Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 16


    సారీ శ్రీపియా....నీ మొండి వాదనతో నన్ను విసిగించకు....నువ్వు ఫోన్ పెట్టేయకపోతే నేనే పెట్టేస్తున్నాను".

    "ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్....ఇంతసేపు మాట్లాడినా నన్ను చూడాలని మీకు అనిపించడం లేదా...." ఆమె కంఠంలో మాధుర్యం ఒలుకుతోంది_

    ".... .... ...."

    "ఒక ఆడపిల్ల సిగ్గువిడిచి ఏ వ్యక్తినీ ఇలా అడగదు.

    "నిన్ను అడగమని నేనేమీ కోరలేదు."

    "పోనీ. నేనే అడుగుతున్నాననుకోండి....నాకోసం ఒక్కసారి రండి"

    "ఎందుకు రావాలి....?"

    "నా ఆతిథ్యం స్వీకరించడానికి...."

    "నాకు అంత తీరికలేదు....సారీ...."

    "మీరెందుకు రానంటున్నారో నాకు అర్ధమయింది లేండి....ఒకవేళ నా వద్దకు వచ్చే సమయంలో మీకు వచ్చే ఆదాయాన్ని మీరు పోగొట్టుకుంటారనే భావన కావచ్చు. ఎంతయినా డబ్బు కోసమేగా మీరు గూండాగిరీ చెలాయించేది....అందుకే మీరు నాకు కేటాయించేసమయంలో ఎంత సంపాదించేదీ చెబితే అంత ఎమౌంట్ నేను ఇస్తాను....చెప్పండి మీరు నా వద్దకు రావడానికి ఎంత ఇవ్వమంటారో...."

    ఆమె మాటలు అతన్ని చెళ్ళున కొరడాతో చరిచినట్టుగా తాకాయి....

    అతనిలోని అహం మేల్కొంది....పురుషత్వం బుసలుకొట్టింది....

    "మిస్ శ్రీప్రియా....డబ్బు వెదజల్లితే చాలు నేనేదైనా చేస్తాననే నీ అభిప్రాయం తప్పు అని తెలియచెప్పడానికి నీ దగ్గరకు వస్తున్నాను....చెప్పు....ఎక్కడకు రమ్మంటావో"

    "థాంక్యూ డియర్....ఇప్పుడే వస్తున్నారా?"

    "అవును...."

    "మినిష్టర్ రోడ్ లో భరణీ కాంప్లెక్స్ ముందు మీకోసం ఎదురు చూస్తుంటాను...."
  
    ఫోన్ పెట్టేసి కాంప్లెక్స్ ముందువైపుకు అడుగులు వేసింది శ్రీప్రియ.

    తను అనుకున్నది సాధించబోతున్నానన్న ఫీలింగ్ ఆమెలో....

    సరిగ్గా పావుగంట తరువాత వచ్చి ఆగిన జీప్ లో నుంచి క్రిందకు దిగుతున్న చక్రవర్తిని ఓరకంట గమనించింది శ్రీప్రియ....

    అతడ్ని రిసీవ్ చేసుకుని అదే కాంప్లెక్స్ లో వున్న తన ప్లాట్ కు తీసుకువెళ్ళింది.

    జీవితంలో ఒక స్త్రీ ఆతిథ్యం తీసుకోవడం చక్రవర్తికి అదే మొదటిసారి__

    అతని ఫీల్డులో అలాంటి సెంటిమెంటల్ లైఫ్ కు ఎప్పుడూ తావివ్వలేదు. ఆమె తనను ఫోన్ లో పిలవడం....ప్లాటుకు తీసుకురావడం అంతా కొత్తగా, వింతగా అనిపిస్తోంది అతనికి!

    "ఫోన్ లో మాట్లాడితే ఏమో అనుకున్నాను. అందంగానే వున్నారే...."సోఫాలో కూర్చుంటూ అన్నాడు చక్రవర్తి.

    బదులుగా చిరునవ్వు నవ్విందామె.

    సంపెంగలపై పన్నీరు చిలకరించినట్టు మధుర పరిమళాలు అలుముకున్నాయక్కడ!

    "అదేంటి....ఇంతవరకూ ఏకవచనంలో పిలిచి....ఇప్పుడు నా ఇంటికొచ్చిన తరువాత మీరంటున్నారేమిటి?"

    "ఏమో....అలా పిలవాలనిపించింది, పిలిచాను....ఫోన్ లో ఎవరో ఆకతాయి అమ్మాయి మాట్లాడుతుందేమోననిపించి 'నువ్వు' అని పిలిచానే తప్ప మర్యాదతెలియని వాడిని కాదు."

    అతనిని ఎలా అర్ధం  అంతుపట్టక అతని మొహం వైపే పరిశీలనగా చూసింది శ్రీప్రియ.

    ఆ చూపులకు చక్రవర్తి ఇబ్బందిగా కదిలాడు....

    "ఈ ఇంట్లో ఎవరెవరుంటారు....?"

    "నేనొక్కదానినే...."

    "అదేంటి....మీ అమ్మానాన్న...."

    "నా చిన్నతనంలోనే చనిపోయారు...."

    ఇంకేలాంటి ప్రశ్నలు వేస్తే ఏం వినవలసి వస్తుందోనని గతుక్కుమన్నాడతను. అందుకే చక్రవర్తికి ఏం మాట్లాడాలో తోచక మరి మాట్లాడలేదు.

    ఒక విధంగా అలాంటి ఒంటరి సమయంలో ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియని వాడిగా పెరిగాడతను.

    "మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆత్మీయుడ్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది."

    శ్రీప్రియ అన్న మాటలకు కూడా చక్రవర్తి పలకలేదు.

    "మీరు మాట్లాడ్డం చాలా తక్కువ అనుకుంటాను"

    "అవును....చిన్నతనం నుంచి ఎవ్వరితోనూ అంతగా మాట్లాడేవాణ్ణి కాను."

    "మరి, నన్ను చూస్తుంటే మీకేం అనిపిస్తుంది...." టాపిక్ మార్చి అందామె.

    "నిజం చెప్పమంటారా?"

    "ఊ....నిజమే చెప్పండి"

    "ఇక్కణ్ణుంచి వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది"

    "అదేంమాట...."

    "మరి కాకపోతే అసలు మీరు చేసిందేమైనా బాగుందా? ఫోన్ లో అలా రెచ్చగొట్టేసరికి మిమ్మల్ని ఒకసారి చూసినట్టు వుంటుందని వచ్చానే తప్ప మీతో కబుర్లు చెప్పుకునేటంత తీరిక, ఓపిక నాకు లేవు.... చూడాలనుకున్నాను.... చూశాను.... వెళ్ళిపోతున్నాను.... దట్సాల్...."

    "అవునులేండి....మిమ్మల్ని ఆత్మీయునిగా భావించడం నాదే పొరపాటు...." నిష్టూరంగా అన్నది ఆమె!

    "చూడండి శ్రీప్రియా....నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎదురు కావడం ఇదే మొదటిసారి. నేనున్నది ఒక గూండా గ్యాంగ్ లోనన్న విషయం మరిచిపోయినట్టున్నారు. వాళ్ళే నాకు సర్వస్వం....వాళ్ళకు కొన్ని పద్దతులున్నాయి. ప్రేమ, పెళ్ళి అనే బంధాలకు బందీనై వాళ్ళనుంచి బయటకు వస్తే ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా అర్ధంకాని పరిస్థితి నాది...."                    

 Previous Page Next Page