Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 17

 

    తన చెవులు రెండూ ఎడ్జస్ట్ చేసుకుని "ఈ మధ్య నా చెవులు భలే తమాషాలు చేసున్నాయిలే! ఇప్పటికిప్పుడే చూడరాదూ? నువ్వు 'అరవై పైసలు అప్పివ్వు?" అని అడిగినట్లు అనిపించింది ...." అన్నాడు విస్మయంతో.
    "నిజంగానే అడిగాను!" అన్నాడు చిరంజీవి తొణక్కుండా.
    "ఏమిటి? అరవై పైసలా?"
    "అవును!"
    "ఎందుకు?"
    "ఇన్నేళ్ళ తర్వాత ఇద్దరం తిరిగి కలుసుకున్న ఈ ఆనందకరమయిన సమయంలో వన్- బై- టూ- 'టీ' తాగుదామని. అంతే! నా దగ్గరున్న నలబై అయిదు పైసలతో ఇంతకుముందే ఎన్టీఆర్ 'టీ' తాగేశాను. ఇప్పుడు టైం పది దాటింది కదా మరి! అరవైపైసలు కావాలి!"
    "డోంట్ వర్రీ మైడియర్ ఫ్రెండ్! ఏ కంపెనీ నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేసినా ఓ నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తుంది కాబట్టి - మన దగ్గర ఎప్పుడూ బాలెన్స్ ఉంటూనే ఉంటుంది. అదలా ఉందనీ గానీ - నువ్వు లక్షాధికారివయుండి , అరవై పైసలు అప్పు అడగటం ....." ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
    చిరంజీవి మళ్ళీ గాడంగా నిట్టూర్చాడు.
    'అదో పెద్ద కధ గురూ! ముందు టీ ఆర్డర్ చెయ్!" అంటూ మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు.
    భవానీశంకర్ కూడా కూర్చుంటూ సర్వర్ సురేష్ వేపు తిరిగి సన్నగా విజిల్ వేశాడు.
    "వొండరపుల్ మొగలాయీ పౌనా మైడియర్ సురేష్! వన్- బై- టూ తీసుకురా!"
    "పవనా ఏక్!" అని అరుస్తూ - అరుపు వెనుకే లోపల కెళ్ళి రెండు కప్పుల్లో చేరి సగం 'టీ' తెచ్చి వారి ముందుంచాడు.
    ఇదరూ 'టీ' కప్పులు గాలిలో తాటించి 'చీర్స్' అనుకున్నారు . కొంచెం 'టీ' చప్పరించాక మూడ్ లో కొచ్చాడు చిరంజీవి.
    "ఈ మధ్యనే మా మావయ్య చనిపోయాడు చెప్పాను కదూ?" పెద్ద కధ మొదలుపెట్టేశాడు చిరంజీవి.
    "ఓహో నువ్వింత దిగులుగా ఉండటానికి కారణం ఆయనతో ఉన్న ఎటాచ్ మెంట్ అవునా! డోంట్ వర్రీ మైడియర్ ఫ్రెండ్! ఓ హిందీ సినిమాలో "జీనాయాహ, మర్ నా యహ, ఇన్ కే సివా జానాకహ " అన్నాడు ముఖేష్! అంచేత ఇలాంటి వాటన్నిటినీ ఫిలాసాఫిక్ దృష్టితో చూడాలి మనం! అసలు...."
    "స్తాపిట్ ప్లీజ్!" చప్పున అతని వాక్ ప్రవాహానికి అడ్డుపడ్డాడు చిరంజీవి.
    "యూ ఆర్ మిస్టేకన్! ఎటాచ్ మెంట్ లేదూ - వంకాయ్ లేదు! ఆ ముసలాడంటే నాకసలు ఇష్టం లేదు-"
    "ఈజిట్?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
    "యస్! అయ్ హేట్ దట్ ఓల్డ్ మాన్! ఎందుకో తెలుసా? నేనూ స్వప్నా పెళ్ళి చేసుకున్నందుకు ఇంటినుంచి గెంటి వేశాడు. మేము డబ్బు లేక నానా బాధలు పడుతున్నా - మా సంగతే పట్టించుకోలేదు ! అలాంటి వారిని ఎవరు ద్వేషించకుండా ఉంటారు?" కోపంగా అడిగాడు చిరంజీవి.
    "ఆఫ్ కోర్స్ప ఆఫ్ కోర్స్! ఎవరయినా ద్వేషిస్తారు! అది సరే గానీ మళ్ళీ నా చెవులు తమాషా చేస్తున్నాయ్ 'నేనూ స్వప్న పెళ్ళి చేసుకున్నాం' అని నువ్వన్నట్లు వినిపించింది!"
    "అవును! ఆ విషయం నీకు చెప్పనేలేదు కదూ! నేనూ స్వప్నా పెళ్ళి చేసుకున్నాం!"
    "స్వప్నేవరు?"
    "ఓ! సారీ! స్వప్న నీకు తెలీదు కదూ? ఓ దేవత! పద - ముందు ఇంటి కెళ్దాం! స్వప్న నిన్ను చూస్తే ఏంతొ సంతోషిస్తుంది - మనం సెయింట్ మేరీస్ లో గడిపిన రోజుల గురించి ఆమెకు ఎప్పుడూ చెప్తుంటాను కదా! అందుకని నీ గురించి బాగా తెలుసు ....కమాన్-"
    "ఇప్పుడా?"
    "అవును! మిగతా విషయాలన్నీ హాయిగా భోజనం చేస్తూ మాట్లాడుకుందాం! అన్నట్లు ఇంకో పాతిక రూపాయలు అప్పు ఇస్తే - మన భోజనం కొంచెం రుచికరంగా వుండే అవకాశం ఉంటుంది" సిగ్గుపడుతూ అడిగాడు చిరంజీవి.
    "నిరభ్యంతరంగా తీసుకో ఫ్రెండ్! నా దగ్గర డబ్బు తీసుకోవడం నీ బర్త్ రైట్ అనుకో! నో డేలికసీ ప్లీజ్!" జేబులో నుంచి డబ్బు తీసి అతని కిస్తూ అన్నాడు భవానీ శంకర్.
    "థాంక్ యూ-" అన్నాడు చిరంజీవి అభిమానంగా.
    "నో ఫార్మాలిటీస్ బ్రదర్! అప్పు, థాంక్యూ, ఋణపడి ఉంటాను , కృతజ్ఞతలు - లాంటి పదాలు మనమధ్యకు రావటం నాకు ఇష్టం లేదు. నేను మన సెయింట్ మేరీస్ రోజుల్ని ఇంకా మర్చిపోలేదు! నేను స్కూలు ఫీజు కట్టలేక పోయినప్పుడు నా పేరు అటెండెన్స్ రిజిస్టర్ నుంచి కొట్టేస్తే - నాకు తెలీకుండా నువ్వే వెళ్ళి నా ఫీజు కట్టేశావ్! బహుశా అది నీకు గుర్తుండి ఉండదు! కానీ నేను మాత్రం ఆ రోజుల్ని మర్చిపోలేదు. ఎన్నోసార్లు - నన్ను ఎంతగా అదుకున్నావో చిన్నచిన్న డిటెయిల్స్ తో సహా నాగుర్తుంది. అందుకే అయ్ లవ్ యూ - అయ్ ఎడోర్ యూ - అన్నట్లు మా సిస్టర్ ఎలా వుంటుంది? చాలా అందంగా ఉంటుందా?"
    చిరంజీవి నవ్వాడు. "నువ్వే చూస్తావుగా ! పద వెళ్దాం-"
    ఇద్దరూ చేతులు పట్టుకుని హుషారుగా ఇంటివేపు బయల్దేరారు.


                                      *****

    మహేశ్వరీదేవి కోపంతో మండిపడుతోంది. ఇల్లంతా ఆవేశంతో కలియ తిరుగుతోంది.
    ఉండండి . 'హు! నా సంగతి తెలీదింకా" అంటోంది. అని పేపర్ వెయిట్ నేల కేసి కొట్టింది.
    "నేను తలచుకుంటేనా , మసి చేస్తాను - " అంది కాసేపాగి. ఈసారి తన హ్యాండ్ బాగ్ విసిరి టేబుల్ మీద పడేసింది.
    ఆ డైలాగులన్నీ నిశ్శబ్దంగా భరిస్తున్నాడు శివతాండవం. ఆమె ఎందుకలా ఆవేశపడిపోతోందో అతనికి తెలీదు గానీ- అప్పుడప్పుడు ఆమె అధ్యక్షతన నడుస్తున్న "లోటస్ లేడీస్ వెల్ఫేర్ క్లబ్" లో తోటి సభ్యురాండ్రతో పేచీ పడినప్పుడు ఇంటిదగ్గర అలా ప్రవర్తిస్తుందని మాత్రం తెలుసు. అలాంటి సమయాల్లో తనంతట తను విషయం చెప్పేవరకూ జోక్యం కలుగజేసుకాకూడదని కూడా అతనికి అనుభవ పూర్వకంగా తెలుసు.
    అంచేతే జోక్యం చేసుకోలేదు. ఆరోజు వెలువడిన 'తెలుగుకిరణం' న్యూస్ పేపర్ లో తను రాసిన ఎడిటోరియల్ నే పద్నాలుగో సారి చదువుతున్నాడు నిశ్సబ్దంగా.
    "ఎవరికెలా బుద్ది చెప్పాలో నాకు బాగా తెలుసు" అంది మహేశ్వరి దేవి మళ్ళీ. అని కాళ్ళ దగ్గరే కూర్చున్న కుక్కని ఒక్క తన్ను తన్నింది. అది కుయ్ మంటూ తన నిరసన తెలియజేసి బయటికెళ్ళి తన సొంత స్థలంలో పడుకుంది.
    "రేపు పేపర్లో రాసేయండి!" అంది మహేశ్వరి దీవి కొద్ది క్షణాలు ఆగి.
    ఆ మాటకు శివతాండవంలో చలనం వచ్చింది.
    "ఏ విషయం?"
    "ఇంకే విషయం ! అదే! ముఖ్యమంత్రి మీద! ఎడా పెడా రాసేయండి! ముఖ్యమంత్రి పదవికి అతను అనర్హుడని తక్షణం 'తెలుగు ప్రజలు అతనిని తొలగించాలని-"
    శివతాండవం ఖంగారు పడ్డాడు.
    "ముఖ్యమంత్రి మీద రాయాలా? ఎందుకు?" అన్నాడు తన ఖంగారుని కప్పి పుచ్చుకుంటూ.
    ఆమెకు అతని ధోరణి నచ్చలేదు. "ఎందుకేమిటి? మా వుమెన్స్ వెల్పేర్ క్లబ్ కు ప్రభుత్వ గ్రాంట్లు నిలిపివేశాడు."
    "ఓ! అదా సంగతి?" అర్దమయినట్లుగా అన్నాడతను.
    "ఏం? అది సంగతి కాదా? అరడజను మంది ముఖ్యమంత్రులు మారారు పదేళ్ళల్లో! ఎవరైనా గ్రాంట్లు అపారా? లేదే? మరీ ముఖ్యమంత్రి ఎందుకాపినట్లు....?
    శివతాండవం ఆమె మొఖంలో వెర్రిగా చూచి, "అవును"! అంటూ సపోర్ట్ చేశాడు.
    "అసలీ ముఖ్యమంత్రిని తీసేయమని మీరు గవర్నర్ కి రాయండి...." అందామె పచార్లు ఆపి.
    "గవర్నర్లు మన మాట వినరే!' ఆమెకు నచ్చజెప్పాలని ప్రయత్నించాడు శివతాండవం.
    "వినకపోతే గవర్నర్ ని తీసి పారేయమని ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తాను" అందామె కసిగా.
    "అదంత తేలిక కాదె!" మళ్ళీ నచ్చ జెప్పబోయాడతను.
    "ఎందుక్కాదు? నా సంగతి మీకింకా తెలీదు! డిల్లీలో మా క్లబ్ వల్ల నాకు చాలా ఇన్ ప్లుయేన్స్ ఉంది!" అందామె.
    "ఈ గవర్నరుని తీసేయించావనుకో! ఆ స్థానంలో వచ్చే ఇంకో గవర్నరయినా నీ మాట వింటాడని ఏమిటి నమ్మకం?"
    ఆ మాటకు మహేశ్వరీదేవికి సమాధానం దొరకలేదు. నిజమే! ఆ వచ్చే గవర్నరయినా తన మాట వింటాడన్న నమ్మకం ఏమిటి?
    ఆమె మళ్ళీ కోపంగా పచార్లు మొదలు పెట్టింది. శివతాండవం పదిహేనోసారి ఎడిటోరియల్ చదువుకోసాగాడు. కొద్ది క్షణాలయేసరికి హటాత్తుగా కొన్ని వందల ఎలుకలు ఒకేసారి అరవటం వినిపించి ఖంగారుగా హాలంతా కలయజూశాడు కానీ ఎలుక లేమీ కనిపించకపోయేసరికి ఆ శబ్దం చేసింది మహేశ్వరీదేవేనని తేలిపోయింది.
    "నాకు బ్రహ్మాండమయిన ఆలోచన వచ్చింది!" అందామె ట్యూబ్ లైట్లా వెలిగిపోతున్న మొఖంతో.
    "ఏమిటది?" గత్యంతరం లేక అడిగాడు శివతాండవం.
    "ఎవర్నో ఎందుకు గవర్నర్ చేయటం? మిమ్మల్నే గవర్నర్ గా చేస్తే సరిపోతుంది కదా?"
    శివతాండవం ఉలిక్కిపడ్డాడు.
    "ఏమిటి ? నన్ను గవర్నర్ గా చేస్తావా? నీకేం మతి పోలేదు కదా? ఎవర్ని పడితే వాళ్ళని గవర్నర్లుగా చేస్తారేమిటి?"
    "ఏడ్చినట్లుంది! ఎవర్ని పడితే వాళ్ళను చేయకపోతే వాళ్ళకేం క్వాలిఫికేషన్లు కావాలా?వంకాయలు కావాలా? సోషల్ స్టడీస్ పుస్తకంలో చదవలేదూ? ముప్పయ్ అయిదేళ్ళ వయసూ- పిచ్చాడు కాకుండానూ ఉన్న ఏ భారతపౌరుడయినా గవర్నరై పోవచ్చని?"

 Previous Page Next Page