"రండి" అన్నాడు మామూలుగా "దేవి ప్రసాదం తీసుకుని వెళుదురు గాని"
ఆమె నడక సాగిస్తూ నేనో ప్రశ్నకి జవాబు తెలుసుకోవడానికి వచ్చాను" అంది.
"దేవీ ఈ రోజు పూర్తి ధ్యాన ముద్రలో వున్నారు. బహుశా జవాబు ఇవ్వరు. దూరంనుంచి వెళ్ళిపోదురు గాని."
ఆమెకి అర్ధం అయింది ఇప్పుడు - తను పూర్తి విరాళం ఇస్తేగాని తన ప్రశ్నకి సమాధానం దొరకదు. చాలా ఇన్ డైరెక్టుగా ఈ విషయం తనకి తెలియబర్చబడుతూంది.
ఆమె క్షణం తటపటాయించి "భక్తులకోసం ఇంత చేస్తున్న యీ సంస్థకి ఉడతాభక్తిగా నేనో కానుక సమర్పించుకొందామనుకుంటున్నాను" అని వేలికి వున్న వజ్రపు టుంగరం హుండీలో వేయడానికి వంగింది.
ఈ విషయం ఇంట్లో తెలిస్తే తనని తలవాచేటట్లు చివాట్లు పెడుతుందనీ, రెండ్రోజుల్లో ఫారిన్ నుంచి తన తండ్రి ఫోన్ లో తనని మందలించబోతున్నాడనీ ఆమెకు తెలుసు. అయినా తన ప్రశ్నకు ఆమె సమాధానం తెలుసుకోవాలని ధృడ నిస్చయంతో వుంది. అందుకే రెండు వేలు చేసే ఉంగరాన్ని కోల్పోడానికి కూడా సిద్ధపడింది. ఆమె హుండీలో ఉంగరాన్ని వేసి లేస్తూంటే చెవి దగ్గర అతడి స్వరం అతి నెమ్మదిగా వినిపించింది "చాలా తెలివైన వారు మీరు"అని. ఆమె దాన్ని పట్టించుకోలేదు. ముందుకు నడిచింది.
ఇద్దరూ పొడవైన వరండాలో నడుస్తూంటే "మనసు నిర్మలంగా వుంచుకోండి. దేవిని నమ్మండి. నిండు మనసుతో దేవిని స్తుతించండి. మీ ప్రశ్న కాగితం మీద వ్రాసుకోండి. తన కరుణా కటాక్ష వీక్షణాలతో దేవి మీ ప్రశ్నని చూడకుండానే జవాబు చెబుతుంది. మీ కోర్కెలు నెరవేరతాయి. కష్టం తొలగి పోతుంది మీరు చేయవలసినదల్లా మీ ప్రశ్న వ్రాయడమే."
అని చక్రవర్తి ఆగి, "వెళ్ళండి" అని చూపించేడు. ఒక తలుపు దగ్గరకు వేసి వుంది. ఆ క్షణం అట్నుంచి అటే వెనక్కి తిరిగి వెళ్ళిపో అని ఆమె సిక్త్స్ సెన్స్ చెబుతూంది. మనసేదో కీడు శంకిస్తూంది.
తలుపు తెరుస్తూ ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. అతడలాగే నిశ్చలంగా -చూపు తిప్పకుండా చూస్తున్నాడు. ఆమె చప్పున తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనుక తలుపు నెమ్మదిగా మూసుకుంది.
లోపల విశాలమైన గది మసక చీకటిగా వుంది. ఒక మూల నిలువెత్తు విగ్రహం ముందు దీపం మినుక్కు మినుక్కు మని వెలుగుతూంది. ఆమె దృష్టి గది మధ్యలో వున్న పొడవాటి టేబిల్ మీద పడింది.
"రా తల్లీ ఆగిపోయావేం"
ఆమె ఉలిక్కిపడి చూసింది. బల్లకు ఒక మూల వృద్ధురాలు కూర్చుని వుంది.
సిద్దేశ్వరీ దేవి.......
ఆమె కళ్ళు మసక చీకటికి అలవాటు పడ్డాయి. ప్రతి వస్తువు స్పష్టంగా చూడగలుగుతుంది. సిద్ధేశ్వరీ దేవి ఆ కుర్చీలో సామ్రాజ్యాన్ని జయించిన రాణిలా కూర్చుని వుంది.
"రా తల్లీ దేవిని నీ సంశయం అడిగి తెలుసుకో"
ఆమె ముందుకు నడిచి, బల్లకి ఇంకో చివర కూర్చున్నది. కొన్నిలక్షలమంది సైనికులు చనిపోయిన తరువాత సంధి ప్రాతిపదికల చర్చలకోసం కూర్చున్న రాజుల్లా వున్నారు ఇద్దరూ. నిశ్శబ్దం రాజ్యం ఏలుతూంది ఇద్దరిమధ్యా.
"వెళ్ళిపో -ఇక్కణ్నుంచి వెళ్ళిపో"అని మనసు సంకేతాలు పంపుతూంది.
సిద్ధేశ్వరి ఆమె వైపు దయగా చూస్తుంది. దూరగా దేవి విగ్రహం నిశ్చలంగా వుంది. ముందు దీపం ఆరి వెలుగుతూంది. ఆమె ముందుకు వంగింది. బల్లమీద కాగితం కలం, వున్నాయి.
"వద్దు వద్దు...." అంటుంది మనసు. "చాలా పటిష్టమైన గుంపు ఇది. ఇరవై ఏళ్ళ అమ్మాయి ఒంటరిగా దీన్ని ఎదుర్కోలేవు. వెళ్ళిపో వెళ్ళిపో" అని హెచ్చరిస్తూంది. ఆ అమ్మాయి చేతిలోని కాగితాన్ని తీసుకుంది. తెల్లటి కాగితం
సిద్దేశ్వరీ దేవి ఆమె వైపే నిశ్చలంగా చూస్తూంది. తన మనసు మీద ఏ విధమైన హిప్నాటిక్ ప్రభావం వుండకుండా వుండడానికి మనసుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూంది. తమ ప్రశ్నము టెలీపతి క్లెయిర్ వాయెన్స్ ద్వారా అవతలి వాళ్ళు తెలుసుకోకుండా వుండడానికి ఒకటి రెండు మూడు అంకెలు లెక్కబెడుతూంది.
ఆమె కలం చేతిలోకి తీసుకోబోయి ఆగింది.
ఈ కలంలో ఏదైనా ఎలక్ట్రికల్ కంప్యూటర్ వుందేమో. తను వ్రాసిన ప్రశ్నని అది ఎక్కడన్నా రీ ప్రింట్ చేస్తుందేమో, ఆమె పై కప్పు కేసి చుట్టూ గోడల కేసి చూసింది. ఎక్కడైనా అద్దాలు గాని, రిఫ్లెక్టర్స్ గాని వున్నాయేమోనని.
సిద్ధేశ్వరి ఆమెవైపు చూస్తూంది.
"నేను.....నేను ఏ ప్రశ్ననైనా వ్రాయవచ్చునా!"
"నిస్సందేహంగా నిర్భయంగా వ్రాయవచ్చు తల్లీ. దేవి జవాబు చెప్పటమే కాకుండా పరిష్కారం కూడా చూపిస్తుంది."
...........పై ప్రశ్న అడుగుతూ చేతిలోని కాగితాన్ని క్రిందికి జార్చింది. మోకాళ్ళ మీద పెట్టుకున్నా హాండ్ బ్యాగ్ లోంచి తన పెన్నూ నోట్ బుక్ లోంచి చప్పుడవకుండా చింపిన కాగితమూ బల్లమీద అదే స్థానంలో పెట్టింది. ఇదంతా క్షణంలో, రెండో కంటికి తెలియకుండానే జరిగిపోయింది.
"వ్రాయి తల్లీ!"
తన కలాన్ని చేతిలోకి తీసుకుని ఆమె ముందుకు వంగింది. మనసు ఆకరి సంకేతాన్ని పంపుతూంది - వద్దు -వద్దు -ఆ ప్రస్న వ్రాయకు -ప్రమాదం - ప్రమా.... ఆమె ప్రశ్న వ్రాయడం పూర్తిచేసింది. గుండ్రటి అక్షరాల్తో తెల్లటి కాగితం మీద చిన్న ప్రశ్న.