Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 18

 

    శివతాండవం తను చదివిన సోషల్ స్టడీస్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ప్రస్తుత భారద్దేశంలో ఉన్న గవర్నర్ల గురించి ఆలోచించాడు. దాంతో భార్య మాటలు పూర్తిగా నిజమైనవేననిపించింది. తనకు ఆ పోస్ట్ కి అవసరమైనవాటికంటే ఎక్కువ అర్హతలే ఉన్నట్లనిపించింది. అయితే మరి ఇలా ఎక్కువ అర్హతలున్న వారికి ఆ పదవి ఇస్తారో ఇవ్వరో తెలీలేదు.
     "కానీ మన కేవరిస్తారే ఆ ఉద్యోగం?" అనుమానంగా అడిగాడతను.
    "ఎవరేమిటి? ఆర్. భీమారావే ఇప్పిస్తాడు. పార్లమెంట్ మెంబర్ కదా- డిల్లీ లో బాగా పరపతి ఉందతనికి! ఇంతకూ ముందు లావార్సీగా తిరుగుతున్న వాళ్ళ చుట్టాలబ్బాయి ఒకతనికి గవర్నరుద్యోగం వేయించటం నాకు తెలుసు....."
    "కానీ మనం ఆర్. బీమారావ్ చుట్టాలం కాదు గదా! అదీగాక నేను లావార్సీగా తిరగడం లేదు.....మరీ భీమారావ్....!"
    "భీమారావ్ సంగతి నాకోదిలేయండి!"
    శివతాండవం మాట్లాడలేదు.
    పక్కగదిలోంచి భార్య గొంతు కర్ణకఠోరంగా వినిపించసాగింది శివతాండవానికి!
    "హలో ఎవరూ! భీమారావ్ గారేనా? నేను లోటస్ వుమన్స్ వెల్ఫేర్ క్లబ్ ప్రెసిడెంట్ మహేశ్వరిదేవిని మాట్లాడుతున్నాను. నమస్కారం - నమస్కారం - మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి! ఎప్పుడు రమ్మంటారు? సాయంత్రం అయిదింటికా? ఒకే! అబ్బే క్లబ్ ఫంక్షన్స్ గురించి కాదులెండి! పర్శనల్ - ఆ! ఆ! అవునండీ! ఉంటానండీ! నమస్తే-"
    అతనికి నమ్మకం కలగడం మొదలు పెట్టింది ఏమో! నిజంగానే తను గవర్నర్ అవుతాడేమో/ శివతాండవం మొఖంలో చిరునవ్వు వెలిసింది.
    అవును! గవర్నరుద్యోగం చాలా బావుంటుంది. రాజభవన్ లో ఉండొచ్చు! తనకు అంగరక్షకులు - గేటు బయట కాపలా! ఎప్పుడూ అనేక రకాల సభలకూ, డిన్నర్ల కూ వెళ్ళటం - అక్కడ అంతకుముందు రాసుకున్న ఉపన్యాసాలివ్వటం - మన దేశం గురించి ఎంతో దేశభక్తి తో మాట్లాడటం - రిపబిక్ల్ డే నెహ్రూ గారు వేసుకున్న డ్రస్ లాంటిదే తనూ వేసుకుని - ఉపన్యాసం చదువుతుంటే ...."
    అతను పూర్తిగా ఊహాలోకంలో జొరబడిపోయాడు.
    ఎదురుగ్గా హైదరాబాద్ టీవి కనబడుతోంది.
    అందులో శాంతిస్వరూప్ మొఖం చిరునవ్వుతో మాట్లాడింది.
    "ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా మన రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు- "
    మరుక్షణంలో శివతాండవం రూపం టీవిలో కొచ్చేసింది.
    "నా ప్రియమయిన తెలుగు ప్రజలను రిపబ్లిక్ డే సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను- మన దేశం 1950 సంవత్సరం జనవరి ఆరున రిపబ్లిక్ డే అవతరించింది. మన రాజ్యాంగం ...."
    శివతాండవం పూర్తిగా తనను తను మర్చిపోయాడు.


                                       *****

    "స్వప్నా! ఓ స్వప్నా! అర్జంటుగా ఇలారా!' భవానీశంకర్ తో పాటు ఇంట్లోకి అడుగుపెడుతూ గావుకేక వేశాడు చిరంజీవి.
    ఆ గావుకేక విని రేడియోలో డ్రామా వస్తోందని భయపడి ట్రాన్సిస్టర్ స్విచ్చాఫ్ చేయడానికానీ వంటింట్లో నుంచి బయటికొచ్చి ఎదురుగ్గా చిరంజీవినీ, అతని వెనుక మరో అపరిచితుడినీ చూసి టక్కున నిలబడిపోయి సిగ్గుపడుతూ పైట సరి జేసుకుందామె.
    "స్వప్నా! ఇడుగో! ఈ అవతారం ఎవరో ఊహించు చూద్దాం! రెండు నిమిషాలు టైము- రెండు పేర్లు చాయిస్ - ' నడుం మీద చేతులుంచుకొని అన్నాడు చిరంజీవి ఉత్సాహంగా.
    స్వప్న ఓ క్షణం భవానీశంకర్ వేపు చూసింది గానీ ఆమె కేమీ తట్టలేదు.
    భవానీశంకర్ ఇంక ఉండబట్టలేక కల్పించుకున్నాడు.
    "వెరీ బాడ్ చెల్లమ్మా! ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? మీరు కిందటి జనవరి పద్నాలుగో తారీఖు 'ఆంధ్రఘోష' దినపత్రికలో నా ఫోటో చూడలేదూ?"
    "నేను న్యూస్ పేపర్స్ చదవను -"
    "ఇది ఇంకా చాలా బాడ్ విషయం -  మైడియర్ సిస్టర్! మోడ్రన్ గాళ్ అయుండి మీరు న్యూస్ పేపర్స్ చదవకపోవడం క్షమించరని నేరం!
    మా ఫ్రెండ్ రాధే శ్యామ్ గాడి సిస్టర్ ఝాన్సీ లక్ష్మి రోజూ పద్దెనిమిది న్యూస్ పేపర్లు చదువుతుండేది. 'వరకట్న దురాచారం' గురించి ఏర్పాటు చేసిన రాష్ట్ర స్త్రీల సదస్సులో ఆమె అమెరికా ప్రెసిడెంట్ రీగన్ గురించీ , అతని రాజకీయ కుతంత్రాల గురించీ ఆరుగంటలు మాట్లాడింది."
    "ఇంతకూ ఆ పేపర్లో మీ ఫోటో ఎందుకు వేశారు!" అడిగిందామె టాపిక్ మార్చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తూ.
    "ఎందుకు వేయరు? జర్నలిజంలో గోల్డ్ మెడల్ కొట్టేశాను కాబట్టి వేశారు. దానికింద నా జీవిత చరిత్ర క్లుప్తంగా , అద్భుతంగా రాశారు లెండి. రేపు మాణింగ్ ఆ పేపర్ కటింగ్ తీసుకొచ్చి మీకు చూసిస్తాను!" అన్నాడు భవానీశంకర్ చిరునవ్వుతో.
    "అవసరంలేదులెండి! మీ మాట నేను నమ్మకపొతేకదా?" అతని ఆలోచనను విరమింపజేయడానికని అందామె.
    "అలా అయితే సరే! బైదిబై ! మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు చాలా అందంగా ఉన్నారు! మా చిరంజీవి రియల్లీ - లక్కీ ఫెలో!"
    స్వప్న కొంచెం సిగ్గుపడింది గానీ ఆ విషయం బయటపడనీయలేదు.
    హటాత్తుగా అతనెవరో ఆమెకి తెలిసిపోయింది. రోజుకి అరడజను సార్లయినా చిరంజీవి అతని గురించి తనకు చెప్పేవాడు - పెళ్ళయిన కొత్తలో!
    "ఆ! ఇప్పుడు తెలిసింది మీరెవరో! చెప్పనా?" ఉస్తహంగా అడిగిందామె.
    "చెప్పు చూద్దాం?" అన్నాడు చిరంజీవి.
    "భవానీశంకర్! మీ ఇద్దరూ కలిసి సెయింట్ మేరీస్ లో ఉండగా "జూలీ ' అనే మీ పెంపుడు కుక్కను సైన్స్ క్లాస్ లోకి తీసుకెళ్ళి మీ పక్కనే బెంచి మీద కూర్చోబెట్టారు కదూ?"
    "నో నో నో !' చప్పున అందుకున్నాడు భవానీశంకర్! "దాని పేరు జూలీ కాదు, జూడీ! చాలా ఒండర్ పుల్ డాగ్ అది! ఇప్పుడేక్కడుందో ఏం చేస్తోందో!"
    "ముందులా కూర్చోండి! మీరు ఓ పావుగంట కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారంటే చాలు! భోజనం రడీ చేసేస్తాను!" అంది చనువుగా.
    భవానీ శంకర్ మొఖం చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది - ఆ మాట వినేసరికి.
    "అబ్బ! ఇంటి భోజనం అంటే ప్రాణం లేచి వచ్చేస్తోంది చెల్లమ్మా! ఆ పనేదో త్వరగా చూడు! నేనూ చిరంజీవి ఈలోగా సెయింట్ మేరీస్ గోల్డెన్ డేస్ ని నెమరు వేసుకుంటూ కూర్చుంటాం! అన్నట్లు మీకు బగారా బైగన్ కర్రీ చేయటం వచ్చా! వస్తే వండేయ్యండి! నాకు మహా ఇష్టం అది! మా ఫ్రెండ్ ఈసువుద్దీన్ నిసార్ గాడు అద్భుతంగా వండేవాడది - అలా అన్చెప్పి వండటం రాకపోయినా ఇప్పుడు ఎక్స్ పెరిమేంట్ చేయవద్దు! ఎక్స్ పెరిమెంట్లంటే మనక్కొంచెం భయంలే! హలో...."
    స్వప్న అప్పటికే వంటింట్లో కెళ్ళిపోవడం చూచి డైలాగులు ఆపేసి ఓ మూలగా వున్న చాప పరచుకొని పడుకున్నాడతను. చిరంజీవి అతని పక్కనే కూర్చున్నాడు.
    ఇద్దరూ సెయింట్ మేరీస్ స్కూల్లో గడిపిన 'గోల్డెన్ డేస్ ' లో కెళ్ళి పోయారు.
    మరికాసేపట్లో భోజనాలు అయిపోయాయి. స్వప్న వాళ్ళిద్దరి మాటలూ చాలా ఆసక్తిగా వింటూ కూర్చుంది.
    "కమాన్ బ్రదర్! ఇప్పుడు చెప్పు! 'లక్షాధికారి - అరవై పైసల అప్పు' అనే కధ చెప్తానన్నావ్ కదా ఇందాక?" అడిగాడు భవానీశంకర్.
    చిరంజీవి మూడ్ మారిపోయింది మళ్ళీ!
    'అదో పెద్ద కధ గురూ!' దిగులుగా అన్నాడు.
    "ఇది రెండోసారి యీ డైలాగ్ చెప్పటం - " గుర్తు చేశాడు భవానీశంకర్.
    "మా మావయ్య తాలుకూ యావదాస్తికి వారసుడిని గానీ - మావయ్య ఓ షరతు పెట్టారు. తెలుగుకిరణం దినపత్రికను మిగతా దిన పత్రికలన్నిటికన్నా అత్యధిక సర్క్యులేషన్ పత్రికగా నేను ఆరు నెలల గడువులో చేయగలగాలి! అది సాధించగలుగుతేనే నాకు యావదాస్తీ వస్తుంది ! లేపోతే  ఆస్తంతా విభూతి బాబా కెళ్ళిపోతుంది....!"
    భవానీశంకర్ లోగొప్ప మార్పు కనబడింది. అతని మొహం ఉత్సాహంతో వెలిగి పోయింది.
    "అంటే ఆ పరమ చెత్త దినపత్రిక 'తెలుగుకిరణం మీ మావయ్యదా?"
    "అవును!"
    "వెరీ బాడ్!" అన్నాడతను.
    "ఆ పత్రికను ఆరు నెలల్లోగా లార్జెస్ట్ సర్క్యులేటేడ్ తెలుగు డైలీగా నువ్వు చేయాలి!" కొద్ది క్షణాలాగి మళ్ళీ అన్నాడతను.
    "అవును!"
    "అలా అయితేనే ఆ ఆస్థి నీకు దక్కుతుంది. లేపోతే బూడిద బాబా కెళ్ళిపోతుంది."
    బూడిద బాబా కాదు! విభూతి బాబా!"
    "బైదిబై - ఈ విభూతి బాబా ఎవరు?"
    "తన భక్త పరమాణువుల కోసం గాలిలో నుంచి కిలోల కొద్దీ బూడిద సారీ, విభూతి తీసి ఇస్తుంటాడు. మావయ్యకు కూడా ఓసారి కిలో విభూతి ఇచ్చాడు.  అప్పటినుంచీ మావయ్యు అతనికి శిష్యుడైపోయాడు.
    "ఐసీ!"
    "న్యాయంగా నాకు చెందాల్సిన ఆస్తి అలా విభూతిబాబాలకూ, బూడిద బాబాలకూ వెళ్ళి పోతుంటే ఎవరికి మాత్రం దిగులుగా ఉండదు?" విచారంగా అడిగాడు చిరంజీవి.
    "ఆఫ్ కోర్స్ - ఎవరికయినా దిగులుగానే ఉంటుంది ...." వప్పుకున్నాడు భావానీశంకర్.
    కొద్ది క్షణాలు నిశ్సబ్దంగా గడిచిపోయింది.
    "ఇప్పుడు దాని సర్క్యులేషన్ ఎంత?" అడిగాడతను.
    "ఎంతో తెలీదు గానీ అన్ని దినపత్రికల కన్నా తక్కువని మాత్రం తెలుసు. ప్రస్తుతం 'తెలుగు కిరణం' సర్క్యులేషన్ నెలకు రెండొందలు కాపీల చొప్పున పడిపోతోంది -"

 Previous Page Next Page