8
పోలిటిక్స్ లెక్చరర్ పేరు హరి. ఆయన క్లాసులోకి రాగానే విద్యార్దులందరూ
"హరిలోరంగ హరి-హరిలో రంగ హరి. హరిలోరంగహరీ అబ్బాయిగారిపని హరి...." అని బల్లమీద దరువులు వేస్తూ పాడటం మొదలు పెట్టారు. ఆయన సైలెన్స్ అని అరవగానే అరక్షణం ఊరుకుని అంతలోనే ఘొల్లున నవ్వుతూ మళ్ళీ పాట అందుకున్నారు. ఆయనకు చాలా కోపంవచ్చి "మీరిక్కడకు వచ్చింది పాఠం వినటానికి. గాడిదల్లా అరవటానికి కాదు అన్నారు. వెంటనే క్లాస్ రూంలో నాలుగువైపులనుంచీ గాడిద ఓండ్రలు వినిపించాయి.
"గాడిదలు అరవవు సార్! పాడతాయి...."
కొండొ కచో పాఠాలు కూడా చెపుతాయి."
ఘొల్లున నవ్వులు-ఆయనకు మండిపోయి అటెండెన్స్ కూడా తియ్యకుండా క్లాసులోంచి వచ్చేశాడు. ఇలా వెళ్ళి అలా వచ్చేసిన హరిణి ఆశ్చర్యంగా చూస్తూ.
"అదేం, క్లాస్ తియ్యలేదా?" అని అడిగాడు చంద్రశేఖర్. హరి జరిగినదంతా వివరించి "చదువంటే శ్రద్ధలేదు. లెక్చరంటే భక్తిలేదు. పరీక్షల భయం అసలేలేదు. ఈ బ్రూట్స్ ని ఎవరూ బాగుచెయ్యలేరు" అన్నాడు విసుగ్గా....అంతలోనే విరక్తిగా "మనం కొందరం అనవసరంగా పట్టుకు పాకులాడుతున్నాం. మూర్తిగారిలాటి కొందరిలా మనం కూడా క్లాసులు వదిలేసి మనపని మనం చూసుకోవటమే ఉత్తమం. మన జీతం మన కొస్తుంది." అన్నాడు.
చంద్రశేఖర్ ప్రాణం ఉసూరుమంది. ఏమిటీ విద్యావిధానం? ఏనాటికి బాగుపడుతుందిది?
చంద్రశేఖర్ క్లాసుకు వెళ్ళేసరికి క్లాస్ ఫుల్ గా ఉంది. అందరూ అటెండ్ అయినందుకు చంద్రశేఖర్ చాలా సంతోషించాడు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పుస్తకం తెరిచి పాఠం ప్రారంభించగానే అందరూ "మాకు పాఠం వద్దుసార్! కధ చెప్పండి సార్! మీరు బాగా కథ చెపుతారు సార్! అందుకే వచ్చాం సార్!" అని అరుపులు ప్రారంభించారు, 'సార్' దగ్గిర దీర్ఘాలుతీస్తూ. ఆ పరిస్థతి అదుపులోకి తేవటం ఎలాగో అర్ధంకాలేదు. చంద్రశేఖర్ కి వాళ్ళను అదిలించినకొద్దీ రెచ్చిపోతారనేది అనుభవంతో నేర్చుకున్న విషయం. అంచేత వాళ్ళదారికే వస్తున్నట్లుగా భ్రమింపచేస్తు వాళ్ళను తనదారిలోకి తెచ్చుకోవాలి.
"అలాగే కధ చెపుతాను."
ఈ మాటలు వినగానే క్లాసు నిశ్శబ్దమయింది.
"కానీ, ముందు మీరు నామాటలు కొన్ని వినాలి...."
అయిష్టంగానే ఒప్పుకున్నారు.
"మీకు పరీక్షలంటే భయంలేదని నాకు తెలుసు. పుస్తకాలు చూసి పరీక్షలు రాసి డిగ్రీలు సంపాదించగలమనే ఉద్దేశంలో ఉన్నారు కానీ, ఒక్కమాట, ఆ డిగ్రీవల్ల ఏం ప్రయోజనం?"
ఒక్కక్షణం ఆగాడు చంద్రశేఖర్. విచిత్రంగా విద్యార్దులందరు శ్రద్ధగానే వినసాగారు. ఒక విద్యార్ధి లేచి. "అదేమిటి సార్! డిగ్రీవచ్చిన అందరికీ ఏంప్రయోజనమో, మాకూ అదే ప్రయోజనం...." అన్నాడు.
"అక్కడే మీరు దారుణంగా పొరపడి మీ చేతులారా మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ యూనివర్సిటీలో పరీక్షలెలా జరుగుతున్నాయో, డిగ్రీలెలా వస్తున్నాయో, అది బహిరంగ రహస్యమయిపోయింది. అంచేత ఈ డిగ్రీలకు మీకు ఎవ్వరూ ఉద్యోగాలివ్వరు. ప్రతిఒక్కరు తమ ఫరమ్స్ లోకి సమర్ధులు రావాలని కోరుకుంటారు కాని, అవక తవకగా ఎలాగో ఒకలాగ డిగ్రీలు సంపాదించినవాళ్ళని కాదుగదా? మరి, ఈ డిగ్రీ తీసుకుని మీరు సాధించేదేమిటి? ఏ క్లాసులోనయినా చాలా తెలివిగలవాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉంటారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లోనయినా పైకిరాగలరు-అలాగే ఎందుకూ పనికిరానివాళ్ళు కూడా కొద్దిమందే ఉంటారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ బాగుపడరు. ఇక క్లాస్ లో మూడువంతు మంది కష్టపడి చదువుకుంటే పైకి రాగలిగినవాళ్ళే! అలాంటి వాళ్ళంతా ఈ కొద్దిమంది మూలంగా నాశనమయిపోతున్నారు. మీరే ఆలోచించుకోండి. మీరు పసిపిల్లలు కారు. ఇలా మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవటం మంచిదేనా?"
చంద్రశేఖర్ మాటలు పూర్తికాగానే ఒక విజిల్ వినిపించింది. కాని, క్లాసంతా ఆ విజిల్ అందుకుని గోల చెయ్యలేదు. ఆ విజిల్ వేసినదెవరో కనిపెట్టగలిగాడు చంద్రశేఖర్. అతడు రవి. రవి పక్కనే వున్న మురళి చప్పట్లు కొట్టబోయి, చంద్రశేఖర్ చూపులు తనమీదనే ఉండటం గమనించి ఆపేశాడు. సగానికిపైగా క్లాస్ నిశ్శబ్దంగానే ఉంది. ఒక విద్యార్ధిలేచి "మీరు చెప్పింది బాగానే వుందిసార్? కానీ యూనివర్శిటీలో అంతతా, అందరూ కాపీలు కొడుతున్నప్పుడు, మేం మాత్రం కాపీలు కొట్టకపోతే ఏం ప్రయోజనం? వాళ్ళకు ఫస్ట్ క్లాసులు, మాకు థర్డ్ క్లాసులు....అంతే!" అన్నాడు.
ఈ ప్రశ్న కొంత క్లిష్ట సమస్యగానే తోచింది చంద్రశేఖర్ కి. ఆలోచించి "నిజాయితీకి ఎప్పుడూ తగిన ఫలితం ఉంటుంది. ఎగ్జామినర్ కి మీరు కాపీకొట్టి వ్రాశారో సొంతంగా ఆలోచించి వ్రాశారో చక్కగా తెలిసిపోతుంది. కాపీలు కొట్టిన వాళ్ళకి మార్కులు తగ్గించేస్తారు. సొంతంగా వ్రాసినవాళ్ళకే మంచిమార్కులొస్తాయి." అన్నాడు. విద్యార్ధులు దీనికి పూర్తిగా అంగీకరించలేక పోయారు. ఒక విద్యార్ధిలేచి "అదేంలేదు సార్....పదో క్లాస్ లొ నేను కాపీ కొట్టకుండా రాశాను, నాకు థర్డ్ క్లాసే వచ్చింది. కాపీలుకొట్టి రాసిన వాళ్ళకు ఫస్ట్ క్లాస్ వచ్చింది" అన్నాడు.
ఆ మాటలు కాదనటానికి వీల్లేదు.
"ఇప్పుడిప్పుడు అందరూ విద్యార్ధులకు న్యాయం చెయ్యటానికే ప్రయత్నిస్తున్నారు__సిన్సియర్ గా వ్రాసిన విద్యార్ధులకు తప్పకుండా మంచి మార్కులొస్తాయి-" అనేశాడు చంద్రశేఖర్, అంతకంటే ఏం చెప్పాలో తెలియక....