"నా బాబే! నువ్వేప్పుడోచ్చావు?....నువ్వెళ్ళి పోయావు! మరెవరు తెస్తారు, నాయనా!' వాసుని దగ్గరగా తీసుకుని అప్యాయతగా తల నిమురుతూ , జీరబోతున్న గొంతుతో అని కళ్ళు వత్తుకుంది జానికమ్మ." ప్చ్! పనిమనిషి ని తెమ్మనక పోయావా?' అన్నాడు నొచ్చుకుంటూ . మనోవ్యధతో క్రుంగి పోయిన జానకమ్మ, మరో పదేళ్ళు పై బడ్డట్టుగానే కనుపిస్తుంది. వంగబోయే నడుముకి చెయ్యి అనుకు నిలుచుని, "నా బాబు! నువ్వు కలెక్టరు చేసిన్నాడు మళ్ళీ నౌకర్లు, చాకర్లూ.....తాతయ్య హయాం లా జరిగిపోతుంది. తహసీల్దారు నామర్దా పనులు చెయ్యకుండా జీవితం వెళ్ళబుచ్చుకున్నారు. అయన అదృష్టవంతుడు. బాధలూ, బరువులూ ఇవన్నీ భరించడానికి నేను మిగిలాను." అంది ఇంకా ఏమో సాగబోయే ఆమె ధోరణి కడ్డువస్తూ , "అమ్మా! అని మందలింపు గా పిలిచింది మధుమతి.
నాకు ప్రతి కదలిక లో ఏదో కొత్తదనం పసికట్టిన మధుమతి మనస్సు పాదరసం లా అన్ని వైపులా పరుగులు తీస్తుంది! "ఏమిటంత హుషారుగా కనుపిస్తున్నాడు? బెంగ దిగుళ్ళ తో బెదిరే కళ్ళు తీక్షణంగా తృప్తిగా మెరుస్తున్నా యేమిటి? ఒక్కసారిగా మనిషిలో ఇంత మార్పు వచ్చిందంటే ఏదో పెద్ద తగినంత కారణముంటుంది!' అతన్ని చూస్తున్న మధుమతి తన నుంచి తన కొడుకు నెవరో వేరు చేస్తూన్నట్టు ఊహించింది. ఏదో బలమైన అనుమానం! విషయం తెలుసుకోవాలనే ఆత్రత. గబగబా అతను తెచ్చిన సామానుల వైపు మళ్ళింది ఆమెదృష్టి. వంట ఇంట్లో భోజనం చేస్తూ జానికమ్మా, జయ, చంద్రం ఇందరితో సందడిగా కబుర్లు చెబుతూ నవ్వుతున్నాడు వాసు.
అందరూ అనే మాటలు విశ్వసించలేక గుడ్డిగా నమ్మి ఆనాడు భర్తను పతనం చేసుకున్న తెలివి తక్కువది తాను. ఈనాడు తన కొడుకు?.... ఆమె నిలవలేకపోయింది. హోల్డాలు విప్పింది. ఖరీదైన కొత్త బట్టలు. "వాసూ!" ఆమె గొంతు తీవ్రంగా ధ్వనించింది.
చెయ్యి కడిగి తువ్వాలుతో తుడుచుకుంటూ . "ఏమమ్మా! పిలిచావా?' అంటూ వచ్చాడు వాసు.
ఆ గొంతులోని తియ్యదనం, అతని వదనం లో సౌమ్యతా చూసిన మధుమతి కరిగిపోయింది. "పాపం, ఎవ్వరి హోల్దాలో వచ్చేసి ఉంటాయి, బాబూ! మామయ్య హూల్దాల్ , అయితే పెద్దది గదా! అంత గుర్తు లేకుండా పోయిందా? చూడు, ఈ బట్టలు? పాపం, వాళ్ళెంత అఘోరిస్తారో!" అంది చటుక్కున ఏదో స్పురించి తేలిగ్గా నవ్వుతూ.
మొదటిసారిగా అమ్మతో అబద్దం చెప్పాలి. ఆమెను వంచించాలి. తనకోసమే జీవిస్తున్న అమ్మకు అబద్దం చెప్పాలి. అమ్మ....అమ్మ.... సంతోషమే మరిచిన అమ్మ.... అతని లేత మనసు నలిగిపోయింది. కాలేజీ.... చదువు.... తన భవిష్యత్తు..... ఫీజులు..... పుస్తకాలు...వీటికి కావలసిన డబ్బు ....వికసించ బోయే తన భవిష్యత్తు " ఆ భవిష్యత్తు కి బలమైన పునాదులు నిర్మిస్తున్న నాన్నా.... అతని ఆదేశం.... అతని కిచ్చిన వాగ్దానం... సతమతమై అలిసిన వాసు మొహం పీక్కుపోయింది... మధుమతి వైపు చూసిన అతని కళ్ళు హోల్డాలు వైపు మళ్ళాయి. నాలుగు పాంటు బట్టలు, షర్టు బట్టలు, తువ్వాళ్ళు, బనియన్లు , రెండు దుప్పట్లు, హూల్దాల్లో చిన్న సైజు గళ్ళ పరుపూ , దిండూ చూసిన వాసు కళ్ళు చెదిరిపోయాయి. "నాన్న....' కట్టలు తెగిన అతని పుత్రవాత్సల్యం , ప్రేమా ప్రవహిస్తుంది. వాసు కళ్ళలో సన్నటి నీటి తెర మెరిసింది.
"ఏమిటలా చూస్తావు! పిచ్చి మొహం లా! ఎవ్వరి హోల్దాలో తెచ్చేశావు. అవునా?..... అతనలా చెపితే వినాలని ఉంది ఆమెకు.
"కాదు! నాదే, అమ్మా!" గుండెల్లో ధైర్యాన్నినింపుకుంటూ ఏమైతే అవనీ అన్నట్టు అని తల వాల్చేశాడు.
క్షణంలో మధుమతి వదనం ఉదాసీనంగా మారిపోయింది. ఒక్కసారి వాసు వైపు చురుగ్గా చూసి, "మామ్మయ్య ఇన్ని బట్టలు కొన్నడంటే నేను నమ్మలేను. ఈవేళ కాకపొతే ఎప్పుడైనా నాకు నిజం చెప్పాలి నువ్వు! ఎవరు కొన్నారీ బట్టలు?.... దీనికి నాకు సమాధానం కావాలి. నువ్వు భయపడుతున్నట్టదోలా కనుపిస్తున్నావు! మరి...మరి....జీవితంలో మోసపోలేను.... నీవూ మోసం చేస్తే! నేను జీవించేది లేదు.... ఇంకా హీనమైన బ్రతుకు బ్రతకలేను" అని నెమ్మదిగా, తీవ్రంగా హెచ్చరిస్తున్నట్టు అంది మధుమతి.
"అమ్మా!...." అప్రతిభుడై పోయాడు వాసు. ఉదాసీనంగా గబగబా ఆ బట్టలు సర్ది వెళ్ళిపోయింది మధుమతి.
ఆఫీసు నుంచి వచ్చిన రాజశేఖరం "ఏం రోయ్? ఎప్పుడు వచ్చావు? ఎలా ఉంది చదువు?' అని కళ్ళేగరేసి అదోలా చూసి నవ్వుతూ అడిగాడు.
"ఇప్పుడే ఆఫీసు నుంచి వచ్చావా? చదువుకేం? బాగానే ఉంది" అన్నాడు తానూ చిన్నగా నవ్వేస్తూ వాసు.
మనమడి కాప్యాయంగా వడ్డన చేస్తూ , "పెద్ద మామయ్యా పిల్లలందరికీ బట్టలు తీశాడు. వెధవ బుద్ది ....నీకో జత తీస్తే తప్పా! పోనీలే, రేపు కామయ్య కొట్లో ఏదన్నా మామూలు బట్టలు ఓ జత తీసుకో. డబ్బు సర్దుబాటు చూసుకుని అప్పు తీర్చేస్తాను" అంది జానికమ్మ వాసు వైపు జాలిగా చూస్తూ.
"నాకు కొత్త బట్టలు ఉన్నాయి. అమ్మా, నువ్వు చెరొక చీరా తీసుకుంటే నాకు సంతోషంగా ఉంటుందమ్మమ్మా!" చెయ్యి కడుక్కుంటూ అన్నాడు వాసు.
"వాసూ! మేడ మీద గదిలోకి పోయి కబుర్లు చెప్పుకుందాం కాస్సేపు రానా!" జయ పిలుపు కి చిన్నగా నవ్వి, "పద వస్తాను" అంటూ ఆమె ననుసరించాడు పసిపిల్లగా ఉన్నప్పటి నుంచీ ఓ రకమైన చనువూ, స్నేహం ఉన్నాయి ఇద్దరి మధ్యా! జయ అందమైన మంచి పిల్ల వాసు దృష్టి లో . వాసు తెలివైన పేద కుర్రాడు, మంచి వాడు అనే జాలి, అభిమానం జయ హృదయం లో!
"వాసూ, ఇక్కడుండే అప్పటి కన్నా ఇప్పుడేదో మారినట్టు కనుపిస్తున్నావు/ కాలేజీ లో చదవటాన్నా?' అమాయకంగా ప్రశ్నించింది జయ.
"కాలేజీ లో చదివితే! మనుషులే మారిపోతారా?' నవ్వాడు వాసు.
"అది కాదు, వాసూ!"
"మరి?"
"నాకు తెలియదు అదేమిటో?"
ఇద్దరూ ఫకాల్న నవ్వుకున్నారు. తరవాత స్కూలూ, చదువూ, సినిమాలూ, తన సంగీతం గురించి గబగబా మాట్లాడినది జయ.
తన కాలేజీ, అక్కడ పాఠాలేలా చెపుతున్నారో, పద్మజా, శీనూ అక్కడి సంగతు లేవో చెప్పాడు వాసు.
'సంగీతం ఎంతవరకూ వచ్చింది? సిగ్గు విడిచి పాదేదాకా ఇంకా రాలేదా?" అడిగాడు వాసు.
"కృతులు చెబుతున్నా రిప్పుడు. నే నిప్పుడెం పాడను. రేపు...." సిగ్గుగానే అంది జయ.
"మరి పోయి పడుకుంటాను. ప్రయాణం కాదు కాని ఒళ్ళు పచ్చడై పోయింది!' లేచి నించున్నాడు వాసు.
* * * *
దూరాన చర్చి లో పది గంటలు కొట్టాయి. ఇల్లంతా నిశ్శబ్ద మావరించింది. ఆ ఇంట్లోని వ్యక్తులు నిద్ర పోయారని సూచిస్తూ! కాని వేడి ఉచ్చ్వాస విశ్వాసాలతో తీవ్రంగా యేవో ఆలోచనల్లో వేగిపోయే వ్యక్తులిద్దరూ-- వాసూ, మధుమతి.
"అమ్మా!" నెమ్మదిగా వాసుగొంతు. ఆ గొంతులో ఆవేదన.
"ఏమమ్మా! నిద్రపోలేదు?" వాత్సల్య పూరిత మైన గొంతు.
"లేదమ్మా! నీతో మాట్లాడాలని...." అంటూ ఆమె పక్కలో కూర్చున్నాడు వాసు.
బరువుగా, మౌనంగా కొన్ని క్షణాలు దొర్లాయి ఇద్దరి మధ్యా. నెమ్మదిగా వాసు వీపు చేత్తో నిమురుతూ "ఏం మాట్లాడాలి, బాబూ!' అని అడిగింది మధుమతి. ఆమెకు తెలుసు ఆ బట్ట లెవరిచ్చారో, వాటి సంగతే వాసు చెప్పబోతున్నాడని.
"అమ్మా, నన్ను మరోలా చెడ్డవాడుగా, నీకు అన్యాయం చేసేవాడుగా అనుకోకమ్మా!" వాసు గొంతు వణికింది చిన్నగా.
"తల్లిగా అలా ఎందుకనుకుంటాను? కొడుకు తప్పులు కప్పి పుచ్చేది , అతని క్షేమం వాచించేది కదా తల్లి?...." ఆ గొంతులో నిష్టూత వ్యధ.
"నేను పెద్ద చదువులు చదవడం , మంచి బట్టలు వేసుకోడం నీకు ఇష్టమే కదూ?" ఆ లేత గొంతులో ఏదో స్థిర గంబీర్యం.
ఏదో తాను చెప్పబోయే మాటకు ఉపోద్ఘాతం లా ఉన్న అతని ప్రశ్నకు కలవరపడింది, తెల్లబోయింది కూడా. పసితనం లోంచి పరువాన్ని తెలిపే అతని వాక్సాతురి.....కొన్ని క్షణాలు ఎమాటా రాని స్తబ్ధత్వంలో ఉండిపోయిన మధుమతి-- " ఎందుకు ఇష్టం కాదు? ఇష్టమే. కాని, నా కొడుకు స్వతంత్రుడవడం, హక్కు లేని డబ్బు అనుభవించడం నేను సహించలేను. నన్ను వదిలి, డబ్బుకు అమ్ముడుపోయి అల్లుడుగా, దత్తుడుగా వెళ్ళడం కూడా నా ప్రాణం ఉండగా ఒప్పను. అలా అమ్ముడు పోయి కలెక్టరు చేసేకన్నా , ఈ స్కూలు ఫైనలు చదువుతో గుమస్తా ఉద్యోగం చేస్తే నీ పంచన గర్వంగా బ్రతకగలదు ఈ తల్లి...." అంది. ఆ గొంతులో దుఃఖావేశం.
"అబ్బా! నాకెలా చెప్పాలో అర్ధం కావడం లేదమ్మా! నేను.... నేను నీ రక్తం పంచుకు పుట్టాను.... నాకు మాత్రం అభిమానం లేదా! నిజం.... అలా అమ్ముడు పోయి నేను చదువుకోవడం లేదు. ఈ ఒక్క మాట నమ్ము. నీమీద ప్రమాణం చేసి చెబుతూన్నాను.... నన్నెక్కువ ప్రశ్నలు వేస్తె నేను అబద్దాలు ఆడాలి... ఎప్పుడన్నా నీకు అబద్దం చెప్పానా? నువ్వు వద్దన్న పని చేశానా, అమ్మా? అప్పుడు కూడా అల్లుడుగా , దత్తుడుగా అమ్ముడు పోలేదు.. పోను..... నాకు బాగా చాలా డబ్బున్న వాళ్ళు చదివేలా చదవాలనుందమ్మా!" పెద్ద చదువులు ...నా మనస్సదోలా అయిపోయిందమ్మా!" కంపన స్వరంతో అని, క్షణం తరువాత - "ఈ నిజం నీ దగ్గర ఎంతకాలమో దాచను. చదువయ్యే పర్యంతమే! ఆ తరువాత...... ఆ తరువాత....ఈ సమస్యకి పరిష్కారం వెతుకుతాను. నీకు తెలియకుండా ....పెళ్ళీ.... దత్తతా అంత తెలివి తక్కువవాడ్నా ....అమ్మా!" అన్నాడు.
మానసికంగా ఇంత ఎదిగిపోయాడని ఈనాడే తెలుసుకున్న మధుమతి కొంత ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, "నేను శరీరాన్ని అన్నం, నీరూ ఇచ్చి పెంచితే, పరిస్థితులు వాణ్ని మానసికంగా పెంచాయి.' అనుకోని త్వరత్వరగా ఏదో నిశ్చయానికి వచ్చినట్టు లేచి కూర్చుంటూ , "పోనీ, చిన్న మామయ్యకు తెలుసు కదా? రాజు భోళా మనిషి, కాస్త కుత్సీతుడు, కాని, గోపీ చాలా మంచివాడు. మనమంటే అభిమాన మున్న వాడూను." అని అత్రతగా , పరిశీలనగా వాసు మొహంలోకి చూసింది మధుమతి.
"తెలుసు."
"నిజం?' ఆమె కళ్ళు మెరిశాయి. తృప్తిగా, సంతోషంగా.
"నిజమేనమ్మా! మామయ్యే దగ్గర పెట్టుకున్నాడు."
"అంటే?' ఆమె కనుబొమలు ముడిపడ్డాయి.
"చచ్చాం. వాళ్ళమ్మాయి మీద దొర్లిపోయింది నీ దృష్టి!" నవ్వాడు.
రెండు నిమిషాలు మళ్ళీ మౌనంగా దొర్లిన తరవాత చిన్నగా నవ్వుకుంటూ, "పోనీలే, నాకు తెలియకపోయినా ఫర్వాలేదు. గోపీకి తెలుసు కదా! వాడు మన క్షేమం కోరేవాడు. అవకతవక వ్యవహారాలు వాడి కసలు గిట్టవు. తాతయ్య పోయిన తరవాత వచ్చిన గోపీ, నాకు కొంత ఆస్తి, మా నాన్నగారు వ్రాయనందుకు చాలా బాధ పడ్డాడు. పెద్ద మామయ్య నెలకో ఏబై ఇచ్చేద్దాం అంటే గోపీ ఏమన్నాడో తెలుసా, వాసూ? అక్కయ్య కి మనతో సరిగా వాటా ఇవ్వాలంటూ రాజుతో వాదించి, చివరికి ఇంటి అద్దె, సంవత్సరం సరిపోయే పంటలో ధాన్యం ఇచ్చే ఏర్పాటు చేశాడు. నాకూ అమ్మమ్మకీనూ. ఏదన్నా వాడి ఇష్టం నాకూ ఇష్టమే... పోయి పడుకో ....నువ్వూ, మామయ్యా నన్ను సస్పెన్సు లో పారేశారు.' తేలిగ్గా నవ్వింది మధుమతి పడుకుంటూ.