! తెలీటం లేదు ! ఇంత కాలం ఎలాంటి మనోవికారం లేకుండా, ప్రశాంతంగా గడుపుతున్న తన జీవితంలో మురళీ వల్ల ఇంత అల్లకల్లోలంగా తయారయింది ?
ఎందుకు, తనని మనసులో నుంచీ, ఆలోచనల్లో నుంచి తొలగించలేక పోతోంది తను ?